Site icon Sanchika

అమెరికా సహోద్యోగుల కథలు – పరిచయం

[box type=’note’ fontsize=’16’] రోజులో మెలకువగా ఉండే సగభాగం మసలే సహోద్యోగులలో ప్రత్యేకతలున్నవాళ్ళ గురించి, తమ జీవితాలని సుసంపన్నం చేసుకున్నవారి గురించి ‘అమెరికా సహోద్యోగుల కథలు‘ అనే కాలమ్ ద్వారా తెలియజేస్తున్నారు తాడికొండ కె. శివకుమార శర్మ. [/box]

[dropcap]నే[/dropcap]ను ఐ.ఐ.టి. మద్రాసులో చదువుతున్న రోజుల్లో ప్రతి బుధవారం మధ్యాహ్నం సెమినార్లుండేవి. తమతమ రంగాల్లో ప్రసిద్ధు లయినవాళ్లు వాటిల్లో ప్రసంగిస్తూండేవాళ్లు. ఒక కంటి ఆపరేషన్ వీడియోని చూపిస్తూ “ఎంత అద్భుతమో కదా!” అని వ్యాఖ్యానించిన ఒక డాక్టరూ, అపోలో 15 మిషన్లో చంద్రమండలానికి వెళ్లి వచ్చిన అంతరిక్ష యాత్రికుడు ఒకరూ ఇప్పటికీ గుర్తుండిపోయారు. వాళ్లతో బాటుగా అమెరికాలో ఉంటున్న ఐ.ఐ.టి. గ్రాడ్యుయేట్ ఒకతను.

ఈ ఐ.ఐ.టి. ఆలమ్నస్ 1982లోనో లేక 1983లోనో ఒక టెక్నికల్ సెమినార్లో ప్రసంగించాడు. అతని రీసెర్చ్ వివరాలను దాదాపు నలభై నిముషాలపాటు తెలియజేసిన తరువాత ప్రశ్నోత్తరాల సమయంలో విద్యార్థుల ప్రశ్నలన్నీ అతను ప్రసంగించిన విషయం మీద కాక అమెరికా గూర్చే – ముఖ్యంగా వివక్షత గూర్చి – అవడమూ, అతను ఇచ్చిన సమాధానమూ నా కిప్పటికీ గుర్తున్నాయి. “వర్కులో ఉన్నంతసేపూ సహోద్యోగులు నీ సాంకేతిక ప్రతిభకి విలువ నిచ్చి గౌరవిస్తారు గానీ, ఉంటున్న చోట అందరికీ నీ ప్రతిభ గూర్చి తెలియదు.” ఎవరూ కూడా అతన్ని, “ఆ సహోద్యోగులు నీ కెలాంటి స్ఫూర్తి నిచ్చారు?” అని మాత్రం అడగలేదు. ఇప్పటికీ, నాకు తెలిసినంతవరకూ స్ఫూర్తి నిచ్చిన అమెరికా సహోద్యోగుల వివరాలని అచ్చులో గానీ అంతర్జాలంలో గానీ చూసిన గుర్తులేదు.

స్ఫూర్తిదాయకు లయిన అమెరికన్లు రెండు చేతి వేళ్ల సంఖ్యకు మించి నాకు సహోద్యోగు లవడం నా అదృష్టం. ఈనాడు సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడూ కనిపించే / వినిపించే వివక్షత స్థాయిని దాటి, వాళ్లూ మనుషులేనని చెప్పే స్థాయిని రాకెట్ భూమండలాన్ని దాటినంత వేగంగా వాళ్లల్లోని ప్రత్యేకతలని చంద్రమండలం మీద అడుగు పెట్టిన మానవుడి విశేషాలుగా చూపే స్థాయికి తీసుకెళ్లడ మనేది ఈ కథల ఆకాంక్ష. అంతా మంచేనా లేక చెడు కూడా కనిపిస్తుందా అని రాబోయే ప్రశ్నకి ముందుగానే, “ఆ రెండో రకం రోజూ పేపర్లల్లో కనిపిస్తూనే ఉన్నాయి గదా!” అని జవాబిస్తాను.

అమెరికాలో నేను మొదట అడుగుపెట్టింది అంతర్జాతీయ విద్యార్థిగా. మేమున్న హాస్టల్లో (ఇక్కడ వాటికి డార్మ్స్ అని పేరు) అందరూ దాదాపు వేరే దేశాలనుండీ వచ్చినవాళ్లే. మా మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంటులో విద్యార్ధులలోనే గాక ఉపాధ్యాయులలో గూడా అంతర్జాతీయుల పాలు హెచ్చుగానే ఉండేది. కొత్తగా అమెరికాలో అడుగుపెట్టినవాళ్లకి జాతీయులంటే శ్వేతజాతీయులు మాత్రమే ననీ, అంతర్జాతీయులంటే మిగిలిన వాళ్లనీ ఇప్పటికీ అనిపించడం సహజం. (ఐరిష్ అమెరికన్లకీ, ఇటాలియన్ అమెరికన్లకీ తేడా లుంటాయి అని తెలియకపోయినా, చైనీస్ అమెరికన్లనీ, ఆఫ్రికన్ అమెరికన్లనీ, ఇండియన్ అమెరికన్లనీ ఇట్టే పట్టెయ్యొచ్చు.) ఆ సమయంలో అక్కడి అమెరికన్లలోనే గాక భారతీయుల్లోనూ, ఇతర దేశాలవాళ్లల్లోనూ కూడా స్ఫూర్తిదాయకులు కనిపించారు.

