Site icon Sanchika

అమెరికా సహోద్యోగుల కథలు-12: గురువుకు తెరువుని చూపిన శిష్యుడు

[box type=’note’ fontsize=’16’] “పిహెచ్.డి. డిగ్రీ పుచ్చుకుని జెఫ్ బర్చ్ వెళ్లిపోయిన తరువాత ఆ ప్రొఫెసర్ కు నిధులేవీ రాకపోవడంతో ఆయన సామర్థ్యం బట్టబయలయింది” అంటూ సహోద్యోగి జెఫ్ బర్చ్ గురించి వివరిస్తున్నారు తాడికొండ కె. శివకుమార శర్మ. [/box]

[dropcap]గ్రా[/dropcap]డ్యుయేట్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మాకు యూనివర్సిటీ లాబొరేటరీలోనే ఆఫీసు లుండేవి. మాస్టర్స్ డిగ్రీ, లేదా పిహెచ్.డి. డిగ్రీ చేసేవాళ్లకి పరిశోధన తప్పనిసరి – ఉత్తీర్ణు లవాలంటే పరిశోధన పత్రాన్ని సమర్పించాలి మరి. ఈ పరిశోధకులు గంటలపాటో లేదా కొన్ని రోజులపాటో నడిచే ప్రయోగాలు చేస్తూంటారు గనుక వాళ్లకి ఆ వెసులుబాటు అవసరం. ఒకరకంగా అది రోజూ ఉద్యోగానికి హాజరవడంవంటిదే. తేడా అల్లా, ఉద్యోగంలో అయితే రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే (ఐ.టి. రంగం పిండంగా కాక అండంగా కూడా లేని రోజులనాటి పరిస్థితి గూర్చి చెప్పేది), తినడానికి పక్కన ఉన్న కేఫ్‌టేరియాకి వెళ్లిన సమయాన్ని తప్పించి గ్రాడ్యుయేట్ విద్యార్థులు అక్కడ పది నించీ పదహారు గంటలదాకా గడపడం సాధారణం. ఇంటినించే తెచ్చుకున్న ఒక శాండ్‌విచ్‌తో సరిపుచ్చుకునే వాళ్లయితే కేఫ్‌టేరియాకి వెళ్లి ఆ కొద్ది సమయం కూడా వృధా చెయ్యరు.

నేను ఆ లాబ్‌లో విద్యార్థిగా అడుగు పెట్టినప్పటినించీ గమనించింది, ఎప్పుడూ నాకన్నా ముందే వచ్చివుండే జెఫ్ బర్చ్ అనే అతన్ని. అతను ఎప్పుడూ శ్రద్ధగా చదువుతూనే కనిపించేవాడు. మితభాషి. ఎవరయినా వెళ్లి పలకరిస్తే మాట్లాడేవాడు గానీ తనంతట తానుగా వెళ్లి ఎవరితో నయినా మాట్లాడ్డం మొదట్లో గమనించలేదు. అతని పరిశోధనకి నిధులుండడం వల్ల అతని చదువు అతని జేబులోంచి కానీ ఖర్చులేకుండా జరుగుతోంది. (నాకు కూడా కానీ ఖర్చు లేకుండానే అక్కడ రెండు డిగ్రీ లొచ్చాయి. అయితే, ఆ సమయంలో నాకు బోధనకు సహాయకుడుగా ఆ మేలు తిన్నగా యూనివర్సిటీ నించే చేకూరింది.) పరిశోధనకు నిధులు లభించా లంటే వాటిని అందించే ప్రభుత్వ సంస్థలకు అర్జీ పెట్టుకోవాలి. ఆ అర్జీని యూనివర్సిటీ బోధకులు సమర్పిస్తారు. ఆ నిధులు చేకూరితే బోధకులకి వేసంకాలంలో రెండు నెలల జీతమూ, వారి దగ్గర పనిచేసే విద్యార్థి పరిశోధకులకు ఏడాది పొడుగునా సహకార వేతనమూ చేకూర్చి, పరిశోధనకు సహకరిస్తాయి.

నాకన్నా ఒకటి, రెండు ఏళ్లకు ముందు భారతదేశాన్నుంచీ వచ్చినవాళ్ల వలన జెఫ్ ఛెస్‌లో గ్రాండ్ మాస్టరని తెలిసింది. ఛెస్‌ తో కొద్దిగా పరిచయం ఉండడంవల్ల దాని గొప్పతనమేదో నాకు బాగానే తెలుసు. నాకు రెండేళ్ల సీనియర్‌కి కూడా అందులో ఆసక్తి. 1984 చివరలో మొదలయి, అయిదు నెలలకు పైగా కార్పోవ్ – కాస్పరోవ్ ల మధ్య సాగిన ప్రపంచ చాంపియన్షిప్ పోటీ ఈ ఛెస్‌ ఆడడంలో ఆసక్తివున్న మా మధ్య పరిచయాన్ని బాగానే పెంచింది. 1984 లోనే అన్నట్లు గుర్తు – ఇటలీ నించీ వచ్చిన ఆలెక్స్ బొటారో అనే ఒక డైనమిక్ విద్యార్థి దానికి తోడయ్యాడు కానీ, గంటలూ, రోజులూ సాగే చదరంగం ఆట ఆడే సహనం అతనికి లేకపోవడంవల్ల అతను అయిదు నిముషాలపాటు మాత్రమే ఆడాలని నియమాన్ని పెట్టి ఆటలు మొదలుపెట్టాడు. ఒక్కొక్క సారి అలాంటి ఆటలు డజనుకు పైగా వరుసగా సాగేవి. జెఫ్ అందరి ఆటలూ అయిదు నిముషాల కన్నా తక్కువ వ్యవధిలోనే కట్టించేవాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా!

