01.
తెలుగు వాడిననుకుంటే
సరిపోతుందా తమ్ముడ!
తెలుగుదనం చూపకుంటె
మూల నవ్విపోర! తమ్ముడ!
02.
అమ్మా నాన్నను మాటలు
చిలక పలుకులాయెరా
ఇంగ్లీషు ముక్క నేర్చాక
చిలుక ఎగిరిపోయెరా.
03.
పేరంటాలెక్కడివి? అసలు
కూర్చునే సమయమేది?
పసుపంటే మొహం మొత్తు
రోజులొచ్చి పడ్డాయి.
04.
అట్లతద్దె బొమ్మల కొలువు
సందెగొబ్బి, షష్టితీర్థం
కనబడనే కనబడవు
వాటి ఊసులైన వినబడవు.
05.
దసరా వేషాలేవీ
తోలుబొమ్మలాటలేవి?
మరబొమ్మలమయ్యక
గుర్తురాదు గతమన్నది.
06.
ఉప్పుబద్ది, కబడీలు
తొక్కుడు బిళ్లాటలేవి?
కర్రాబిళ్ళా కొలతలు
దాగుడు మూతలాటలేవి?
07.
రామనవమి పందిళ్ళు
అమ్మవారి సంబరాలు
బుట్టబొమ్మలాటలేవి?
చేనుగట్టు పాటలేవి?
08.
లాలిపాట లేకపోతే-ఇక
ఉయ్యల పాటలెక్కడివి?
వియ్యాల పాటలెక్కడివి
అయ్యో జానపదాలెక్కడివి?
09.
పోతన్న వెనకబడే
అన్నమయ్య రామదాసు
తెలియని రోజొచ్చిపడే
స్త్రీల పాట లెగిరిపోయె.
10.
అనగనగా కథలు లేవు
తాతయ్య పద్యాలు లేవు
పెద్దతనం నడ్డి విరిగి
వృద్ధాశ్రమంలో చేరింది.
11.
పరికిణీ ఓణీలేవీ
జడనిండా పూలేవీ
చీరేదీ? రవికేదీ?
బొట్టు కాటుకలేవీ?
12.
పంచె కట్టు పైజమా
భుజంనిండ ధోవతీ
అనుకరణల సుడిగాలికి
అయ్యో! కొట్టుకుపోయాయ్.
13.
గుత్తి వంకాయ కూర
వహ్వా గొంగూర పచ్చడి
చింతచిగురు రుచులన్నవి
దొరకవింక దొరకవు.
14.
కందిపొడి నేతి చుక్క
బొబ్బట్టు పూతరేకు
అరుదైపోయయ్
కంటికి మరుగైపోయయ్.
15.
ఉయ్యాలలు ఎగిరిపోయె
తరవాణి కుండపగిలె
ముగ్గుల అందాలుపోయి
వీధులు మూలుగుతున్నాయ్.
16.
వసారాలు అరుగులు
మండువాలు లేవండి
ఇరుకు గదుల కాంక్రీటుతో
తెలుగుయిల్లు కూలింది.
17.
హంగులు రంగులు పెరిగాయ్
రక్తసంబంధాలు తెగాయ్
మాటల్లో చేతల్లో
సున్నితాలు మరుగయ్యాయ్.
18.
ఒంటి పిల్లి రాకాసి
కాపురాలు మిగిలినవి
ఉమ్మడి బతుకుల మమతలు
కథలుగానె నిలబడినవి.
19.
ఆ నవ్వులు పరిహాసం
అయిన వారితో సరసం
ఏమయ్యాయ్? ఏ కాలం
వేటుకి గురి అయ్యాయ్.
20.
రమ్మని పిలిచే మమత
ఉండమనే బలవంతం
ఇచ్చి పుచ్చుకునే ధోరణి
ఏవీ లేనే లేవు?
21.
అతిథి వస్తే ఆహ్వానం
వెడుతుంటే వీడ్కోలు
పెద్దవారికి నమస్కారం
మాయమయ్యె సంస్కారం.
22.
చావు పుట్టుకలన్నీ –
ఫోనులే చెప్పేస్తున్నాయ్
ఆత్మీయతలు తగ్గి తగ్గి
దూరాలు పెరుగుతున్నాయ్.
23.
తెలుగుదనం వలసబోవు
రోజులెదురవుతున్నవి-అది
ప్రవాసాలలో బతికే
దారులు కనబడుతున్నవి.
24.
పల్లె నగరమైతేనేం
ఏ రాష్ట్రమైతేనేం
తెలుగున్న చోటే స్వర్గం
అది లేకుంటేనే నరకం.
25.
కలిమి లేమి ఎంచేది
సంపదతో కాదురా
నోట తెలుగు పలికితే
రత్నాల గనులు నీవిరా.
26.
సంపదంటే ముద్రించిన
కాగితాలు కాదురా
తరతరాలు అందుకునే
తెలుగుదనమే ధనమురా.
27.
తిండి గలిగి కండగలిగి
గుండెలనే ఎదురొడ్డే
నీతికలిగి రీతికలిగి
బ్రతికితేనే ఆంధ్రుడంటే.
28.
మనకట్టు మనబొట్టు
మన ఆటలు మన పాటలు
మనలోపల బతికుంటే
అదేకదా తెలుగంటే.
29.
తెలుగు వాడిననుకుంటూ
తెలుగు విడిచి ఉండనేల
నేలవిడిచి సాముచేసి
తెల్లబోవనేలరా?
30.
తెలుగు భాషలోనె
అమ్మ చిరునామా ఉంది
తెలుగు ‘బాస’ లోనె
పునర్జన్మ దాగిఉంది.