Site icon Sanchika

అమెరికా సహోద్యోగుల కథలు-9: బ్రోచిన రూపం

[box type=’note’ fontsize=’16’] “క్రిస్ నాకు చేసిన మరచిపోలేని సహాయం నేను కొన్న మొదటి కారుతో ముడిపడి వున్నది” అని తన సహోద్యోగి ‘క్రిస్ స్మిత్’ గురించి వివరిస్తున్నారు తాడికొండ కె. శివకుమార శర్మ. [/box]

[dropcap]“ఎ[/dropcap]టుల బ్రోతువో తెలియా!” అంటాడు త్యాగరాజు ఒక కీర్తనలో. దాదాపు ముఫ్ఫయ్యేళ్ల క్రితం సరిగ్గా అలాగే అంటూ వగచేనేమో గుర్తులేదు గానీ దానికి కావలసిన బలమైన కారణం మాత్రం లేకపోలేదు. వచ్చి బ్రోచిన రూపాన్ని మాత్రం మరచిపోయే సమస్యే లేదు.

రట్గర్స్ యూనివర్సిటీలో నా మొదటి ఆఫీస్ మేట్ క్రిస్టఫర్ స్మిత్. యూనివర్సిటీలో ఆఫీస్ మేట్ ఏమిటీ అన్న సందేహం సామాన్యం. మేమిద్దరం విద్యార్థులమే అయినా దానితోబాటుగా బోధనా సహకారులం – అంటే, టీచింగ్ అసిస్టెంట్స్ –కావడంవల్ల యూనివర్సిటీ ఉద్యోగులం కూడా. మా ఇద్దరి కార్యాలయాలూ ఒక లాబొరేటరీలో. పర్సనల్ కంప్యూటర్లే కాక కనీసం మానిటర్లు కూడా డెస్కుల మీదకు చేరని కాలం.

అప్పటికీ, ఇప్పటికీ కూడా మాస్టర్స్ డిగ్రీ చేద్దా మనుకునే అమెరికా దేశపౌరులు తక్కువే. ఈనాడు ఇద్దరు పిల్లలని కాలేజీలో చదివించిన తరువాత చెబుతున్నాను. బాచెలర్ డిగ్రీ చెయ్యడానికే ఖర్చు తడిసి తడిసి మోపెడవుతుంది మరి! అందుకని మా డిపార్ట్‌మెంటులోనే గాక యూనివర్సిటీ అంతటా ఎక్కువగా విదేశాల నుండీ వచ్చిన విద్యార్థులే మాస్టర్స్, పి.హెచ్.డి. ప్రోగ్రాములలో కనిపిస్తారు. అలాంటి చోట ఈ దేశంలోనే పుట్టి పెరిగిన క్రిస్ కొద్దిగా అరుదయిన వ్యక్తి. అంతే కాక క్రిస్ చాలా సాధుస్వభావుడు. (క్రిస్ అనేది క్రిస్టఫర్ అనే పేరున్నవాళ్లందరూ సాధారణంగా పలికే  పొట్టిపేరు.) మా డిపార్ట్‌మెంటులో ఉండే ఆరుగురు (నాతో కలిపి) ఇండియన్లతో కలిసిపోయాడు. పైగా, అతనికీ, నాకూ అడ్వైజర్ ఒకే ప్రొఫెసర్. అందువల్ల అని కాదు గానీ, క్రిస్ నాకు చేసిన మరచిపోలేని సహాయం నేను కొన్న మొదటి కారుతో ముడిపడి వున్నది.

