[box type=’note’ fontsize=’16’] “పక్కింటివాడి ఉద్యోగం ఊడితే అది రిసెషన్. నీది ఊడితే అది డిప్రెషన్!” అని చెప్పిన తన సహోద్యోగి ‘రిచర్డ్ వాండర్వూర్ట్’ గురించి వివరిస్తున్నారు తాడికొండ కె. శివకుమార శర్మ. [/box]
[dropcap]“నీ[/dropcap] పని నువ్వు చెయ్యి!” అంటాడు గీతలో కృష్ణుడు. దాన్ని ఆదేశంగా భావిస్తూ అమలులో పెట్టినవాళ్లల్లో నాకు కనిపించిన ఒక అపూర్వ వ్యక్తి రిచర్డ్ వాండర్వూర్ట్.
పి.హెచ్.డి. తరువాత చదువుకు తగినంత జీతమిస్తూ ఉద్యోగచ్చిన మొదటి కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ డిక్; “డిక్” అన్న పొట్టి పేరుతో రిచర్డ్ ని పిలవడం అమెరికాలో సాధారణమే. ఆ కంపెనీ ముగ్గురు సంస్థాపకుల్లో డిక్ ఒకడు. (ఎనభయ్యవ దశకంలో ముగ్గురూ కలిసి పనిచేసిన కంపెనీలోనే ఒక సాఫ్ట్ వేర్ని తయారుచేసినా, నాసా కాంట్రాక్టుతో దాన్ని ఇంకా అభివృద్ది చెయ్యడానికి స్వంతంగా కంపెనీని స్థాపించారు.) నాకంటే కనీసం పాతికేళ్లు పెద్దవాడు. ఎప్పుడూ చాలా సీరియస్ గా కనిపించేవాడు. చాలా ప్రిన్సిపుల్డ్ వ్యక్తి. అప్పుడే బాచెలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగంలో చేరినవాళ్లకి అతను ప్రిన్సిపాల్ లాగా కనిపించి వుంటాడు. అతని అరవయ్యవ దశకపు లావుపాటి నల్ల ఫ్రేమున్న కళ్ళజోడూ, తీక్షణ దృష్టీ దానికి దానికి కారణా లనిపిస్తాయి.
రిపోర్టులని రాయడానికి కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థులు శ్రద్ధ చూపించరు – అమెరికాలో కూడా. సమస్యని పరిష్కరించడంలో చూపే శ్రద్ధ దాని వివరాలని కాగితం మీద పెట్టడాని కొచ్చేసరికి మాయ మవుతుంది. అది రిపోర్ట్ రాయడాన్ని ఇంజనీర్లు ఒక పెద్ద పరిశ్రమ చెయ్యడంగా భావించడంవల్ల కావచ్చు, లేదా వాళ్ల మేనేజర్లు వాటి తయారీకి కావలసినంత సమయాన్ని కేటాయించకపోవడం వల్ల కావచ్చు. ఏమయినా గానీ, కాంట్రాక్టుల మీద ఆధారపడే కంపెనీలకి రిపోర్టులని తయారుచేసి సమర్పించడం తప్పనిసరి. ఇంగ్లీషు మాతృభాష అయిన కొంతమందికి కూడా, రిపోర్టు రాయడం మాట అటుంచి వ్యాకరణ దోషాల్లేకుండా ఒక్క వాక్యం రాయడం కూడా గగనమే అని తెలుసుకున్నప్పుడు ‘వార్నీ!’ అనుకోక తప్పదు. అయితే, డిక్ ఒక టాస్క్ లీడ్ గనుక, అతని గ్రూప్ లో పనిచేస్తూ రిపోర్టు తయారుచేయవలసిన వ్యక్తి కస్టమర్ కి అందించడానికి తగిన స్థాయికి దాన్ని తీసుకురాకపోతే ఆశ్చర్యపోయి కూర్చోలేదు. చికాకుపడ్డాడు. ఉద్యోగ పర్వం ఒక ఏడాది కూడా పూర్తి కాని కుర్రాడు డిక్ ని ‘రిపోర్టు చదివావా?’ అనడిగితే అతని ముందరే ఆ రిపోర్టుని చెత్తబుట్టకు సమర్పించాడు. ఆ కుర్రాడు కళ్లనీళ్ల పర్యంత మయ్యాడని ఒక కొలీగ్ చెప్పాడు. ఇప్పటికీ ఆ క్వాలిటీ లేని రిపోర్టులు చదవవలసి వస్తూనే ఉంటుంది గానీ, అలాంటి వాటిని బుట్టపాలు చెయ్యడానికి డిక్ కి ఉన్న స్వేచ్ఛ నాకు లేనందుకు విచారం కలుగుతూంటుంది.
