అమెరికా సహోద్యోగుల కథలు-10: సుగుణాభిరాముడు

0
2

[box type=’note’ fontsize=’16’] “ఎవరిమీదా గొంతెత్తడం గానీ, ఎవరితో నయినా పరుషంగా మాట్లాడడం గానీ ఆ ఆరేళ్లల్లో నే నెప్పుడూ చూడలేదు” అని తన సహోద్యోగి ‘ముకుంద్ కర్వే’ గురించి వివరిస్తున్నారు తాడికొండ కె. శివకుమార శర్మ. [/box]

[dropcap]ఇం[/dropcap]డియా నించీ అమెరికా వచ్చి స్థిరపడి పౌరసత్వాన్ని మార్చుకున్నవాళ్లని కూడా అమెరికన్లని అంటారు కదా, అలాంటివాళ్లల్లో స్ఫూర్తినిచ్చిన  వాళ్లెవరూ లేరా అన్న ప్రశ్న తలెత్తడం సహజమే. ఉన్నారు అంటూ ఉదాహరణలని చూపించవలసినవాళ్లల్లో ముకుంద్ కర్వే ఒకరు.

ముకుంద్ నాకన్నా రెండు సంవత్సరాలకు ముందు రట్గర్స్ యూనివర్సిటీలోనే, మా మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంటులోనే జేరాడు. ఐ.ఐ.టి. బొంబాయి నించీ. నేను వచ్చేటప్పటికి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి పి.హెచ్.డి చదువు మొదలుపెట్టాడు. అందరితో ఇట్టే కలిసిపోయే స్వభావం. అలుగుటయే ఎరుంగని – అంటూ చెప్పే ధర్మరాజు గూర్చి నాకు తెలియదుగానీ, ముకుంద్ ఎవరిమీదా గొంతెత్తడం గానీ, ఎవరితో నయినా పరుషంగా మాట్లాడడం గానీ ఆ ఆరేళ్లల్లో నే నెప్పుడూ చూడలేదు.

అతని సహాయం చేసే స్వభావం గూర్చి చెప్పడానికి చాలా ఉదాహరణ లున్నాయి గానీ, చాలామటుకు అవి రెండు కేటగిరీలకి చెందినవి. ఒకటి, ఇండియా వెడుతున్నవాళ్లని విమానాశ్రయం కి చేర్చడానికీ, అక్కణ్ణించీ వెనక్కి తిరిగివచ్చినప్పుడు విమానాశ్రయం నించీ తీసుకురావడానికీ. ఇప్పుడయితే న్యూ జెర్సీ లోని నూవర్క్ విమానాశ్రయం నించీ కూడా అంతర్జాతీయ ప్రయాణాలు చెయ్యడం సాధ్య మవుతోంది గానీ, పంధొమ్మిది వందల ఎనభయ్యవ దశకంలో మాత్రం రట్గర్స్ యూనివర్సిటీనించీ ఇండియా ప్రయాణ మంటే దాదాపు అరవై మైళ్ల అవతల న్యూయార్క్ లో వున్న జాన్ ఎఫ్ కెనెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నించీ మాత్రమే అది సాధ్యం.  ట్రాఫిక్కుని బట్టీ గంటా, రెండు గంటల ప్రయాణం.  అందువలన, డ్రైవర్‌కి మాత్రం రెండు వైపులా కలిపి కారుకు పెట్రోలూ, రహదార్ల మీదా, బ్రిడ్జీల మీదా అయ్యే టోల్స్ మాత్రమే కాక మూడు నించీ నాలుగ్గంటల ఖర్చు కూడా. ఆ కాలంలో ఈ వ్యాసకర్తతో కలిపి ముకుంద్ కి తెలిసిన వాళ్లల్లో ఈ సహాయం పొందని భారతీయులు మా యూనివర్సిటీలోని  గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ లో లేరనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

రెండవది, డ్రైవింగ్ నేర్పించడం. ఆ కాలంలో, భారతదేశంలో పెద్ద నగరాలనుంచీ వచ్చినవాళ్లు తప్పితే అమెరికాకు చేరే ముందరే డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించుకున్నవాళ్లు అరుదు. అలా తెచ్చుకున్నవాళ్లల్లో కూడా ప్రాక్టీసుకు ఒక కారు అవసరం. అన్ని విధాలుగానూ సహాయపడ్డది ముకుంద్ ఆకుపచ్చ కారు షెవర్లె వొలారే. (అమెరికాలో తయారయిన కార్లకి ఆనాడు అంత గొప్ప పేరు లేదు గానీ, ఇంతకు ముందు పేర్కొన్నట్లుగా నేను కొన్న టయోటా కరోలా కన్నా ఈ కారు వేల రెట్లు నయం. అది ముకుంద్ ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టిన గుర్తులేదు.) నాతో బాటే అదే ఏడాది మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో మాస్టర్స్ చెయ్యడానికి జేరిన మరో ఇద్దరితో కలిపి, అంతకు ముందు, ఆ తరువాతా వచ్చినవాళ్లల్లో ముకుంద్ సహాయంతో అమెరికాలో డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ ని సంపాదించుకున్నవాళ్లు ఎంతమంది ఉంటారో లెక్కలేదు.

