Site icon Sanchika

అమ్మ వంటల కమ్మదనం

[dropcap]ప్ర[/dropcap]తి వారికీ వాళ్ళమ్మ చేసే వంటలు అద్భుతంగా ఉంటాయి కానీ కొందరి వంటలు అందరికీ రుచికరంగా ఉంటాయి. మా అమ్మ చాలా బాగా చేస్తుంది వంట. పులుసులకు స్పెషల్ మా అమ్మ. అక్కలు, మా పెద్దమ్మలు కూడా చాలా బాగా వండుతారు. కాకరకాయ అంత కమ్మగా ఉంటుంది. చామ దుంపల పులుసు కూడా ఎంత రుచిగా వండుతుందో. అసలు ఏ పులుసు పెట్టినా అమ్మ స్పెషల్.

పులుసు మాట వచ్చింది కాబట్టి ఓ విషయం చెప్పాలి. మా కజిన్ మా ఊరి ప్రక్కనే ఉన్న వేటపాలెంలో ఉద్యోగం చేసేవాడు. అది మా నాయనమ్మ వాళ్ళ ఊరు. మా నాయనమ్మ దగ్గరే ఉండేవాడు. శనివారం సాయంత్రం కాలేజీ అయిపోయిందంటే చాలు చీరాల మా ఇంటికి వచ్చేవాడు. ఆదివారం నాడు అమ్మ పులుసు వుండాల్సిందే. మా అన్నయ్య పులుసు కోసమే వచ్చేవాడు గానీ ఆదివారం కాలేజీకి శలవు బోర్ కొడుతుంది అంటూ ఏదో కబుర్లు చెప్పేవాడు. అన్నయ్య, నేను తమ్ముడు కలిసి ఆదివారం పూర్తిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. పూర్వపు రోజుల్లో రాచ్చిప్పల్లో పులుసులు పెట్టేవాల్లంట. మా నాయనమ్మ దగ్గర రాచ్చిప్ప ఉంది. ఆమె అందులోనే పులుసు పెడుతుంది.

ఇంకా నారింజకాయ పచ్చడి చేయటం అమ్మ ప్రత్యేకత. అమ్మ గుంటూరు వెళ్లినపుడు మా పెద్దనాన్న వాళ్ళింట్లో చూసి నేర్చుకుందట. అమ్మ చిన్నప్పుడు టమోటాలు పండితే తినేవారు కాదట. పచ్చి టమోటాలు పచ్చడి చేసుకునేవారట. కానీ పండితే పారేసేవాళ్ళట. బహుశ మనం దొండకాయలు పండిపోతే పారబోసినట్లుగా కావచ్చు. పండు టమోటాలు కూరల్లో వేయడం కూడా అమ్మ గుంటూర్లోనే నేర్చుకుందట. ఆ విషయం గొప్పగా చెబుతుంది. గుంటూరంటే సిటీ అని అప్పట్లో అనుకునేవారు గుంటుర్లో మా పెదనాన్న చేసే కొత్త వంటలే కాదు కొత్త విషయాలేమైనా ఆమెకు గొప్పగానే ఉంటాయి మరి. ఆ పెదనాన్న బాగా చదువుకున్నారట.

ఇంతకీ నారింజకాయ పచ్చడి అడుగున కప్పడి పోయింది. నేను ఐదారేళ్ళ క్రితం యాపిల్ కాయ పచ్చడి నూరి అమ్మకు పెడితే ‘నీకూ వంటల్లో ప్రయోగాలు చేయడం వచ్చేస్తోంద’ని సంతోషపడింది. పండ్లు, ఫలాలతో చట్నీలు చేయడమంటే ఆషామాషీ కాదు గదా! నారింజకాయ పుల్లగా ఉంటుంది కదా. తొనలతో పచ్చడి చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా తిన్నదే లేదు. మా పెద్దమ్మల పిల్లలు, మా మామయ్యల పిల్లలు చెప్తారు ‘ఆ నారింజకాయ పచ్చడి’ గురించి. పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా అమ్మ చేసిందంటే నోరూరిస్తుంది. పొట్లకాయ కూరలేవైనా సరే బాగా వండుతుంది.

