Site icon Sanchika

అమెరికా ముచ్చట్లు-9

[box type=’note’ fontsize=’16’] తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖలో ఓఎస్‌డిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే తమ అమెరికా యాత్ర విశేషాలు సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికాను ఆదుకున్న గ్రాండ్ కూలీ డ్యాం

[dropcap]2[/dropcap]019లో అమెరికా వెళ్ళినప్పుడు ఆరిజోనా – నెవేడా రాష్ట్రాల సరిహద్దులో కొలరాడో నదిపై నిర్మించిన హూవర్ డ్యాంను చూడటానికి వెళ్ళాను. హూవర్ డ్యాం చూడాలన్న కోరిక నాకు ఇంజనీరింగ్ చదివే రోజుల నుంచి ఉండేది. ఈ నా చిరకాల వాంఛ 2019లో తీరింది. ఆ ప్రాజెక్టు అమెరికా వ్యవసాయాభివృద్దికి, జల విద్యుత్ ఉత్పత్తికి, ఇతర రంగాల అభివృద్దికి ఏ విధంగా దోహదం చేసింది వివరిస్తూ ఒక వ్యాసం కూడా రాశాను. నమస్తే తెలంగాణ పత్రిక అమెరికా నుంచి పంపిన ఆ వ్యాసాన్ని ప్రచురించింది. ఆ తర్వాత ఆ వ్యాసాన్ని మరింత సమగ్రంగా విస్తరించి ఫోటోలతో సహా నా “కాళేశ్వరం ప్రాజెక్ట్ : తెలంగాణ ప్రగతి యంత్రం” పుస్తకంలో చేర్చాను. జూన్ 2022లో రెండవసారి అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా ఉత్తర రాష్ట్రం వాషింగ్టన్‌లో కొలంబియా నదిపై నిర్మించిన గ్రాండ్ కూలి డ్యాం (Grand Coulee Dam) ను జూన్ 26న సందర్శించాను. నాతో పాటు నా మిత్రుడు, సాగునీటి శాఖలో నాకు సీనియర్, విశ్రాంత చీఫ్ ఇంజనీర్ అయిన కొండపల్లి వేణుగోపాల రావు గారు కూడా రావడం సంతోషాన్ని కలిగించింది.