విద్యార్థి దశలో – అందునా రెండు సూట్‌కేసులతో అమెరికాలో అడుగుపెట్టి, తల్లిదండ్రులూ, చుట్టపక్కాలూ ఎవరూ దేశంలోనే కాక ఖండంలోనే  లేనప్పుడు, యూనివర్సిటీ వాళ్లిచ్చే వేతనంతో కొనుగోలు శక్తి ముడిపడి ఉన్నప్పుడు – కొనగలిగింది బాగా వాడేసిన కారు మాత్రమే! అమెరికాలో అడుగుపెట్టే ముందర కారు నడపడం మాట అటుంచి, కారులో ఎన్నిసార్లు కూర్చున్నానో లెక్కపెట్టడానికి ఒక చేతి వేళ్లు ఎక్కువ. అందుకని పాత కారు కొనడంలో తీసుకోవలసిన జాగ్రత్తల గూర్చి ఏమీ తెలియదు. పైగా, ఇండియాలో అంబాసడర్, ఫియట్ రెండు కారు మోడల్స్ ని మాత్రమే చూడడానికి అలవాటుపడ్డవాణ్ణి. న్యూస్ పేపర్ అడ్వర్టయిజ్‌మెంట్స్‌లో కనపడ్డ అయిదు అమెరికన్ కంపెనీలు, మూడు జాపనీస్ కంపెనీలు, ఇంకా జర్మన్, స్వీడన్, ఇటాలియన్, దేశాల కంపెనీలు, ప్రతీ కంపెనీ తయారు చేసే మూడు నాలుగు మోడల్స్ నాలో కొద్దిగా గందరగోళాన్ని సృష్టించాయి. నాకన్నా ఒకటి, రెండు సంవత్సరాలు ముందు వచ్చిన భారతీయ విద్యార్థుల సహాయాన్ని తీసుకున్నాను. చివరకి నా చేతి కొచ్చింది టయోటా కరోలా. 1978 మోడల్. కొన్నది 1987 లో. ఒక ఆస్ట్రేలియన్ దాన్ని కేలిఫోర్నియాలో కొని, దేశం పసిఫిక్ మహాసముద్రపు తీరాన్నుండీ అట్లాంటిక్ మహాసముద్రపు తీరం దాకా దాదాపు మూడువేల మైళ్లు డ్రైవ్ చేసి, న్యూ జెర్సీలో నాకు – ఒక భారతీయుడికి – పదిహేను వందల డాలర్లకు అమ్మేసి వెళ్లిపోయాడు. తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది.

కారు రిజిస్ట్రేషన్ చేసే ముందర అంతా సవ్యంగా ఉన్నదన్న ఇన్స్‌పెక్షన్ రిపోర్టు కావాలి. నీలం పొగ రావడం ఇంజన్ సరిగ్గా పనిచెయ్యకపోవడంవల్ల అని కారు ఇన్స్‌పెక్షన్ ఫెయిలయింది. నాలుగు వందల డాలర్లకు పైగా తీసుకుని ఒక మెకానిక్ అంతా బావున్నదన్న స్టికర్ ఇచ్చాడు కానీ, సంవత్సరం తరువాత మళ్లీ అదే పరిస్థితి. ఆ మెకానిక్ డబ్బు తీసుకున్నాడు గానీ అవసర మయిన రిపేర్ మాత్రం చెయ్యలేదని అప్పుడు తెలిసింది. (ఇక్కడ కూడా అలా చేస్తారా అని ఆశ్చర్యపోయిన మాటమాత్రం నిజం.) దానితోబాటే, ఈసారి ఖర్చు నాలుగంకెలు దాటుతుందని కూడా. అప్పటికి నాలుగంకెలు దాన్ని కొనడానికీ, ఆ కొన్న ఖర్చులో మూడవ వంతు అప్పటికే రిపెర్లకీ ఖర్చుపెట్టినవాణ్ణి. మళ్లీ అంత ఖర్చు పెట్టే స్తోమత ఏమాత్రం లేదు.

నా బాధ చూడలేక, మనమే చేసుకుందాం, పార్ట్స్ ఖర్చు మాత్రం నువ్వు పెట్టుకో, అన్నాడు క్రిస్. కారులో ఏ భాగమేదో తెలియనివాడికి వాటి రిపేరు గురించి ఏం తెలుస్తుంది? అందుకని, నేను పక్కన నిల్చొని దేభ్యం మొహాన్నేసుకుని చూస్తుండగా చేసిన దంతా అతనే!