అమ్మకు ఇష్టమైన కూరగాయల్లో చిక్కుడుకాయ ప్రథమస్థానంలో నిలుస్తుంది. నేనెప్పుడు చిక్కుడుకాయ పాదులు పెట్టినా చప్పటి చిక్కుడుకాయలే కాస్తాయి. గత సంవత్సరం మాత్రం విత్తులతో నిండు గర్భిణిలా విరగకాశాయి. మా వేపచెట్టుకు అల్లుకొని మూడో అంతస్తు దాకా పాకి మరీ కాయలు వేసింది. ఆ కాయల్ని చూసే అమ్మ మురిసిపోయింది. రోజూ వండినా చిక్కుడుకాయ కూర అంటే ఇష్టమే అమ్మకు. ఇవి చివరి రోజులని ఆ చెట్టుకు తెలిసిందేమో, ఎక్కడి నుంచి వచ్చి మోలిచిందో ఆ చిక్కుడు చెట్టు అమ్మకు ఎంతో సంతోషం కలిగించింది.

పూర్ణాలు వండటమంటే చాలా శ్రమ పడాలి. అందుకని పండుగ వస్తే గారెలు చేసి సరి పెట్టేస్తాను నేను. అమ్మ మాత్రం ఒంట్లో ఓపిక లేకపోయినా పండక్కి పూర్ణాలు కచ్చితంగా వండాల్సిందే. ఒకోసారి నూనెలో వేయగానే అవి విచ్చుకుపోతాయి. నాకు చాలా చిరాకు వస్తుంది. “ఎందుకమ్మా అంత కష్టపడతావు” అంటే “ఇందులో కష్టం ఏముందీ, వండితే నలుగురూ తింటారు కదా” అంటుంది నవ్వేస్తూ. పూర్ణాలు పిండిని ఉండలు చేస్తూనే “రాణి ఇలా రా కొద్దిగా బెల్లం సరిపోయిందో లేదో చూసి చెప్పు” అంటూ పిండి ముద్ద నోట్లో పెడుతుంది. చిన్నప్పుడు ఈ పిండిని చాలా ఇష్టంగా తినేదాన్నట. అందుకే ఇలా దేవుడికన్నా ముందే నాకు పెడుతుంది.

అమ్మ చేసే వంటల్లో బొంబాయి చట్నీ అనబడే శనగపిండి చెట్నీ చాలా బాగుంటుంది. దీన్ని కొద్దిగా ఎక్కువ ఉడికిస్తే నీళ్ళయి పోతుంది. శనగపిండి ఎక్కువైతే ముద్దయిపోతుంది. అమ్మ సమంగా చక్కగా చేస్తుంది. నేను చిన్నప్పుడు ఇంట్లో రోజు చేయమనే దాన్ని. మా రైస్ మిల్లులో బియ్యం తీసుకెళ్ళిన హోటల్ వాళ్ళు రోజు టిఫిన్ మా ఇంటికి పంపేవాళ్ళు. వాళ్ళు ఒక్క బుధవారం నాడు తప్ప బొంబాయి చెట్నీ వారం రోజులూ చేసేవారు కాదు. నేను బుధవారం ఎప్పుడోస్తుందా అని చూసేదాన్ని. అమ్మ ఈ బొంబాయి చెట్నీతో పాటు పూరీ కూర కూడా బాగా చేస్తుంది. మా చుట్టాల్లో చాలామంది అమ్మ దగ్గర వంట నేర్చుకున్నవాళ్ళే. ఈ పూరీ కూరలో అమ్మ కొద్దిగా పంచదార వేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ దీంట్లో పంచదార వెయ్యరు. ఇలాంటి సీక్రెట్ టిప్స్ మా దగ్గర పని చేసిన వంటవాళ్ళకు నేర్పింది అమ్మ. మా పని వాళ్ళు కూడా అమ్మ చేసిన రకరకాల వంటల రుచిని చూసినవాళ్ళే. కొబ్బరి బూరెలు చక్కని పాకంతో చెయ్యాలి. పాకం సరిగా కుదరలేదంటే బూరెలు పాడయిపోతాయి. అవి నాకు వండడం రాదు. అమ్మ లేకుండా పోయాక ఒక్కరోజు కూడా వండలేదు. అమ్మ కొబ్బరి లౌజులు కూడా బాగా చేస్తుంది. మా ఇంట్లో కొబ్బరి చెట్లు ఉండడంతో కొబ్బరికాయలు కొట్టించి బెల్లంతో కొబ్బరి ఉండలు లేదంటే పంచదారతో కొబ్బరి లౌజులు చేసేది. చిన్నప్పుడు బాగా తిని విసుగొచ్చేది గానీ ఇప్పుడు చేసి పెట్టే వాళ్ళే లేరు. ఎన్నని గుర్తు తెచ్చుకోను. అసలు రోజు ఏదో ఒక విషయంలో గుర్తు చేసుకుంటూనే ఉంటాము. అమ్మ వంటలు ఎన్నో ఉన్నాయి.

Exit mobile version