ముఫ్ఫై అయిదేళ్ల క్రితంకూడా అమెరికాలో యూనివర్సిటీ ప్రొఫెసర్లల్లో విదేశాల నుంచీ వచ్చి చేరినవాళ్ల సంఖ్య చాలా ఎక్కువే. అందరూ తమకే ప్రత్యేకమయిన ఆక్సెంటుని కలిగివుంటారు. అమెరికాలో దాదాపు తమజాతి వాళ్లే అయిన హైస్కూళ్లల్లోని పంతుళ్ల ఉచ్చారణకు అలవాటుపడిన టీనేజర్లకి కొందరు విదేశీయుల ఉచ్చారణలు అర్థం అయే అవకాశం తక్కువ. ముఖ్యంగా అది చైనా, కొరియావంటి దేశాలనించీ వచ్చినవాళ్లవి. దానికి తోడు, పిహెచ్.డి. పొందిన ప్రతీవ్యక్తీ గొప్పగా కాకపోయినా కనీసం సాధారణంగానయినా పాఠాలు చెప్పగలిగే సామర్థ్యాన్ని కలిగివుంటారని యూనివర్సిటీలు మామూలుగానే తప్పుగా అంచనా వేస్తాయి. దానికి ఉచ్చారణ సవాలు తోడవుతుంది. కరువులో అధిక మాస మన్నట్టు, వేలకు వేల డాలర్లు ట్యూషన్ ఫీజు కట్టి, అసలే ఛాలెంజింగ్‌గా ఉన్న పరిస్థితిలో, విద్యార్థులకు ఈ బాధ అధికం. జెఫ్ థీసిస్ అడ్వైజర్ కొరియా నించీ వచ్చినవాడు. తన ఉచ్చారణ అర్థం కాక విద్యార్థులని తలని గోడకేసి కొట్టుకునేలా చేసినవాడు. రేనాల్డ్స్ నంబర్ అని ఒకటుంది. నంబర్ని కుదించి no. అని రాస్తాం కదా, అలాగే, no ని నో అని పలుకుతాం కూడా. ఆ ప్రొఫెసర్ Reynoldsనీ, no.నీ కలిపి “రేనాల్డ్స్‌నో” అని పలికితే ఆ విద్యార్థుల గతేమిటి? పాపం ఆ విద్యార్థులు కాలేజీ డీన్‌కి కంప్లైంట్ చేశారట కూడా. అప్పటిదాకా టెంపరరీ పొజిషన్లో ఉన్నాడు గనుక ఆ కొరియన్ ప్రొఫెసర్‌కి కాంట్రాక్ట్ కాలం అయిపోగానే డీన్ అతనికి ఉద్వాసన చెబుదామనే అనుకున్నాట్ట. అయితే, అతను డిపార్ట్‌మెంటుకి పరిశోధనకై తెచ్చిపెట్టిన కొన్ని లక్షల డాలర్ల వనరులని చూపించి, ఇలాంటివాళ్లకి ఉద్వాసన చెబితే నేనింక డిపార్ట్‌మెంటుని ఎలా నడపాలి అని డిపార్ట్‌మెంటు ఛెయిర్మన్ పోట్లాడాడట. డీన్ తల వంచి అంగీకరించి అతణ్ణి పర్మనెంట్ చేశాడు.

పిహెచ్.డి. డిగ్రీ పుచ్చుకుని జెఫ్ బర్చ్ వెళ్లిపోయిన తరువాత ఆ ప్రొఫెసర్ కు నిధులేవీ రాకపోవడంతో ఆయన సామర్థ్యం బట్టబయలయింది. అప్పటికి గానీ ఆ వచ్చిన రీసెర్చ్ గ్రాంట్స్ జెఫ్ బర్చ్ ప్రతిభవల్ల మాత్రమే వచ్చాయని యూనివర్సిటీవాళ్లకు అర్థంకాలేదట. లాభ మేమున్నది? పర్మనెంట్ చెయ్యబడడంవల్ల ఆయన్ని పీకాలంటే ప్రొఫెసర్ల యూనియన్తో పోట్లాడాలి. పెద్ద కోర్టు కేస్ అవుతుంది. ఆయనేదో క్రిమినల్ యాక్టివిటీలో పాల్గొంటున్నాడన్న ఋజువు దొరికితే తప్పితే ఆయన ఉద్యోగానికి ఢోకా ఏమీ ఉండదు. ఎన్నో తరాల విద్యార్ధులని బాధపెట్టిన తరువాత ఈపాటికి ఆయన రిటయిరయి ఉండాలి. జీవనాధారాన్ని అందించినందుకు జెఫ్ కి ఋణపడి ఉన్నానని ఆయన అనుకుంటాడో లేదో గానీ, ఆనాటి విద్యార్థులకీ, ఆయన సహోద్యోగులకీ ఈ సంగతి బాగానే తెలుసు. స్వయంప్రతిభ వల్లనే పి.హెచ్.డి. డిగ్రీని సంపాదించుకున్న జెఫ్ బర్చ్ మాత్రం అంచెలంచెలుగా ఎదిగాడని అనుకోవడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.

Exit mobile version