గ్రాండ్ కూలి డ్యాం విహంగ వీక్షణం

గ్రాండ్ కూలీ డ్యాం కూడా అమెరికాలో నిర్మించిన తొలితరం డ్యాంలలో ఒకటి. హూవర్ డ్యాంతో పాటూ గ్రాండ్ కూలీ డ్యాం నిర్మాణానికి కూడా ప్రణాళికలు తయారు అయినాయి. ఈ రెండు ప్రాజెక్టుల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించింది యు.ఎస్.బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ (USBR) ఆనాటి కమీషనర్, అమెరికా లెజెండ్ ఇంజనీర్ ఎల్వుడ్ మీడ్(El Wood Mead). యు.ఎస్.బి.ఆర్ అమెరికాలో ఆయా రాష్ట్రాల సహకారంతో సాగునీటి ప్రాజెక్టులు, జల విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణం, నిర్వాహణ తదితర వ్యవహారాలు చూసే అత్యున్నత సంస్థ. మన దేశంలో కేంద్ర జల సంఘం లాంటిది. ఆయన హయాంలో యు.ఎస్.బి.ఆర్ అమెరికాలో అనేక ప్రాజెక్టులను రూపకల్పన చేసింది. మీడ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఓవైహీ (1928-32), హూవర్ (1931-36), గ్రాండ్ కూలి (1933-44) డ్యాంల నిర్మాణం పూర్తి అయినాయి. రాష్ట్రాల మద్య నీటి పంపిణీ, విద్యుత్ పంపిణీ ఒప్పందాలను కుదుర్చడంలో మీడ్ కీలక పాత్ర పోషించాడు(మీడ్ జీవిత విశేషాలను మరొక ఎపిసోడ్‌లో రాస్తాను). ఆనాడు ప్రపంచంలో ఇటువంటి ఎత్తైన డ్యాంల నిర్మాణంలో అనుభవం ఎవరికీ లేదు. వీటి నిర్మాణం కోసం యు.ఎస్.బి.ఆర్ అనేక కొత్త ఆవిష్కరణలు చేయవలసి వచ్చింది. వాటి నిర్మాణ అనుభవాలు ప్రపంచానికి కొత్త సాంకేతిక పద్ధతులను, పరికరాలను అందించాయి. హూవర్, గ్రాండ్ కూలి డ్యాంలతో పోలిస్తే అదే కాలంలో నిర్మాణం అయిన ఓవైహి డ్యాం చిన్నదే. ఎత్తు 417 అడుగులు. ఈ చిన్న ఆర్చ్ డ్యాం నిర్మాణంలో యు.ఎస్.బి.ఆర్ పొందిన అనుభవం ఎత్తైన హూవర్ (726 అడుగులు), గ్రాండ్ కూలి (550 అడుగులు) డ్యాంల నిర్మాణానికి ఇతోధికంగా తోడ్పడినాయి. ఈ అనుభవాల ఆధారంగా యు.ఎస్.బి.ఆర్ ఇంజనీర్లు కొత్త సాంకేతికతను, కొత్త పరికరాలను తయారు చేసుకున్నారు. ఆనాటికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించారు. వీటి నిర్మాణానికి ఆనాటి అమెరికా ఫెడరల్ అధ్యక్షులు కెల్విన్ కూలిడ్జ్ (1923-29), హెర్బర్ట్ హూవర్ (1929-33), ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ (1933-45) సంపూర్ణంగా సహకరించారు. అమెరికా ఫెడరల్ కాంగ్రెస్ ఆమోదం పొందారు. నిధులు సమకూర్చారు. ఆనాడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నా, పర్యావరణవాదుల నుంచి వ్యతిరేకత ఎదురైనా వారి రాజకీయ సంకల్ప బలం వలన ఆ డ్యాంల నిర్మాణం సాధ్యం అయ్యింది. హూవర్ డ్యాంకు అధ్యక్షుడు హెర్బర్ట్ హూవర్ పేరు పెట్టారు. గ్రాండ్ కూలి డ్యాం జలాశయానికి అధ్యక్షుడు రూజ్వెల్ట్ పేరు మీదనే నామకరణం చేశారు. హూవర్ డ్యాం వెనుక ఏర్పడిన జలాశయానికి యు.ఎస్.బి.ఆర్ కమీషనర్ ‘ఎల్వుడ్ మీడ్ లేక్’గా నామకరణం చేశారు.

