Site icon Sanchika

అమ్మ

[box type=’note’ fontsize=’16’] ‘నా కొడుకూ తండ్రిలా చేస్తాడో ఏమో. తండ్రి బుద్ధులు తన కుమారుడికి రానీయకు దేవుడా’ అని రోజు దేవుడిని ప్రార్థిస్తుందో భార్య తాళ్లపూడి గౌరి వ్రాసిన “అమ్మ”కథలో. [/box]

[dropcap]తె[/dropcap]ల్లవారింది. తొందరగా పనులు ముగించుకొని తన కొడుకు రాకకై ఎదురుచూస్తోంది కాంతమ్మ.

ఇంతలో పక్కనే వున్న సీతమ్మ వచ్చి “ఏమిటి వదినా యివాళ చాలా తొందరగా పని ముగించావు” అని అడిగింది.

అందుకు బదులుగా “ఏముందమ్మా మీ అన్నయ్య వున్నప్పుడు మాట. నన్ను కాశీకి తీసుకువెళతా అన్నారు. వారు పోయి ఇన్నేళ్ళ తరువాత నా భాగ్యం పండింది. చూడు సీతమ్మ వదినా ఇంట్లో కోడలు ఒక్కదాయె వుంటుంది. ఏమిటో పిల్లల్ని వంటరిగా వదిలి వెళ్ళాలని లేదు గాని ఏమి చేయను. కాశీ వెళ్ళాలని ఆశ. రంగం నన్ను తీసుకువెళతా అంటున్నాడు” అంది కాంతమ్మ.

“ఆ ఏముంది? నేను వున్నాలే. అలా సరదాగా వెళ్ళిరా. నేనున్నలే, నాకు ఎలాగో పని లేదు. అడపా దడపా వచ్చి చూసి పోతుంటా” అన్నది. “సరే జాగ్రత్త వెళ్ళిరా” అని…. “ఆ.. అవును మాటల్లో పడి మరిచిపోయాను పొయ్య మీద అన్నం వుంది వస్తాను” అని వెళ్ళిపోయింది.

ఇంతలో కాంతమ్మ కొడుకు రానే వచ్చాడు

“బయలుదేరు అమ్మా, ట్రెయిన్‌కి టయిమ్ అవుతుంది” అని చెప్పాడు.

“సరే నాయనా, నీకు భోజనం వడ్డించి నేను తయారు అవుతాను” అని చెప్పింది కాంతమ్మ.

“సరేలే తొందరగా కానీ” అన్నాడు.

అన్నం వడ్డించి కాంతమ్మ ప్రయాణానికి కావలసినవన్నీ సర్దుకొని ఏనాడో మళ్లీ ఆయన రంగం కడుపులో పడిన సందర్భంగా సంతోషంతో చేయించిన చంద్రహారాన్ని, కన్నవారు యిచ్చిన బంగారు గాజులు వేసుకొని, తన దగ్గర వున్న కొంత డబ్బు పట్టుకొని సిద్ధమయింది.

ఇంతలో “బయలుదేరు అమ్మా” అన్నాడు రంగం.

“శాంతా వెళ్ళొస్తాను, తలుపులు జాగ్రత్తగా వేసుకో. ఫోను దగ్గర పెట్టుకో. ఏదయినా అవసరం పడితే ఫోను చేస్తాను” అని చెప్పి బయలుదేరాడు రంగం కూడా.

కాంతమ్మ తన కోడలు శాంత దగ్గరకు వచ్చి, “అమ్మా నిన్ను వదిలి వెళ్ళాలి అనిపించడం లేదు కాని ఏం చేయను. ఇది ఏనాటి కోరికో. మీ మామగారు వుంటే తీసుకువెళ్ళేవారు, కానీ అయన దూరము అయిపోయారు. పోనీ ఆ పుణ్యతీర్థంలో మావయ్యకి పిండ ప్రదానం చేస్తే ఆయనకి ముక్తి కూడా అని యిరుగు పొరుగు వాళ్ళు అంటున్నారు. రంగం కూడా నన్ను తీసుకువెళతా అంటున్నాడు, వెళ్ళివస్తాను” అని జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది.

ట్రయిన్ స్టేషన్‌లో ఆగింది. కాంతమ్మ, రంగం ట్రెయిన్‌లో కూర్చున్నారు. కొన్ని గంటలు తరువాత పొద్దు వాలిపోయింది. కాంతమ్మకి కునుకు పడుతుంది. అది గమనించిన రంగం, “అమ్మా నీకు కునుకు పడుతుంది, ఈ ట్రయిన్‌లో దొంగలు భయము ఎక్కువగా వుంటుంది. కనుక ఆ నగలు వగైరా యివ్వు, పెట్టిలో పెట్టి తాళం వేస్తా” అని చెప్పాడు.

తన కొడుకు మాట విని కాంతమ్మ తన వంటిపై వున్న నగలు తీసి తన కొడకుకి యిచ్చేసింది, తన దగ్గర వున్న డబ్బులు కూడా యిచ్చేసింది. రంగం అవి భద్రపరిచిన తను కూడా రెప్పవాల్చినట్టు నటించాడు.

