అమ్మ కడుపు చల్లగా-30

0
2

[box type=’note’ fontsize=’16’] చిత్తడి నేలలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గురించి వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

చిత్తడి నేలలు – పరిరక్షణ – ‘రామ్‌సర్’ సదస్సు:

[dropcap]అం[/dropcap]తర్జాతీయ ప్రాముఖ్యత గల చిత్తడి నేలల పరిరక్షణ చర్యలకు సంబంధించి అవగాహనకై ఈ సదస్సు ఏర్పాటు చేయబడింది. ఇరాన్ లోని ‘రామ్‌సర్’లో ఈ సదస్సు జరిగిన కారణంగా ఆ ఒప్పందానికి ‘రామ్‌సర్’ ఒప్పందంగా వాడుక వచ్చింది. 1971 ఫిబ్రవరి 2వ తారీఖున ఈ ఒప్పందం జరిగింది. ఆ రోజునే మనం ‘చిత్తడి నేలల పరిరక్షణ దినం’గా జరుపుకొంటున్నాం. ఆలా అని ప్రతి చిత్తడి నేల ‘రామ్‌సర్’ ప్రాంతం కానేరదు.

ఈ సదస్సులో పాల్గొనదానికే కొన్ని లాంఛనాలు విధించబడ్డాయి. సదస్సులో పాల్గొన దలచిన దేశంలో/దేశాలలో ఉన్న చిత్తడి నేలలు ప్రకృతి సిద్ధమైన జల, జంతు, వృక్ష జాతుల, మంచినీటి వనరుల పరంగా ఎంతో కొంత ప్రాముఖ్యతను కలిగి ఉండాలి.  ఆ నేలల పరిరక్షణ, వనరుల సమర్థ వినియోగం పత్ల శక్తి మేరకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్న ఆశయం ఉండాలి. తమ దేశంలో అంతర్జాతీయంగా ప్రాముఖ్యం ఉన్న చిత్తడి నేలలలో కనీసం ఒకదానినైనా ‘రామ్‌సర్ లిస్ట్’లో చేర్చాలి. పరిరక్షణ చర్యలలో భాగంగా మిగిలిన దేశాల అనుభవాలు, వ్యూహాలను తెలుసుకొనే వెసులుబాటు ఉండడంతో పని సులభం అవుతుంది.

అయితే ఈ ఒడంబడికతో U.N.కు గాని, యునెస్కోకు గాని ప్రమేయం లేని కారణంగా చట్టపరంగా సభ్య దేశాలను నిలదీయగల అవకాశం ఏ మాత్రం లేదు. సభ్య దేశాల నిబద్ధత మాత్రమే ఒడంబడిక అమలుకు, ఫలితాలకు కీలకం కాగలదు. అయినప్పటికీ ప్రకృతి పరిరక్షణకు సంబంధించినంత వరకు ఒక అడుగు పడటమే ముందడుగుగా భావించాలి.

చిత్తడి నేలలపై ఆధారపడి బిలియన్ల ప్రజల మనుగడ సాగుతోంది. అయినప్పటికీ వాటికి ముప్పు ఏర్పడింది. ఇటీవలి లెక్కలు కాకుండా గతంలో వరకు వెళితే 64% వరకు చిత్తడి నేలలు కనుమరుగైపోయాయి. వాటి ప్రాముఖ్యతను గుర్తించి ‘రామ్‌సర్’ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత క్రమంగా మిగిలిన దేశాలు, ప్రభుత్వలలో కూడా అవగాహన పెరిగి ఒప్పందంలో భాగస్వామ్యమూ పెరిగింది. సహజంగానే అవసరమైన చర్యలు చేపట్టడానికై తగిన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవలసిన అవసరమూ ఏర్పడింది. ఆ దిశగా –

1990లో ‘RAM’ ఏర్పడింది. ‘రామ్‌సర్’ ఒప్పందంలోని భాగస్వామ్య దేశం ఏదైనా దాని అభివృద్ధి/వెనుకబాటుతనంతో సంబంధం లేకుండా – తమ దేశంలోని ‘రామ్‌సర్’ ప్రాంతానికి ప్రమాదం ఏర్పడిందని భావిస్తే అధికారికంగా వినతిపత్రాన్ని సమర్పించవచ్చు. ‘రామ్‌’ స్పందిస్తుంది, ‘రామ్‌సర్’ సెక్రటేరియట్‌కు అందిన వివరాలను బట్టి ఆ ప్రాంతానికి నిపుణుల బృందాన్ని పంపడం జరుగుతుంది. వారు తగిన సూచనలు సహకారం అందిస్తారు. సమస్య పెద్దదైతే నిపుణుల బృందం రిపోర్టు ఆధారంగా చేపట్టవలసిన చర్యల వివరాలతో ముసాయిదాను తయారు చేసి అర్జీదారు దేశానికి అందజేయడం జరుగుతుంది. తగిన సూచనలు ఉంటే మార్పులు చేర్పులు చేయబడ్డాకా, ఆ  రివైజ్డ్/ఫైనల్ నివేదిక ప్రచురించబడుతుంది. సందర్భాన్ని బట్టి ఆర్థిక సహకారమూ అందజేయబడుతుంది.

రానురాను ఈ యంత్రాంగాలు పదునుతేలాయి. సమస్యను క్షుణ్ణంగా పరిశీలించడం, తదనుగుణంగా వివిధ రంగాలలోని నిపుణులను బృందంలో చేర్చడం వంటి మెలకువలతో సమర్థవంతంగా పని చేస్తున్నాయి. అవసరాన్ని బట్టి వరల్డ్ హెరిటేజ్ కన్వెషన్, I.C.U.N. వంటి వాటి తోనూ చేతులు కలుపుతున్నాయి.

పరిరక్షణ దిశగా ప్రోత్సాహం –

చిత్తడి నేలల పరిరక్షణ దిశగా విశేషంగా కృషి చేసిన, చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలకు అవార్డులనూ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రామ్‌సర్ ‘CoP6’ లో మొదలుపెట్టారు. 1996 VI.18 రిజల్యూషన్ ద్వారా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి సాధికారతను కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు 7 సార్లు అవార్డుల ప్రదానం జరిగింది.

1999లో ‘సెపా’ (CEPA) కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్థానికులలో పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం ద్వారా వారిని జాగురూకులను చేయడంతో పాటు సర్వసన్నద్ధులను, భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం ముఖ్యేద్దేశం. తద్వార లక్ష్యం నెరవేరడానికి దారి సుగమం అవుతుంది. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. అభివృద్ధి పేరుతో మనిషి నేల తల్లిని అంపశయ్య మీదకి చేర్చాడు. ఆ పాపాలన్నీ ఎంతో కొంత కృషితో పరిహారమయ్యేవి కావు.

ఈనాడు వేల సంఖ్యలో మేధావులు, శాస్త్రజ్ఞులు ప్రకృతి వ్యవస్థల పరిరక్షణ దిశగా విశేషంగా కృషి చేస్తున్నారు. దానికి సగటు మనిషి సహకారం కూడా తోడైనపుడే వారి కృషికి తగిన ఫలితం లభిస్తుంది.  నేల తల్లికి ఉపశమనం లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here