అమ్మ కడుపు చల్లగా-26

1
3

[box type=’note’ fontsize=’16’] పరిష్కారం చూపగలిగిన ప్రతి పరిశోధన మరిన్ని పరిశోధనలకు స్ఫూర్తి కాగల అవకాశం ఉందంటున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

ఇంతింతై – వటుడింతై:

[dropcap]ఏ[/dropcap]డాదికి 9 లక్షల టన్నుల ప్లాస్టిక్ వినియోగంలోకి వస్తోంది. రీసైకిలింగ్‍కి నోచుకుంటున్నది మాత్రం పది శాతానికి లోపే. మిగిలిన ప్లాస్టిక్ అంతా వివిధ రూపాలలో కాలుష్యానికి కారణం అవుతున్నది. సముద్ర గర్భాలకు, పర్వత శిఖరాలకూ కూడా ఈ ప్లాస్టిక్ కాలుష్యం ముప్పు తప్పడం లేదు.

వివిధ రకాల కాలుష్యాలకు సంబంధించి చాలా కాలంగా ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో ప్లాస్టిక్ కాలుష్యం కూడా ఉంది. ‘కామన్ సీస్’ అనే సంస్థ ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సంస్థ సహకారంతో నెదర్లాండ్స్ శాస్త్రజ్ఞులు నిర్వహించిన అధ్యయనాలలో మతులు పోయే విషయాలు బయటపడ్డాయి. ఆ ఫలితాలన్నీ పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ పత్రికలో ప్రచురించబడ్డాయి.

వాటి ప్రకారం – మనుషుల రక్తం నమూనాలలో పలు రకాల ప్లాస్టిక్ అవశేషాలు కనిపించాయి. అవి రక్తంతో పాటుగా ప్రయాణించి శరీరంలోని మిగిలిన అవయవాలకు కూడా చేరుతున్నాయా అన్న అంశం ఇంకా నిర్ధారణ కాలేదు. నెదర్లాండ్స్ శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ డిక్ వెతాక్ ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు. రక్తం లోని విష పదార్థాలు మెదడుకు పాకకుండా మెదడుకు ఉండే సహజ సిద్ధమైన ప్రత్యేక రక్షణ వ్యవస్థను అధిగమించి ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు మెదడును కూడా చేరగలవా అన్న అంశాన్ని సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తేల్చుకోవాలని ఆయన ఆందోళన వెలిబుచ్చారు.

సమగ్రమైన విధానాలతో అధ్యయానాలను విశ్లేషించడం జరిగిందనీ, మానవ రక్తంతో ప్లాస్టిక్ రేణువులు చేరుతున్నాయని సాధికారంగా నిరూపించబడిందనీ ‘నేషనల్ ఓషనోగ్రఫీ సెంటర్’ పరిశోధకుడు డాక్టర్ హార్టన్ అంటున్నారు.

ఏల్ యూనివర్సిటీ పరిశోధనల ఫలితాల ప్రకారం మైక్రో ప్లాస్టిక్ కాలుష్యం శరీరంలోని కణాల గోడల దెబ్బతినడానికి, కణాలు నాశనమవడానికి కారణం అవుతోంది.

చైనాలో నిర్వహించిన పరిశోధనలలో మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు జీర్ణాశయంలో వాపుకు, బవుల్ డిసీజెస్‍కు కారణం అవుతున్నాయని తేలింది.

అందంగా, తేలికగా, ఆకర్షణీయమైన రంగులతో – వినియోగానికి ఎంతో అనువుగా అందుబాటులోకి వచ్చిన ప్లాస్టిక్ ‘ఇంతింతై – వటుడింతై’ అన్నట్టుగా నేల నాలుగు చెరుగులనీ చుట్టేసింది. అంతే కాకుండా, పరిమాణంతో సంబంధం లేకుండా వివిధ స్థాయిలలో హానికారకంగానూ పరిణమించి పరిష్కారానికి అందని సమస్యగా తయారైంది.

