Site icon Sanchika

అమ్మ ఒడి

[dropcap]ల[/dropcap]క్ష్మీకుమారి టీచరు క్లాసు రూములున్న వరండాలో నుంచి నడిచి వెళ్తున్నారు. ఎయిత్ ‘బి’ సెక్షనులో నుండి లెక్కల మాస్టారి గొంతు పెద్దగా వినిపిస్తున్నది. “ఏరా! నువ్వు చదువుకోవటానికి వచ్చావా? మా అందర్నీ నీ నోటికొచ్చినట్లు ఎగతాళి చెయ్యటానికొచ్చావా?” అంటూ చేతిలోని బెత్తంతో ఎడాపెడా ఉమాపతిని బాదారు.

ఉమాపతి ఏం మాట్లాడలేదు. కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డాడు.

“మూగి మొద్దులా మాట్లాడవేం? నిన్న, నా వెనకాల అరుచుకుంటూ పోయి కూసిన కూతలేంటి? వళ్ళు తెలుస్తుందా నీకు?” అంటూ మరో రెండు తగలనిచ్చారు. “నేను నీకు తాతనా? తాతా! ఓ…. పిలక తాతా! గోచీ పాతా!” అంటూ లల్లాయిపదాలు పాడతావా? తాటిచెట్టులో సగమున్నావు. పట్టుమని పది ఎక్కాలు రావు. ఒక కూడిక రాదు. ఒక తీసివేత రాదు. నీ మొహానికి పాటలొకటి తక్కువయ్యావా?” అంటూ కోపంతో ఊగిపోతూ మళ్ళీ కర్రెత్తారు.

“నేను మా తాతను ఇంట్లో ఎప్పుడూ ఇట్టాగే అంటాను. నిన్న బళ్ళో గూడా మా తాతే గుర్తొచ్చి అట్టా పాడాను. నిన్నేం కాదు”

“నోర్ముయ్. ఇంటికి పోయి మీ తాత దగ్గరే వుండు లేదా మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. ఆ తర్వాత నాకు క్షమాపణ చెప్పి క్లాసులో కూర్చో. అలా చెప్పేదాకా నా క్లాసులో నువ్వు కనిపించకు” అంటూ గట్టిగా అరిచారు.

వాడికి చీమ కుట్టినట్లైనా లేదు. ఏం మాట్లాడకుండా తరగతి బయటికొచ్చి వరండాలోకొచ్చి నిలబడి దిక్కులు చూశాడు. ప్లే గ్రౌండ్‍క్కాని, స్కూల్ బయటిక్కాని వెళ్ళాలనిపించింది. కాని వెళ్ళకూడదేమోననిపించి వరండాలోనే గుమ్మం పక్కగా, నిలబడ్డాడు.

లక్ష్మీకుమారి స్టాఫ్ రూంలో కెళ్ళి ఎయిత్ ‘బి’ హిందీ కాంపోజిషన్లు దిద్దుదామని ఒక్కొక్క పుస్తకం తెరిచి చూడసాగింది. పేరు చదివింది. అది ఉమాపతిదే. ఇందాకటి గొడవ గుర్తుకొచ్చింది. ఈ ఆగష్టు నెలలో వచ్చే స్వాతంత్ర దినోత్సవమే వీళ్ళ హిందీ సిలబస్‍లో కాంపోజిషన్ వ్రాయాలని వున్నది. అదే పరీక్షల్లో పది మార్కులకిచ్చే ప్రశ్నల్లో ఒకటిగా వుంటుంది. క్లాసులో ముందుగా దాన్ని గురించి వివరించి చెప్పి, ఆ తర్వాత కాంపోజిషన్ వ్రాయమని చెప్పింది.

“పంద్రహ్ అగస్త్ మే భారత్ కో స్వతంత్ర్ మిలా. స్కూల్ మే జండా ఉడతా. హమ్ చాక్లెట్ ఖాతా. స్కూల్ చుట్టీ హోతా.” అని రెండు మూడు పంక్తులు తెలుగులో వ్రాశాడు. ఉమాపతికి హిందీ అక్షరాలు వ్రాయటానికి రావని అర్థమయింది. ఇలాంటి వారికి ప్రత్యేకంగా నేర్పాల్సిందే అనుకున్నది. నెక్ట్స్ క్లాసు ఎయిత్ ‘బి’ కే, వెళ్ళాలి అనుకుంటూ అ క్లాసులో అడుగుపెట్టింది. ఒక్కొక్కరినీ పిలిచి కాంపోజిషను పుస్తకాలు ఇవ్వటం ప్రారంభించింది.

“ఉమాపతీ! నువ్వింకా హిందీ అక్షరాలు నేర్చుకోలేదు. తరుచూ చెప్తుతూనే ఉన్నాను. నువ్వు మాత్రం నేర్చుకోలేదు సరికదా? హిందీ అక్షరాలను తెలుగులో కాంపోజిషను వ్రాశావు. అది తప్పు. క్వార్టర్లీ పరీక్షల నాటికి నువ్వు బాగా నేర్చుకుని హిందీలోనే తప్పుల్లేకుండా జవాబులు వ్రాయాలి”

“మా అన్న ఇట్టాగే వ్రాసుకుని ఇందీ సదూకునేవాడంట. ఈ ఇందీ నాకు రాటం లేదు రా అంటే ఇట్టా సదవమని సెప్పాడు. అయినా చాలామంది ఫోన్‍లో తెలుగు రాయకుండా, ఇంగ్లీషు అచ్చరాలలోనే, మెసేజ్‍లు అవీ పెడతారుగా. నేను ఇందీని అట్టా తెలుగు అచ్చరాల్లో రాయొచ్చుగా. నేను ఇట్టాగే రాస్తాను” అంటూ కూర్చున్నాడు.

