[box type=’note’ fontsize=’16’] “స్నేహానికి ప్రాణ మిచ్చిన ఇతనంటే స్నేహానికి ప్రాణం కాకుండా ఎలా వుంటుంది?” అని తన సహోద్యోగి ‘క్రిస్ మోరిస్’ గురించి వివరిస్తున్నారు తాడికొండ కె. శివకుమార శర్మ. [/box]
స్నేహ మంటే ఒకళ్లకి ప్రాణం అని వినడం సాధారణం. అలాంటిది, ఈ శీర్షిక ఏమిటీ, ఇలా తిప్పి ఉన్నది అని అనుకుంటున్నారా? క్రిస్ మోరిస్ గూర్చి చదివిన తరువాత మీరు కూడా ఈ చిత్రణతో ఒప్పుకుంటా రన్న నమ్మకం నాకున్నది.
మందులేని వ్యాధికి గురయిన ఒక స్నేహితుడి గూర్చిన బాధ ఎవరిని ఏ పని చెయ్యడానికి ప్రేరేపిస్తుందో చెప్పడం కష్టం. కానీ, క్రిస్ లాంటి స్నేహితుడు దొరకడం ఎంత గొప్ప అదృష్టమో చాలా తేలిగ్గా చెప్పెయ్యొచ్చు.
క్రిస్ మోరిస్ నాసాలో మా GOES-R ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. మంచి వ్యక్తి. అందరితో చాలా తేలికగా కలిసిపోయే స్వభావం. ఐటి మేనేజర్. ఉద్యోగరీత్యా ఎలాంటి సహాయా న్నయినా వెంటనే అందించడానికి ముందుంటాడు. అతను స్నేహానికి ఇచ్చే ప్రాణం గూర్చి తెలిసింది మాత్రం 2011లో.
అతని కాలేజీ కాలం (1982) నాటి స్నేహితుడు జేన్ గోర్డాన్ మల్టిపుల్ స్లెరోసిస్ అన్న వ్యాధికి గురయి బాధపడుతున్నాడు. కేన్సర్ లాగానే ఈ వ్యాధి కూడా చికిత్సకి దొరక్కుండా తప్పించుకు తిరుగుతోంది. ఆప్తులకి ఇలాంటి వ్యాధులు సోకినప్పుడు చెయ్యగలిగేది చికిత్సకోసం జరిగే పరిశోధనలకోసం వనరులని పోగుచెయ్యడం, పరిశోధనలు జరుపుతున్నవాళ్లకి వాటిని అందివ్వడం. వనరులని పోగుచెయ్యడానికి చేపట్టే కార్యక్రమాల్లో చిన్నపిల్లలు బడులలో జరిపే కేకులనీ, బిస్కెట్టులనీ అమ్మడం నించీ అన్ని వయసులవాళ్లూ ఘనీభవించే ఉష్ణోగ్రత ఉన్న నీళ్లల్లో దూకే దాకా విస్తృతి ఉంటుంది. క్రిస్ ఎన్నుకున్నది మాత్రం దేశంలో పశ్చిమాన ఉన్న పసిఫిక్ మహాసముద్రపు తీరాన్నుంచీ రెండువేల ఎనిమిది వందల మైళ్ల దూరాన (4,400 కిలోమీటర్లు – కాశ్మీరు నుండీ కన్యాకుమారి దాకా ఉన్న దూరం కంటే దాదాపు 1,600 కి.మీ. ఎక్కువ) తూర్పున ఉన్న అట్లాంటిక్ మహాసముద్రపు తీరందాకా సైకిల్ తొక్కుతూ రావడాన్ని. అది కూడా ఒంటరిగానే!
ఈ ప్రయాణంలో ఎదురయ్యే సాధకాల కన్నా బాధకాలే ఎన్నో వేల రెట్లు ఎక్కువని తేలిగ్గా చెప్పొచ్చు. మొదటగా ఆలోచించవలసింది సైకిల్ తొక్కే వ్యక్తి క్షేమాన్ని గూర్చి. అమెరికాలో కేవలం కొన్ని పెద్ద పట్టణాల్లో మాత్రమే సైకిల్ కంటూ ప్రత్యేకమయిన లేన్లుంటాయి. అది కూడా అక్కడక్కడా మాత్రమే. ఇతని ప్రయాణంలో తగిలేవి మాత్రం సైకిళ్లు తొక్కడానికి ఎలాంటి ప్రత్యేక హోదాకీ వెసులుబాటు నివ్వకపోగా గంటకి కనీసం డెబ్భై మైళ్ల వేగంతో పక్కనించీ దూసుకుపోయే వాహనాలున్న హైవేలు. పైగా, ఆ వాహనాలు నడిపేవాళ్లు రోడ్ల పక్కన అయినా గానీ మనుషులు ఉంటారని ఊహించకపోవడంవల్ల సైకిల్ తొక్కేవాళ్లకి ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువ. కొంతమంది గుంపులుగా సైకిళ్లమీద వెడుతుంటారు. అలాంటిచోట్ల ఒకరికొకరు సహాయం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇతనొక్కడే!
దేహదార్ఢ్యం కోసం ప్రతీ ఆటగాడూ శ్రమపడినట్లే ఇతను కూడా ప్రయాణానికి ముందునించే శరీరాన్ని కావలసిన బాటలో చేర్చుకున్నాడు. అయితే, దేహబలాన్ని మించి కావలసింది గుండెబలం. రోజుకి పదిగంటలపాటు గంటకి సగటు పది, పదిహేను మైళ్ల వేగంతో వెళ్లగలిగినా అలా ఒకరోజు చెయ్యగలగడం వేరు, రోజు తరువాత రోజు అదేపనిగా చెయ్యడం వేరు. రెండురోజులపాటో లేదా ఒకవారంపాటో అలా సైకిల్ తొక్కుతూ గడిపిన తరువాత ఇంక కుదరదంటూ దేహం మొరాయించే అవకాశం చాలా ఎక్కువ.
సోకిన వ్యాధి స్నేహుతుణ్ణి ఎక్కువ కాలం బతకనివ్వదని తెలుసు. కానీ, తరువాత గోర్డాన్ బ్రతికిన మూడేళ్లూ విజయవంత మయిన స్నేహితుని ప్రయత్నాన్ని ఏ రోజయినా మరచిపోవడానికి అవకాశం లేకుండా తలచుకుంటూ ఉన్నా డనుకోవడంలో ఆశ్చర్య మేమీ ఉండదు కదా! స్నేహానికి ప్రాణ మిచ్చిన ఇతనంటే స్నేహానికి ప్రాణం కాకుండా ఎలా వుంటుంది?