ఈ రెండూ కాక ముకుంద్ ప్రత్యేకతలని గూర్చి చెప్పడానికి అతనికి స్పోర్ట్స్ మీది అభిలాష, అవుట్‌డోర్ యాక్టివిటీలలో భాగంగా కొండలలో హైకింగ్ చెయ్యాలనే ఉత్సాహమూ, సంగీతం అంటే మక్కువా ఉన్నాయి. జీవితంలో ఎవరెస్ట్ ఎక్కాలని ఆకాలంలో అతని ఆకాంక్ష. ఎండాకాలం వస్తున్న దనగానే టెన్నిస్ రాకెట్ తో ప్రత్యక్ష మయేవాడు ప్రతిరోజూ సాయంత్రం పూట. ఏ కాల మయినా వారాని కొకసారి షటిల్ బాడ్మింటన్.

అమెరికాలో షటిల్ బాడ్మింటన్ ఆడే అవకాశ మున్నదని తెలిసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ఇక్కడ యూనివర్సిటీలలో దానికి అవకాశం దాదాపు లేదనే చెప్పవచ్చు. రట్గర్స్ యూనివర్సిటీకి ఒక టీమ్ అంటూ ఎలానూ లేదు. అందుకని బాడ్మింటన్ కోర్ట్ ఉండడానికి ఆస్కారమే లేదు. భారతదేశంలో ఆ ఆట ఆడి వచ్చినవాళ్లకి ఆడాలని అనిపించడం సహజం. మా అపార్ట్‌మెంట్ బిల్డింగులకి వంద గజాల దూరంలో మెడికల్ స్కూల్ ఉన్నది. లోపలకి ప్రవేశించగానే కనిపించేది రెండు మూడు అంతస్తుల ఎత్తున్న ఖాళీ స్థలం. అక్కడ పనిచేస్తున్న ఒకాయన వల్ల వారానికి ఒకసారి, సాయంత్రం ఎనిమిది గంటల తరువాత, రెండు గంటలపాటు ఆ స్థలాన్ని ఉపయోగించుకుని ఆడుకోవడానికి అనుమతి లభించింది. కోర్టు పరిధులని నేలమీద టేపుని అతికించి నిర్ణయించేవాళ్లం. కావలసిన సరంజామా అంతా న్యూయార్క్ వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ముకుందే ఆ భారాన్ని తల కెత్తుకునేవాడు.

ప్రొ. కర్వేతో రచయిత

హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం మా ఇద్దరికీ కూడా ఇష్టం. ఉస్తాద్ విలాయత్ ఖాన్, ఉస్తాద్ అమ్జాద్ ఆలీఖాన్, పండిట్ హరిప్రసాద్ చౌరాశియా, పండిట్ జస్రాజ్, పండిట్ శివకుమార్ శర్మల కచేరీలకీ, ట్రిపుల్ బైపాస్ సర్జరీ అయిన తరువాత పండిట్ రవిశంకర్ మొదటి ఇచ్చిన మొదటి కచేరీకి వెళ్లాం.

పి.హెచ్.డి. పూర్తి చేసిన తరువాత రట్గర్స్ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్‌గా చేరి, డిపార్ట్‌మెంటు హెడ్‌గా కూడా కొంతకాలం పనిచేశాడు. ఇప్పుడు డీన్ కూడా. అతని గూర్చిన వీడియో చూడడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. అందరితో కలిసిపోయే స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఫ్ఫయ్యేళ్లు అతని స్వభావాన్ని మార్చలేదని కూడా ఋజువు చూపిస్తుంది. విద్యార్థులతో కలిసి హైకింగుకి ఇప్పటికీ వెడుతుంటాడని వీడియోవల్ల తెలుస్తుంది. అతని బోధనా పటిమ గూర్చి నేనేమీ చెప్పలేను గానీ, ఈనాటి రట్గర్స్ యూనివర్సిటీ విద్యార్థులు ఆ లోటుని పూరిస్తారు.

అవునూ, సుగుణాభిరాముడు శీర్షికన సినిమా ఏదీ రాలేదెందుకని?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here