Site icon Sanchika

అమెరికా సహోద్యోగుల కథలు -2: మేనేజ్ – వర్క్ లైఫ్ బాలెన్స్!

[box type=’note’ fontsize=’16’] “వర్క్ ఒక్కటే జీవిత లక్ష్యం కాదు, దాని బయట జీవితం ఉన్నది అని గ్రహించడంతో ఆగిపోక దాన్ని ఆస్వాదించడాన్ని ఆచరణలో పెట్టినవాళ్ళలో ఒకడు” అని తన సహోద్యోగి ‘మైకేల్ డానెలీ’ గురించి వివరిస్తున్నారు తాడికొండ కె. శివకుమార శర్మ [/box]

[dropcap]“ఉ[/dropcap]ద్యోగం పురుష లక్షణ” మన్న మాటని ఎవరూ కాదనలేరు గానీ, అంకితభావంతో పనిచెయ్యడ మంటే ఉద్యోగం తప్ప వేరే వ్యాపకాలు లేకపోవడం అని ఈనాడు అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో. మేనేజర్ పదవులలో ఉన్నవాళ్ల సంగతి ఇంక చెప్ప నవసరం లేదు. తెల్లవారుతూనే పరుగెత్తడాలూ, సాయంత్రం బాగా చీకటిపడ్డ తరువాత గానీ ఇంటికి చేరకపోవడాలూ, పిల్లలకి తండ్రి ఉన్నా లేనట్టే అన్న భావనల గూర్చిన ఆరోపణలని ఎదుర్కోవలసిరావడాలూ వాళ్లకి సామాన్యం. ఆ మేనేజ్ చేసేది నలుగురి నయినాగానీ, నాలుగు వందలమంది నయినా గానీ; నాలుగు లక్షల రూపాయల విలువ గల ప్రాజెక్టులో అయినా గానీ నాలుగు కోట్ల విలువ గల దానిలో అయినా గానీ. అదేమిటో గానీ, రూపాయల్లో ప్రాజెక్ట్ విలువ పెరిగే కొద్దీ ఈ మేనేజర్లకి వాళ్ల కుటుంబంతో గడిపే సమయం తగ్గుతూ వస్తుంది.

ఈ పరిశీలనకి వ్యతిరేకంగా కనిపించారు మా ప్రాజెక్ట్ మేనేజర్ మైకేల్ డానెలీ. ఇంజనీరు. వాతావరణ వివరాలని ప్రజలకు అందించడానికి కావలసిన సమాచారాన్ని ఉపకరణాల (ఇన్‌స్ట్రుమెంట్స్) ద్వారా సేకరించే GOES-R ఉపగ్రహాల (శాటలైట్ల) ప్రోగ్రాంకి మేనేజర్. ఈ ప్రాజెక్ట్ విలువ దాదాపు ఆరు బిలియన్ల డాలర్లు. ఆరు పక్కన తొమ్మిది సున్నాలు. డెభ్భైతో గుణిస్తే రూపాయల్లో ఈనాటి దాని విలువ వస్తుంది. పై పేరాలోని పరిశీలన లెక్కన కుటుంబ సభ్యులకి సమయాన్ని కేటాయించడా న్నటుంచి రోజులో ఒక్క నిముషం కూడా తనకోసం గడపడానికి మైక్ కి వీలవకూడదు. ఎందుకంటే, తన ప్రాజెక్టుని మేనేజ్ చెయ్యడానికి కావలసిన సమయంతో బాటు ఆయన తన పైవాళ్లకి ప్రాజెక్టు ఎలా సాగుతోందన్న వివరాలని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉండాలి. వాళ్లు తమ పైవాళ్లకి వివరిస్తారు. చివరికి అది వాషింగ్టన్, డి.సి., లోని  కాంగ్రెస్ దాకా వెడుతుంది. ప్రాజెక్ట్ ఎక్కడ కుంటుపడుతోందన్నా గానీ ఇంకా ఎక్కువ వివరాలను పైవాళ్లు డిమాండ్ చేస్తారని వేరే చెప్పనక్కరలేదు.

