Site icon Sanchika

అమ్మ చీర కొంగు

[dropcap]అ[/dropcap]మ్మ చీర కొంగు
ఎన్నో బెంగలకి
ఆనకట్ట వేస్తుంది!

చెరువులో కేరింతల
కెరటాలు కొట్టుకొనేటప్పుడు
అమ్మ కొంగే ఒళ్ళంతా
ఆత్మీయ పరమళం
అద్దుతుంది!

కొంగు పట్టుకుని పొలంలో తిరుగుతుంటే
నాకేమిటన్న భరోసా కులాసాగా
గిరికీలు కొడుతుంది

నాన్న కి దొరకకుండా
అమ్మ కొంగు వెనుక
ఎప్పుడూ
‘అమ్మ దొంగా’

రాత్రయితే చాలు
కొంగు మీద తల పెట్టి రెక్కల గుర్రం
కధలు వింటూ
విశ్వ విజేతనవుతాను!

జాతర లో అమ్మ చీర
కొంగు అక్షయ పాత్రవుతుంది!

***

ఎదిగాక అమ్మ కొంగులో
ఇంకి పోయిన కన్నీళ్ళు తెలిసాయి

బహుశా అమ్మ నేత చీర కొంగుకే
ఆమె కన్నీటి కతలు తెలుసు కాబోలు
చీర కొంగు అమ్మ తో ఏదో
రహస్య భాషణాలు జరుపుతుంది!
అప్పుడప్పుడు అమ్మ
కొంగు బిగించి జీవన రణ క్షేత్రంలో
కదను తొక్కుతూ…

కొంగుతో నా ఒంటినే కాదు
మింటి కెగసే కష్టాన్ని
తుడిచెయ్యగల మాంత్రికురాలు
అమ్మ

అమ్మ కి హంసతూలికా తల్పం
కొంగు పరుచుకున్న గది గుమ్మమే!

అమ్మ ఇప్పుడు లేక పోయినా
దండెం మీద
అమ్మ చీర కొంగు
జ్ఞాపకాల ఊట
నాకు దారి చూపే బాట!

Exit mobile version