Site icon Sanchika

అమ్మ కావాలి

[dropcap]“నా[/dropcap]న్నా.. నాన్నా.. లే నాన్నా” గట్టిగా పిలిచిన కొడుకు పిలుపుకి కళ్ళు తెరిచాడు జగన్నాధం.

ఎదురుగా కొడుకు అనిరుద్ధ, కూతురు ప్రియంవద కనిపించారు. వారిద్దరి మొహాలు ఆందోళనగా ఉన్నాయి.

“ఏమైంది బాబూ, ఎందుకు కంగారు పడుతున్నారు?” మంచం దిగుతూ కొడుకుని అడిగాడు జగన్నాధం.

“ఎవరో పెద్దావిడ మన పూజ గదిలో పూజ చేస్తున్నారు నాన్నా” అంది కూతురు. ఆమె మాటలకి నిద్రమత్తు దిగిపోయింది జగన్నాధానికి. సరిగ్గా అదే సమయంలో పూజ గదిలోంచి ‘గణ గణ’మంటూ గంట శబ్దం వినిపించింది జగన్నాధానికి. గబ గబా పూజ గది దగ్గరకు వెళ్ళాడు. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు.

ఎవరో పెద్ద వయసావిడ, పూజ ముగించి దేవుడి పటాలకి హారతి ఇస్తోంది. ఆమెకేసి పరిశీలనగా చూసాడు. ఆవిడ వయసు అరవై దాటి ఉంటుంది. తన వైపు బంధువులల్లో గానీ, భార్య వైపు బంధువుల్లో గానీ ఆవిడని చూసిన గుర్తు లేదు. ఆవిడ హారతి పళ్ళెం కింద పెట్టి, హారతి కళ్ళకు అడ్డుకుని వెనక్కి తిరిగింది. గుమ్మంలో జగన్నాధం, పిల్లలు కనిపించారు. చిన్నగా నవ్వి, ‘రారా అబ్బాయ్, హారతి తీసుకో’ అని పిలిచింది. మౌనంగా వెళ్లి హారతి కళ్ళ కడ్డుకున్నారు జగన్నాధం,పిల్లలు.

“ఐదు నిముషాల్లో నీకు కాఫీ, పిల్లలకు పాలు తీసుకువస్తాను. వెళ్లి హాలులో కూర్చోండి” అంది ఆవిడ.

హాలులోకి వెళ్ళిన జగన్నాధం “నేను బ్రష్ చేసుకుని వస్తాను, మీరు కూర్చోండి” అని బాత్రూంకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని, మొహం కడుక్కుని వచ్చాడు. అప్పటికే పిల్లలు పాలు త్రాగడం పూర్తి అయ్యిందని గ్రహించాడు.

అతను రావడం గమనించిన పెద్దావిడ కాఫీ పట్టుకుని వచ్చి జగన్నాధానికి ఇచ్చారు. మొదటి గుక్క తాగగానే అతని కళ్ళు ఆనందంగా పెద్దవి అయ్యాయి. సంతోషంగా కాఫీ తాగి కప్పు టీ పాయ్ మీద పెట్టాడు.

పిల్లలు తాగిన పాల గ్లాసులు, జగన్నాధం ఖాళీ చేసిన కాఫీ కప్పు తీసుకుని వంటింట్లోకి వెళ్ళారు ఆవిడ.

ఈవిడ ఇంట్లోకి ఎలా వచ్చిందా? అని ఆలోచించిన జగన్నాధానికి సమాధానం తొందరగానే దొరికింది. పనిమనిషి రత్తాలు, తాను ఊరికి వెళ్లాలని పెందరాళే వచ్చింది. ఆమె గిన్నెలు తోమేసి వెళ్ళిపోయింది. తాను నిద్రలో ఉండి ఆమె వెళ్ళాకా, గేటు వెయ్యడం మర్చిపోయాడు. ‘అప్పుడు లోపలకు వచ్చి ఉంటుందీవిడ’ అని రూఢీ చేసుకున్నాడు జగన్నాధం.