ఇంతలో తన తల్లి నిద్ర పోతుండటం చూసి, మధ్య రాత్రిలో దిగిపోయాడు. ఇంతలో యింకో వూరు వచ్చింది, టీటీఇ వచ్చాడు, కాంతమ్మను టికెట్ అడిగాడు వున్నాది బాబు. కొడుకు బయటకి వెళ్ళాడు వస్తాడు అని చెప్పింది కాంతమ్మ. ఇలా కొన్ని గంటలు గడిచాయి. అయినా తన కొడుకు రాలేదు. చూస్తూ చూస్తూ భయం కలుగుతుంది, ఎక్కడికి వెళ్ళాడో బండి కదిలిపోయింది అని ఎదురు చూస్తూంది. ఆకలేస్తుంది, తన దగ్గర చిల్లిగవ్వ కూడా మిగల్చకుండా కొడుకు చేతిలో పెట్టింది. ఆకలికి తట్టుకోలేక తన సంచిలో ఉన్న మరమరాలు నవులుతుంటుంది. ఇంకా తన కొడుకు కానరాలేదు. ఇంతలో యింకో ఊరు వచ్చింది. మళ్ళీ టీటీఇ వచ్చి టికెట్ అడిగాడు. కాంతమ్మ బిత్తరపోయి కన్నీరు కార్చింది. టికెట్‌ లేకపోవటంతో టీటీఇ ఆమెను స్టేషన్‌లో దింపేసాడు. ‘ఏం చేయను, మావాడు ఎక్కడున్నాడో ఏమైపోయాడో’ అని అదే స్టేషన్లోకి వచ్చిన ప్రతి రైలును చూస్తుంది. కొడుకు రానందున యిలా కొన్నాళ్ళు గడచింది. ఆమె ఎలాగోలాగ మెల్లగా కాశీ చేరుకుంది. ప్రతి రోజు తన మనసులో దిగులు పడుతూ ‘కాశీ అన్న ఆశ నన్ను కాటి వరకూ తీసుకొచ్చింది’ అని రోజు రోజుకూ కుంగిపోయేది. ఇలా కొన్నాళ్లు గడిచాయి.

***

శాంతమ్మ తన భర్తతో “ఏమండీ మన అత్తగారు తప్పిపోయి 9 ఏళ్ళు గడిచాయి. ఆమె జాడ యింతవరకూ తెలియలేదు. ఆమె యింక బ్రతికివుండరు. కనీసం ఆమె విముక్తికయినా కాశీలో పిండము పెడదాము” అని భర్తను బయలుదేరదీసింది. కాశీ చేరుకున్నారు.

యాత్ర మూగించుకొని బయలుదేరారు. ఇంతలో గుడి మెట్లపైన ఒక యాచకురాలు మరణించి వుంది. అది చూచి అక్కడ వున్న వారు అంతా బాధపడుతున్నారు. “ఈ మహాతల్లిని 9 ఏళ్ళ క్రితం తన కొడుకు కాశీకి తీసుకొని వచ్చాడట. తప్పిపోయిన కొడుకు గుడికి వస్తాడు. నాకు కనిపిస్తాడు అని ఎదురు చూస్తూ కన్నుమూసింది” అని చెప్పుకుంటున్నారు.

రంగం ఆ మెట్ల దగ్గరకు వెళ్ళాడు. శాంత పరిశీలించి చూసింది. చనిపోయిన ఆవిడ తన అత్తగారు అని తెలిసి “ఏమండీ మీ…” అనగానే ఆమెను బరబరలాక్కుంటూ బయలుదేరాడు రంగం. ‘ఏమిటి ఈయన ప్రవర్తన? తన తల్లిని చూసి కూడా ఏమీ కానివాడిలా యిలా ప్రవర్తిస్తున్నాడు’ అని ఆలోచించింది.

ఆనాడు తల్లి తప్పిపోయింది అని చెప్పిన మాట అబద్దం అన్నమాట. ‘వెతికిస్తున్నాను’ అని తనకు చెప్పిన మాట కూడా అబద్దమే అని అర్థం అయ్యింది. సొంత తల్లి భారాన్ని తప్పించుకోవడానికి ఆడిన నాటకము ఇది. ఆమెను నగలు వేసుకోమన్నది కూడా వాటిని చేజిక్కించుకోవాలన్న దురాలోచన వుండే. అందుకే ఈ విధమైన పన్నాగము పన్నారు అని తన భర్త దుర్మార్గానికి అసహ్యించుకుంటుంది. తల్లిని భారంగా భావించే ఇటువంటి కొడుకులు ఈ ప్రపంచంలో ఏ తల్లికీ పుట్టకూడదు.

రేపటి నా జీవితము ఎలా ముగుస్తుందో. ‘నా కొడుకూ ఈ తండ్రిలా చేస్తాడో ఏమో. ఈ తండ్రి బుద్ధులు తన కుమారుడికి రానీయకు దేవుడా’ అని రోజు దేవుడిని ప్రార్థిస్తుంది శాంత.

Exit mobile version