Site icon Sanchika

అమ్మ కడుపు చల్లగా

[dropcap]అ[/dropcap]యిదు సంవత్సరాలకు ఒకసారి ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ) అడవుల విస్తీర్ణంపై అంచనా నిర్వహిస్తోంది. జీవావరణ వ్యవస్థలో అడవులకు ఉన్న ప్రాముఖ్యత విస్మరించరానిది. ఒక హెక్టారు రమారమి 74 టన్నుల కార్బన్‍ను శోషిస్తుంది. ప్రపంచం మొత్తంగా అడవుల మూలంగా 200 కోట్ల టన్నుల కార్బన్ శోషించబడుతుంది.

రష్యా, బ్రెజిల్‍, అమెరికా, కాంగో, ఇండోనేషియా, కొలంబియా, చైనా దేశాలు మనకన్నా ముందు ఉండగా మన దేశం కార్బన్ ఎబ్సార్ప్షన్ (absorption) రేటులో ఎనిమిదవ ర్యాంకులో ఉంది. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు వంటి ఉద్గారాలు తగ్గాలంటే కార్బన్ ఎబ్సార్ప్షన్ రేటు పెరగాలి.

జీవవారణ్య వ్యవస్థలో నేలపైన, క్రింద వివిధ రూపాలలోని వ్యర్థాలు మట్టిగా మారాక అందులో కార్బన్ కూడా ఉంటుంది. అవే కార్బన్ డిపాజిట్లు లేదా కార్బన్ స్టాక్. వాతావరణంలోని కార్బన్‍లో సగం దాకా చెట్లు, అడవులే గ్రహిస్తాయి. ఆ రకంగా చెట్లు ఉద్గారాలనూ తగ్గిస్తాయి. అంతేకాకుండా ప్రతిగా ఆక్సిజన్‍ను విడుదల చేస్తాయి. మానవాళికి ఈ రకంగా మహాపకారం చేస్తున్న వృక్షసంతతిని మనం తెగనరుకుతూ పోతున్నాం. ఆ కారణంగా వాతావరణంలో ఉద్గారాలు పెరిగిపోయి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు పెరిగితే మహానగరాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఏనాటినుండో పర్యావరణ వేత్తలు మొత్తుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో-

సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఒక చెట్టు వెలువరించే ఆక్సిజన్ విలువను లెక్కగట్టాలని ఆదేశించింది. చెట్లను నరకడాన్ని ఆపాలనీ ఆదేశించింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 7000 హెక్టార్లు అటవీ ప్రాంతం అన్యాక్రాంతం అయ్యిందని అడవులపై అధారపడి బ్రతుకుతున్న వారు సుప్రీంకోర్టుకు విన్నవించడం జరిగింది. అటవీ భూములో అన్యాక్రాంతం కావడం విచ్చలవిడిగా చెట్లనరికివేతకు దారిని సుగమం చేస్తుంది.

భూతాపాన్ని కట్టడి చేయాలంటే ఉద్గారాలను నియంత్రించవలసిందే. ఉద్గారాలను నియంత్రించాలంటే చెట్లను నాటి పెంచడమే కాకుండా ఉన్న ఆడవులనూ జాగ్రత్తగా కాపాడుకోవలసిందే. 1990లో 31%గా ఉన్న అడవులు క్రమేపీ తమ విస్తీర్ణాన్ని కోల్పోతూ వచ్చాయి. మూడింట ఒకవంతు భూమండలం హరిత వనాల వారసత్వపు హక్కు అన్నది పారిశ్రామిక విప్లవపు తొలిరోజులనాటి మాట. పారిశ్రామికీకరణ వికటించిన నేటికాలానికి ఆ వారసత్వపు హక్కును పునరుద్దరించడంతో బాటుగా మరిన్ని దిద్దుబాటు చర్యలు తప్పని సరి.

Exit mobile version