“ముందు లేచి నిలబడు. చెప్పేది పూర్తిగా విను. తెలుగులో టైప్ చేయటం రాక, ఫోన్‍లో కొంతమంది ఇంగ్లీషు అక్షరాలను టైప్‍ చేసి పంపుతున్నారు. అదీ కరెక్ట్ కాదు. నువ్వు దాన్నసలు పాటించకూడదు. ముందు నువ్వు అక్షరాలూ, గుణింతాలూ కాపీబుక్‍లో వ్రాయటం మొదలుపెట్టు”

“నాకు రాదని చెప్తుండాగా. నేనిట్టాగే రాత్తాను” అని చెప్పి మరలా కూర్చున్నాడు. ఉమాపతితో మాట్లాడటంతోనే చాలా సమయం గడిచింది. “నువ్వు లంచవర్‍లో నాకు కనిపించు” అని మిగతా పనిలో పడింది.

***

సాయంకాలం స్కూల్‍ నుండి ఇంటికొచ్చింది. అత్తగారు “బాబూ! బాబూ!” అని కొంచెం పెద్దగానే పిలుస్తున్నారు. బాబు తమింట్లో పెంపుడు కుక్కయిన టఫీని బెల్ట్ తీసుకుని కొడుతున్నాడు.

“వద్దొద్దు బాబు అలా కొట్టొద్దు” అంటూ కొడుకు చేతిలో బెల్ట్ లాక్కున్నది.

“నేనెంత చెప్పినా వినకుండా పాపం దాన్ని చంపుకు తింటున్నాడు” అంది అత్తగారు.

“దీన్ని ఇంకా బాగా కొట్టాలి. పెడిగ్రీ అంతా బొక్కేసింది. టీ.వి ముందు ఎన్నోసార్లు కూరోబెట్టాను. కార్టూన్ ప్రోగ్రామ్‌లో ‘సోఫీ’ అనే కుక్కపిల్ల రెండు కాళ్ళ మీద నడవటం ఎన్నిసార్లో చూపించాను. అలా నువ్వూ నడమని చెప్తున్నాను. వూరికే చూస్తుంది తోకూపుకుంటూ, నాలిక ఆడించుకుంటూ తిరుగుతుంది. కాని నేను చెప్పిన పని మాత్రం ఒక్కసారి కూడా చేయలేదు. అందుకే కోపం వచ్చి కొడుతున్నాను” అన్నాడు ముఖాన్ని ఎర్రగా చేసుకుని.

“మన టఫీకి అలా నడవడం ఎలా వస్తుంది చెప్పు. నువ్వైతే ఒక్క కాలుతోనే, నడవగలవా? అదీ అంతే. పాపం దెబ్బలు తిని ఊరుకున్నది అది తిరిగి నిన్ను కరిస్తే ఏం చేసేవాడివి?”

“కరవమను చూద్దాం. విసిరి రోడ్డుమీద పడేస్తాను” అంటూ అక్కడ్నుంచి వెళ్ళాడు. ఇల్లంతా చిందరవందరగా వున్నది. అన్నీ లాగిపడేసినట్లున్నాడు. దేనికోసమో రాక్‍లోని డబ్బాలన్నీ కదిలించాడు. కొన్ని కిందపడ్డాయి. “ఏయ్‍ బాబూ! రాక్‍ అంతా ఎందుకు కుదిపేశావు? స్నాక్స్ నాన్నమ్మ నడిగి తీసుకోవచ్చుగా? ఇల్లంతా నానా ఖంగాళీ చేసి పెట్టావు” అంది కోపంగా.

“స్నాక్స్ కోసం ఏం కాదు. టఫీ ఏమో చెప్పిన మాట వినలేదు. నానమ్మ పాలు తాగమంది. నాకు నచ్చలేదు. షాంపు సీసా, సర్ఫ్ డబ్బా తీసుకుని, ఆ రెండూ కొంచెం, కొంచెం కలిపి గిలకొట్టాను. బాగా నురగొచ్చింది. ఆ నురగలో పసుపేస్తే థిక్ ఆరెంజ్ కలర్‍లోకి వచ్చింది. మొన్నొకసారి అలాగే చేశాను. ఈరోజూ అలాగే కలిపి రంగు బుడగలొస్తే వాటిని ఊదుకుందామని వెతికాను. పసుపు నువ్వెక్కడ పెట్టావో నాకు కనబడలేదు. నానమ్మ నాకు తెలియదన్నది. నేను ఏం చేసినా తప్పే. టఫీని కొడితే తప్పు. ఇంక నేనేం చెయ్యాలి” అంటూ ఏడ్చేశాడు.

“కొంచెంసేపు టి.వీ చూడొచ్చు. మరికొంచెం సేపు ఫోనులో ఆడుకోవచ్చు. పక్కింటి పిల్లల్తో ఆడుకోవచ్చు. కాని అదేపనిగా ఏ పనీ చేయకూడదు. సరే కొంచెంసేపు ఆడుకునిరా. ఆ తర్వాత హోంవర్క్ చేసుకుందాం”

“నా ఫ్రెండ్ ఊరెళ్ళాడు. ఇంకెవరితో ఆడుకోవాలి?”

