[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]
బతుకు పోరాటం – పక్షులు – వలసలు
[dropcap]1[/dropcap]979 నాటి ‘బాన్’ ఒప్పందం ప్రకారం వివిధ జీవుల ఆవాస ప్రాంతాలలోనే కాక వలస ప్రాంతాలలోనూ సంరక్షణ చర్యలు చేపట్టవలసి ఉంది. భూమండలం పైనున్న జీవ వైవిధ్యానికి పశుపక్ష్యాదులతో సహా, వాటి మనుగడకు ప్రమాదం కలగకుండా ఉండటానికి అనేక ఒప్పందాలు ఉన్నాయి. చట్టాలు రూపొందాయి. కారణం మానవ ప్రేరిత చర్యల ద్వారా ప్రాణికోటికి జరుగుతున్న హానిని ఏనాడో గుర్తించడం జరిగింది. కానీ వాటి అమలు లోనే అలవి మాలిన అలసత్వం లేదా నిర్లక్ష్యం రాజ్యాలేలుతున్నాయి.
Fatal Light Disorder:
అమెరికాలో ఏటా కోట్ల సంఖ్యలో పక్షులు విద్యుత్ వెలుగుల కారణంగా చనిపోతున్నాయి. ఉత్తర అమెరికాలో సుమారు 70 లక్షల పక్షులు టీవి/రేడియో టవర్ల వంటి వాటిని ఢీకొంటున్న కారణంగా చనిపోతున్నాయి. కరెంటు తీగలు, పవన విద్యుత్ పరికరాలు సైతం వాటికి ప్రాణాంతకమవుతున్నాయి. బట్టమేక పక్షులయితే ఏటా 18 లక్షల దాకా పై కారణాలుగా చనిపోతున్నాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన సుప్రీం కోర్టు 2021లోని విద్యుత్ తీగలను భూమి లోపల ఏర్పాటు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.
కారణం అనేక జీవజాతులలో వలస పోవటం అనేది క్రమానుగతమైన చర్య. వాటి జాతుల మనుగడకు కీలకమైన అంశం. అటువంటి వలసే వాటి పాలిట ప్రాణాంతకంగా మారుతున్నదంటే మనిషి స్వార్థాన్ని ఏ రకంగా నిర్వచించాలి?
శక్తే ఇంధనం:
శరీరంలో కొవ్వు రూపంలో ఆహారం ద్వారా సమకూరిన శక్తిని శక్తిని దాచుకుని కేవలం నైసర్గిక శక్తులు, భూ అయస్కాంతక్షేత్రం, సూర్యచంద్రులు, భూమి పైన ఉండే కొన్ని గుర్తులు/ఆనవాళ్ళ ఆధారంగా సమూహాలుగా కొన్ని, ఒంటరిగా కొన్ని పక్షిజాతులు వలసలను కొనసాగిస్తాయి. మార్గమధ్యంలో మరుగు లేని చోట్ల వేటగాళ్ళ నుండి వాటికి ప్రమాదం ఉండనే ఉంటుంది. వలసకు వలసకు నడుమ వాటి ప్రయాణ మార్గంలో చోటు చేసుకుంటున్న మార్పులు సైతం వాటి భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. సముద్ర మట్టానికి 150 మీటర్ల నుండి – 600 మీటర్ల వరకు ఎత్తులో అవి ప్రయాణిస్తాయి. ‘ఈము’ పక్షులు కిలోమీటర్ల దూరం నడచి వలసపోతాయి. ఉత్తర అమెరికా లోని వందల సంఖ్యలోని పక్షి జాతులలో సగానికిపైగా వలసపోయే పక్షులే. పైగా సుదూర ప్రాంతాలను ఆవాసాలుగా లక్షం చేసుకోని పోవటం ఉత్తర అమెరికా లోని పక్షిజాతుల పత్యేకత. వలస మార్గంలో వీటి ప్రయాణం చాలా కఠినతరంగానే ఉంటుంది. అయినా లెక్క చేయక ఎన్నో వందల/వేల ఏళ్లుగా ఈ జాతులు వలసలను కొనగసాగిస్తునే ఉన్నాయి. సంతానోత్పత్తికి అనువైన శీతోష్ణపరిస్థితుల గురించి కొన్ని, అనువైన, సమృద్ధమైన ఆహారం అన్వేషణలో తమ తమ ప్రత్యకమైన కారణాలతో పక్షిజాతులు వలస బాట పడతాయి. నిర్ణీత కాలానికి తిరిగి ఏ మాత్రం ఏ మార్పు, వైఫల్యం లేకుండా తమ తమ స్వంత గూళ్లకు/ఆవాసాలకు చేరుకుంటాయి.
ఎంత చిత్రమైనది ఈ ప్రకృతి!