[box type=’note’ fontsize=’16’] “తెల్లని కిరణంలో ఎన్ని రంగు లుంటాయో ఆ కిరణం గాజు పట్టకంలోకి ప్రవేశించినప్పుడు గానీ తెలియదు అని గుర్తు వస్తుంది డెబ్బీని తలుచుకున్నప్పుడల్లా” అని తన సహోద్యోగి ‘డెబొరా హారిసన్’ గురించి వివరిస్తున్నారు తాడికొండ కె. శివకుమార శర్మ. [/box]
[dropcap]రు[/dropcap]ద్రనమకంలో అన్నింటిలో ఉన్న నీకు నమస్కరిస్తున్నాను అంటూ ఒక చోట “నమ ఆశుషేణాయ చ ఆశురథాయ చ” అని ఉంటుంది. అంటే, సూర్యుని కిరణాల్లో ఉన్న నీకు, సూర్యుని కిరణాలని రథంగా చేసుకునే నీకు నమస్కరిస్తున్నాను” అని. తెల్లని కిరణంలో ఎన్ని రంగు లుంటాయో ఆ కిరణం గాజు పట్టకంలోకి ప్రవేశించినప్పుడు గానీ తెలియదు అని గుర్తు వస్తుంది డెబ్బీని తలుచుకున్నప్పుడల్లా.
ప్రాజెక్టు ఆఫీసులో సంవత్సరంలో క్రిస్మస్, ఇంకా రెండు, మూడు పార్టీలని అడ్మిన్ స్టాఫ్‌తో కలిసి అరేంజ్ చెయ్యడంలో డెబ్బీ కీలకపాత్ర నిర్వహించేది. ఈ పార్టీలకి వచ్చేవాళ్లు వాళ్లవంతు ధరని చెల్లించాల్సిందే. వీటిల్లో క్రిస్మస్ పార్టీల గూర్చి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మెనూని తయారుచేసి, తయారుచేసే వాళ్లకి అందులోని ఐటమ్స్ ని పురమాయించి పార్టీ రోజున ప్రాజెక్ట్ ఆఫీసు ముందరేనో లేక కాన్ఫరెన్స్ రూములోనో వాటిని డెబ్బీతో కలిసి కొంతమంది సెక్రటరీలు అమరుస్తారు. పార్టీ తరువాత క్లీనింగ్, పార్టీ తయారీ కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. తిన్నవాళ్లు తినే ముందర సహాయం చెయ్యడానికి ముందుకొస్తారు గానీ, తినగానే చల్లగా జారుకుంటారు. అందుకని క్లీనింగ్ భారం కూడా డెబ్బీ మీద పడేది.
పార్టీకి వచ్చినవాళ్లకి లాటరీలో డోర్ ప్రైజెస్ ఉంటాయి. వాటికోసమని డెబ్బీ గిఫ్ట్ కార్డులని పట్టుకొచ్చేది. ఒక్కొక్కదాని విలువ పాతికో, యాభయ్యో డాలర్లుంటుంది. అవి కాఫీ షాపులవి కావచ్చు, మసాజ్ థెరపీవి కావచ్చు, హెయిర్ స్టైలింగ్‌వి కావచ్చు, లేదా డెంటిస్ట్ క్లినిక్‌వి కావచ్చు. చాలావరకూ ఆ బిజినెస్సులు ఆమెకు వాటిని ఉచితంగా ఇచ్చేవారంటే వాళ్ల వద్ద ఆమె పరపతి ఎలాంటిదో ఊహించవచ్చు.
ఆ పరపతికి కారణం ఆమె తన చర్చి తరఫున నడిపే వాలంటీర్ పాంట్రీ సర్వీస్ కావచ్చు ననిపించింది వాటి వివరాలని విన్న తరువాత. నెల కొకసారి ఆ చర్చి పాంట్రీకి కొన్ని గ్రోసరీ బిజినెసులు ఉచితంగా ఆహారపదార్థాలని సరఫరా చేస్తాయి. వాటిని ఈ వాలంటీర్లు బీదా, బిక్కీలకి పంచుతారు. ఆ వచ్చేవాళ్లు అమర్చిన షెల్ఫుల లోంచి పరిమితి మేరకు తీసుకోవాలి. దీనికి లైన్లు ఎంత పొడుగున ఉంటాయో, అక్కడికి వచ్చేవాళ్లల్లో కొంతమంది పరిమితికి మించి తీసుకోవడానికి ఎలా పోట్లాడతారో డెబ్బీ చెబితే ఆశ్చర్య మేసింది. వాళ్లల్లో చైనా దేశీయులూ, భారతదేశం నించీ వచ్చినవాళ్లూ కూడా ఉంటారని వినడం ఆ ఆశ్చర్యాన్ని ఇనుమడింప జేసింది.
నవంబర్ చివర్లో వచ్చే థాంక్స్ గివింగ్ గురువారంనాడు హోమ్‌లెస్ మనుషులకి ప్రత్యేకమయిన భోజనాన్ని డెబ్బీ వెళ్లే చర్చి పంచుతుంది. దాన్ని తయారుచెయ్యడంలో డెబ్బీ అంతకు ముందరి ఆదివారం నుండీ ఊపిరి సలపకుండా పని చేసి అలసిపోయి తరువాత ఆదివారం దాకా విశ్రాంతి తీసుకునేది. “సారంగ”లో వెలువడిన నా “రవి గాంచినది” కథలో క్రిస్టినా ఈమే.
శ్వేతజాతీయురాలయినా కూడా ఆమె ఆఫ్రికన్ అమెరికన్ల చర్చికి వెళ్లేది. ఆమె ఫైనల్ సర్వీసెస్ ఆ చర్చిలోనే నిర్వహించారు. ఆ సర్వీసులో వాళ్లు మంచి పదార్థాల్ని వండి వడ్డించారని దానికి హాజరయిన సహోద్యోగి చెప్పాడు. వాళ్లు డెబ్బీ మంచితనాన్ని ఆమె బ్రతికివుండగానే గుర్తించినవాళ్లు! ఈ గాజు పట్టకం ద్వారా (నా ద్వారా) ఆ కిరణం బహుముఖ వ్యక్తిత్వం గూర్చి మీకు తెలిపే అవకాశాన్ని అందించినందుకు వినమ్రంగా శిరస్సుని పది దిక్కులకూ తిప్పి నమస్కరిస్తాను.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఒక కథకి శీర్షిక “ఎన్నో రంగుల తెల్ల కిరణం” డెబ్బీకి ఎంతఅందంగా అమరుతుందో గదా!
(Photos from her Facebook page)