“హోంవర్క్ మొదలుపెట్టు. ఇవి సర్దేసి నేనూ నీ దగ్గరకొస్తాను. “

“ఎప్పుడూ ఇదొకటి మాత్రం చెప్తావు. నేను చెయ్యనే చెయ్యను” అంటూ టి.వీ రిమోట్ చేతిలోకి తీసుకుని తనక్కావలసిన ఛానల్స్‌ను మార్చుకుంటూ టి.వీలో కార్టూన్ ప్రోగ్రామ్ చూట్టంలో లీనమయ్యాడు. మధ్యమధ్యలో పెద్దగా నవ్వుకుంటున్నాడు.

‘ఇక ఆ టీ.వీ చూడటం ఆపడు. తను వెళ్ళి ఆపేస్తే పెద్దగా ఏడుస్తూ నానా రభసా చేస్తాడు. రోజురోజుకూ మరీ మొండివాడుగా తయారవుతున్నాడు. ఈ మధ్య టఫీని కొట్టడం కూడా ఎక్కువ చేస్తున్నాడు. పాపం అది దెబ్బలు తిన్న కాసేపు ఒకమూలన ముడుచుకుని పడుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ వీడి వెనకాలే తిరుగుతుంది’ అని లక్ష్మీకుమారి అనుకుంటుండగానే నాలుగిళ్ళ అవతల వుండే ఆటోడ్రైవర్ భార్య తన కూతుర్ని కూడా తీసుకుని లోపలికొచ్చింది. బాబుతో పాటు తన పిల్లలకూ కాస్త చదువు చెప్పమని అడుగుతుంది.

ఆ అమ్మాయి వయసు పన్నెండేళ్ళు వుంటుంది.

“అక్కడున్న పీట మీదెక్కి తాడుమీద ఆరేసిన బట్టల్ని లోపలకు తీసుకురా. కాస్త టీచరుగారికి పనిలో సాయం చేద్దాం” అన్నది.

“నేన్నీకు ఇంటికాడే సెప్పాను. నేనీ పని చెయ్యను. చదువుకోను. నువ్వే తిట్టి తిట్టి లాక్కొచ్చావు. నాకేం తెలవదు పో” అంటూ ఆ అమ్మాయి టీ.వీ ముందు కూలబడింది.

“బాబ్బాబు కాసేపు ఆ టి.వీ కట్టెయ్యవా? అది లేకపోతే నా కూతురు కాస్త మాటన్నా వింటది” అంటూ బాబును బతిమాలుకున్నది.

“మా అమ్మకు తోడు, నువ్వూ తయారయ్యావా? నేను ఈ ప్రోగ్రామ్ చూడాలి” అంటూ రిమోట్ దాచుకున్నాడు.

బాబునేమీ అనలేక ఆవిడ తన కూతుర్ని “రావే పిల్లా” అంటూ పిలిచింది. ఆ పిల్ల రాలేదు. ఆ పిల్ల దగ్గరకొచ్చి వంగబెట్టి కొడుతూ “జరమొచ్చి నాకు బాగాలేదని గదా నీతో చెప్పింది. బొత్తిగా మాట ఆలకిచ్చుకోలేవు. మీ నాన్న అట్లా కాల్చుకు తింటుండె. నువ్విట్లా నా పాణాలు తోడేత్తున్నావు కదే” అంటూ తన సొద వెళ్ళబోయసాగింది.

“నన్నేం అనబాకు. నేను పని సెయ్యనన్నాక సెయ్యను. చదవనంటే చదవను. టి.వి కూడా సూడను” అంటూ హాల్లో గచ్చుమీద బడి దొర్లింది. అలా దొర్లుతూ వచ్చి గోడ దగ్గరకు రాగానే రెండు కాళ్ళు గోడకు తన్నిపెట్టి కాళ్ళతో తపతపా తన్నసాగింది. ఆ అమ్మాయి కాళ్లకున్న మురికంతా గోడమీద నల్లగా అయింది. అటూ, ఇటూ తల తిప్పుతూ గచ్చుకేసి రుద్దింది. అక్కడంతా గచ్చుమీద తలచమురూ, ఒంటి చెమటా కలిపి మరకలు పడ్డాయి. లక్ష్మీకుమారి హాల్లోకి వచ్చేసరికి ఆమె తన కూతుర్ని పైకి లేవదీయటానికి తంటాలు పడుతున్నది. ఆ పిల్ల కాళ్ళతో వాళ్లమ్మని తన్ని పారేస్తున్నది. పెద్దగా అరుస్తున్నది. ఆ అరుపులకు చాలా చికాకనిపించింది. బాబు తన రెండు చెవుల్ని చేత్తో మూసుకున్నాడు. మురికి అయిన గోడను, కింద గచ్చునూ చూడగానే లక్ష్మీకుమారికి పట్టరాని కోపం వచ్చింది. అతికష్టం మీద తమాయించుకుంటూ “లే అమ్మాయ్! లే. నువ్వు ముందు లేచి కాళ్ళు శుభ్రంగా కడుక్కురా. మట్టికాళ్ళతో ఇల్లంతా తిరక్కు” అన్నది గట్టిగా.

రెండుసార్లు చెప్పిన తరువాత లేచి హాల్లో బాబు పడేసిన గులాబిరంగు స్కెచ్ పెన్ తీసుకుని వేగంగా బయటికెళ్ళింది. బయటి గోడమీద నాలుగు గులాబి రంగు గీతల్ని సత్తువ కొద్దీ గీసింది. లక్ష్మీకుమారి పరుగెత్తుకొచ్చి ఆ స్కెచ్ పెన్ లాక్కుంది.

