[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
సముద్రాలకూ తప్పని ముప్పు:
[dropcap]వా[/dropcap]తావరణంలో మార్పు అన్నది సహజంగానూ, క్రమక్రమంగానూ వస్తున్నది కాదు. ఇటీవలి కాలంలో అది చాలా వేగంగా జరుగుతోంది. లివర్‌పూల్ యూనివర్శిటీ మెరైన్ బయాలజిస్ట్ Nova Mieszkowska అధ్యయనాల ప్రకారం సముద్రజలాల ఉష్ణోగ్రతలు పెరిగిన కొద్దీ ఉష్టమండల తుఫానులు ఎక్కువ బలం పుంజుకుంటాయి. మిగిలిన సముద్ర జలాల నుండి వచ్చి చేరే జీవులు స్థానిక సముద్ర జీవుల మనుగడకు పెద్ద అవరోధంగా మారతాయి. దుబాయ్‌లో వరదలు మరింత బీభత్సంగా మారడానికీ వాతావరణ మార్పులే కారణం.
కోపర్నికస్ క్లైమేట్ సర్వీస్ 2024 ‘యూరోపియన్ యూనియన్ స్టేట్ ఆఫ్ ది క్లయిమేట్’ ప్రకారం సముద్రాలలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. యు.కె.కు ఉత్తరాన ఉన్న నార్వేజియన్ సీ, అట్లాంటిక్ సీ లలో ఫైటోప్లాంక్‌టన్ సగటు కంటే 200% నుండి 500% వరకు అధికంగా ఉంది. లైబీరియన్ ద్వీపకల్పానికి పడమటి సముద్రంలో ఫైటోప్లాంక్‌టన్ అదే సగటుకు 60 నుండి 80% తక్కువగా ఉంది. ఈ సగటును 1998-2020 నడుమ కాలంలో సముద్రాల స్థితిగతుల నుండి లెక్కించారు.
ఫైటోప్లాంక్‌టన్ కిరణ జన్యసంయోగక్రియలో పాలుపంచుకునే అతి చిన్న/సూక్ష్మమైన జీవులు. క్లోరోఫిల్ అనబడే వర్ణద్రవ్యంతో నిండి ఉండే ఈ ఫైటోప్లాంక్‌టన్ సముద్రపు ఆహార వ్యవస్థకు మూలం. క్రిల్ నుండి తిమింగలాల వరకు ఆహారపు గొలుసు వ్యవస్థలో దీనిపైనే ఆధారపడి జీవిస్తాయి. వాతావరణం నుండి సముద్రంలోనికి కార్బన్ డై ఆక్సైడ్ (CO2)ను బదిలీ చేయడంలోనూ దీని పాత్ర కీలకం.
సముద్రాల రంగు కూడా వాటి ఉపరితలాలలో ఉండే పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. వాటిలో ఈ ఫైటోప్లాంక్‌టన్ కీలకమైనది. ఉపరితలం నుండి ప్రతిబింబించే సూర్యరశ్మి కిరణాల తరంగదైర్యం ద్వారా సముద్రంలో క్లోరోఫిల్ స్థాయిలను అంచనా వేస్తారు. సముద్ర జలాలు ముదురు నీలంగా ఉంటే క్లోరోఫిల్ తక్కువగా ఉన్నట్లు. ఆకుపచ్చగా ఉంటే ఎక్కువగా క్లోరోఫిల్ ఉన్నట్లు.
పగడపు దిబ్బలు:
ఇవి సముద్ర జలాల లోని జీవ వైవిధ్యానికి నెలవులు. సముద్ర జీవులలో రమారమి 25% జాతులకు ఇవి ఆధారభూతమైనవి. అనేక జీవజాతులు ఈ పగడపు దీవులలో ఆవాసం కల్పించుకొని తమ ఆహారం, ప్రత్యుత్పత్తి వంటి ప్రక్రియలను సురక్షితంగా కొనసాగిస్తాయి. ఇవి వెన్నెముక లేని జాతి సముద్ర జీవులు. సమాహాలుగా మనుగడ సాగించే విధానంలో కొంత మేరకు విస్తరించి దీవులుగా రూపొందుతాయి. తీర ప్రాంత ప్రజలకు ఈ పగడపు దిబ్బలు తుఫానులు, వరదల తాకిడి నుండి కొంతవరకు రక్షించచగల కవచాల వంటివి. ఇటువంటి పగడపు దిబ్బలు సముద్ర జలాలలో పెరుగుతున్న ఎసిడిటి, సముద్ర జీవులను మర బోట్లు వంటి సాధనాలతో వేటాడటం వంటి కారణంగా ప్రమాదంలో పడుతున్నాయి.
సముద్ర జలాలు వేడెక్కి పోతుండడము వీటి మనుగడకు ముప్పుగా పరిణమిస్తోంది. మార్చి 2023 నాటి సగటు సముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత సాధారణంగా కంటే ఎక్కువగా పెరుగుతూ పోయి ఆగస్టు నాటికి రికార్డు స్థాయికి (కొత్త) చేరుకున్నది. కోపర్నికస్ ఉపగ్రహం వెలువరించిన డేటా ప్రకారం రికార్డు స్థాయి చాలా హెచ్చుగా ఉంది. ఈ రకమైన ఉష్ణోగ్రతల కారణంగా పగడపు దిబ్బలు తమ రంగును కోల్పోయి క్రమంగా నశించిపోతున్నాయి. ఇవి సముద్రపు పాకృతిక వ్యవస్థలలో చాలా కీలకమైన ఉప వ్యవస్థలు. వీటి ఉనికికి ముప్పు పెరిగిన కొద్దీ సముద్రంలోని జీవ వైవిధ్యానికి ముప్పు ఏర్పడినట్లే.