Site icon Sanchika

అమ్మ

[dropcap]అ[/dropcap]మ్మకి అస్సలు లెఖ్ఖలు రావు
ఒక ముద్ద పెట్టమంటే పది ముద్దలు పెడుతుంది..

అమ్మ, నేనంటూ లేని నన్ను తెచ్చుకుని
తొమ్మిది నెలలు కడుపులో దాచుకుని
ప్రాణాన్ని, రూపాన్ని , పేగు తెంపి జన్మనీ ఇచ్చింది
ప్చ్.. అమ్మకి ఇవ్వడమే తప్ప అడగడం రాదు..

అమ్మకి రేపటి గురించి ఆలోచనే లేదు
ఎంత ఆత్రమో తన సర్వం పిల్లలకి
పంచెయ్యాలని
పాపం అప్పుడు తెలియదుగా తనని పంచుకోడానికి
పిల్లలు పంచాయితీలు పెడతారని..

ఇల్లంతా వెతికాను
అమ్మ తన కష్టాలని కన్నీళ్ళనీ మాకు
తెలియకుండా ఎక్కడ దాచి ఉంటుందా అని
ఎక్కడా కనిపించ లేదు
బహుశ ఇక్కడొక్క చోట తెలివి తెచ్చుకుని
మళ్ళీ మనం దూరలేని కడుపులో దాచుకుని ఉంటుంది..

అందరూ అంటూ ఉంటారు
అమ్మల రోజు అమ్మల రోజు అని
అసలు ఎవరికీ తెలియటం లేదా
అమ్మ లేని రోజంటూ ఉండదని?

మనిషికి మరణం ఎక్కడినుంచైనా
ఎవరి ద్వారా అయినా ఎలాగైనా రావచ్చు
కానీ జన్మ మాత్రం ఒక చోట నుంచే వస్తుంది
అది అమ్మ మాత్రమే ఇస్తుంది..!

Exit mobile version