అమ్మ కడుపు చల్లగా-3

0
2

గతంలో పర్యావరణం అటవీ మంత్రిత్వశాఖ అటవీప్రాంతాల వర్గీకరణ జాబితానుండి ‘ప్రవేశ నిషేధం’ పదాన్ని తొలగించింది. ఆ చర్యతో జీవవైవిద్య సంపదతో తులతూగుతూ దట్టంగా ఉండే అడవులు కూడా అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తెరిచివేయబడ్డాయి. పరిహారంగా ‘ఎఫారిస్టేషన్ ప్రోగ్రామ్’లో అటవీయేతర ప్రాంతాలలో టేకు, యాకలిప్టస్ వంటి వాణిజ్యపరమైన తోటలను పెంచాలనీ నిర్ణయించడం జరిగింది. రక్షితవనాల నష్టాన్ని ఈ చెట్ల పెంపకం పూరించగలదా? రిజర్వ్/రక్షిత అడవులే సహజారణ్యాలు.

చెట్ల సాంద్రత 10%కి మించి ఉండి విస్తీర్ణం ఒక హెక్టారు దాటితే ఆ ప్రాంతాలు అడవుల కోవలోకి వస్తాయని ‘ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా’ నిర్వచించింది. శాటిలైట్ మేపింగ్ ఆవిష్కరించిన దృశ్యాల ఆధారంగా వెలువరించబడిన నిర్వచనమది.

2015 లో పర్యావరణ మంత్రిత్వ శాఖ వెలువరించిన వివరాల ప్రకారం భూవిస్తీర్ణంలో 21.34%  గా మాత్రమే దేశంలోని మొత్తం అడవులన్నింటీ కలపగా లెక్క తేలింది. ఆ 21.34 శాతమే 24% అయ్యిందని ప్రభుత్వం అంటోంది. కాని 2016-17 నడుమ విచక్షణరహితంగా లెక్కకు మించిన అటవీభూములను అభివృద్ది ప్రాజెక్టులకు కేటాయించారు. జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రిపోర్టు ప్రకారం 2014-16ల నడుమే సుమారు 46లక్షల హెక్టార్లు పచ్చదనం హరించుకుపోయింది. విపరీతమైన వేగంతో తగ్గిపోతున్న అడవుల విస్తీర్ణం నేపధ్యంలో మనిషికి ఒకచెట్టు చొప్పున 700 కోట్లకు మించి చెట్లను నాటవలసిందిగా U.N.O 2015లో పిలుపునిచ్చింది కూడా.

అటవీ పరిరక్షణ జాబితాలో ఉన్న సుమారు 190 దేశాలలో మనం 177వ స్థానంలో ఉన్నాం. మనదేశ జనాభాలో అయిదవ వంతు ప్రజలు అడవులే ఆధారంగా జీవిస్తున్నారు. వివిధ రకాల అటవీ ఉత్పత్తులు, వనరులు వారికి జీవికతో బాటు ఆదాయాన్ని సమకూర్చిపెడతాయి. అంటే పరోక్షంగా దేశపు జి.డి.పిలో వాటికి పాత్ర కూడా ఉంటుంది. అడవుల క్షీణత మూలంగా జి.డి.పిలో 1.4% వరకు కోతపడుతోందని టి.ఇ.ఆర్.ఐ వెల్లడించడాన్ని బట్టి ఆ విషయం దృవీకరించబడుతుంది కూడా.

అడవి – వందల, వేల సంవత్సరాలుగా ప్రకృతి పరిణామ క్రమంలో సహజ సిద్దంగా రూపుదిద్దుకుని, విభిన్నమైన జీవజాతులతో తెగలతో తమతమ మనుగడకు సంబంధించిన వేరువేరు ప్రమాణలు/లెక్కలతో వృద్దిచెందుతూ అలరారే ఒక ప్రకృతి వ్యవస్థ. ఈ వ్యవస్థను మరొకదానితో పోల్చడానికి వీలులేదు. నిజానికి భారతదేశంలోని సహజమైన కీకరణ్యాలు, చిట్టడవులు తమ విస్తీర్ణాన్ని కోల్పోయి చాల తక్కువ విస్తీర్ణానికి కుంచించుకుపోయాయి. వాటిని పునరుద్దరించడానికి మనిషి జీవితం చాలదు.

‘ప్రపంచ వనరుల అధ్యయన సంస్థ’ అధ్యయనాల ప్రకారం మనదేశం లక్షా ఇరవై రెండువేల ఏడువందల ఏభై హెక్టార్లు అడవులను కోల్పోయింది. I.S.F.R రిపోర్టు ప్రకారం ప్రస్తుతం దేశంలో ఉన్న అడవుల విస్తీర్ణం 80.7 మిలియన్ హెక్టార్లు. ఇది మొత్తం భూభాగంలో 24.56%. వాస్తవంలో 21 శాతానికి మించి ఉండదన్న అంచనాలు ఉన్నాయి.

2019 సంవత్సరానికి గాను ‘మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, క్లెయిమేట్ ఛేంజ్’ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 2011 నుండి రమారమి 98 మిలియన్ హెక్టార్లు అటవీపునరుద్దరణ జరిగింది. గత నాలుగు సంవత్సరాలలో హరితవనాల విస్తీర్ణం పెరిగినమాట నిజమేకాని అందులో అడవుల విస్తీర్ణం 50% మించదని నిపుణుల లెక్కల్లో చెప్తున్నాయి.

హరితవనం నిర్వచనంలోకి అడవులతో బాటు చెట్లు, తోటలు కూడా రావడమే దానికి కారణం. ఆ నిర్వచనం ప్రకారం వెదురు, యాకలిప్టస్, కాఫీ వంటి వనప్రాంతాలు/తోటలు కూడా అడవుల కోవలోనికే వస్తున్నాయి. నష్టపోయిన అటవీ విస్తీర్ణాన్ని ఈ వాణిజ్య వనరులు ఏ రకంగానూ భర్తీ చేయలేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here