“తనంత మొండికేస్తుంటే ఎందుకు తీసుకొచ్చావు? ఇవాల్టికి ఆగాల్సింది. ఇప్పుడు చూడూ అన్నీ డబల్ డబల్ పనులయ్యాయి. బంగారంలాంటి గోడలు పాడుచేసింది” అంటూ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ “ముందు కాఫీ పెడతాను. జ్వరానికి మందుబిళ్ళ ఇస్తాను అదేసుకుని కాఫీ తాగు. ఏయ్ అమ్మాయ్! నువ్వూ కాఫీ తాగు” అంటూ ఇద్దరికీ కాఫీ కలిపి ఇచ్చింది.

తన స్కెచ్ తీసుకెళ్ళి అలా గీసినందుకు బాబుకు చాలా కోపం వచ్చింది. టఫీని కొట్టినట్లుగా బెల్ట్ తీసుకుని కొడదామని లేచాడు. వాళ్లమ్మ బాబు చేతిలోని బెల్ట్ తీసుకుంటూ “నువ్వెళ్ళి నీ పని చూసుకో నేను చూసుకుంటానులే” అన్నది.

ఆమె కాఫీ తాగుతూ “మీరు నా సంగతి పట్టించుకుంటారనేనమ్మా ఇలా వచ్చాను. ఇంట్లో మందుబిళ్ళ తెచ్చిచ్చే నాధుడు లేడు. ఈళ్ళ నాన్నకు అసలేం పట్టదు. రోజూ పుల్లుగా తాగేసొచ్చి ఇంట్లో తిరనాలేనమ్మా. పిల్లలిద్దరూ రణపెంకెగా తయారయ్యారు. వాడు దెబ్బేత్తే ఆగుతాడు. ఈ పిల్లగుంట అన్నింటికీ ఎదురుతిరుగుద్ది. పైపెచ్చు నన్నే కొట్టాలని చూసుద్ది. దాన్ని కొట్టీ కొట్టీ నా చేతులు సచ్చుబడిపోతున్నాయి. ఇదిమాత్రం దారికే రాదు. అటు బడికీ పోదు, ఇటు పనీ అంటుకోదు. నిన్నటేలనుంచి అంత ఇబ్బందిపడతాన్నా నా గోస ఎవరికీ పట్టలేదు. బడీ నుంచి వచ్చి వుంటారని ఇలా వచ్చాను” అన్నది.

కాఫీ కప్పు దూరంగా నెట్టేసి కూర్చున్న ఆ పిల్లవంక చూస్తూ “నాల్గు బిస్కట్లు ఇస్తాను. కాఫీలో ముంచుకుని తిను, బావుంటుంది” అంటే సరేనని తలూపింది. ఆ తర్వాత ఆ పిల్ల కాస్త శాంతపడింది. అప్పటిదాకా బెరుగ్గా చూసిన పిల్ల లేచి నిలబడి కాఫీకప్పు తీసుకెళ్ళి కడిగిపెట్టింది.

“చూడమ్మాయ్! శుభ్రంగా ఉన్న గోడలను మురికి చేశావు. చూట్టానికి అసహ్యంగా వుంది కదూ! అవునా?”

“అవును” అని తలదించుకుని తప్పు చేశానన్నట్లుగా తల అటూ ఇటూ ఊపసాగింది.

“ఈ మట్టి మరకలను సబ్బు నీళ్ళతో శుభ్రం చేద్దాం. బయటి గోడమీది స్కెచ్ పెన్, గీతలకు టిన్నర్ ఆయిల్‍తో రుద్ది చూద్దాం”

చెప్పింది వింటూ ఒడుపుగా మరకలను రుద్దింది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి హాలంతా చీపురుతో చిమ్మింది. నీళ్ళలో కొద్దిగా డెటాల్, మరికొంచెం సర్ఫ్ కలిపి జాగ్రత్తగా హాలంతా తడిబట్ట పెట్టింది. తన తలమురికి అంటిన చోట మరింత శుభ్రంగా రుద్దింది. సాయం చెయ్యటానికన్నట్లు తల్లితో పాటు బట్ట తెచ్చి మడతలు పెట్టింది “మొక్కలకు నీళ్లు పొయ్యమంటారా?” అనడిగింది.

ఇందాక ప్రవర్తించిన తీరుకు, ఇప్పుడా పిల్ల మాట్లాడే తీరుకూ అసలు పొంతనే లేదు.

“నువ్వు మంచి అమ్మాయివి. బాగా తెలివిగలదానివి. పని కూడా శుభ్రంగా చేస్తున్నావు. ఇంట్లో కూడా మీ అమ్మకు సాయంగా ఉండు. నీలాంటి తెలివిగల పిల్లలకు చదువు కూడా బాగా వస్తుంది. చక్కగా బడికెళ్ళి చదువుకో”

ఏం మాట్లాడకుండా వింటూ నించున్నది. ఇంతలో బాబు పుస్తకాల బ్యాగును బోర్లించి, దేనికోసమో వెదికాడు. తనక్కావలసింది తీసుకుని ఆ పుస్తకాలన్నింటిని అలాగే వదిలేశాడు. ఆ అమ్మాయి అవన్నీ నీట్‍గా బ్యాగులో సర్దిపెట్టింది.