గ్రాండ్ కూలీ డ్యాం ముందు వైపు దృశ్యం
గ్రాండ్ కూలీ డ్యాం చిత్ర పటం

గ్రాండ్ కూలీ డ్యాంకు సియాటిల్ నగరం నుంచి కారులో 4 గంటల ప్రయాణం. మేము టెక్సాస్ రాష్ట్రం డాలస్ నగరం నుంచి విమానంలో 25 జూన్ రాత్రికే సియాటిల్ నగరం చేరుకున్నాము. కొండపల్లి వేణుగోపాల రావు గారి కుమారుడు భార్గవ ఇంట్లో మా బస ఏర్పాటు చేశాడు. జూన్ 26 ఉదయం 10 గంటలకు సియాటిల్ నుంచి గ్రాండ్ కూలి డ్యాంకు బయలుదేరాము. 8 మంది కూర్చునే ఒక పెద్ద వ్యాన్ లాంటి కారులో ఏడుగురం ఉన్నాము. నేను, నా సతీమణి డా.భారతి, మా ఇద్దరు పిల్లలు అంజలి, వెన్నెల, వేణుగోపాల రావు, వారి సతీమణి నీహారిణి, డ్రైవింగ్ సీట్లో వేణుగోపాల రావు దగ్గరి బంధువు సిద్దార్థ. ఆ రోజంతా సిద్దునే డ్రైవింగ్ చేశాడు. డ్యాంకు వెళ్ళే దారిలో వాషింగ్టన్ రాష్ట్రంలో అనేక గ్రామాలలో పంట కాలువల కింద తుంపర సేద్యం చేస్తున్న దృశ్యాలు కనువిందు చేశాయి. ఎత్తైన ఎల్లో పైన్ వృక్షాలతో నిండిన దట్టమైన అడవులు, పర్వత శ్రేణులు, నదులు, సరస్సులు దాటుకుంటూ మధ్యాహ్నం 3 గంటలకు గ్రాండ్ కూలీ డ్యాం చేరుకున్నాము. మధ్యలో ఒక గంట భోజనానికి ఆగినాము. మేము డ్యాం ఎడమ వైపు ఎత్తు నుంచి డ్యాం అందాలను చూసి మైమరచి పోయాము. ఎండాకాలం అయినా కూడా డ్యాం పొంగి పొర్లుతున్నది. వాషింగ్టన్ రాష్ట్రం కెనెడా దేశానికి సరిహద్దులో ఉంటుంది. కొలంబియా నది కెనడా ఉత్తర ధృవ మంచు కొండలలో పుట్టి అక్కడ నుంచి అమెరికాలో ప్రవేశించి పసిఫిక్ మహా సముద్రంలో కలుస్తుంది. కెనెడాలో మంచు కరిగి నదిలోకి నీరు వస్తున్నందున ఎండాకాలం అయినా కూడా డ్యాం సర్ప్లస్ అవుతుండడం మా అదృష్టం. ఈ ఏడు యూరప్ ఆమెరికాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. యూరప్‌లో అన్ని నదులు, జలాశయాలు ఎండిపోయి తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినాయి. యూరప్ దేశాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికాలో కూడా జలాశయాలు అన్ని అట్టడుగు మట్టానికి చేరుకున్నాయి. 1243 టిఎంసిల నిల్వ సామర్థ్యం ఉన్న హూవర్ డ్యాం కూడా అట్టడుగు మట్టానికి చేరుకున్నట్టు సమాచారం. హూవర్ డ్యాంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్న లాస్ వెగాస్, ఫీనిక్స్, లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా లాంటి అనేక నగరాలకు వాటర్ రేషనింగ్ అమలు చేయడం ప్రారంభించారు. దేశం ఈ స్థితిలో ఉన్నా కొలంబియా నదిలోకి నీరు వస్తున్నది. గ్రాండ్ కూలీ డ్యాం అద్భుతమైన దృశ్యాలను కెమెరాలో బందించాము.

కొండపల్లి వేణుగోపాల రావు గారితో రచయిత
మ్యూజియంలో ఏర్పాటు చేసిన డ్యాం మోడల్

అక్కడ డ్యాం వివరాలను పొందు పరచి ఉన్న బోర్డుల ఫోటోలు తీసుకున్నాము. డ్యాం కిందకు వెళ్ళే ముందు అక్కడ ఉన్న విసిటర్స్ గ్యాలరికి వెళ్ళాము. ఇది నిజానికి గ్రాండ్ కూలీ డ్యాం మ్యూజియం అని చెప్పాలి. డ్యాం నిర్మాణం సందర్భంగా వినియోగించిన అనేక వస్తువులు, సర్వే పరికరాలు, నిర్మాణ పరికరాలు, వందలాది ఫోటోలు, చారిత్రిక పత్రాలు ఈ మ్యూజియంలో భద్రపరచినారు. పై అంతస్తులో 50 మంది కూచునే ఒక ఆడిటోరియం కూడా ఉంది. అందులో గ్రాండ్ కూలీ డ్యాం నిర్మాణం జరిగినప్పుడు తీసిన డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తున్నారు. USBRలో చరిత్రకారులు కూడా ఉన్నారని తెలిసి ఆశ్చర్యం కలిగింది. అమెరికాలో నిర్మాణం అయిన ప్రతీ ఒక్క ప్రాజెక్టు చరిత్రను భద్రపరచడానికి ఒక చరిత్ర విభాగం ఉంది. హూవర్ డ్యాం వద్ద కూడా ఇటువంటి మ్యూజియం ఉంది. ఫొటోల్లో కూలీ డ్యాం జలాశయంలో అన్ని రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాలలో ప్రవహిస్తున్న నదీ జలాలను తీసుకు వచ్చి కూలీ డ్యాం జలాశయంలో ఒకేసారి కలుపుతున్న దృశ్యం నన్ను ఆకట్టుకున్నది. నదీ జలాల విషయంలో భారతీయులకు ఉన్నట్టే ఆమెరికన్లకు కూడా సెంటిమెంట్స్ ఉన్నాయని అనిపించింది. మన పెద్దలు కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు వారు వారణాసి వద్ద గంగా జలాన్నితీసుకు పోయి రామేశ్వరం వద్ద హిందూ మహా సముద్రంలో కలుపుతారు. ఆ సముద్రపు నీటిని తీసుకు వచ్చి కాశీలో గంగా నదిలో కలిపితేనే వారి యాత్ర సంపూర్ణం అయినట్టు లెక్క. ఇక్కడ అమెరికాలో కూడా 50 రాష్ట్రాల నుంచి నీటిని తీసుకు వచ్చి కొలంబియా నదిలో కలపే దృశ్యాన్ని చూసినప్పుడు మన పెద్దల కాశీ-రామేశ్వరం-కాశీ యాత్ర స్పురణకు వచ్చింది.

