అమ్మ కడుపు చల్లగా-19

0
2

[box type=’note’ fontsize=’16’] అభివృద్ధి పేరున మనిషి చేస్తున్న పొరపాట్లకు అద్భుతమైన నైసర్గిక వ్యవస్థలన్నీ సంతులనం కోల్పోతున్నాయని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]

హిమనీనదాలు – అద్భుతమైన ప్రకృతి వ్యవస్థ:

[dropcap]సిం[/dropcap]ధునది, గంగ, బ్రహ్మపుత్ర నదులు ఈ హిమనీనదుల కారణంగానే జీవనదులయ్యాయి. కాలానుగుణంగా ఈ హిమనీనదాల నుండి మంచు కొంచెం కొంచెంగా కరిగి ప్రవహించి నదుల్లోకి వచ్చి చేరుతుంది. ఆ కారణంగా వేసవిలో సైతం నదులలో ఎంతో కొంత నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. అది వ్యవసాయం, పరిశ్రమలు వంటి పలు రంగాలకు ఆధారం. ఈ జీవనదులపై ఆధారపడి కోట్ల సంఖ్యలో రైతులు వ్యవసాయం సాగిస్తున్నారు. ఈ నదీ పరీవాహక ప్రాంతాలలో జి.డి.పి. లక్షల కోట్ల రూపాయలలో ఉంటుందని అంచనా.

వాతావరణంలో వస్తున్న పెను మార్పుల కారణంగా భూతాపం పెరిగి ఆ వేడికి హిమనదాలు త్వరితగతిని కరిగిపోతున్నాయి. ఆ కారణంగా నదులలో నీరు ఎక్కువగా వచ్చి చేరుతోంది. దానిని మనం శాశ్వతమైన సమృద్ధిగా పరిగణించకూడదు. స్పష్టంగా చెప్పాలంటే హిమనీనదాలు/గ్లేసియర్స్ అనబడే నీటి డిపాజిట్లు కరిగిపోతున్నట్లు – ప్రకృతి చేస్తున్న హెచ్చరికగా దానిని భావించాలి.

నైసర్గిక స్వభావం కారణంగా – సమృద్ధిలో ఉన్నప్పుడు కొంత నీరు ఘనరూపంలోకి మారి గ్లేసియర్స్ ఏర్పడటం, వేసవిలో నదులలో నీటి కొరత ఏర్పడి ప్రవాహం తగ్గేనాటికి కొద్దికొద్దిగా ఆ గ్లేసియర్స్ కరుగుతూ నదులలో చేరడం ద్వారా నీటి కొరత ఏర్పడకుండా ఉండడం, జీవరాశి మనుగడకై ప్రకృతి ఏర్పరిచిన అద్భుతమైన వ్యవస్థ. అభివృద్ధి పేరున మనిషి చేస్తున్న పొరపాట్లకు అద్భుతమైన నైసర్గిక వ్యవస్థలన్నీ సంతులనం కోల్పోతున్నాయి.

2013లో ‘చోరాబారీ’ హిమనీనదం కరిగిపోవడంతో ఆకస్మికంగా వచ్చిన వరదలతో ‘మందాకిని’ పోటెత్తి కేదార్‌నాథ్ మునిగిపోయింది. 5000 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అపారమైన ఆస్తి నష్టం జరిగింది. అయినా దిద్దుబాటు చర్యలు శూన్యం.

2021 ఫ్రిబవరి 7న ‘రైంధీ’ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన కారణంగా మంచు ఫలకాలు విరిగిపడి రిషిగంగ నదికి ఉధృతంగా వరదలు వచ్చి ఉత్పాతాన్ని సృష్టించాయి. ‘రిషిగంగ’ జల విద్యుత్కేంద్రంకు చెందిన బ్యారేజ్ ధ్వంసం అయింది. తర్వాత క్షణాల్లో తపోవన్ ‘విష్ణుగఢ్’ జల విద్యుత్కేంద్రం బ్యారేజీ సైతం కొట్టుకుపోయింది. ఈ ప్రాజెక్టు సొరంగ మార్గమూ రాళ్ళూ, మట్టితో పూడిపోయింది. తరువాత ‘అలకనంద’ మీది వంతెన కూడా కూలిపోయింది.