కారణం – మట్టిలో కలవదు. విడగొట్టి రీసైకిల్ చేసే ప్రక్రియలో దాని తాలూకూ సూక్ష్మ కణాలు గాలిలో, నీటిలో చేరుతూ ఉంటాయి. పరిమాణాన్ని కుదించటానికి కాల్చటం తేలిక అనుకుందుకూ వీలు లేదు. కాలుస్తున్నప్పుడు ప్లాస్టిక్ నుండి వెలువడే వాయువులు కేన్సర్ కారకాలు అంటే కార్సినోజెనిక్స్.

ఇక మిగిలింది ఒకే దారి. క్రమేపీ వినియోగాన్ని తగ్గించుకుంటూ పోవటం. యుద్ధ ప్రాతిపదికన ప్లాస్టిక్‌ను ఉత్పత్తి దశలోనే నివారించడం. ఇప్పటికే ఉన్న సామగ్రిని సాధ్యమైనంతవరకూ పునర్వినియోగించుకోవటం. ప్లాస్టిక్ ముప్పు మరింత పెరిగిపోకుండా కట్టడి చేయడానికి వేరే దారి లేదు.

రీసైక్లింగ్, నివారణల దిశగా ఊపందుకున్న విధానాలు:

జపాన్‍లో ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి వాడుతున్నారు. స్వీడన్‍లో ఘన వ్యర్థాలలో 99% వరకూ రీసైకిల్ చేసి వినియోగంలోనికి తీసుకువస్తున్నారు. ఐర్లాండ్ ప్రత్యేకించి అదనపు పన్ను విధించడం ద్వారా ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని 90% తగ్గించగలిగింది. వియత్నాంకు చెందిన ‘లౌలాక్’ సూర్యరశ్మి గాని, గాలి లోని చెమ్మ గాని తగిలితే 90 రోజులలో జీర్ణించిపోయే చేతి సంచులను తయారు చేస్తోంది. పూనాలో ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఇంధనాన్ని తీసి విద్యుత్ జనరేటర్లలో వాడుతున్నారు.

మధురై ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ రాజగోపాలన్ రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించవచ్చని నిరూపించారు. బాంబే ఐఐటికి చెందిన ఒక విద్యార్థి వాడి పారేసిన ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు వంటి వాటితో తాగు నీరు అందించే అద్భుతమైన పరికరాన్ని కనుక్కున్నాడు.

జర్మన్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన శాస్త్రజ్ఞులు ‘భోజపత్ర’ (సిల్వర్ బిర్చ్) మొక్కలు నేలలోని భార లోహాలను, ప్లాస్టిక్ రేణువులను గ్రహిస్తున్నట్లు గుర్తించారు. వాతావరణం లోనికి చేరిన ప్లాస్టిక్ నుండి చిన్న చిన్న రేణువులు వెలువడుతూ ఉంటాయి. వాతావరణంలో జరిగే వివిధ రసాయనిక చర్యలు కూడా దీనికి కారణం అవుతూ ఉంటాయి. అలా వెలువడిన సూక్ష్మ రేణువులు మనలోనికి, మట్టి లోనికి, నీటి లోనికి సైతం మనకు తెలియకుండానే చేరుతూ ఉంటాయి. ఇది కంటికి కనిపించని ప్లాస్టిక్ కాలుష్యం. పైన చెప్పిన ‘భోజపత్ర’ మొక్కల వేర్లు నేలలో ఉపరితలంలో ఎక్కువగా వ్యాపించి ఉంటాయి. తమ అధ్యయనాలు, ఫలితాలు, అంచనాలు సరైనవో కావో తేల్చుకోవడానికి శాస్త్రజ్ఞులు కాంతిని వెలువరించే రంగులు కలిపిన ప్లాస్టిక్ రేణువులను నేలలో కలిపి ఆ నేలలో ఈ ‘భోజపత్ర’ చెట్లను నాటారు. 5/6 నెలల తరువాత ఆ మొక్కల వేర్లను స్కాన్ చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి. సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ మొక్కలను నాటవచ్చునన్న అభిప్రాయానికి వారు వచ్చారు.

పరిష్కారం చూపగలిగిన ప్రతి పరిశోధన మరిన్ని పరిశోధనలకు స్ఫూర్తి కాగల అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here