ఒక శనివారంనాడు ఆ కారుని యూనివర్సిటీలో లాబ్ హై-బే లోకి తోలి, అక్కడ ఇంజన్ చుట్టుపక్కల ఉన్న చాలా భాగాలని పీకి, సిలిండర్ హెడ్ ని ఊడదీశాడు. దాన్ని తన కారులో మెషీన్ షాపుకు తీసుకెళ్లి సర్ఫేస్ ని గ్రైండ్ చేయించి తీసుకువచ్చి, మళ్లీ ఇంజన్ కి అమర్చాడు. రెండు వాక్యాల్లో చెప్పాను గానీ రెండు నిముషాలలో ఆ పని అయినట్లు కాదు.  నాలుగ్గంటలు పీకడానికి పట్టింది. ఇంకో నాలుగ్గంటలు అన్నీ మళ్లీ సరిగ్గా పెట్టడానికి. పార్టులకీ, మెషీనింగ్ కీ కలిపి ఖర్చు దాదాపు రెండువందల డాలర్లు. అదే మొత్తం రిపేరు బయట షాపులో చేయిస్తే కనీసం వెయ్యి డాలర్లు దాటేది. (అంత ఖచ్చితంగా ఆ సంగతి నాకు ఎలా తెలుసునంటే, అదేం భాగ్యమో గానీ ఒక నాలుగేళ్ల క్రితం అలాంటి రిపేరు ఇంకొక టయోటా కారుకి వచ్చింది. అయిన ఖర్చు, మూడు వేల డాలర్లు!) ఆ కాలంలో అది నాకు తలకు మించిన ఖర్చే! ఒక నాలుగేళ్ల పరిచయానికే అతను నాకు చేసిన సహాయం ఎన్నడూ మరువలేనిది. ఇదీ బ్రోచిన రూపం!

నేను న్యూ జెర్సీని వదిలి వచ్చిన తరువాత క్రిస్ ని మళ్లీ కలిసింది లేదు. ఈ మధ్యనే అతనితో మాట్లాడి ఫోటో సంపాదించాను. పి.హెచ్.డి. పూర్తి చేసి గవర్నమెంట్ లాబ్ కి డైరక్టర్ గా పనిచేస్తున్నాడు. ముఫ్ఫై ఏళ్ల తరువాత మాట్లాడుతున్నట్లు ఏమాత్రం అనిపించలేదు. అతను ఆఫీసు పనిమీద వాషింగ్టన్ వచ్చినప్పుడు కలుద్దామని సంకల్పం.

అలాగే, యాంగ్ అనే ఒక చైనా దేశీయుడి పరిచయం కూడా. అతను మేమున్న హాస్టల్లో ఉండేవాడు. ఒక రోజున నా కారు కింద ఆకుపచ్చ రంగునీళ్లు కనిపించాయి. వాటర్ పంప్ పాడయింది. నేను కొత్తదాన్ని కొనుక్కుని వచ్చి దాన్ని బిగించడానికి కష్టపడుతుంటే అతనే పని పూర్తిచేశాడు. యాంగ్ తో నాది ముఖపరిచయానికి ఒక మెట్టు మాత్రం ఎక్కువ. క్రిస్ కానీ, యాంగ్ కానీ నాకు అంత సహాయం చెయ్యడం ఎప్పుడూ మరువలేనిది.

ఉపసంహారం: మేము న్యూ జెర్సీ నుంచీ ఫ్లారిడాకి వెడుతూ, ఆ కారుని నా శ్రీమతి చుట్టానికి ఇచ్చేసి వెళ్లాం. దాదాపు మూడేళ్ల తరువాత వాళ్లింటికి వెళ్లి కలిస్తే తెలిసిన దేమిటంటే, నా దగ్గరున్న మూడేళ్లలో నన్ను పెట్టిన ఇబ్బందికి ఆ కారుకి సిగ్గొచ్చిందో ఏమో గానీ, తరువాత మూడేళ్లూ వాళ్లకి ఏమీ ట్రబుల్ ఇవ్వలేదట! అదీ అదృష్ట మంటే!

“ఏనాటి నోము ఫలమో!” అని కూడా అన్నాడు త్యాగరాజు.

Exit mobile version