“సర్దటం అయిపోయె. ఇప్పుడు హాలు శుభ్రంగా వుంది. రేపు పుస్తకాలు తెచ్చుకుని చదువుతాను” అంటూ వాళ్ళమ్మతో కలిసి వెళ్ళిపోయింది.

***

వాళ్ళు వెళ్ళిన తరువాత లక్ష్మీకుమారి ఆ అమ్మాయి గురించి ఆలోచించసాగింది. ఎంత మొండిది? కొట్టకుండా, తిట్టకుండా ఓర్పుగా చెప్పేసరికి కాస్త దారిలోకి వచ్చింది. ఉమాపతి కూడా ఈ బాపతు పిల్లాడే. వాడికి చదువు రావాలన్నా, కుదురుగా అతను స్కూలుకు రావాలన్నా ఉపాధ్యాయులు రెట్టింపు సహనంతో ప్రవర్తించగలగాలి. అంతమంది పిల్లలను మానేజ్ చేసుకుంటూ, ఓర్పును కూడగట్టుకుంటూ, చదువు నేర్పడం కాస్త కష్టసాధ్యమే. ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి అనుకుంటుండగానే ఏదో భళ్ళున పడిన శబ్దం వినిపించింది. పరిగెత్తుకుంటూ మళ్ళ హాల్లోకి వచ్చింది. టి.వీ గట్టుపై నుంచిన చిన్న ఆక్వేరియం కింద పడీపోయి వున్నది. నీళ్ళు హాల్లో గచ్చుమీద పాకి వస్తున్నాయి. ఆ నీళ్ళల్లో ఉన్న చిన్న చిన్న రంగుల చేపపిల్లలు ఎగిరెగిరి పడుతున్నాయి.

బాబుగాడిని రెండు బాదాలా? ముందు ఆ చేపపిల్లల్ని వేరే దాంట్లో ఉంచాలా? అన్న ఆలోచన బాగా కోపం వచ్చింది. స్కూల్ నుంచి వచ్చాక ఇంతవరకు మంచినీళ్ళు కూడా తాగలేదు. ప్రొద్దుట్నుంచీ క్లాసుల్లో నిలబడి పాఠాలు చెప్పి అలసటగా ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇందాకట్నుంచి ఇదే పరిస్థితి అనుకుంటూ ఉసూరుమన్నది. తలెత్తి బాబువంక కోపంగా చూసింది. తనదేం తప్పులేదన్నట్లు చూస్తూ నిలబడ్డాడు.

“ఒక చేపపిల్లను బయటకు తీద్దామని కాస్త వంచాను. నువ్వే ఆ అక్వేరియంను బాగా చివరగా ఉంచావు. చెయ్యి తగిలి అది పడిపోయింది. నేనేం చేసేది!” అన్నాడు.

“నోర్ముయ్!” అంటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి లోపలికెళ్ళి మంచినీళ్ళు తీసుకుని తాగింది. ఆ తర్వాత అనాలోచితంగానే బాబుగాడి చాక్లెట్ కనపడితే తీసుకుని నోట్లో వేసుకున్నది. దాన్ని చప్పరిస్తూనే మరేదైన గాజుగిన్నె దొరుకుతుందేమోనని వెతకసాగింది. ఒక వెడల్పాటి గాజు బౌల్ కనపడగానే కడిగి నీళ్ళు పట్టి ఎగిరెగిరి పడే చేపపిల్లల్ని ఎత్తి ఆ నీళ్ళల్లో వేసి దాన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అత్తగారు ఇటువస్తే కాలుజారి పడుతుందని భయపడి వెంటనే ఒక మందపాటి పాత టవల్ తెచ్చి ఆ నీళ్ళను పీల్పించింది. ఒకలాంటి నీచువాసన ఇల్లంతా వస్తున్నది. మరింత డెట్టాల్ కలిపిన నీళ్ళలో బట్టను ముంచి హాలంతా తుడిచింది. బాబు ఏమెరుగని వాడిలా వెళ్ళి ఫ్యాన్ వేసుకుని సోఫాలో కూర్చున్నాడు. కాసేపు ఏం మాట్లాడకుండా ఉన్నది. బాగా నీరసంగా అనిపించి ఒక కప్పు కాఫీ కలుపుకుని తాగుతూ కూర్చున్నది. రాత్రి వంట కోసం బియ్యం నానపెట్టింది. భర్త ఇంక ఇంటికి రాలేదు. తనకు తప్పదు కదా అనుకుని వంట ఇంట్లో పనులు చూసుకోసాగింది.

“అమ్మా! హోంవర్క్ అంతా చేశాను. కరెక్టేమో చూడు” అంటూ వచ్చాడు బాబు.

పుస్తకం తీసుకుని చూస్తే అంత తప్పుల్లేకుండానే చేశాడు. “వెరీగుడ్. బాగా చేశావు. సరేకాని బాబూ! టి.వీ చూట్టంతో పాటు ఇంకా నీకు ఏమేం ఇష్టం?”

“బొమ్మలు గీయటం, వాటికి రంగులు వేయటం, ఇంకా కార్టూన్ ప్రోగ్రామ్స్‌లో సోనూ అనే అబ్బాయి వాయిస్తాడే గిటార్ నాకది బాగా నచ్చింది. నేను కూడా అది నేర్చుకుంటాను. కొని పెడతావా?”

