Site icon Sanchika

అమ్మ కడుపు చల్లగా-4

[box type=’note’ fontsize=’16’] “కన్నతల్లిలా ఇన్నాళ్ళూ మనను ఆదరించిన, కాపాడిన ప్రకృతిని ఇప్పుడా కన్నబిడ్డలే సాకాలి. అప్పుడే తిరిగి పరిస్థితులు చక్కబడతాయి” అంటున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

వృక్షోరక్షిత రక్షతః:

[dropcap]అ[/dropcap]మెరికా, ఐరోపా వంటి దేశాలలో అటవీ విస్తీర్ణం ఎక్కువ. అయినప్పటికీ ఆ దేశాలు జరిగిన నష్టాన్ని గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించడంతో అడవుల పరిరక్షణలో, పెంపకంలో మంచి ఫలితాలను సాధించాయి. 1900 నాటికి 65% అటవీ విస్తీర్ణంతో ఉన్న ఫిలిప్పైన్స్ – వివిధ అవసరాలకు బదలాయించిన కారణంగా జీవ వైవిద్య సంపదతో తులతూగుతుండిన తన అటవీ విస్తీర్ణాన్ని 44% మించి పోగొట్టుకుంది. 21 శాతానికి పడిపోయిన అటవీ విస్తీర్ణాన్ని గుర్తించి ప్రమాదాన్ని పసిగట్టిన ప్రభుత్వం సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకొని 2010 నాటికి 26 శాతానికి పెంచగలిగింది.

2010-15 నడుమ కాలంలో అడవులను విస్తారంగా పెంచిన పది దేశాలలో మన దేశం కూడా ఉంది. చైనా మొదటి స్థానంలో నిలిచి ఆదర్శప్రాయమైంది.

అగ్ని ప్రమాదాలు, ఉద్గారాలు, పారిశ్రామికీకరణ అడవుల క్షీణతకు కారణము అయ్యాయి.

అగ్ని ప్రమాదాలు:

ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అంచనా ప్రకారం ఏటా అరవై లక్షలు – కోటి నలభై లక్షల నడుమ హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి అవుతోంది.

1995లో ఉత్తరాఖండ్‌లో 2,75,000 హెక్టార్లు, 2008లో మహారాష్ట్రలో 10,000 హెక్టార్లు, 2010లో హిమాచల్ ప్రదేశ్‌లో 18,000 హెక్టార్లు, అగ్నికీలలకు ఆహుతి అయ్యాయి. ఈ శతాబ్దంలో – ఉత్తరాఖండ్‍లో దావానలానికి రమారమి 22,000 ఎకరాలు మాడి మసైపోగా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్మూ/కాశ్మీర్ లకూ సెగ పాకింది. పంజాబ్, ఒరిస్సా, ఉత్తర కర్నాటకంలోనూ వందల హెక్టార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. అడవులలో కార్చిచ్చు చెలరేగినప్పుడు అనుసరించి వెలువడే పొగ, దుమ్మూ, ధూళి వంటి కాలుష్యాల సంగతి చెప్పనలవి కానిది. గ్రీన్ ట్రిబ్యునల్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు అప్పట్లో నోటీసులు ఈయడం కూడా జరిగింది. 2015లోనూ అడవులలో 15937 అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అడవులు తగులబడిపోయినప్పుడు అనంతర పరిణామాలలో హిమాలయాలలోని మంచు కరిగి ఉత్తరాది నున్న నదులకు వరదలు వెల్లువెత్తే ప్రమాదాన్ని కొట్టిపారేయలేము.

కాలిఫోర్నియాలో – 2018లో చెలరేగిన అగ్ని ప్రమాదాల కారణంగా జీవ వైవిధ్యం అత్యధికంగా ఉన్న అటవీ ప్రాంతాలకు నష్టం వాటిల్లింది. 2019లో అమెజాన్‌లో చెలరేగిన వరుస కార్చిచ్చులకు అత్యంత జీవ వైవిధ్యంతో అలరాలే కీకారణ్యాలు 9 లక్షల హెక్టార్లకు పైగా కాలి బూడిదైపోయాయి. అదే సంవత్సరం ఆస్ట్రేలియాలో అడవులలో కార్చిచ్చు రేగిన కారణంగా లక్షకు పైగా చదరపు కిలోమీటర్ల అడవులు మాడి మసైపోవడమే కాకుండా ఆస్తినష్టం, ప్రాణనష్టం, జన నష్టం కూడా సంభవించాయి.

ఉద్గారాలు:

అడవులు క్షీణత వలన ఉద్గారాల తీవ్రత పెరిగిపోతోంది. 12% నుండి 20% కర్బన ఉద్గారాలకు కారణం అటవీ విస్తీర్ణం తగ్గిపోవడమేనని పలు అధ్యాయనాలు, పరిశోధనలు చెప్తున్నాయి. ఉద్గారాల తీవ్రత కారణంగా భూతాపం పెరిగిపోతోంది. భూతాపం విపరీతంగా పెరిగిపోవడంతో అడవులలో కార్చిచ్చులూ సర్వ సాధారణమైపోయాయి. కార్చిచ్చుల వలన మళ్ళీ అడవులకూ, జీవవైవిద్యానికి విపరీతమైన నష్టం సంభవిస్తుంది.

ప్రాణికోటితో, జీవ వైవిద్యంతో పరస్పరాధారితంగా అమూల్యమైన సంపదతో తులతూగే ప్రకృతి వ్యవస్థ ప్రకృతిని చెండుకు తినేవరకు వెళ్ళిన మానవుని అత్యాశ కారణంగా నేడు ఉత్పాతాల విషవలయంలో చిక్కుకొనిపోయింది. కాని తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న మానవుడు కొమ్మే విరిగిపోయాక ఏం చేయగలడు? ఆధారమే లేకపోతే ఫలితం ఎక్కడ మిగులుతుంది? కారణం –

ప్రపంచవ్యాప్తంగా పరీక్షంగానో  ప్రత్యక్షంగానో అడవులపై ఆధారపడి బ్రతుకుతున్నవారు 300 కోట్లకు పైమాటే. స్వచ్చమైన నీటి వనరులలో 75 శాతానికి  అడవులే ఆధారం. కొన్ని కోట్ల జీవజాతులకు చెట్లు, క్రిమికీటకాలు, జంతువులు వంటి వాటిలో 80 శాతానికి అడవులే నెలవులు. మానవజాతి కొనసాగాలంటే ప్రకృతిని పరిరక్షించుకొని తీరాలి. కన్నతల్లిలా ఇన్నాళ్ళూ మనను ఆదరించిన, కాపాడిన ప్రకృతిని ఇప్పుడా కన్నబిడ్డలే సాకాలి. అప్పుడే తిరిగి పరిస్థితులు చక్కబడతాయి.

స్వస్థత చేకూరి స్వాంతన లభిస్తే ఆ తల్లే మళ్ళీ మనిషిని సేదదీర్చగలదు.

Exit mobile version