బహుశా తండ్రి వైపు బంధువు అయ్యుంటుంది. మీరు ఎవరని అడిగితే బాధపడతారు. నెమ్మదిగా ఆవిడే చెపుతుందని ఊరుకున్నాడు జగన్నాధం. ఆరోజు ఆదివారం. జగన్నాధం, పిల్లలూ ఇంటివద్దే ఉంటారు. అనిరుద్ధ ఏడవ తరగతి, ప్రియంవద ఆరవతరగతి చదువుతున్నారు. జగన్నాధం భార్య సుగుణ, మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతున్నాడు. జగన్నాధం. మండల పరిషత్ కార్యాలయంలో సూపెర్నెంట్ గా పని చేస్తున్నాడు.

ఫ్రిజ్‌లో ఉన్న దోశెలపిండి తీసి ముగ్గురికీ దోశెలు వేసి పెట్టింది ఆవిడ. రుచిగా ఉండడంతో ముగ్గురూ తృప్తిగా తిన్నారు. జగన్నాధం దోశెలు వేస్తే గుండ్రంగా రావు. రక రకాల ఆకారాల్లో వస్తాయి. పిల్లలు తండ్రిని వేళాకోళం చేస్తూనే ఉంటారు వాటిని చూసి.

“ఒరేయ్ అబ్బాయ్, ఒక అర లీటరు పాలు పట్టుకురా. పిల్లలకు పాయసం చేస్తాను” అని పెద్దావిడ చెప్పడంతో, వీధి చివర ఉన్న పాల బూత్‌కి వెళ్లి పాలు పట్టుకొచ్చాడు జగన్నాధం. అనిరుద్ధ,ప్రియంవద హోమ్ వర్క్ చేసుకుని, కార్టూన్ ఫిలిం చూస్తున్నారు. జగన్నాధం ఆఫీస్ ఫైల్స్ చూసి, తర్వాత ఫోనులోని వాట్స్ అప్ మెస్సేజిలు చూస్తున్నాడు.

అప్పుడు వచ్చారు పక్కింటి పరమేశం గారు. ఆయన హైస్కూల్‌లో మాస్టారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన పిల్లలు ఇద్దరూ బెంగుళూరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. జగన్నాధం తీరుబడిగా ఉండడం, పిల్లలు టి.వి. చూస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆయన వచ్చేసరికి జగన్నాధం కూరలు తరుగుతూ ఉండడం, పిల్లలు అతనికి సాయం చేయడం కనిపించేది. కానీ ఈరోజు అలా కనపడలేదు.

“ఏవండీ జగన్నాధం గారూ, ఈరోజు బయట భోజనం ఏదైనా ఉందా? లేక మీల్సు ఆర్డర్ ఇచ్చారా?” అన్నారు పరమేశం గారు కుర్చీలో కూర్చుంటూ.

“అబ్బే, అదేం లేదండి. ఇవాళ చుట్టాలు వచ్చారు. ఆవిడ వంట చేస్తున్నారు” చిన్నగా నవ్వుతూ అన్నాడు జగన్నాధం.

“అదీ సంగతి. అందుకే మీరు ముగ్గురూ రిలాక్స్‌గా ఉన్నారు” అని, జగన్నాధంతో లోకాభిరామాయణం మాట్లాడసాగారు పరమేశం గారు. ఐదు నిముషాలు గడిచేసరికి పెద్దావిడ కాఫీ తీసుకువచ్చి ఇచ్చారు పరమేశానికి. కాఫీ ఒక గుక్క తాగి జగన్నాధం కేసి తిరిగి “ఏది ఏమైనా ఆడవాళ్ళు చేసిన కాఫీ రుచే వేరు జగన్నాధం గారూ. అద్భుతంగా ఉంది కాఫీ” అని మెచ్చుకున్నారు పరమేశం. ఆయన మాటలకు చిన్నగా నవ్వాడు జగన్నాధం. ఒక గంట ఉంది వెళ్ళారు పరమేశం.

