[dropcap]“చం[/dropcap]దమామ రావే, జాబిల్లి రావే..” అని పాడుతూ బిడ్డకి జోలపాడుతుంది తల్లి. పాటలోని భావం అర్థం కాకపోయినా ఆ రాగానికి మైమరచి నిద్రపోతాడు. నిండు చందమామని చూపిస్తూ “చందమామలో చెట్టుకింద ముసలమ్మ రాట్నం ఒడుకుతూ ఉంది. చిన్న పిల్లలు చుట్టూ మూగి కథ చెప్పమని అడుగుతూ ఉంటారు, చూడు!” అంటూ ఒక మనోహరమైన ఊహ కల్పించి గోరుముద్దలు తినిపిస్తుంది. బిడ్డకు కొంచెం ఉహ తెలిసిన తర్వాత “అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు..” అంటూ కథలు చెబుతుంది తల్లి. ఇవన్నీ మనందరికీ అనుభవైకవేద్యమే! బాల్యంలో ఛత్రపతి శివాజీకి తల్లి జిజియా బాయి వీరగాథలు వినిపించటం వల్లనే అంతటి వీరుడు అయ్యాడని మనం చరిత్ర పాఠాలలో చదువుకున్నాం.
బాల్యంలో మా అమ్మ కూడా నాకు పంచతంత్ర కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, అక్బర్ బీర్బల్ కథలు ఇలా చాలా కథలు వినిపించి, నాకు పుస్తక పఠనం మీద ఆసక్తి కల్పించి తద్వారా నేను రచయితను అయ్యేందుకు బీజం వేసింది. నేను పుట్టి అయిదు దశాబ్దాలు దాటిపోయినా, అమ్మ స్వర్గానికి వెళ్లి రెండున్నర దశాబ్దాలు అయినా ఇప్పటికీ కళ్ళు మూసుకుని పడుకుంటే మా అమ్మ నా పక్కన కుర్చుని నుదురు స్పర్శిస్తూ, జుట్టు నిమురుతూ లాలిస్తున్నట్లే అనిపిస్తుంది. నన్ను వెన్నంటి ఉండి మార్గదర్శకత్వం చేస్తున్నట్లే అనిపిస్తుంది. బాల్యంలో మా అమ్మ చెప్పిన రెండు కథలు నా మనసులో ముద్రించుకు పోయాయి. అవి నాకు ఇప్పటికీ గుర్తుండి పోయాయి. అవేమిటంటే: –
ఒకసారి శ్రీరాముడి తల్లి, హనుమంతుడి తల్లి, అగస్త్య మహర్షి తల్లి కలుసుకుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారట. మాటల సందర్భంలో శ్రీరాముడి తల్లి “మా అబ్బాయి సముద్రాన్ని దాటి, రావణాసురుడిని చంపి భార్య చెరను విడిపించి తెచ్చాడు. దేవతలందరి చేత ప్రశంసించబడ్డాడు. ఎంత గొప్పవాడో!” అని చెప్పుకుని మురిసిపోయింది.
అప్పుడు హనుమంతుడి తల్లి “ఆ.. ఏం గొప్పలే! మా అబ్బాయి సీత జాడ కనిపెట్టి చెప్పబట్టి తెలుసుకున్నాడు. లేకపోతే అసలు లంకానగరం వెళ్ళేవాడా! యుద్ధం చేయగలిగేవాడా? అంతేనా! సంజీవిని తెచ్చి లక్ష్మణుడిని బ్రతికించాడు. మా అబ్బాయే లేకపోతే మీ రాముడికి అంత పేరు ఎక్కడ వచ్చేది? మా వాడే గొప్ప!” అని అన్నది గర్వంగా.
“బాగున్నాయమ్మా మీ ఇద్దరి ఆర్భాటాలు! మా అబ్బాయి సముద్రం మొత్తం ఒక్క గుక్కలో ఔపోసన పట్టేశాడు. వాడి కన్నా గొప్పవాళ్ళు ఎవరున్నారు?” అన్నది అగస్త్యుడి తల్లి.
ఇంతలో రాముడు, హనుమంతుడు, అగస్త్యుడు అక్కడికి వచ్చారు.
“చూడు నాయనా! నువ్వు రావణుడిని జయించి వచ్చావంటే, ‘కాదు ఆంజనేయుడి వల్లనే ఇంత పేరు వచ్చింది’ అంటున్నది” అన్నది రాముడి తల్లి.
“నిజమేనమ్మా! ఆంజనేయుడు సీత క్షేమం వినిపించి నాకు ఊరట కలిపించాడు. నూరు యోజనాల విస్తీర్ణం గల సముద్రం అవలీలగా దాటగాలిగాడు. తనే గనక లేకపోతే నాకీ విజయాలు సాధ్యం అయ్యేవి కావు. నాకన్నా ఆంజనేయుడే గొప్పవాడు” అన్నాడు రాముడు నిగర్వంగా.
