అమ్మ కడుపు చల్లగా-29

0
3

[box type=’note’ fontsize=’16’] చిత్తడి నేలలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గురించి వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

చిత్తడి నేలలు:

[dropcap]ఈ[/dropcap] వ్యవస్థలు జీవవైవిధ్యంలో అలరారుతూ మనిషి పురోగమనానికి, నాగరికతలు పెంపొందడానికి దోహదం చేసిన కల్పతరువుల వంటివి. మానవ నాగరికతలన్నీ నీటి వనరుల కారణంగానే విలసిల్లాయి. గంగాసింధు మైదానాలు, యూఫ్రటీస్, టైగ్రిస్ పరివాహాక ప్రాంతాలు అద్భుతమైన నాగరిక సమాజాలు రూపొందగలగడానికి మూల కారణాలుగా చరిత్ర చెప్తోంది.

అటువంటి అద్భుత వ్యవస్థలన్నీ ఇప్పుడు మనుగడ ముప్పును ఎదుర్కొంటున్నాయి. మానవ తప్పిదాల కారణంగా నదులు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. చెరువులు, బావులు, నీటి కుంటలు వంటివి క్రమేపీ కనుమరుగైపోయాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసంలో మనుగడ ముప్పునెదుర్కొంటున్న అనేక ప్రకృతి వ్యవస్థలలో చిత్తడి నేలలూ ఉన్నాయి.

భూ ఉపరితలంలో 6% నేలను ఆవరించి ఉన్న చిత్తడి నేలలను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కారణం – వరదలు, తుఫానులు వంటి సమయంలో నీటిని ఒడిసి పట్టగల కారణంగా ఇవి ధన ప్రాణ నష్టాలను, ముంపును నిరోధించడంలో గణనీయంమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయగలిగిన నాడు ఇవి ఆర్ధికాభివృద్ధికి సైతం చోదకశక్తి కాగలవు. అంతర్జాతీయపరంగా కీలకమైన చిత్తడినేలలు 2100 వరకు ఉన్నాయి. వీటిలో U.K లో 175, మెక్సికో 142, కాగా లక్షా 48000 కిలోమీటర్ల వైశాల్యం గల చిత్తడి నేలలతో బోలీవియా అలరారుతోంది. కాంగో, కెనడా, రష్యా, చాడ్ వంటి దేశాలూ సుమారు 100000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంగల చిత్తడి నేలలను కలిగి ఉన్నాయి. ఇండియాలో చిలికా సరస్సు, సుందర్‌బన్ వంటి విసైతం ‘రామ్‌సర్’ జాబితాలో ఉన్నవే.

పాంటనాల్:

దక్షిణ అమెరికాలోని ‘పాంటనాల్’ చిత్తడి నేలలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకంటే ఎక్కువ విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉన్నాయి. పరాగ్వే, బొలీవియా, బ్రెజిల్ దేశాల వరకు కూడా విస్తరించి ఉన్న ఈ ప్రాంతం రమారమి 1.4 బిలియన్ ఎకరాల విస్తీర్ణంలో అంతులేని జీవవైవిద్యంతో అలరారుతూ ఉంటుంది. అరుదైన జాగార్ వంటి జంతువులు, స్కార్లెట్ మకావ్ జాతి చిలుకలు వంటి అరుదైన జాతులతో టూరిజంకూ ఆకర్షణగా నిలుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో సింహభాగం ప్రైవేటు వ్యక్తుల/సంస్థల ఆధినంలోనే ఉంది. దాదాపు 4,700 మొక్కల, జంతువుల, జాతుల వైవిద్యంలో కూడుకొని ఉన్న ఈ వ్యవస్థలో వన్యప్రాణుల జాతులూ మిక్కుటం.

సీజనల్‌గా వచ్చే వరదలు ఈ ప్రాంతాన్ని ఆసాంతం నీటితో ముంచెత్తి వేస్తూ ఉంటాయి. ఏప్రిల్ నుండి నీరు మెల్లిగా తీయడం మొదలు పెడుతుంది. సెప్టెంబర్ నాటికి వరద నీరు మొత్తం వెనక్కు వెళ్లిపోతుంది. అంత పెద్ద ఎత్తున వరద నీటికి ఆలవాలంగా ఉండగలగడంతో రక్షణ కవచంలా – లక్షలాది ప్రజలను వరదల కారణంగా కలిగే ధన, ప్రాణ నష్టాల నుండి కాపాడుతూ వస్తోంది ఆ ప్రాంతం.

అయితే వరద నీరు తీసే నాటికి సారవంతమైన మట్టితోనూ, అనేకరకాల జీవ జాతుల తోనూ ఈ ప్రాంతం సుసంపన్నంగా మారుతూ ఉండటం ఒక విశేషం. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. భూగర్భ జలాలు పెరగడానికి, జల రవాణాకు సైతం దోహదకారి అవుతోంది. ఈ రీత్యా అర్ధికంగానూ, పర్యావరణ పరంగానూ ఈ ప్రాంతానికున్న ప్రాముఖ్యం తక్కువ కాదు. బ్రెజిల్ వ్యవసాయ పరిశోధన సంస్థ అధ్యయనాల ప్రకారం ఈ ప్రాంతపు పర్యవరణ వ్యవస్థ సాలీనా 100 బలియన్ డాలర్లకు పైగా ఆర్ధిక సేవలనందిస్తోంది.

అంతటి విశిష్టమైన ప్రాముఖ్యతగల ‘పాంటనాల్’ ప్రాంతం కూడా మనుగడ ముప్పును ఎదుర్కొబోతోంది. 12% అటవీ ప్రాంతం ఇప్పటికే అదృశ్యమయిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పాతిక/ముప్పె సంవత్సరాలలో ఈ అద్భుతమైన ప్రకృతి వ్యవస్థ ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది.

ప్రమాదాన్ని గ్రహించిన అనుబంధ దేశాలు బొలీవియా, పరాగ్వే, బ్రెజిల్ వ్యవస్థను కాపాడుకోవడానికి పరస్పరం సహకరించుకోనేలా ఒక త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. W.W.F. ఆధ్వర్యంలో ఒక కార్యాచరమ ప్రణాళికను రూపొందించే దిశగానూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలలలో 3% పైగా ఉన్న ఈ అపురూపమైన పర్యావరణ వ్యవస్థను కాపాడుకోనే దిశగా అడుగులు పడటం ముదావహం. మిగిలిన వ్యవస్థల పరిరక్షణ దిశగా అడుగులు పడటానికి ఈ చర్య స్ఫూర్తిదాయకం కాగలదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here