మధ్యాహ్నం పన్నెండు దాటగానే పెద్దావిడ, జగన్నాధానికి పిల్లలకి భోజనం వడ్డించింది. టమాటా పప్పు, వంకాయ కారం పెట్టిన కూర, మిరియాల చారు, అప్పడాలు, పాయసం, పెరుగు.. వంటకాలు అన్నీ రుచికరంగా ఉన్నాయి.

“వడియాలు కనిపించలేదురా అబ్బాయ్. ఎక్కడ వున్నాయో నిన్ను అడుగుదామంటే, ఆయనెవరో వచ్చి నీతో మాట్లాడుతున్నారు. అందుకని అప్పడాలు కనిపిస్తే అవే వేయించాను” అంది ఆవిడ.

“వడియాలు అయిపోయాయి. మళ్ళీ ఎవరైనా వస్తే కొనుక్కోవాలి” అన్నాడు జగన్నాధం నెమ్మదిగా.

“ఒకళ్ళ దగ్గర కొనుక్కోవడమేమిటి? రేపు సాయంత్రం కూరలకొట్టులో బూడిద గుమ్మడికాయ ఒకటి పట్టుకురా. నేను వడియాలు పెడతాను” అంది ఆవిడ ఆప్యాయంగా.

పిల్లలు ఇద్దరూ ఆవిడ చేసిన పదార్థాలు ఇష్టంగా తినడం గమనించాడు జగన్నాధం. ‘పాయసం చాలా బాగుందని’ ముగ్గురూ ముక్తకంఠంతో అన్నారు. ఆవిడ చిన్నగా నవ్వి వంటింట్లోకి వెళ్ళారు.

ముచ్చటగా మూడురోజులు గడిచాయి. జగన్నాధం, పిల్లలూ ఆవిడకి బాగా చేరిక అయ్యారు. ఆవిడ చెప్పే కథలు పిల్లలు ఇద్దరినీ బాగా ఆకట్టుకున్నాయి. భాగవతంలోని పద్యాలు ఆవిడ పాడుతుంటే పిల్లలు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి ఆమెకేసి చూస్తూండిపోయారు. జగన్నాధం కూడా ఆవిడ గాత్ర మాధుర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు.

“మిమ్మల్ని మేం ఏమని పిలవాలి?” అనిరుద్ధ అడిగాడు ఆవిడని.

“నాన్న అమ్మని ఏమంటారు?” చిన్నగా నవ్వుతూ అడిగారు ఆవిడ.

“నానమ్మ” వెంటనే అంది ప్రియంవద. ‘నా బంగారుతల్లి’ అని ప్రియంవద బుగ్గలు నిమిరారు ఆవిడ. ‘హే.. నానమ్మా’ అంటూ చప్పట్లు కొట్టాడు అనిరుద్ధ. ఆ మాటలు వినగానే జగన్నాధం గుండెలు ఝల్లుమన్నాయి. తన పెళ్లి జరిగిన ఆర్నెల్లకే తల్లి చనిపోయింది. తన పిల్లలకు నానమ్మ తెలియదు. ఈ పెద్దావిడ.. ఆ లోటుని భర్తీ చేయడానికి వచ్చిందా? జగన్నాధం హృదయం భారంగా మూలిగింది.

