అమ్మ గుర్తుకొస్తోంది

0
60

[డా. చెంగల్వ రామలక్ష్మి రచించిన ‘అమ్మ గుర్తుకొస్తోంది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఈ మధ్య అమ్మ
పదే పదే గుర్తుకొస్తోంది

వంటలో, ఇంటిలో, ఖర్చులో, పొదుపులో
రాజీలో, ప్రతిఘటనలో
ప్రతి పాత్రలో అమ్మ నాలో
పరకాయ ప్రవేశం చేస్తోంది.

మా ఊళ్ళో పెద్ద ముత్తయిదువగా అమ్మకు
పెద్ద స్థానం
ఆ గౌరవం తెచ్చిన చీరలు, చిల్లర డబ్బులు,
ఎన్నో సార్లు నాన్న మర్యాదను నిలిపిన అనుభవం నాదవుతోంది

ఇంటి నిండా అతిథులు
చెదరని చిరునవ్వుతో
‘ఇప్పుడే వస్తాన’ని చిటికెలో
ఇంటివెనక వైపు నుంచి
తెచ్చిన అరువుతో పరువు నిలిపిన జ్ఞాపకంతో
నాకు అబేధం

అప్పుడప్పుడు అసహనంతో
నాన్నను ప్రతిఘటించినా
విలువ లేక
నవ్వుతూ రాజీ కొచ్చేసే
అమ్మ నాకెప్పుడూ ఆదర్శమే!

సహకారం, సానుభూతి, ప్రశంస ల్లాంటి
పదాలకు ఇంట నోచుకోకపోయినా
తన నిరంతర శ్రమ, నైపుణ్యాలచే ఒంటి చేత్తో
ఇంటిని నిలుపుతుందనే గుర్తింపుతో రచ్చ గెలిచిన అమ్మ
నా కెప్పటికీ స్ఫూర్తే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here