50 రాష్ట్రాల నుంచి తెచ్చిన నీటిని జలాశయంలో కలుపుతున్న దృశ్యం

విసిటర్స్ గ్యాలరీలో ఒక గంట గడిపిన తర్వాత డ్యాం కిందకు వెళ్ళి డ్యాం అందాలను దగ్గరి నుంచి వీక్షించాము. ఫోటోలు దిగాము. ఎండలో ఎగిసిపడుతున్న నీటి తుంపరలకు అక్కడ ఏర్పడుతున్న ఇంద్ర ధనుస్సు మనస్సును ఉల్లాసపర్చింది. ఎంత సేపు ఉన్నా అక్కడి నుంచి కదలడానికి మనసొప్పడం లేదు. వాషింగ్టన్ రాష్ట్రంలో సూర్యాస్తమయం రాత్రి 9 గంటలకు కాబట్టి మేము డ్యాం నుంచి బయలుదేరి సియాటిల్ చేరుకునే సమయానికి ఇంకా వెలుతురు ఉంది.

***

ఇకపోతే గ్రాండ్ కూలీ డ్యాం విశేషాలను కూడా చెప్పక పోతే ఈ వ్యాసం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ఇంతకు ముందు పేర్కొన్నట్టు గ్రాండ్ కూలీ డ్యాంను వాషింగ్టన్ రాష్ట్రంలో కొలంబియా నదిపై నిర్మించారు. ఈ నది కెనడా లోని బ్రిటిష్ కొలంబియాలో రాకీ పర్వతాలలో పుట్టి అమెరికాలో వాషింగ్టన్ రాష్ట్రంలో ప్రవేశించి పసిఫిక్ మహా సముద్రంలో కలిసిపోతుంది. సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రవహించే కొలంబియా నది అమెరికాలో నాల్గవ అతి పెద్ద నదిగా, ప్రపంచంలో 36వ పెద్ద నదిగా గుర్తింపు పొందింది.ఈ నది పరీవాహక ప్రాంతం కెనడాలో, అమెరికాలో 7 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నది. జల విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ, సాగునీటి సరఫరా లక్ష్యాలతో ఈ గ్రాండ్ కూలీ డ్యాంను రూప కల్పన చేశారు. జూలై 1933లో ప్రారంభం అయిన డ్యాం నిర్మాణం మే 1942 కల్లా పూర్తి చేశారు. జూన్ 1, 1942 న ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశాడు అనాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఈ డ్యాంలో మొత్తం నాలుగు జల విద్యుత్ కేంద్రాలు 7 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. డ్యాం ఎత్తు 550 అడుగులు (168 మీటర్లు), పొడవు 5,223 అడుగులు (1,592 మీటర్లు). డ్యాం నిర్మాణం వలన ఏర్పడిన జలాశయంలో 423.78 టిఎంసిల నీరు నిల్వ ఉంటుంది. 1,91,918 చదరపు కిలోమీటర్ల పరీవాహక ప్రాంతంలో కురిసే వర్షపు నీరు అంతా ఈ జలాశయం లోకి చేరుతుంది. 6.71 లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తుంది.