పెద్దావిడ జగన్నాధం ఇంటికి వచ్చి వారం గడిచింది. ఒకరోజు పెందరాళే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు జగన్నాధం. కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కుని వస్తుంటే, దండెం మీద పెద్దావిడ చీర కనపడింది. రెండు చోట్ల చిన్న చిన్న చిరుగులున్నాయి. వాటిని చూడగానే అతని మనసు విల విల లాడిపోయింది. లోపలకు వచ్చి ఆవిడ ఇచ్చిన కాఫీ తాగి బయటకు వెళ్ళాడు జగన్నాధం. చేనేత వస్త్రాలయంకి వెళ్లి రెండు వేంకటగిరి జరీ చీరలు కొని పట్టుకొచ్చాడు. చీరలు చూసి ఆవిడ ఇబ్బంది పడ్డారు. “నాకెందుకురా బట్టలు? నాలుగు రోజుల్లో వినాయకచవితి పండుగ ఉంది కదా. పిల్లలకు కొనలేకపోయావా?”అన్నారు.

“రేపు వాళ్ళని తీసుకుని బజారుకెళ్తానమ్మా. వాళ్లకు నచ్చిన బట్టలు రెడీమేడ్‌లో తీసుకుంటాను” అని తన గదిలోకి వెళ్ళిపోయాడు జగన్నాధం. ఆమెని ‘అమ్మా’ అని పిలిచినప్పుడల్లా అతని కళ్ళల్లో ఆనంద భాష్పాలు గిర్రున తిరుగుతున్నాయి. అవి ఆమె కంటపడకుండా జాగ్రత్తపడుతున్నాడు.

వినాయక చవితి ముందు రోజే పనిమనిషి రత్తాలుచేత మట్టి తెప్పించారు ఆవిడ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చిన్న వినాయక ప్రతిమ చేసారు. అది చూసి పిల్లలు చాలా ఆనందపడ్డారు. అనిరుద్ధ దగ్గరున్న కలర్సు బాక్స్ లోని కలర్సు వాళ్ళ చేతే వినాయకుడి ప్రతిమకు వేయించారు. నాలుగు కొబ్బరి ఈనె పుల్లల్ని తీసుకుని, సన్నని దారంతో వాటిని గట్టిగా కట్టారు. తర్వాత ప్రియంవద దగ్గరున్న రంగుల పేపర్‌ని గుండ్రంగా కత్తిరించి, కొబ్బరి ఈనె పుల్లల పైన పెట్టి గొడుగులా అమర్చారు. జగన్నాధం ఆఫీస్ నుంచి రాగానే ‘నాన్నా’ అంటూ అతని దగ్గర చేరారు పిల్లలు. ‘నేను చెప్తానంటే’ ఉహూ ‘నేను చెప్తా’నంటున్న పిల్లల్ని చూసి చాలా ముచ్చటపడ్డాడు జగన్నాధం. ఇటువంటి సంతోషకరమైన సన్నివేశం ఇటీవలి కాలంలో రాలేదు.

“చెల్లాయి చిన్నదికదా, దాన్ని చెప్పనీయ్ అనిరుద్ధ” అని కొడుకుని బుజ్జగించాడు జగన్నాధం. ఆ మాట వినగానే ప్రియంవద మొహం వెయ్యి కేండిల్ బల్బులా వెలిగిపోయింది. ‘నాన్నా.. మరేమో.. నానమ్మ వినాయకుడి బొమ్మ చేసింది. నేనూ, అన్నయ్యా దానికి రంగులు వేసాము’ అంది సంతోషంగా. ‘వినాయకుడికి గొడుగు కూడా చేసింది నానమ్మ’ అన్నాడు అనిరుద్ధ. ఇద్దరూ తండ్రి రెండు చేతులూ పట్టుకుని దొడ్లోకి తీసుకు వచ్చారు. చిన్న పీటమీద అందంగా ఉన్న వినాయకుడి బొమ్మ జగన్నాధానికి బాగా నచ్చింది.

“చాలా.. చాలా బాగుంది. మీరిద్దరూ గ్రేట్” అని పిల్లల్ని దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు జగన్నాధం.