ఆ తర్వాత కూడా అడపదడపా కొండ చరియలు విరిగిపడటమూ, ఎంతో కొంత నష్టాన్ని కలిగించడమూ మామూలై పోయింది. అభివృద్ధి పేరిట కొండలను తవ్వేస్తుండడంతో పేలుళ్ళతో ఎగురుతున్న రాళ్ళతోనూ, నదీ ప్రవాహాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొండవాలు లోని చెట్లను నరికి వేస్తుండటంతో, నదులు వరదలతో పోటెత్తినప్పుడు వరదనీటి ప్రవాహం వడినీ, ఉధృతినీ నిలువరించే సహజసిద్ధమైన పర్యావరణ వ్యవస్థ దెబ్బతినిపోయింది.

అభివృద్ధి Vs పర్యావరణం – ‘చార్‌ధామ్’ ప్రాజెక్టు:

ఇది ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రిలను డబుల్ లేన్‌తో కలిపే ప్రాజెక్టు. 12000 వేల కోట్ల రూపాయల ఖర్చుతో 9000 కిలోమీటర్ల పొడవునా నిర్మించదలపెట్టబడిన ఈ ప్రాజెక్టు భారతదేశం, చైనా సరిహద్దు ప్రాంతానికి త్వరితగతిన చేరుకోవడానికి ఉపకరిస్తుంది. రక్షణ సామగ్రిని, సిబ్బందిని వేగంగా తరలించగలగడానికై, ఆ రకంగా చైనా దాడులను నిలువరించడానికి ఉద్దేశింపబడిన ఈ ప్రాజెక్టు కోసం రోడ్లను 10½ మీటర్ల వెడల్పు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఆ క్రమంలో రోడ్డు వెడల్పు  5½  మీటర్లు దాటరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టు హిమాలయాల పర్యావరణ వ్యవస్థకు హాని చేయగలదని సుప్రీంకోర్టు తరఫున పర్యటించిన నిపుణుల బృందం కూడా హెచ్చరించింది. అయినప్పటికీ ప్రభుత్వం అత్యవసర రవాణా నిమిత్తం రోడ్డు వెడల్పు అంతా ఉండవలసిందేనని వాదిస్తోంది.

వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కోర్టులో ఇంకా తీర్పులు వెలువడే లేదు. సుప్రీం కోర్టులో కేసులు ఇంకా వాదప్రతివాదనల దశలోనే ఉన్నాయి. ఈ దశలో పర్యావరణ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు ఇటీవల ఒక అఫిడవిట్ సమర్పించింది. దాని ప్రకారం హిమాలయాల ప్రాంతంలో నిర్మించతలపెట్టిన 24 ప్రాజెక్టులలో 7 ఇప్పటికే కొన్ని దశలను దాటినందున ఆ 7 ప్రాజెక్టుల కొనసాగింపునకు అనుమతులిచ్చినట్లుగా పేర్కొంది. వాటిలో మొన్న ఫిబ్రవరిలో కొట్టుకుపోయిన తపోవన్ విష్ణుగఢ్ ప్రాజెక్టు కూడా ఉండడం కొసమెరుపు.

వివిధ కమిటీలు – సిఫార్సులు – కేదార్‌నాథ్ దుర్ఘటన అనంతరం:

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ నిపుణుడు రవి చోప్రా నేతృత్వంలో 17 మంది నిపుణులతో నియమించిన కమిటీ ‘భాగీరది, అలకనంద  బేసిన్‌లో – ఇక్కడ గంగ, మరికొన్ని ఉపనదులు కలుస్తాయి – ప్రతిపాదనలో ఉన్న 24 ప్రాజెక్టులలో 23 ఇక్కడి పర్యావరణాన్ని సరిదిద్దలేని విధంగా దెబ్బతీస్తాయ’ని హెచ్చరించింది. ఆ సునిశిత అధ్యాయనం వెల్లడించిన వివరాల ఆధారంగా సుప్రీంకోర్టు ఆ ప్రాజెక్టులను నిలుపు చేసింది. రవి చోప్రా కమిటీ నివేదికలో పేర్కొనబడిన ప్రాజెక్టులలో ఆరు ప్రాజెక్టులకు సంబంధించిన డెవలపర్లు కేదారనాథ్ దుర్ఘటనకు మునుపే ప్రాజెక్టుల నిర్మాణానికి తమకు అనుమతులు లభించి ఉన్న కారణంగా తమ ప్రాజెక్టులు కొనసాగడానికి అనుమతినీయాలని న్యాయస్థానాన్ని కోరగా, సుప్రీంకోర్టు వారి వినతిని పరిశీలించడానికి మరొక కమిటీని వేసింది.

కాన్పూర్ ఐ.ఐ.టి.కి చెందిన వినోద్ తారే సారధ్యంలోని ఆ కమిటీ సైతం ఆ ప్రాజెక్టులు పర్యావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపించగలవని స్పష్టం చేసింది. సమస్య అక్కడితో ఆగలేదు.

2015లో పర్యావరణ మంత్రిత్వ శాఖ ‘రవి చోప్రా కమిటీ’లో సభ్యుడైన బి.పి. దాస్ నేతృత్వంలో మరొక కమిటీని వేసింది. దాస్ కమిటీ ప్రాజెక్టు డిజైన్‌లలో చిన్న చిన్న మార్పులను సూచిస్తూ ఆ ఆరు ప్రాజెక్టులను అనుమతించాలని సిఫార్సు చేసింది.

‘స్వచ్ఛ గంగా సమితి’ పర్యవేక్షకులుగా ఉన్న ఉమాభారతి ఆధ్వర్యంలో ఉన్న జలవనరుల శాఖ అప్పట్లో ఆ సిఫార్సులను ఆమోదించలేదు.

గంగానదిలో కనీస నీటి ప్రవాహం పైనే నీటి పరిశుభ్రత ఆధారపడి ఉంటుందని, జలవిద్యుతుత్పత్తి ప్రాజెక్టుల వలన నది నీటి ప్రవాహంలో సంభవించే మార్పులు పర్యావరణానికి హానికారం కాగలవన్న కారణంతో గంగా పరీవాహక ప్రాంతంలో ప్రాజెక్టులను అప్పటి నీటి వనరుల శాఖ తీవ్రంగా వ్యతిరేకించింది.

ఉత్తరాఖండ్ వాదన:

విద్యుత్ కొనుగోలు కోసం సాలీనా 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తోందని, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను రద్దు చేస్తే అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుంది కాబట్టి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను కొనసాగించడానికి, మిగిలిన ప్రాజెక్టులకు అనుమతుల నివ్వాలి.

అయితే ప్రాజెక్టులన్నీ ప్రైవేటు పార్టీలకే కట్టబెట్టిన కారణంగా ప్రాజెక్టులు పూర్తి అయినా నిర్ణీత శాతం విద్యుత్తును మాత్రమే రాష్ట్రానికి ఇచ్చి మిగిలిన విద్యుత్తును ఎక్కువ లాభాలకు అమ్ముకోవడం పైనే ఆసక్తి చూపుతాయన్న వాదనలూ సత్యదూరం కాదు.

మనం ఇప్పటికీ పర్యావరణ సంక్షోభంలో ఉన్నది చేదు నిజం. వివిధ రంగాలలో అభివృద్ధి దిశగా దూసుకుపోవాలన్న లక్ష్యం మంచిదే కాని తక్షణ ప్రయోజనాలనే కాకుండా దీర్ఘకాలిక పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఖచ్చితమైన అంచనాలతో ఆచి తూచి అడుగు వేయాలి. అప్పుడే మరింత నష్టం కలగకుండా ప్రకృతి వ్యవస్థను కాపాడుకోగలుగుతాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here