మైకేల్ పైవాళ్లకి ఏం రిపోర్టు యివ్వాలి అని చెప్పడానికి ముందుగా ఈ ప్రాజెక్టు ఎంత క్లిష్టతరమైనదో చెప్పాలి. నాలుగు శాటలైట్లని తయారుచెయ్యాలని ఆదేశం. ఆరు రకాల ఇన్‌స్ట్రుమెంట్స్ ఒక్కొక్క శాటలైట్ లోనూ ఉన్నాయి. 25 నుండీ 125 కిలోగ్రాములదాకా బరువు కలవి. ఆరు కంపెనీలు తయారుచేస్తున్నాయి. ఇది కాక శాటలైట్ తయారుచేసే కాంట్రాక్టర్ వేరే. అందువలన వాటి తయారీలో 4×7 = 28 ప్రత్యేకతలని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపకరణాల వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు (http://spaceflight101.com/goes-r/goes-r-instruments/). వాటిని తయారుచెయ్యడానికి అయ్యే ఖర్చు యాభై మిలియన్ల నుంచీ సుమారు బిలియన్ డాలర్లదాకా. రెణ్ణెల్ల కొకసారి ఈ ఏడుగురు కాంట్రాక్టర్లూ తమ అభివృద్ధి గూర్చిన వివరాలని ప్రాజెక్ట్ మేనేజర్ కి తెలియజెయ్యాలి. అందులో భాగంగా ముఖ్యంగా వివరించవలసినవి: సమయానికి తయారవుతున్నాయా, సాంకేతిక సమస్యలు ఎదురయాయా, అయితే వాటిని ఎలా అధిగమిస్తున్నారు, ఖర్చు ముందు అనుకున్న విధంగానే అవుతున్నదా లేక హెచ్చుతగ్గు లున్నాయా? ఈ వివరాల నన్నింటినీ వాళ్లు తెలియజెయ్యడం ఒక ఎత్తయితే, వాటిని మేనేజర్ గా పైవాళ్లకి చెప్పడంకోసమే కాకుండా గుర్తుపెట్టుకుని, రెణ్ణెల్ల తరువాతి మీటింగులో క్రితంసారి విశదీకరించిన సమస్యలని గుర్తుపెట్టుకుని వాటి వివరాలని ఆరాతియ్యడం ఇంకొక ఎత్తు. ఆ ప్రశ్నలు విన్నప్పుడు ఆ మీటింగుల్లో ఉన్న ప్రతిసారీ ఈయనకి ఎంత జ్ఞాపకశక్తి ఉన్నదో నని ఆశ్చర్యపోయేవాణ్ణి. దాదాపు 2000 సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ మొదలయినప్పుడు మైకేల్ మేనేజర్ కాదు గానీ, ఆ పొజిషన్లోకి వచ్చిన తరువాత ఏడేళ్లకు పైగా దానికి సారథ్యం వహించారు. నవంబర్ 19, 2016 న మొదటి ఉపగ్రహం లాంచ్ సమయానికి నాలుగేళ్ల ముందరే వేరే ప్రాజెక్టుకు మేనేజర్ గా మారినా, ఆ లాంచ్ విజయవంత మవడంలో మైకేల్ కృషి ఎనలేనిది అన్న విషయం మాత్రం తిరుగులేని సత్యం.

ఇంత క్లిష్టతరమైన ప్రాజెక్టుని మేనేజ్ చేస్తూ కూడా, దాదాపు ఏప్రిల్ నెల నుంచీ అక్టోబర్ దాకా వారంలో ఒక రోజు మధ్యాహ్నం తను ఆఫీసులో ఉండడని ముందుగానే అందరికీ తెలియజేసేవాడు. వాన పడుతుంటే తప్ప తన బోటులో ఛెసపీక్ (Chesapeake) బే లో విహారానికి వెళ్లడమో లేక గోల్ఫ్ ఆడడమో చేస్తాడు. అంతటితో ఆగకుండా 2012 లో తొమ్మిదిమందితో కలిసి అట్లాంటిక్ మహాసముద్రంలో సెయిలింగ్ పోటీలో పాల్గొన్నాడు. ఈ పోటీలో కేవలం తెరచాపలని ఉపయోగించి మాత్రమే నడిపే పడవలకే ప్రవేశం అన్నమాట. గాలివాటున సాగుతూ 752 మైళ్ల దూరాన ఉన్న గమ్యాన్ని చేరడం ఈ పోటీలో లక్ష్యం. చేరడానికి కొన్ని రోజులు పడుతుంది కాబట్టి ఈ బోటులో వండుకోవడానికీ, పడుకోవడానికీ వసతులుంటాయి.

సెయిల్ బోటు పి.హెచ్.డి.లున్న భార్యాభార్తలది. ప్రభుత్వోద్యోగు లయిన భార్యాభర్తలు, ఇళ్లు కట్టే వ్యాపారం ఉన్న ఒకాయనా, నేవీలో పనిచేసే ఇంకొకరూ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగీ ఒకరూ, కస్టమర్ రిలేషన్స్ లో పనిచేసే వాళ్లొకరూ ఈ టీంలో భాగస్వాములు. ఒక్క మైక్ మాత్రమే కాక వీళ్లందరూ కూడా వర్క్ ఒక్కటే జీవిత లక్ష్యం కాదు, దాని బయట జీవితం ఉన్నది అని గ్రహించడంతో ఆగిపోక దాన్ని ఆస్వాదించడాన్ని ఆచరణలో పెట్టినవాళ్లు! కానీ, వాళ్లెవరి మీదా లేని వత్తిడులు మైక్ మీద ఉన్నాయని మాత్రం చెప్పగలను.