“నిజంగా గిటార్ నేర్చుకుంటావా? ఒకటి రెండు రోజులు నేర్చుకుని దాన్ని మూలన పడేస్తే వుపయోగమేమీ ఉండదు. ఎంతో కష్టం మీద వేలరూపాయలు పెట్టి కొనాలి. పైగా నీకు ఏమీ రాదు కూడాను. ఖచ్చితంగా నేర్చుకుంటానంటే నాన్నగారిని కొని తీసుకురమ్మంటాను”

“నిజ్జంగానే నేర్చుకుంటాను. మరి ఎవరు నేర్పిస్తారు?”

“కనుక్కుందాం. చీకటిపడుతుంది స్నానం చెయ్యి.”

***

“క్వార్టర్లీ పరీక్షలొస్తున్నాయి. మీ అందరికీ సిలబసులయ్యాయా? ఎవరికైనా పూర్తికాకపోతే ఆదివారం క్లాసులు పెట్టి పూర్తి చేయండి” అన్నారు హెడ్‍మాస్టారుగారు తనముందు కూర్చున్న స్టాఫ్‍తో.

“మేం ఏదో ఒక విధంగా పూర్తి చేస్తాం మాస్టారు. కాని కొత్తగా ఎయిత్‍లో చేరిన కొంతమందితో బాగా ప్రాబ్లమ్‍గా వుందండి. క్లాసులకు సరిగ్గా రారు. వచ్చినా పాఠాలు వినరు. వాళ్ళలో ఎవరికీ పొట్టపొడిస్తే అక్షరం ముక్క రాదు. పశువుల్ని కాచుకునే మందంతా వచ్చి స్కూల్లో చేరారండీ లెక్కలు చెయ్యకపోగా నన్ను పిలకతాతా, గోచీపాతా అంటూ పాటలు పాడుతున్నాడొకడు” అంటూ కోపంగా తన భుజంమీది కండువాను సర్దుకున్నారు లెక్కలమాస్టారు.

ఆయన పంచెకట్టుతో నెరిసిన తెల్లజుట్టును నిలువుపాపిడి తీసుకుని, నుదిటిన బొట్టుతో, సంప్రదాయబద్ధంగా వుంటారు. ఇప్పుడాయనన్న మాటలు మిగతావారికి నవ్వొచ్చినా ఆపుకున్నారు.

“కొంతమంది చదువుమానేసి పనిపాటల్లో పడిపోయారు. అలాంటి వాళ్ళు మళ్ళీ చదువుకోవాలని స్కూల్లో చేరారు. ఇక్కడీ వాతావరణానికి అలవాటుపడటానికి టైం పడుతుంది. మనమంతా కష్టపడి అలాంటి వాళ్ళకు చదువు నేర్పాల్సిందే. లక్ష్మీకుమారిగారూ! మీ హిందీలో ఎలా వున్నారు?” అన్నారు హెచ్. ఎమ్.

“హిందీ పదాలను తెలుగులో వ్రాస్తున్నారు. అదేమంటే ఫోన్లులో మెసేజులు పంపుకునేవాళ్ళు తెలుగు పదాలను ఇంగ్లీషు అక్షరాల్లో రాస్తున్నారు గదా? మేమూ అట్లాగే హిందీని, తెలుగులో వ్రాస్తామంటున్నారు.”

“దాన్ని ‘టింగ్లీష్’ అంటే దీన్ని ‘టిందీ’ అనలేమో” అన్నారు తెలుగు మాష్టారు. ఆ మాటతో అందరూ నవ్వేశారు.

“సరే అందరూ ఎవరి ప్రయత్నం వాళ్ళు చెయ్యండి. వాళ్లకక్షరం ముక్క వచ్చేటట్లు చెయ్యాలిగా” అంటూ మరికొన్ని జాగ్రత్తలు చెప్పి పంపారు హెచ్.ఎమ్ గారు.

ఆ తర్వాత లక్ష్మీకుమారి ఎయిత్ ‘బి’కి వెళ్ళింది. మిగతావాళ్లతో పాటు ఉమాపతి కూడా క్లాసులోనే ఉన్నాడు కాని ధ్యాస ఎక్కడో వున్నది.

“ఉమాపతీ! ఒకసారి నీ నోట్‍బుక్ తీసుకునిరా”

అతను తెచ్చి చూపగానే పేజీలు తిరగేసి చూసింది. మొదటి పేజీలో తను వ్రాసిచ్చిన వర్ణమాల వున్నది. ఆ తర్వాత వేరే ఎవరో వ్రాసిచ్చిన పదాలు, ప్రశ్నలు, జవాబులు ఉన్నాయి. హిందీ పదం పక్కన ఆ పదం తెలుగులో వ్రాసుకున్నాడు. ఆ తర్వాతి పేజీలలో అంతా తెలుగు అక్షరాలలోనే వ్రాసి ఉన్నది.

“ఇప్పటికైనా నువ్వు హిందీ అక్షరాలు, గుణింతాలు నేర్చుకోవాలి. ఇలా తెలుగులో వ్రాసి నేర్చుకుని, అదే వ్రాస్తుంటే జీవితంలో నీకు హిందీ రాదు. ఏ పనైనా మొదట్లో కొంచెం కష్టంగానే వుంటుంది. ఇదీ అంతే. ఆ తర్వాత నీకే తేలిగ్గా అనిపిస్తుంది. ఏ సబ్జెక్టయినా నీకర్థం అయ్యేవరకు అడిగి చెప్పించుకో. అందరం చెప్తాం. అదేం లేకుండా స్కూల్లో పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నష్టపోతావ్. కష్టపడి చదవడం అలవాటు చేసుకో”