మర్నాడు పెద్దావిడే జగన్నాధం,పిల్లలు ఇద్దరి చేతా వినాయకుడి పూజ చేయించింది. ఆమె మంత్రాలు, కథ చదువుతున్నంత సేపూ ముగ్గురూ మంత్రముగ్థుల్లా ఆమె కేసి చూస్తూండిపోయారు. కథ అయ్యాకా అక్షితలు వాళ్ళ ముగ్గిరి తలలమీదా వేసి దీవించింది. పిల్లలు ఇద్దరూ ఆమెకి నమస్కారం చేసారు. జగన్నాధం ఆమెకి సాష్టాంగ నమస్కారం చేసాడు.

“ఏమిట్రా విశ్వనాధం, నీకు చాదస్తం మరీ ఎక్కువైపోతోంది” అని ఆప్యాయంగా నవ్వి ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని దీవించారు. వెంటనే లేచి బెడ్ రూమ్ లోకి వెళ్లి కళ్ళు తుడుచుకున్నాడు జగన్నాధం.

“నానమ్మా, మా నాన్న పేరు జగన్నాధం కదా. నువ్వు విశ్వనాధం అని పిలుస్తావేమిటి?” అడిగాడు అనిరుద్ధ.

“మీ నాన్న శివరాత్రి నాడు పుట్టాడు. అందుకే తాతగారు ‘విశ్వనాధం’ అని పేరు పెట్టారు. ఆఫీస్‌లో అందరూ వాడ్ని జగన్నాధం అని పిలుస్తారేమో” అని వంటింట్లోకి వెళ్ళిపోయారు ఆవిడ. పిల్లలు ఇద్దరూ ఆమె కేసి ఆశ్చర్యంగా చూసారు.

పెద్దావిడ జగన్నాధం ఇంటికి వచ్చి రెండు నెలలు అయింది. ఆమె తన బంధువా? కాదా? అన్న ఆలోచన మానేసాడు జగన్నాధం. ‘దేవుడిచ్చిన అమ్మ’ గానే ఆమెని భావిస్తున్నాడు. ఒక శనివారం నాడు పెద్దావిడ “ఒరేయ్ విశ్వం, రేపు గారెలు చేస్తాను. ఒక కేజీ మినప్పప్పు పట్టుకురా” అన్నారు. ‘అలాగే’ అన్నాడు జగన్నాధం. సాయంత్రం ఇంటికి రాగానే పిల్లలూ, ఆవిడా రెడీగా ఉన్నారు బయటకు వెళ్ళడానికి.

“అబ్బాయ్, పిల్లల్ని గుడికి తీసుకువెళ్తున్నాను. ఒక అరగంటలో వచ్చేస్తాం. నీకు కాఫీ ఫ్లాస్కులో పోసి ఉంచాను. తాగు” అని పిల్లలతో కలిసి బయటకు వెళ్ళారు ఆవిడ.

కిరాణాకొట్టువాడు ఇచ్చిన పొట్లం విప్పి, మినప్పప్పు డబ్బాలో పోసి, కాగితం మడత పెట్టి డస్ట్ బిన్‌లో పడేద్దామనుకుని అనుమానం వచ్చి మడత విప్పి, కాగితం లోని ప్రకటన కేసి చాశాడు జగన్నాధం. ఆ ప్రకటన లోని ఫోటో చూడగానే అతని గుండెలు దడ దడ లాడాయి. నెమ్మదిగా ప్రకటన చదవసాగాడు.

“అమ్మ కావాలి. ఈ ఫోటో లోని వ్యక్తి మా అమ్మగారు. ఇల్లు విడిచి రెండు నెలలు అయ్యింది. మా అన్నయ్య రోడ్ ఆక్సిడెంట్‌లో చనిపోయారు. అప్పటినుంచి ఆవిడకి మతిస్థిమితం సరిగా లేదు. ఎవరు కనిపించినా మా అన్నయ్య విశ్వనాధంలా భావించి మాట్లాడతారు. మా నాన్నగారు పక్షవాతంతో బాధపడుతున్నారు. ఈ సమయంలో మా అమ్మగారు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. దయచేసి ఈవిడ ఎవరికి కనిపించినా, ఈ క్రింది నెంబర్‌కి ఫోన్ చెయ్యండి. నేను వచ్చి తీసుకువెళ్తాను. మా అమ్మ మాకు కావాలి. కన్నీళ్ళతో ప్రార్థిస్తున్నాను. సహాయం చెయ్యండి. ప్రభాకరం. ఫోన్ నెంబర్..”

