అధ్యాపకుని కన్న ఆచార్య వర్యుడు
పది రెట్లు శ్రేష్ఠుడై బరుగుచుండు!
వందరెట్లాచార్య వర్యుని కంటెను
తండ్రియే శ్రేష్ఠుడై దనరు జగతి!
తండ్రికంటె పదివందల రెట్లు తల్లియే
శ్రేష్ఠమై వెలయునీ క్షితిని యనుచు,
అమ్మ, అయ్య, గురువు ఆచార్యులను పోల్చి
మనుధర్మ శాస్త్రమ్ము మనకు తెలిపె!
ఆర్ష ధర్మము కూడ ఆరాధనామూర్తు
లందమ్మయే మిన్న యనుచు నుడివె!
ఆరుసార్లు భూమిని చుట్టినంత ఫలము
వందసార్లు కాశికి వెళ్ళి వచ్చు ఫలము
కడలి మునకలు నూరింట కలుగు ఫలము
ఒక్క మాతృ వందనమున కుద్ది కాదు!
జంతువులు పక్షులు తరువుల్ జలచరములు
నేరుగా చూపి పేర్లను నేర్పుచుండు
అమ్మయే నేర్పెను మనకు అమ్మనుడిని
అమ్మ ఒడియె మొదటి బడి యగును గాన
అట్టి అమ్మ మొదటి గురువనుట నిజము!
తెలుగువారు అక్షరమాల దిద్దునపుడు
అమ్మయని ముందు నేర్పింత్రు కమ్మగాను
వరుసగా ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనుచు
వర్ణమాల నేర్పింత్రు వైనమొప్ప
వర్ణమాల యందును అమ్మ ప్రథమ మగును!
మాతపిత గురు దైవమీ మాటలోను
మాతృభాషయని యనెడి మాటలోను
మాతృదేసమని యనెడి మాటలోను
అమ్మకే ప్రథమ స్థాన మగును గాన
జనని ఋణమీ గునే యెన్ని జన్మలైన!