[box type=’note’ fontsize=’16’] హిమాలయ ప్రాంతంలోని కాలుష్యం పెనుముప్పుగా మారుతున్న వైనాన్ని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]
[dropcap]నే[/dropcap]షనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్, నాగపూర్ శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం – గంగాజలాలలో సుమారు 200 రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి 17 రకాల వ్యాధులను కలిగించే సూక్ష్మక్రిములను నాశనం చేయగలవు. ఈ వ్యాధినాశక గుణాలు నర్మద, యమున నదులలో 30 రకాలకు మించవు. గంగానదిలో రేడియో ధార్మిక ధోరియం, రాగి కూడా విస్తారంగా ఉన్నాయి. రేడియో ధార్మిక స్వభావ రీత్యా ఈ నీరు చాలా హనికారకాలను నిరోధించగల లేదా నిర్మూలించగల శక్తిని కలిగి ఉంటుంది.
భూమి లోపలి టెక్టానిక్ పలకలు కదిలినప్పుడు భూకంపాలు సంభవించిన సందర్భంగా కొండచరియలు విరిగిపడినప్పుడు ఆ రద్దు అంతా నదులలోకి కొట్టుకువచ్చి నదుల కాలుష్యానికి కొంత వరకు కారణం అవుతోంది. వేల సంవత్సరాలుగా ఈ ప్రక్రియ జరుగుతోంది. కాగా దశాబ్దాలుగా లక్షల లీటర్ల మురుగునీరు, టన్నులకు టన్నులకు ఘన వ్యర్థాలు, పారిశ్రామిక, వ్యవసాయ సంబంధిత వ్యర్థాలు, చమురు సంబంధిత కాలుష్యం వంటివన్నీ నదులను ముంచెత్తి నదీజలాల సహజ సిద్ధమైన జీవ లక్షణాలను హరించివేస్తున్నాయి. సహజంగానే ఔషధ ప్రాయమైన నదీ జలాలు విషతుల్యాలు అవుతున్నాయి.
రావి, బియాస్, సట్లెజ్, జీనాబ్, యమున, దేవప్రయాగ, వంటి వివిధ నదులు హిమాలయ ప్రాంతంలోని ప్రజా బాహుళ్యానికి జీవనాధారం. కానీ ఈనాడు అవి వివిధ స్థాయిలలో కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. టూరిజం బాగా ఊపందుకోవడంతో ఆయా రాష్ట్రాలకు ఆదాయం బాగా పెరిగిన మాట నిజమే. కానీ పెద్ద సంఖ్యలో ఉంటున్న యాత్రికుల కారణంగా వివిధ రకాల వ్యర్థాలూ అక్కడి పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి.
గాజు, ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలో కలవడానికి వందల సంవత్సరాలు పడుతుంది. చాలా సింపుల్‍గా అనిపించే సిగరెట్ ముక్కలు సైతం జీర్ణం కావాలంటే 10-12 సంవత్సరాలు పడుతుంది. పళ్ళ రసాల కేన్లు శిధిలం కావాలాన్నా 200 నుంచి 500 సంవత్సరాల వరకు సమయం కావాలి. థర్మోకోల్ వ్యర్థాలు జీర్ణమయ్యే ప్రసక్తే లేదు. కాయితం, అట్ట వంటివి మాత్రమే, సులభంగా, అదీ నెలల సమయంలో జీర్ణమవుతాయి. ఇవన్నీ అక్కడ గుట్టలుగా పేరుకుపోతున్నాయి.
స్థలాభావం కారణం, మట్టిలో త్వరగా కలిసిపోగల ఆహార సంబంధిత వ్యర్థాలను సైతం బహిరంగ ప్రదేశాలలో క్రుమ్మరిస్తున్న కారణంగా కాలుష్యానికి కారణం అవుతున్నాయి. అతి శీతల వాతాతవరణంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఉండే హిమాలయ ప్రాంతంలో ఆ వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు కార్బన్ మోనాక్సైడ్, మీధేన్ వంటి వాయువులు వెలువడతాయి. ఆ వ్యర్థాలకు నీరు తోడయితే భూగర్భ జలాలు కలుషితమవుతాయి. వానలు కురిస్తే ఈ కాలుష్యం అంతా నదుల్లోకి చేరుతుంది. ఇదొక వలయం. వ్యర్థాలను తగులబెట్టినప్పుడూ హానికారక వాయువులు – డయాక్సిన్స్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, టుల్యూన్, బెంజీన్ వంటివి గాలి లోనికి చేరతాయి. కాంతిని గ్రహించే విషవాయువులు మంచు కరగడానికి దోహదం చేస్తాయి. ఆ రకంగా గ్లేసియర్లకు ముప్పు.
అయితే ఔత్సాహికులైన పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు కొన్ని వ్యర్థాల నిర్వహణను గురించిన అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తూ యథాశక్తి కృషి చేస్తున్నాయి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సి.ఎస్.ఐ.ఆర్) ప్రకారం అక్కడ వ్యర్థాలలో 50 శాతానికి పైగా త్వరగా మట్టిలో కలిసిపోయేవే. గాజు 4%, సిరామిక్ 3%, నిర్మాణ వ్యర్థాలు 20%, కాయితం వంటివి 10%, 8% ప్లాస్టిక్.
కాలుష్య నియంత్రణ సంస్థల స్థాపన లక్ష్యం కాలుష్యాన్ని ఉత్పత్తి స్థానాలలోనే నియంత్రించడం. అయితే ఆ దిశగా ప్రయత్నాలే లేవు. ప్రజల భాగస్వామ్యం లేకుండా కాలుష్య నియంత్రణ ప్రస్తుత పరిస్థితులలో అసాధ్యం. సమస్య బాగా ముదిరిపోయింది.
ఎప్పటి నుండో పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములుగా చేయడం వలన ఫిన్‌లాండ్, ఇస్తోనియా వంటి దేశాలలో ఫలితాలు బావున్నాయి. చైనా టెలిఫోన్ హాట్ లైన్ ద్వారా ప్రజల నుండి సమాచారాన్ని పొంది కాలుష్య కారక సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను సాధించింది. ఇక్కడ కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.