ప్రకటన పూర్తిగా చదవగానే జగన్నాధం మెదడు మొద్దుబారినట్టు అనిపించింది. కొద్దిసేపటికి స్థిమితపడ్డాడు. ఆవిడ తనని ‘విశ్వనాధం’ అని ఎందుకు పిలుస్తోందో అర్థం అయ్యింది. అతని మనసు బాధగా మూలిగింది. తన ఇంటిని ‘నందనవనం’లా తీర్చిదిద్దిన ఈ దేవతని, వాళ్లకు అప్పగించాలన్న ఆలోచన రాగానే వణికిపోయాడు. కళ్ళమ్మట కన్నీళ్ళు జల జలా రాలాయి. తన పిల్లలు ‘నానమ్మా.. నానమ్మా’ అంటూ ఆవిడతో బంధం పెంచుకున్నారు. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతే తన పిల్లల పరిస్థితి ఏమిటి? ఎంత బెంగ పడతారు.

ఉహూ.. తను ఈ ప్రకటన చూడనట్లే ఉంటే ఏ బాధా ఉండదు. అవును అదే కరెక్టు.. అని అనుకున్నాడు జగన్నాధం. గుడి నుంచి పిల్లలతో వచ్చిన ఆవిడని చూడగానే తన గుండెని ఎవరో పిండేసినట్టు అనిపించింది. ఆ రాత్రి సరిగా భోజనం చేయలేదు జగన్నాధం. రాత్రి నిద్ర పట్టక హాలులోకివచ్చి అటూ ఇటూ తిరిగాడు. చేతులు జోడించి కన్నీళ్ళతో వేడుకుంటున్న ఒక యువకుడి రూపం అతనికి పదే పదే కళ్ళముందు కదలాడుతోంది.

నీ ఆనందం కోసం, ఇంకొకరికి దక్కాల్సిన శాంతి, సౌభాగ్యాన్ని దూరం చేయడం భావ్యమా? అని అంతరాత్మ నిలదీసింది. ఎటూ తేల్చుకోలేక గదిలో అసహనంగా పచార్లు చేసాడు. ఇటు తన పిల్లలు, అటు ఆ యువకుడు అతని మనోఫలకం మీద పదే పదే ఆవిష్కృతమవుతున్నారు.

చివరికి అతని అంతరాత్మే గెలిచింది. తెల్లవారు ఝూమున ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్త్ర6కి ఫోన్ చేసి తృప్తిగా నిట్టూర్చాడు.

ఉదయం ఏడుగంటలకే పరమేశం గారిని కలిసి విషయమంతా వివరించాడు. తన మనసులోని మరోమాట కూడా ఆయనకు చెప్పాడు జగన్నాధం. అతని నిర్ణయం విని జగన్నాదాన్ని అభినందించారు పరమేశం. ‘నీ పిల్లల కోసమే కాదు, బాంధవ్యం కోసం అలమటించే మరో మాతృమూర్తికి అండగా నిలవాలనుకున్న నీ నిర్ణయం అభినందనీయం’అన్నారు పరమేశం.

ఇద్దరూ కలిసి జగన్నాధం స్కూటర్ మీద ‘కస్తూరి బా వృద్ధాశ్రమం’కి బయల్దేరారు.

‘అవును. నాకూ అమ్మ కావాలి’ అని సంతోషంగా స్కూటర్ నడుపుతున్నాడు జగన్నాధం.

Exit mobile version