[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
[dropcap]చ[/dropcap]మురు, సహజవాయువుల పరిశ్రమలు శుద్ధ ఇంధనానికై పెడుతున్న పెట్టుబడి కేవలం 1%. 2022లో ఈ పరిశ్రమ శుద్ధ ఇంధన రంగంలో పెట్టిన పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లు. వారి పెట్టుబడులలో ఇది 2.5%. అది 50 శాతానికి చేరుకుంటేగాని ఉద్గారాలను 1.5°Cకి కట్టడి చేయడం సాధ్యం కాదని I.E.A. (ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ) స్పష్టం చేసింది. ‘కార్బన్ కేప్చర్’ పర్యావరణ సంక్షోభానికి పరిష్కారమేమీ కాదు. సంక్షోభాలకు పరిష్కార మార్గాలూ సంక్లిష్టంగానే ఉంటాయి.
గల్ఫ్ దేశాలలో మిగిలన ప్రపంచం కంటే ఉష్ణోగ్రతలు అధికం. ఇప్పటికే అక్కడ ఉష్ణోగ్రతలు 50°Cకి మించిపోవడం సర్వసాధారణం. కాలుష్యకారకాలతో కూడిన ధూళితుఫానులూ అక్కడ ఎక్కువే. అతి విలాసవంతమైన జీవన విధానం, ఆయిల్ వెలికితీత వంటి కారణాలుగా ఆ దేశాలలో ఉద్గారాల స్థాయీ ఎక్కువే. సౌదీ, U.A.E. (ఎమిరేట్స్) వంటి దేశాలు పెద్ద ఎత్తున శుద్ధ ఇంధన వినియోగం దిశగా మరలితే గాని 2030 నాటి లక్ష్యాలను చేరుకోవటం సాధ్యం కాదు. స్వంత దేశాలలో వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఆ దేశాలు అంత త్వరగా చమురు సహజవాయువుల వెలికితీతను తగ్గించుకోవడానికి సిద్ధంగా లేవు. కారణం చమురు ఎగుమతుల్లో వచ్చే రాబడిపై అవి ఆధారపడి ఉన్నాయి. వాటికి వేరే ఆదాయ వనరులు లేవు.
అయితీ అవి చిత్తశుద్ధితో ఆలోచిస్తే, ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి చమురు ఎగమతులతో వచ్చే ఆదాయాన్ని పునరుత్పాదక ఇంధనవనరుల రంగంలో పెట్టుబడులను పెంచి సమస్యను అధిగమించవచ్చు. సౌరశక్తిని హెచ్చు స్థాయిలో ఒడిసిపట్టి చమురు ఎగుమతుల వలన వచ్చే ఆదాయాన్ని సౌరశక్తి అమ్మకాలతోనే పొందవచ్చు.
ఉదాహరణకు పునరుత్పాదక విద్యుత్తుల కలగలుపుతో 92% వరకు దేశ విద్యుత్ అవసరాలను తీర్చుకోగలుగుతున్న కెన్యా ఆఫ్రికన్ దేశాలలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దేశాలలో ఒకటి.
C. C. S. ప్రాజెక్టులు –
కెనడా ‘ఆయిల్ శాండ్’ కంపెనీ 1.6 బిలియన్ టన్నుల ‘కార్బన్ కేప్చర్’ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించింది. అయితే అల్బెర్టా వాసులు అంత Co2 ను భూమిలోనికి ఇంకిస్తే పర్యావరణానికి, ప్రజలకు హానికారకం కాగలదని భయందోళనలు వెలిబుచ్చారు. చమురు వెలికితీతలో కెనడా నాల్గవ స్థానంలో ఉండటం గమనార్హం.
2020లో ‘పెట్రోనాస్’ – మలేసియా చమురు సహజవాయువులు కంపెనీల గ్రూప్ కార్బన్ కేప్చర్ సాంకేతికతలను అవలంబించి 2050 నాటి కల్లా జీరో కర్బన/కర్బన రహిత ఇంధనాన్ని సాధించడం ద్వారా ‘నెట్ జీరో’ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించింది.
అమెరికా 2022లోనే ‘C.C.S’ ను లెజిస్లేషన్ ద్వారా ఆమోదించింది.
2023 నవంబర్ నెలాఖరులో ఇ.యు. పార్లమెంట్ ‘నెట్ జీరో’ ఇండస్ట్రీ చట్టంను ఆమోదించింది.
షెల్, బి.పి. టాటా ఎనర్జీస్, ఎక్సాన్ మొబిల్ కంపెనీల గ్రూప్ నాన్ ప్రాఫిటబుల్ ప్రైవేట్ సంస్థగా ‘C.C. ఇండస్ట్రీస్’ పేరిట మొన్నటి CoP-28 లో అధికారికంగా రిజిస్టర్ అయ్యింది. ఈ సంస్థ కార్బన్ కేప్చర్‌తో బాటు స్టోరేజిని కూడా చేపడుతుంది. ఇదంతా ‘oil lobbying’ మహత్యమేనన్న విమర్శలూ రావడం జరిగింది.