కొలంబియా నది

హూవర్ డ్యాం నిర్మాణం సందర్భంగా పర్యావరణవాదులు లేవనెత్తిన వివాదాలే గ్రాండ్ కూలీ డ్యాం నిర్మాణానికి కూడా ఎదురైనాయి. ఈ డ్యాం నిర్మాణం వలన విలువైన పర్యావరణం దెబ్బ తింటుందని, కొలంబియా నదీ లోయలో నివసిస్తున్న స్థానిక ఆదివాసీ గ్రామాలు ముంపు బారిన పడతాయని, వేలాది మంది తమ ప్రాంతం నుంచి నిర్వాసితులు అవుతారని, అమెరికా స్థానిక ప్రజల హక్కులకు అమెరికా చట్టాలు భద్రతను కల్పిస్తున్నాయని వాదిస్తూ 290 అడుగుల తక్కువ ఎత్తుతో డ్యాం నిర్మించాలని పట్టుబట్టారు. అయితే వాషింగ్టన్ రాష్ట్రంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎత్తైన డ్యాంనే నిర్మించాలని ఆయకట్టు రైతాంగం పట్టుబట్టింది. 1934 లో అమెరికా అధ్యక్షుడు డ్యాం నిర్మాణ స్థలాన్ని సందర్శించి 550 అడుగుల ఎత్తైన డ్యాం నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు. అయితే డ్యాం నిర్మాణానికి అయ్యే 450 మిలియన్ డాలర్ల ఖర్చు గురించి ఆయన తీవ్రంగా ఆలోచించాడు. అమెరికాలో ఆనాడు నెలకొని ఉన్న ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ఈ మొత్తం ఖర్చును భరించలేదని అభిప్రాయపడినాడు. తాము 63 మిలియన్ డాలర్ల నిదులు మాత్రమే సమకూరుస్తామని, మిగతా నిధులను వాషింగ్టన్ రాష్ట్రం సమకూర్చుకోవాలని ప్రకటించాడు. కానీ USBR కమీషనర్ ఎల్ వుడ్ మీడ్ ఖర్చుకు వెనుకాడకుండా అమెరికా ఫెడరల్ ప్రభుత్వం డ్యాం నిర్మాణాన్ని చేపట్టాలని కొరినాడు. డ్యాం నిర్మాణం తర్వాత అది అటి తక్కువ కాలం లోనే తన మీద పెట్టిన ఖర్చు తిరిగి చెల్లిస్తుందని, అమెరికాలో నెలకొని ఉన్న ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో వేలాది మందికి డ్యాం నిర్మాణంలో ఉపాధి లభించనున్నదని అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి నివేదించాడు. 1933 లో వాషింగ్టన్ రాష్ట్ర గవర్నర్ క్లియరెన్స్ మార్టిన్ కొలంబియా రివర్ బేసిన్ కమిషన్ ను ఏర్పాటు చేసి డ్యాం డ్యాం నిర్మాణాన్ని పర్యవేక్షించే బాద్యతలను అప్పజెప్పాడు. 1935లో అమెరికా కాంగ్రెస్ కూడా డ్యాం నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. ఎత్తైన హూవర్ డ్యాం నిర్మాణంలో అపారమైన అనుభవం గడించిన ఏజెన్సీలకే గ్రాండ్ కూలీ డ్యాం నిర్మాణ పనులను కూడా అప్పగించారు. నిర్మాణం జరిగిన తర్వాత అమెరికా వాయవ్య(North West) రాష్ట్రాల రూపు రేఖలు మారిపోయాయి. విద్యుత్ సరఫరా మెరుగుపడడంతో పరిశ్రమలు, ఏర్పాటు అయినాయి. ఆయకట్టు ప్రాంతంలో వ్యవసాయ విస్తరణ జరిగింది. సియాటిల్ లాంటి నగరాలు అమెరికాలో ప్రముఖ నగరాలుగా అభివృద్ది చెందాయి. సియాటిల్ నగరం అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రంగా మారినాయి. మైక్రోసోఫ్ట్, అమెజాన్ వంటి ఐటి దిగ్గజాల ప్రధాన కార్యాలయాలు సియాటిల్ లోనే ఏర్పాటు అయినాయి. అల్యూమినియం ఉత్పత్తి చేసే పరిశ్రమలు, బోయింగ్ విమానాల తయారీ పరిశ్రమ కూడా సియాటిల్‌లో ఏర్పాటు అయ్యింది. ఈ అనూహ్య ప్రగతికి గ్రాండ్ కూలీ డ్యాం నుంచి సరఫరా అయ్యే విద్యుత్, నీరే కారణం అని చెప్పవచ్చు.

