[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘అమెరికా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]మ[/dropcap]హా సముద్రాల ఆవల ఉంది
ఇటు రా అంటూ రమ్మంటుంది
ఆకాశ సౌధాలతో ఆశల హర్మ్యాలలో
ఐశ్వర్యాలు విలాసాలు భోగాలు
ఆరెంకల జీతాలు ఊరిస్తున్నాయ్
ఎట్టకేలకు చేరుకున్నాను అమెరికా
కలల తీరం చేరుకొని చూస్తే కనిపించేది
ఎడారిలో ఎండమావులు నీరులేని బావులు
ఆకాశంలో కనిపించే దాహం తీర్చని మబ్బులు
అమ్మా నాన్నా గుర్తుకొచ్చారు
గుండెల్లో గుచ్చినట్టుగా ఉంది
ఆకలెయ్యకపోయినా అన్నం పెట్టే
అమ్మ, అడుగడుగునా ఆదుకొనే నాన్న
జేబులో డబ్బు లేకపోయినా
గుండెకు హత్తుకునే మిత్రులు
ప్రేమగా పలకరించే పొరుగువారు
అందరూ గుర్తుకొస్తున్నారు ఎందుకో
అమెరికా ఒక కత్తుల అమరిక
చక్రవ్యూహంలో చిక్కిపోయావా
బయట పడే దారి వేరే లేదు
కత్తులను హత్తుకొని కోస్తున్నా
కంట నెత్తురు కారుతున్నా
ఇదే నా జీవితపు చివరి మజిలి
కన్నవారు గొప్పగా చెప్పుకుంటారు
మావాడు అమెరికాలో ఉన్నాడని
వారు కన్న నేను కల ఒకటే కదా..
వారి కల చెదరొద్దు గుండె పగలొద్దు
కలలలోనే వారు కాలం గడపనీ
కల్లలలోనే నేను బతుకు ఈడ్చనీ
అమెరికా నా మేను చెమరిక కారనీ