“ఎట్టాగండీ చదవటం? నేనెప్పుడో మూడేళ్ళ కిందట ఏడో తరగతి చదివి బడి మానేశాను. ఎవసాయం పనులక్కానీ, మార్కెట్‍లో పనులక్కానీ ఎడుతున్నాను. మల్లీ ఈ ఏడు మా నాన్నా, అన్న కలిసి ఎలిమెంటరీ బళ్ళోకెళ్ళి నా టీ.సీ తెచ్చారు. నన్ను తీసుకొచ్చి ఈడ పడేశారు. మల్లా ఇప్పుడూ సదువూ… సదువూ అంటే నేనేం సదివేది? సదివినా నాకేం అరదం కావట్లేదు. నాకేకాదు. నాసావాసగాళ్ళు మరో ఇద్దరు కూడా ఇట్టాగే అగోరిత్తన్నారు. ఈ లెక్కలూ, ఈ ఇందీ, ఇంగ్లీసు ఇయన్నీ నాకేం రావటం లేదు. బడి మానేత్తాను. మా అమ్మవాళ్ళక్కూడా చెప్పేత్తాను” అన్నాడు ఆక్రోశంగా.

ఉమాపతి మాటలు లక్ష్మీకుమారిని ఆలోచన్లోకి నెట్టివేశాయి. వెంటనే వాటిల్లోనుంచి బయటపడుతూ “మరేం ఫర్వాలేదు ఉమాపతీ! మీకందరకూ వయసేం మీరిపోలేదు. కాస్త కష్టపడితే మీకందరకూ చదువొస్తుంది. చదువుకుని పైకొచ్చి మీరు ఏ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారో ఎవరికి తెలుసు? మీ అమ్మా నాన్న మీకు మంచి చేయాలనే మళ్ళీ స్కూల్లో చేర్పించారు. మిగతా పిల్లల్తో పాటే మీరూ చదువుకోవటానికి ప్రయత్నం చేయండి. ఓడిపోయి స్కూల్ వదిలిపెట్టొద్దు”

“వదిలిపెట్టక ఏం చెత్తామండీ! గవర్నమెంటు బళ్ళో సదువుకునే వాళ్లందరకూ, ఓ ఉజ్జోగాలు వచ్చేత్తన్నాయని ఆశపుట్టి, మమ్మల్నీడకు తీసుకొచ్చి పడేశారు. ఆ డబ్బులు మేం సాకిరీ చేసుకుంటే రావా? ఇంట్లో ఇవ్వమా” అన్నాడు కోపంగా.

“ఆ మాట కోసమనే కాదు ఉమాపతీ! విద్యలేనివాడు వింతపశువంటారు. ఎవరి జీవితానికైనా చదువనేది చాలా ముఖ్యం. అదిలేందే మీరే పనిలోనూ రాణించలేరు. ఇంకోమాట చెప్పనా? చదువులేని వాళ్ళను పెళ్ళి చేసుకోవటానికి ఏ ఆడపిల్లా ఒప్పుకోవటం లేదు. మగపిల్లలకనే కాదు. ఆడపిల్లలకూ చదువు చాలా అవసరం. అనవసరమైన ఆలోచనల్ని వదిలేసి చదువుమీదే దృష్టిపెట్టాలి కూర్చో.”

అతనింకేం మాట్లాడకుండా కూర్చుని చేతిలో వున్న పుస్తకాల వంక చూడసాగాడు.

***

ఉమాపతి అన్నయ్య బి.ఇడి పూర్తి చేశాడు. ఈ మధ్యే పెట్టిన డియస్సీలో వ్రాత పరీక్ష పాసయ్యాడు. సర్టిఫికెట్ల పరిశీలనకూ వెళ్ళివచ్చారు.

“అమ్మా! నాకింక ఉద్యోగం వస్తుంది. ఎంతదూరమైనా వెళ్ళి చేస్తాను.”

“అట్టగే నాయనా! అట్టాగే. ఏదో ఆ దేముడు సల్లగా సూడబట్టి గవర్నమెంటు పంతులుగా అవుతున్నావు. నీ తమ్ముడు ఉమాపతిదే దిగులంతా. వాడెట్టా బతుకుతాడో ఏమో? ఆ యిచారంతోనే కుంగిపోతన్నాను”

“ఎవసాయం కోసం సేసిన అప్పులు తడిసిమోపెడయ్యాయి. తీర్చేదారి అవపట్టం లేదు. నా మొకం అప్పులిచ్చినోల్లకు ఎట్టా సూపించాలి? ఈ దాసతోనే రాత్రిళ్ళు కంటిమీదకు కునుకురావటం లేదు. ఏ పురుగులమందైనా తాగిసత్తే, మీ అందరిగతి ఏమైపోద్దా అని బయపడి సత్తన్నాను. నువ్వు సేతికందొచ్చావు. నాకిప్పుడెంతో ధైర్యంగా వున్నది. ఏనుగెక్కినంత సత్తావొస్తందిరా పెద్దోడా. చిన్నొడిదే, ఎటూకాకుండా వున్నది”

“భయపడకు నాన్నా. వ్యవసాయంతో పాటు నా చదువుకూ ఖర్చుపెట్టావుగా. నిదనంగా కొంత కొంతగా అప్పులు తీర్చేద్దాం. అమ్మ మనందరి కోసం ఎంత చాకిరి చేస్తున్నది. అమ్మకోసం నాలుగు బంగారు గాజులు చేయించి ఇవ్వాలని నాకెప్పటినుండో కోరిక”

“మానాయనే అంతమాటన్నావు అదే సాలు. బంగారమంటూ ఉంటే రాబోయే కోడలికి పెట్టతానికుంటుంది. నాదేముంది ఎలా వున్నా గడిసిపోతుంది. మీరు బాగుంటే నేనూ బాగున్నట్టే. ఎవరికి చేత్తున్నానునా మొగుడికే, పిల్లలకేగా నేను చాకిరీ చేసిపెట్టేది” అంటూ మధ్యకు చినిగిన చీరను సూదీ దారం తీసుకుని కుట్టుకోసాగింది.

