Site icon Sanchika

అమ్మ కడుపు చల్లగా-54

[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

తన్ను తాను మరమ్మత్తు చేసుకోగల స్థాయి నుంచి ప్రకృతిని వికృతి చేసిన మానవుడు

[dropcap]మ[/dropcap]నిషి ప్రభావం లేని రోజుల్లోనూ కాలుష్యాలు విడుదల అయ్యేవి. భూమండలంపై సహజసిద్ధంగా సంభవించే మార్పులు దానికి కారణం అయి ఉండవచ్చు. ‘ఆర్కిటిక్ కోరింగ్’ త్రవ్వకాలలో వెలికితీయబడిన అవశేషాలను పరిశీలిస్తే 5½ కోట్ల సంవత్సరాల క్రిందట ఆర్కిటిక్‍లో ఉష్ణోగ్రత 18°C ఉందని తెలిసింది. అంటే అక్కడ అప్పట్లో మంచు లేనే లేదు. ఉద్గారాల కారణంగా భూమిపై 5°C ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీన్ని పాలియోసివ్/ఎయోసిన్ ‘థర్మల్ మాగ్జిమమ్’ [Paleocene-Eocene Thermal Maximum (PETM)] గా వ్యవహరిస్తారు. పాలియోసిన్ దశలో ఆర్కిటిక్ వద్ద ఉష్ణోగ్రత 24°C లకు పెరిగింది. ఆ సమయంలో సైబీరియన్, కెనడియన్ నదీ ప్రవాహాల నుండి చాలా హెచ్చుస్థాయిలో నీరు ఆర్కిటిక్ లోనికి వచ్చి చేరింది. దీనికి తోడు అవక్షేపాలు కలియడంతో ఉప్పునీరు మంచినీరుగా మారిపోవడం మొదలెంది. ‘అజోల్లా’ మంచినీటిలో పెరిగే మొక్క. దీనికి Co2 ను తొలగించే గుణం ఉంది. ఇది ఆర్కిటిక్ ఉపరితలాన్ని కమ్ముకుంటూ పోయింది సహజంగానే, Co2 స్థాయిలు తగ్గతూపోయాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలూ తగ్గుతూపోయాయి. అది చివరికి మంచుమయం కావడానికి దారితీసింది. ప్రొ. బ్రింకుయిస్ పరిశోధనలలో 5000 సంవత్సరాల క్రిందట ఆర్కిటిక్‍లో అజోల్లా ఉన్నట్టు, – అదే సమయంలో అక్కడ నీరు మొదటిసారిగా గడ్డకట్టటం మొదలు పెట్టినట్లు ఆనవాళ్లు కనిపించాయి.

Co2 ఉద్గారాలు – గతిరీతులు:

2020లో నాసా Co2 పెరుగుదల, విడుదల వంటి అంశాలకు సంబంధిన వాతావరణంపై అధ్యయనం చేపట్టింది. భూతలం నుండి, ఉపగ్రహాల నుండి అత్యంత ఆధునిక పరికరాలతో బిలియన్ల డేటా పాయింట్ల నుండి సమాచారాన్ని సేకరించి కర్బన ఉద్గారాల విడుదల, గతిరీతులను తెలియజెప్పే మేప్‌ను తయారు చేసింది. ఇది సాంప్రదాయ అద్యయన రీతుల కంటే 100 రెట్లు ఎక్కువ స్పష్టంగా సమాచారాన్ని సేకరించింది. ఈ విధానంలో ఉద్గారాల విడుదలను/వ్యాప్తిని హై రిజల్యూషన్‌తో జూమ్ చేసి చూడవచ్చు. G.E.O.S. జరిపిన ఈ అధ్యయనంలో Co2 సముద్రాలను దాటుకొని ఖండాంతరాలకూ ఎట్లా వ్యాపిస్తోందో స్పష్టంగా తెలిసింది.

దీని ప్రకారం దక్షిణాసియా, U.S, చైనాలలో Co2 ఉద్గారాలకు కారణం పవర్ ప్లాంట్స్, పరిశ్రమలు, వాహనాలు. ఆఫ్రికా, దక్షిణ అమెరికాలలో అగ్ని ప్రమాదాలు, వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయడం, అడవుల నరికివేత వంటివి. ఈ మానవ కార్యకలాపాలకు అదనంగా ప్రకృతి వైపరీత్యాలు (కార్చిచ్చుల వంటివి) ఉండనే ఉన్నాయి.

ఒప్పుకోళ్లు సరే – చిత్తశుద్ధి ఏది?

అటవీ సంరక్షణ నిధులను అటవీ సంరక్షణ నిమిత్తం మాత్రమే వినియోగించాలి. ఉష్ణమండల అరణ్యాలు, సహజారణ్యాలు, వర్షారణ్యాలు వంటి వివిధ అటవీ వ్యవస్థలను సంరక్షించి వాటిని అభివృద్ధి చేయటానికి నిర్దేశించబడిన ఆ నిధులను ఉద్గారాల విడుదలకు పరిహారంగా వినియోగించకూడదు. కార్బన్ క్రెడిట్లు ఉద్గారాల విడుదలకు అనుమతి పత్రాలు కావు.

సైన్స్ బేస్డ్ టార్గెట్ ఇనిషియేషవ్ అనేది ఒక N.G.O. ఈ సంస్థ వరల్డ్ వైడ్ ఫండ్, ఐక్యరాజ్యసమితిల సహకారంతో పనిచేస్తోంది. వివిధ దేశాలలో కర్బన ఉద్గారాల నియంత్రణకై తీసుకున్న నిర్ణయాలు – వాటి అమలుకు సంబంధించి సుమారు 5000 కంపెనీల, ఆర్థిక సంస్థల పనితీరును పరిశీలించి ఫలితాలను విశ్లేషించింది. ఒప్పందాలలో ఉన్న చొరవకూ, లక్ష్యశుద్ధి దిశగా చేపడుతున్న చర్యలకూ పొంతన లేదు.

ప్రకృతిని ప్రేమించి, పూజించి, ప్రకృతితో మమేకమై బ్రతికిన మనిషి స్వార్థం షెరిగిపోయి లాభాపేక్షతో ఆ ప్రకృతి వ్యవస్థలనే చెండుకు తింటున్న కారణంగా ఓర్మి నశించిన ప్రకృతి మ్రోగిస్తున్న ప్రమాదఘంటికలనూ నిర్లక్ష్యం చేస్తున్న మానవ జాతి మనుగడ ఏం కానున్నదో!

Exit mobile version