అమ్మ కడుపు చల్లగా-37

0
2

[అడవులను, జల వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

చేతులు కాలాకానైనా ప్రాప్త కాలజ్ఞత:

[dropcap]2[/dropcap]008లో ఈక్వెడార్ ప్రకృతి లోని అన్ని వ్యవస్థలకీ సురక్షితంగా మనగలిగే/కొనసాగగలిగే రాజ్యాంగబద్ధమైన హక్కును కల్పిస్తూ ప్రకటన చేసింది.

2011లో బొలీవియా అటువంటి గౌరవాన్నే ప్రకృతికి కట్టబెట్టింది. 2017లో న్యూజిలాండ్ వాంగ్‍నూయ్ నదీ ఆవరణ వ్యవస్థకు మనుషుల వలెనే జీవించగలగటం ప్రాథమిక హక్కు అని తేల్చి చెప్పింది.

2017లో భారతదేశం, 2018లో బాంగ్లాదేశ్ నదులన్నిటికీ రాజ్యాంగపరంగా మనుషులతో/పౌరులతో సమానమైన స్థాయి ఉంటుందని తేల్చి చెప్పాయి.

2020లో కేరళ ఇంకొక అడుగు ముందుకు వేసి – నదులు, జలాశయాలు వంటి వనరుల పరిరక్షణ బాధ్యత స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలదేనని తేల్చి చెప్పింది.

నదీ జలాలు – పంపకాలు వంటి అంశాలకు సంబంధించి పేచీలు, పిటిషన్లు, తీర్పులు ప్రపంచవ్యాప్తంగా ఏనాటి నుంచో ఉన్నాయి. అవి మనకు అలవాటైపోయాయి. కానీ నదుల అస్తిత్వం, వాటికి కలుగుతున్న అపకారం, వాటికి గల హక్కులను గురించిన వ్యాజ్యాలు – తీర్పులు – ఈ శతాబ్ది సామన్య మానవుడి మారిన ఆలోచనా ధోరణికి నిదర్శనం. మానవ నాగరికతలన్నీ జీవజలాల లభ్యత ఆధారంగా నదీ తీరప్రాంతల లోనే రూపుదిద్దుకున్నాయన్నది చరిత్ర చెప్తున్న సత్యం. అటువంటి నీటికే ముప్పు ఏర్పడితే ఎంతటి నాగరికతలైనా తుడిచిపెట్టుకుపోవటం ఖాయం. ఆ నిజాన్ని మనిషి గ్రహించాడు.

దిద్దుబాటు దిశగా:

అంతర్వాహినిగా పేర్కొనబడే ‘సరస్వతి’ నది జాడలు రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్, అనూప్ గఢ్, బార్మర్ తదితర కొన్ని జిల్లాలలో లభించాయి. వెంటనే స్పందించిన రాజస్థాన్ ప్రభుత్వం ఆ స్ఫూర్తితో ఆ నదిని పునరావిష్కృతం చేయడానికై ప్రణాళికలు రచించి కేంద్రానికి సమర్పించి ముందుకు సాగింది. 1676 కోట్ల రూపాయల వ్యయంతో ‘ద్రవ్యవతి’ నది పునరుద్ధరణకూ సంకల్పించింది. 6500 చ.కిమీ. విస్తీర్ణంలో హరితహారాన్ని వృద్ధి చేయటం, కాలువల అనుసంధానం, కలుషిత జలాల శుద్ధి వంటివి ‘ద్రవ్యవతి పునరుద్ధరణ పథకం’లో అంతర్భాగం.

కేరళ లోని ‘కుట్టెంపెరూర్’ నది దుస్థితికి ఆవేదన చెందిన ప్రజలు దాదాపు 700 మంది 70 రోజులు శ్రమించి ఆ నదిని పునరుద్ధరించుకోగలిగారు. ప్రజలు నడుం బిగిస్తే ఎంతటి కష్టతరమైన లక్ష్యాలనైనా సాధించవచ్చు అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ.

దాదాపు 35 సంవత్సరాల క్రిందట బాసెల్ వద్ద ఒక రసాయన కర్మాగారంలో ఒక పెద్ద పేలుడు సంభవించి కొన్ని టన్నుల హానికారక రసాయనాలు ‘రైన్’ నదీ జలాలను విషపూరితం చేసేశాయి. అనేక జలజీవులూ చనిపోయాయి. యూరప్ లోనే అతి పెద్దదైన ఈ నది 6 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఆ నదీ పరీవాహక దేశాలన్నీ కలిసి నదీ జలాల శుద్ధికి నడుం బిగించి నిర్ణీత సమయానికి మూడు సంవత్సరాల ముందే ‘రైన్’ నదిని పునరుద్ధరించుకోగలిగాయి. అంతటితో ఆగిపోక, ‘రైన్’ నది సమగ్ర ప్రక్షాళన దిశగా ముందుకు సాగుతున్నాయి.

1950ల ప్రాంతంలో లండన్ లోని థేమ్స్ నది సాధారణ జలచరాలు సైతం మనలేనంత విషపూరితమై పోయింది. 1957లో ‘నేచురల్ హిస్టరీ మ్యూజియమ్’ 215 మైళ్ల నిడివి గల ఆ నదిని ‘మృత నది’గా ప్రకటించింది కూడా. ఆ నదీ జలాలలో ప్రాణవాయువు తగ్గిపోయిన కారణంగా జీవవైవిధ్యమూ పూర్తిగా దెబ్బతిన్నది. ప్రభుత్వం మేలుకొని 1960లో ప్రణాళికను సిద్ధం చేసినా, ఎన్నో వ్యయప్రయాసల అనంతరం గాని ప్రణాళిక అమలు పూర్తి కాలేదు. ఆలస్యం అయినా, ఫలితం దక్కి నది జలాలు తేటతీరి లెక్కకు మిక్కిలి జీవరాశులతో, ఆ నది పూర్వ వైభవం సంతరించుకొని కళకళలాడుతోంది.

దక్షిణ కొరియా, యు.కె., సియోల్ వంటి రాష్ట్రాలు విషపూరితాలైపోయిన నదీ జలాలను సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో శ్రమించి శుద్ధి చేసి జీవధారలుగా మార్చుకున్నాయి.

19 దేశాల గుండా ప్రవహించే డాన్యూబ్ నదిది సైతం మరణం అంచులను తాకి వెనక్కి వచ్చిన చరిత్రే.

అయితే అప్పట్లో అభివృద్ధే లక్ష్యంగా దూసుకుపోవడంలో మనిషి పర్యవసానాలను ఆలోచించని కారణంగా ప్రకృతి వ్యవస్థలకు నష్టం జరిగింది. నష్టాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవటంతో పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పుడు పర్యవసానాలకు అంచనాలు అక్కరలేదు. అనుభవాలే కళ్ళకు కట్టినట్లున్నా తెలిసీ తెలియని నిర్లక్ష్యంతో, అత్యాశతో అభివృద్ధి పేరిట చేపడుతున్న విధ్వంసక చర్యల కారణంగా ప్రకృతికి నష్టం కలుగుతోందన్నది నిష్ఠుర సత్యం. అరుదుగానైనా ప్రకృతి హిత పాలసీలు వచ్చినా ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాలసీలు మారిపోవడం కూడా నిరంతర విధ్వంసానికి ఒక కారణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here