CoP-28 లో ప్రభుత్వ ప్రైవేటు కంపెనీల పెద్ద సంస్థ ‘U.A.E. డి-కార్బొనైజేషన్ ఏక్సిలరేషన్’ తమ కార్యకలాపాలు హరితగృహ వాయువులను ఎలా తగ్గిస్తాయో వెల్లడించినపుడు నిరసనలు వ్యక్తం అయ్యాయి. ‘డి-కార్బనైజేషన్ అలయెన్స్’ అన్నది CoP-28 నుండి ‘ప్రమాదకరమైన పెడదారి’గా నిర్వచించటం కూడా జరిగింది.
I.E.A చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బోరల్ సైతం –
కార్బన్‌ను ఒడిసిపట్టి నిక్షిప్తం చేయడం అన్నది ఫాసిల్ ఫ్యూయల్ వ్యాపారానికి లైసెన్స్ కాదని కుండ బద్దలు కొట్టారు. విడుదల చేసిన కర్బన ఉద్గారాలను ఆసాంతం ఒడిసిపట్టగలగడం అన్నది సాధ్యమయ్యేది కాదనీ, అది ఒక భ్రమ మాత్రనేనని నిష్కర్షగా చెప్తూ, “ఇప్పుడే ‘స్విచ్ ఆఫ్’ పాలసీలు తేవాలి. ప్రస్తుతం ఉన్న పాలసీల ప్రకారం 2030 నాటికి శిలాజ ఇంధన వనరుల వినియోగం peak లో ఉంటుందన్న లెక్కల ప్రకారం ప్రభుత్వాలు ముందు జాగ్రత్త పడాలి. లేకుంటే అనిశ్చితితో కూడిన భవిషత్తులో పడటం ఖాయం” అని హెచ్చరించారు.
“సమస్య యూరప్‍దో, U.S.దో మరో దేశానిదో మాత్రమే కాదు. భూమండలంపై ఉన్న అందరిదీ. న్యూఢిల్లీ నుండి జకార్తా, నైజీరియాల వరకు ప్రజలు శిలాజ ఇంధనాల వాడకం వలన వాతావరణంలో వస్తున్న ప్రమాదకరమైన మార్పులు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. వాళ్లకి లింక్ అర్థం అవుతోంది” అన్నారు. “రెన్యువబుల్స్ లోకి వెడుతున్న పెట్టుబడులు బాగా పెరగాలి. ఒక క్రమానుగతమైన తగ్గుదల శిలాజ ఇంధనాల వాడకంలో వచ్చి తీరాలి. ప్రస్తుతం ఉన్న సాంకేతికలు, నైపుణ్యాలు, మార్కెట్లూ అన్నీ రెన్యువబుల్స్ ఇంధనాల వైపు మరలాలి” అని ఆయన అన్నారు.
హెచ్చు మొత్తంలో Co2ను కృత్రిమంగా భద్రపరిస్తే భూ ఉపరితలం లోని నీరు, శక్తి వంటి వాటి సమతుల్యతలో మార్పులు సంభవించి భూ, జీవ, జాతిక సంబంధమైన దుష్ప్రభావాలకు అవకాశం ఉందన్న వాదనలను కాదనలేం. ‘జియో ఇంజనీరింగ్’ విధానంలో కార్బన్‌ను భద్రపరచడం అన్న విధానం వలన ఒనగూడగల/సంభవించగల పరిణామాలపై స్పష్టమైన అవగాహన ఇంకా లేదు. ఈ విధానం అమలయిన కొన్నాళ్లకు కానీ ఆ వివరాలు తెలియవు. Co2 ను భద్రపరిచేటప్పుడు ఎంతో కొంత ఉద్గారాలు వెలువడతాయి.
జియో ఇంజనీరింగ్‌లో భద్రపరచబడిన Co2 శతాబ్దాల బాటు డిస్టర్బ్ కాకుండా ఉండాలి. సాధ్యమేనా? నేల వినియోగం మారితే అక్కడి Co2 డిపాజిట్ల సంగతి?
చెట్ల నుండి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, మాంగ్రోవ్స్ వంటి వ్యవస్థల నుండి వాతావరణం లోని వేడికి Co2 విడుదల అవుతూ ఉంటుంది. ఆ Co2 కు ఈ భద్రపరచబడిన Co2 కూడా జతపడే పరిస్థితులు ఎదురైతే అప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ యక్ష ప్రశ్నలు. కారణం వీటికి జవాబులు భవిష్యత్తు గర్భంలో ఉన్నాయి. గతంలో చేపట్టిన ఎన్నో పురోభివృద్ధి కార్యక్రమాలు మిగిల్చిన చేదు ఫలితాలనే నేడు మనం అనుభవిస్తున్నాం. చేసిన తప్పులను దిద్దుకొనే క్రమంలో పరిణామాలు ఎలా ఉంటాయో తెలియని మరిన్ని క్రొత్త విధానాలను చేపట్టటం వివేవకంతమైన చర్య కాబోదు.