డ్యాం విశేషాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన బోర్డు
డ్యాం వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకం

గ్రాండ్ కూలీ డ్యాం వెనుక ఏర్పాటు అయిన జలాశయాన్ని ‘ఫ్రాంక్లిన్ డెలానో రూస్వెల్ట్ లేక్’ అని పిలుస్తారు. ఈ జలాశయం వలన దాదాపు 3000ల మంది స్థానిక అమెరికా ఆదివాసీ ప్రజలు నిర్వాసితులు అయినారు. ఒకవైపు డ్యాం నిర్మాణం జరుగుతుండగానే జలాశయంలో ముంపు బారిన పడుతున్న భూముల సేకరణకు, నిర్వాసిత ఆదివాసీ ప్రజల పునర్ వ్యవస్థీకరణకు చర్యలు తీసుకున్నారు. అమెరికా సుప్రీం కోర్టు నుంచి ఈ విషయంలో అన్ని అనుమతులు పొందారు. సుమారు 243 కిమీ పొడవునా విస్తరించే జలాశయం పరిధిలోకి 70,500 ఎకరాల భూసేకరణ, దీనికి అదనంగా మరో 11,500 ఎకరాల భూములను ఇతర అవసరాలకు యూ.ఎస్.బి.ఆర్ వారు సేకరించినారు. 11 పట్టణాలను, 2 రైల్వే మార్గాలను, 3 రాష్ట్ర రహాదారులను, 150 మైళ్ళ గ్రామీణ రోడ్లను, 4 కలప మిల్లులను, 4 టెలిఫోన్/టెలిగ్రాఫ్ లైన్లను, ఎన్నో విద్యుత్ లైన్లను, శ్మశానాలను తరలించి వేరే చోట పునరుద్దరించడం జరిగింది. 3 వేల మందికి అన్ని వసతులతో పునరావాస కేంద్రాలను నిర్మించారు. సుమారు 8 వేల మంది కార్మికులు డ్యాం నిర్మాణంలో పాలుపంచుకున్నారు. వీరి కోసం ఒక ప్రత్యేకమైన మేసన్ పట్టణాన్ని నిర్మించారు. ఇంజనీర్ల కోసం ఇంజనీర్స్ టౌన్ నిర్మించారు. డ్యాం నిర్మాణంలో 77 మంది కార్మికులు ప్రమాదాల బారిన పడి మరణించినట్టు యు.ఎస్.బి.ఆర్ రికార్డ్ చేసింది. మేసన్ పట్టణంలో ఒక ఆసుపత్రి, ఒక పోస్టాఫీసు, విద్యుత్తు, తాగునీరు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. డ్యాం నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఇంజనీర్స్ టౌన్, మేసన్ టౌన్ లను కలిపి గ్రాండ్ కూలీ నగరంగా అభివృద్ది చేశారు. 1959 నుంచి గ్రాండ్ కూలీ నగరం అధికారికంగా ఉనికిలోకి వచ్చింది.

గ్రాండ్ కూలీ డ్యాంను సందర్శించిన బృందం

డ్యాం నిర్మాణం పూర్తి అయిన తర్వాత విద్యుత్ ఉత్పత్తికె అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేయాలన్న లక్ష్యంతో మొదట విద్యుత్ సరఫరాకు సంబంధించిన పనులకు నిధులు ఖర్చు చేయడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతనే 1953లో సాగునీటి సరఫరా మొదలయ్యింది. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాయవ్య ప్రాంతాల అభివృద్దికి గ్రాండ్ కూలీ డ్యాం ఒక ప్రగతి రథంగా మారిందని అక్కడి మేధావులు విశ్లేషిస్తున్నారు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version