జూన్ 8 న పొద్దున్న 4:30 కే నిద్ర లేచి, 7:30 బోటుని చేరితే పోటీ మధ్యాహ్నం 1:30 కి మొదలయింది. “వేరీజ్ మైక్?” అన్న వెబ్సైట్ ని తయారుచేసి పోటీ మొదలయిన తరువాత వాళ్ల పడవ ఎక్కడున్నదో తెలుసుకోవడానికి జీపీఎస్ సహాయంతో వెసులుబాటు కల్పించారు. అట్లాంటిక్ మహా సముద్రం అలలకి ప్రసిద్ది. పెద్దపెద్ద నావలనే ఆ అలలు ఆటాడిస్తాయి. అలాంటిది పదిమంది మాత్రం పట్టే పడవని ఒక పట్టు పట్టక ఊరుకుంటాయా? దానితోబాటు గాలివాటు వ్యవహారం కాబట్టి గాలి వీయకపోతే నట్టనడి సముద్రంలో చెక్కభజన తప్ప చెయ్యడాని కేమీ మిగలదు. జూన్ 14 న పొద్దున్న రెండు గంటలకల్లా బెర్ముడా తీరానికి దగ్గరలోకి వచ్చారు గానీ అక్కడ సరుకుల రవాణా నౌకలు పోర్టులో ఉన్నాయని తీరానికి రానీయకుండా కొన్ని గంటలపాటు వాళ్లని ఆపివేశారు. పోటీలో ఎనిమిదవ స్థానంతో తృప్తిపడవలసి వచ్చింది.

బెర్ముడాలో మూడురోజులు విశ్రాంతి తీసుకుని వెనక్కుబయలుదేరారు. కొంతమంది విమానంలో తిరిగి వస్తే, వాళ్ల స్థానంలో కొత్తవాళ్లు ముగ్గురు చేరారు. బయలుదేరిన కాసేపటికే గాలుల వేగం పెరిగి ప్రయాణాన్ని కష్టతరం చేసింది. బోటులో చేరుతున్న అరడుగు నీళ్లని తోడి బయట పారబోస్తూనే వుండవలసివచ్చింది. వాతావరణాని కనుకూలంగా తెరచాపలని ఎత్తడమో, దించడమో, లేక మార్చడమో చెయ్యవలసివచ్చింది. 22వ తారీకున మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో మొదలుపెట్టి అతి వేగంగా వీస్తున్న గాలుల, కళ్లు కనిపించనీయని వానల నడుమ బోటు దిశని మార్చి దగ్గరలో వున్న తీరాన్ని చేరి ఆ రోజు రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుని 23 పొద్దున్న బయలుదేరి 24 మధ్యాహ్నానికి ఇంటిదగ్గరి తీరానికి చేరారు.

ఇంటికి చేరాక మైకేల్ చేసిన మంచి పని తన ప్రయాణ విశేషాలని మా ప్రాజెక్టుకు తెలియజెయ్యడం. అందువల్లనే వాటిని క్లుప్తీకరించి ఈనాడు పంచుకోవడానికి వీలయింది. ఈ వ్యాసాన్ని రాసే ముందర ఆయనతో మాట్లాడుతుంటే 2012 తరువాత కూడా ఇలాంటి పోటీల్లో పాల్గొటూనే ఉన్నానన్నారు. మా ప్రాజెక్ట్ తరువాత కనీసం ఇంకా రెండింటికి సారథ్యం వహించారు. వాటిల్లో ముఖ్యమైనది Osiris-Rex మిషన్. బెన్ను అన్న ఆస్టరాయిడ్‌కి శాటలైట్‌ని పంపి, పంధొమ్మిది వందల అరవై, డెభ్భై దశకాల్లో చంద్రుడి వద్దనించీ తెచ్చినట్లుగా ఈ ఆస్టరాయిడ్‌ దగ్గరినించీ రాళ్లనీ, రప్పలనీ వెనక్కి తీసుకురావడం దీనికి నిర్దేశించిన పని. ఈ మిషన్ సెప్టెంబర్ 8, 2016లో లాంచ్ చెయ్యబడ్డది.  బెన్ను దగ్గర సేకరించినవాటితో సెప్టెంబర్ 24, 2023న తిరిగి భూమిని చేరుకుంటుంది. అయితే, ముఫ్ఫై ఏళ్లు మాత్రమే ఉద్యోగస్తునిగా ఉంటాను అన్న నిర్ణయం తీసుకున్న మైక్ ఆ విషయాన్ని సాధారణ పౌరునిగా తెలుసుకుంటాడు – ఎందుకంటే, జూలై, 2019లో రిటయిరవుతున్నారు! ఇంకా అరవై ఏళ్ల వయసుని చేరకుండానే! ఆయన సహోద్యోగులకి, వర్క్ బయట ప్రపంపచానికి వర్క్‌తో సమంగా, లేదా ఇంకా ఎక్కువగా విలువ నిచ్చే మైక్ ఈ రిటయిర్మెంట్ తీసుకోవడం అంత ఆశ్చర్యకరమైనది కాదు. Osiris-Rex మిషన్ ప్రస్తుతం ఏ ఫేజ్‌లో ఉన్నదో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. https://www.asteroidmission.org/objectives/

వర్క్-లైఫ్ లని బాలెన్స్ చెయ్యడం గూర్చి ఎన్ని పుస్తకాలు ప్రచురింపబడ్డా వాటితో అవసరం లేకుండా అలా చేసి చూపిన మైకేల్ తో పనిచేసినందుకు గర్వపడుతున్నాను.

Exit mobile version