“నాదేముందమ్మా! సముద్రం దాటగలిగే శక్తి నాకొక్కడికే కాదు, అంగదుడికీ, జాంబవంతుడికీ కూడా ఉన్నది. కానీ అగస్త్య మహర్షి సముద్రాన్ని దుముక లేదు, దాటలేదు, ఒక్కచోట కూర్చుని మొత్తం పానం చేసేశారు” అన్నాడు హనుమంతుడు.
అప్పుడు అగస్త్య మహర్షి “తల్లుల్లారా! మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. నాకు సముద్రపానం చేసే శక్తి ఎలా వచ్చినదనుకున్నారు? రామనామం నుంచీ వచ్చింది. ‘రామాయ స్వాహా’ అనుకుంటూ సాగర జలం నా పొట్టలో ఇముడ్చుకున్నాను. ఆంజనేయుడు కూడా రామనామం జపిస్తూ ఉండటం వల్లనే అవలీలగా అబ్ది లంఘించగలిగాడు. రామనామం ఒక్కసారి జపిస్తే చాలు ఎటువంటి కార్యాలు అయినా శుభప్రదంగా జరుగుతాయి. శ్రీరాముడు లోకకళ్యాణం కోసం మానవుడిగా అవతరించిన ఆది నారాయణుడు” అన్నాడు అగస్త్య మహర్షి.
ఆ మాటలు విన్న రాముడి తల్లి పొంగిపోయింది.
రామనామ ప్రభావం వల్ల ఎలుక, పాము, ముంగిస వంటి జంతువులు కూడా జాతివైరం మరచి ఐకమత్యంగా ఉంటాయి. ఎన్నోజన్మల పుణ్యం చేసిన వారి నోటి నుంచే శ్రీరామనామం వస్తుంది. ప్రహ్లాదుడు, నారదుడు, అంబరీషుడు, హనుమంతుడు, వ్యాసుడు వంటి వారు భగవన్నామం జపించటం వల్లనే చిరంజీవులైనారు నాయనా!” అంటూ ముగించింది మా జనని.
ఇలాంటిదే ఇంకొక కథ:-
వారధి నిర్మాణం జరుగుతున్నది. వానరులు కొండరాళ్ళు ఒక్కొక్కటి తెచ్చి అందిస్తూంటే దాని మీద ‘రామ’ అని రాసి నీటిలో వేస్తున్నాడు నలుడు. అవి నీటిలో తేలుతూ ఒకదానికొకటి అంటుకుని సేతువు లాగా ఏర్పడుతున్నది. కొంచెం దూరంలో కుర్చుని ఇటువైపే చూస్తున్న రాముడికి అదంతా ఆశ్చర్యంగా అనిపించింది. ప్రశంసాపూర్వకంగా చూస్తూ “అలా ఎలా తేలుతున్నాయి?” అని అడిగాడు నలుడిని.
“అంతా రామనామ మహిమే ప్రభూ! మిమ్మల్ని స్మరించుకుంటూ రాళ్ళని వదలుతున్నాయి. నేను కోరినట్లే అవి నీటిలో తేలుతున్నాయి” అని చెప్పాడు నలుడు.
‘నా పేరుకే అంత మహత్తు ఉంటే నేనే స్వయంగా వేస్తే ఏమౌతుందో చూద్దాం’ అనుకుంటూ ఒక కొండరాయి తీసుకుని సముద్రంలో వేశాడు రాముడు. వెంటనే బుడుంగు మని మునిగిపోయింది.
“హనుమా! చిత్రంగా ఉందే! నలుడు వేసిన రాళ్ళు తేలుతున్నాయి. నేను వేసిన రాయి మునిగిపోయింది. ఏమిటీ వింత?” అని అడిగాడు.
“ప్రభూ! తమకు తెలియనిది ఏముంది? అయినా అడిగారు కాబట్టి చెబుతున్నాను. రామనామం జపించినంత కాలం, మీ కటాక్ష వీక్షణాలు ప్రసరించినంత కాలం ఎవరికీ ఏ లోటూ ఉండదు. కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ నామస్మరణ మర్చిపోయి, మీకు దూరమైననాడు సంసార సాగరంలో మునిగిపోతాడు. అందుకు సంకేతమే ఇది!” అని చెప్పాడు హనుమంతుడు.
బాల్యంలో ఈ కథ విన్నప్పుడు “అర్థం కాలేదు, మళ్ళీ చెప్పమ్మా!” అనే వాడిని. అమ్మ ఓర్పుగా మళ్ళీ చెప్పేది. అయినా అర్థం కానట్లే ఉండేది. పెద్దయిన తర్వాత ఆ కథలో అంతరార్థం బోధపడింది నాకు.