Site icon Sanchika

అమ్మ సంతకం

[dropcap]పె[/dropcap]రట్లో రేగుపండ్ల చెట్టుకింద
గోడకు ఓరగా
సింహాసనం మీద కూర్చున్న మహారాణిలా
గట్టుమీద కట్టెలపొయ్యి!
కోడికూయకముందే
అమ్మకాలిమువ్వల సవ్వడికి నిద్రలేచేది!

సింగులు దోపుకొని చేతిలో పట్టుకొచ్చే
అలుకుకుండను చూసి ఉలిక్కి పడి చూసేది
చంటి పిల్లలు స్నానానికి మొరాయించినట్లు
ముఖం ముడుచుకునేది
ఎర్రమన్ను పేడ కల్లు కలిపిన అలుకుకుండలో ముంచి
పిడుచతో అలికితే కొత్తపెండ్లికూతురులాగా
మెరిసేది
ముగ్గుబుట్టిలోని ముగ్గును మునివేళ్ళతో పట్టుకొని
అలవోకగా “బొట్ల”సంతకం చేసేది అమ్మ
నూనెసుక్క వేసిన పిడుకనుగ్గును
ఎక్కదీపానికి పెట్టి ముట్టించి పొయ్యిల వేసి
రెండు కట్టెలు దానిమీద పెడితే
సంద్యారవి లాగా మండేది
పొయ్యి మీద అన్నం
“కొడ”పొయ్యిమీద “అటికె”ల పప్పు
ఒకేసారి వండేది
పొగలు కక్కుతూ ఉడికిన
అన్నం పువ్వులను కంచంలపెట్టి
కుండలోని ఉడికేపప్పులో
మామిడికాయ తొక్కు నెయ్యివేసి కలిపి
ప్రేమగా గోరుముద్దలు పెట్టేది!
అమ్మ కొంగు పట్టుకుని
అస్తమానం తిరిగే నేను అలా నేర్చుకుందామని
ఎంత ప్రయత్నించినా నాకు అబ్బలేదు
అమ్మ అయ్యాక గానీ తెలియలేదు
ఆత్మీయమైన అమ్మప్రేమ సంతకాన్ని
ఫోర్జరీ చేస్తే రాదని!!

Exit mobile version