డిక్ తరంవాళ్లే కాక అన్ని వయసులవాళ్లు కూడా తమకి తామే కొంతమంది ఇంట్లో ఫ్లోరింగులు మార్చడాలూ, కిచెన్లనీ, బాత్రూములనీ ఊడబీకి కొత్తవి అమర్చడాలూ, కార్ల రిపేర్లు చేసుకోవడాలూ అమెరికన్లలో సాధారణంగానూ, ఇండియా, చైనా దేశాలనింఛీ వచ్చినవాళ్లల్లో అక్కడక్కడా కనిపించినా, “సర్వజ్ఞుడి” కింద మొదటగా నాకు తెలిసిన వ్యక్తి డిక్. అతని గరాజ్ ఒక వర్క్‌షాప్. నేను డిజైన్ చేసిన ఒక ప్రాజెక్టుని అతని గరాజ్ లో టేబుల్ కి బిగించి అది ఎలా పనిచేస్తోందో గమనించాం.
అమెరికాలో 1991 సంవత్సరం ఉద్యోగాలకి గడ్డుకాలం. దానికి తోడు అమెరికా అధ్యక్షుడూ, కాంగ్రెస్సూ కలిసి కొన్ని మిలిటరీ ఉద్యోగాలని తొలగించారు. పైగా, ఇరాక్ మీద ప్రకటించిన మొదటి యుద్ధం – గల్ఫ్ వార్ – జరిగిన కాలం. ఆ కాలాన్ని రిసెషన్ పీరియడ్ అన్నారు. 1930 దశకంలో వచ్చిన డిప్రెషన్ దానికన్నా కూడా ఇంకా ఎక్కువ గడ్డుకాలం. రెండింటికీ తేడా ఏమిటన్న ప్రశ్నకి డిక్ ఇచ్చిన సమాధానం మరువలేనిది: ‘పక్కింటివాడి ఉద్యోగం ఊడితే అది రిసెషన్. నీది ఊడితే అది డిప్రెషన్!’ వాషింగ్టన్, డి.సి. కి దూరంగా ఎక్కడో మారుమూల ఫ్లారిడాలో ఉన్నామనుకున్నాం గానీ మా సహోద్యోగులలోనే కొంతమందికి అది రిసెషన్నీ, మరికొంతమందికి డిప్రెషన్నీ రుచి చూపించింది.
అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ తో బాటు చాలామంది Habitat for Humanity అన్న సంస్థ ఆధ్వర్యంలో ప్రతిఫలమేమీ తీసుకోకుండా ఇళ్లు కట్టిపెడుతూంటారు. అలా సహాయం చెయ్యడానికి వెళ్లేవాళ్లు తమ ఖర్చులని తామే పెట్టుకుంటారు. పనిలో మధ్యాహ్నం మాత్రం అందరికీ భోజనం పెడతారు. అన్ని రకాల పనులనీ చెయ్యగల సామర్థ్యం కలవాడు గనుక డిక్ ఆ సంస్థకి తన సహాయాన్ని అందించేవాడు.
నేను ఆ కంపెనీని వదిలిన తరువాత దాని మిగిలిన ఇద్దరు వ్యవస్థాపకులు అతని భాగాన్ని కొనేసుకున్న తరువాత ఇంటిని అమ్మేసి, ఒక RV (రిక్రియేషన్ వెహికిల్ – చక్రాల మీద ఇల్లు – అందులో నివసించడానికి కూడా సదుపాయా లుంటాయి – కిచెనూ, లివింగ్ రూమూ, టాయిలెట్ తో సహా) కొనుక్కుని, భార్యతో సహా Habitat for Humanity కి వాలంటీర్ సర్వీసులని అందిస్తున్నా డని విన్నాను. భారత స్వాతంత్రోద్యమంలో సర్వం త్యజించి పాల్గొన్నవాళ్ల గూర్చి వినడమే తప్ప వాళ్లని ప్రత్యక్షంగా చూసిందీ, కలిసిందీ లేదు. సహాయ సహకారోద్యమంలో ఏమీ తిరిగి ఆశించకుండా పాల్గొంటున్న వ్యక్తితో కలిసి రెండేళ్లకి పైగా పనిచేసినందుకు ఆనందంగా ఉన్నది.
ఈ కర్మయోగి లిస్టులోని కర్మలు చాలా గొప్పవి.
సారంగలో వచ్చిన నా “రవి గాంచినది” కథలో ప్రత్యేకంగా పేరు పెట్టకపోయినా ఉదహరించబడ్డ ఒక వ్యక్తి ఈయనే. ఆయనతో కలిసి పనిచేసిన పాతికేళ్లకి పైగా తరువాత ఇలా రాస్తానని ఊహించివుంటే అప్పుడే ఆయన ఫోటోని సంపాదించి వుండేవాణ్ణి. ఈనాడు ఎక్కడా ఈయన ఫోటో లభించలేదు.