పి.హెచ్.డి. పూర్తిచేసిన తరువాత నాసాతో నా సంబంధానికి దాదాపు పాతికేళ్ల వయసు దాటిందంటే ఆశ్చర్య మేస్తుంది. నాసాలో పనిచేసే అందరూ ప్రభుత్వోద్యోగులు కానక్కరలేదు. గాడర్డ్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్లో పని అంతా భూమి వైపు గానీ అంతరిక్షం వైపు గానీ చూసే శాటలైట్స్ గూర్చి మాత్రమే. (వేరే గ్రహాలకు పంపే పని కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలోనూ, అంతరిక్షంలోకి మనుషులని పంపే పని టెక్సస్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్లోనూ జరుగుతాయి.) నేను పనిచేసిన ప్రాజెక్టులు వాతావరణం గూర్చిన వివరాలని తెలియజేసేవి. వాతావరణం అనగానే రోజూ టెలివిజన్ మీద గానీ ఇంటర్నెట్లో గానీ చూసే వివరాలు స్ఫురణ కొస్తాయి. ఇవి భూమికి సంబంధించినవి. కొన్ని శాటలైట్స్ లో, సూర్యునిలోని సంక్షోభాన్ని తెలుపుతూ, భూమి మీద దాని ప్రభావాన్ని ముందరే పసిగట్టడానికి కావలసిన సమాచారాన్ని అందించే పరికరాలు కూడా ఉన్నాయి.

కారుకీ, రిఫ్రిజిరేటర్ కీ, కంప్యూటర్ కీ లాగానే, ప్రతి శాటలైట్ కి కూడా జీవితకాల కనీస పరిమితి కొంత ఉంటుంది – అది నెలలు కావచ్చు, ఒక దశాబ్దం కావచ్చు. అవి అనుకున్నదానికంటే ఎక్కువకాలం పనిచెయ్యొచ్చు కూడా.  వాతావరణ వివరాలకి ఎప్పుడూ అవసర ముంటుంది కాబట్టి, పరిమిత కాలానికి మించి ఆ శాటలైట్లు పనిచేస్తాయని ఆశించి అక్కడితో ఆగకుండా ఆ పరిమిత కాలం పూర్తయేసరికి కొత్తవాటిని పాతవాటి స్థానంలో ఉంచేలా ప్లాన్ వేసి దాన్ని ఆచరణలో పెడతారు. ఒక కొత్త శాటలైట్ ని ప్లానింగ్ స్టేజి దగ్గర మొదలుపెట్టి దాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేసరికి కారణాంతరాల వల్ల అయిదేళ్ల నించీ పదిహేనేళ్ల వరకూ పట్టవచ్చు.  నవంబర్ 2016లో లాంచ్ చేసిన GOES-16 శాటలైట్ ఈనాడు అమెరికాకి తూర్పు తీరాన వాతావరణానికి సంబంధించిన పరిశీనలని అందిస్తోంది. మార్చి 2018లో లాంచ్ చేసిన GOES-17 శాటలైట్ అమెరికాకి పశ్చిమ తీరానికి చేరింది. ఈ రెండింటితోనూ అనుబంధం దాదాపు పదిహేనేళ్ల క్రితం ప్లానింగ్ స్టేజీలో మొదలుపెట్టి ఇప్పటిదాకా. ఆ అనుబంధంలో భాగస్వాములు సహోద్యోగులు. రోజులో మెలకువగా ఉండే సగభాగం వాళ్లతోనేగా మసలడం! ఉద్యోగమే పరమావధిగా పెట్టుకున్నవాళ్లతో బాటు ప్రత్యేకత లున్నవాళ్లు నాకు తెలిసి ఇంద రున్నారని ఈ మధ్యనే తెలిసి సంతోషించాను. వీళ్లల్లో ఒక అంతరిక్ష యాత్రికుడూ, సేవాతత్పరురా లయిన ఒక నర్తకీ, కొన్ని బిలియన్ డాలర్ల ప్రాజెక్టుని మేనేజ్ చేసిన ఒక వ్యక్తీ, స్నేహితుడు గురయిన విరుగుడు లేని రోగానికి చికిత్సకై పరిశోధన కోసం డబ్బు పోగుచెయ్యడానికి అమెరికా పశ్చిమ తీరాన్నుండీ దాదాపు రెండువేల రెండు వందల మైళ్ల అవతల వున్న తూర్పు తీరానికి ఒంటరిగా సైకిల్ తొక్కిన వ్యక్తీ, లాభాపేక్ష లేని ఒక సంస్థని స్థాపించి పాతికేళ్లకి పైగా తెలుగువాళ్లల్లో ప్రత్యేకులని సత్కరిస్తున్న ఇద్దరూ, తల్లిదండ్రులకి వీలుకాకో లేక కారణాంతరాలవల్లనో పసితనంలోనే పిల్లలని వదిలేస్తే ఇప్పటిదాకా వందమందికి పైగా సాకిన దంపతులూ ఉన్నారు. ఒంటరిగా వీళ్లందరూ తమ జీవితాలని ఎంత సుసంపన్నం చేసుకున్నారో నని ఆనందించాను. దాన్ని పంచుకోవాలని ఈ ప్రయత్నం.

కానీ, ఈనాటి సహోద్యోగులతోనే ఆగిపోతే, అమెరికాలోని నా కాలేజీ జీవితంలో స్ఫూర్తిదాయకు లయినవాళ్లని తలచుకోకపోతే, ఈ ప్రయత్నం సంపూర్ణ మవదు. ఆ మైలురాళ్లని దాటితేనే గదా ఈ గమ్యాన్ని చేరుకున్నది! అందుకని, ఈ సింహావలోకనంలో వాళ్లూ దర్శన మిస్తారు.

వాళ్లని పరిచయం చేస్తాను రండి!

Exit mobile version