ఆ మాటలన్నీ వింటూ తండ్రి కండువాతో కళ్ళొత్తుకుంటూ “మీ అమ్మ కడుపునిండా తినే రోజులు తక్కువేరా. ఎప్పుడూ ఇంట్లోనూ పొలంపోనూ, పశువుల దగ్గరా, పనిచేస్తూనే వుంటుంది. విచ్చినపత్తి పూవులాగా కళకళలాడే మడిసి వడిలి నల్లబడిన పొగాకు లాగా ముడుసుకుపోయింది” అన్నాడు.

ఈ మాటలన్నీ ఉమాపతి నిశ్శబ్దంగా వినసాగాడు. ఎప్పుడూ నీరుకావి బట్టల్తో, బక్కచిక్కి వున్నాడే నాన్న, నీరసంతో, సోలిపోయే అమ్మ, ఇద్దరూ మార్చి మార్చి ఉమాపతి కళ్ళముందు కదలాడసాగారు. అన్నయ్యలాగే తానూ తన తల్లిదండ్రులకు ఏదైనా భరోసా కల్పించాలని ఆలోచించాడు కాని ఎలా? అమ్మకు తను ఏదైనా బంగారు వస్తువు చేయించగలిగితే బాగుండును. ముందు కడుపునిండా తినేటట్లు చేయగలగాలి. అట్లా చేస్తే అమ్మ కూడా స్కూల్లోని హిందీ పంతులమ్మ గారిలా దర్జాగా వుంటుంది. తమకు స్వంతభూమి లేదు. కౌలు వ్యవసాయం గిట్టుబాటే కావటం లేదు. అందుకే అమ్మ నాన్న తన్ను చదువుకోమని పోరతన్నారు. తనేమో చదువంటే భయపడి చత్తున్నాడు. కష్టపడి చదివితే చదువొస్తుందని పంతులమ్మగారు చెప్తున్నారు. తను కష్టపడగలడా? పడాలి. కష్టపడి చదివి పాసవ్వాలి. ఉజ్జోగం సంపాయిచ్చాలి. అమ్మనూ, నాన్ననూ సుఖపెట్టాలి. ఈ ఆలోచనల్లోనే తెల్లవారింది. మర్నాడు స్కూలుకు రోజులాగే అయిష్టంగా, కాకుండా, బాగా యిష్టంగా వెళ్ళాడు. అటు ఎక్కాలూ, ఇటు హిందీ అక్షరాలూ, దీక్షగా దిద్దసాగాడు. లక్ష్మీకుమారి గారి సలహాలతో ఇప్పుడు ఉమాపతి బాగా శ్రద్ధ ఉన్న విద్యార్థి అయ్యాడు.

ఆ రోజు ఆదివారం ఆటోడ్రైవరు కూతురు వాళ్ళమ్మతో పాటు వచ్చింది.

“ఏం చలాకీ రాణీ! బాగా చదువుతున్నావా? తెలివిగలపిల్లవి. బాగా చదువుకుని నాకన్నా పెద్ద ఉద్యోగం చెయ్యాలి” అంటే ముసిముసిగా నవ్వుకున్నది.

“నా కూతురు ఈడకొచ్చి మీ మాటలు విని బాగా మారిపోయిందమ్మా. బళ్ళోకి పోతుంది. మీరసలు కోపం లేకుండా సక్కగా ధైర్యం సెపుతారని ఓ మురుసుకుంటది. మీ దగ్గరకు రావాలని తెగ ఉబలాటపడుద్ది” అని చెప్పింది.

బాబు ఇప్పుడు బొమ్మలు గీసి రంగులు కూడా వేస్తున్నాడు. దగ్గరలో వున్న సంగీత శిక్షణాలయానికెళ్ళి గిటార్ నేర్చుకుంటున్నాడు. ఇంటికెవరొచ్చినా, సా…రీ…గ…మా…ప….ద…ని…సా… గిటార్‍ని వాయించి చూపిస్తున్నాడు. టఫీకి దెబ్బలేం లేవు. ఇంట్లో వస్తువులు ఏం పగలడం లేదు.

ఉమాపతిగాని, ఆటోడ్రైవరు కూతురుగాని, బాబుగాని తను తల్లిలా లాలిస్తూ ప్రేమగా చెప్పేటప్పటికీ ముగ్గురూ తమని తాము మార్చుకున్నారు. ఒకవిధంగా తన ఒడిలోకి తీసుకున్నట్లుగా తీసుకుని బుజ్జగించింది. అదే ‘అమ్మఒడి’ కున్న గొప్పతనం అనుకున్నది. శిక్షించి, దండించి, సాధించలేనిది, ప్రేమతో సాధించవచ్చని బాగా అర్థమైంది. ఇక ముందుకూడా ఎంతోమంది విద్యార్థుల్ని ఇలాగే తీర్చిదిద్దాలనుకున్నది.

Exit mobile version