Site icon Sanchika

అమ్మాయి కాపురం

[dropcap]గు[/dropcap]య్ గుయ్ అంటూ మోగుతోంది మొబైల్, సరిగా వినలేదు. మా ఆవిడ పెట్టేసిన మంచి భోజనం తిని, సెలవు రోజు కదా, హాలులో పడక కుర్చీలో హాయిగా కూర్చుంటే తెలియని నిద్ర పట్టేసింది. అది అలసట వల్ల వచ్చిందో, ఆనందం వల్ల వచ్చిందో గానీ బాగా పట్టేసింది.

ఇంతలోనే, మళ్ళీ నా మొబైల్ మోగుతూ ఉంది, రింగ్ టోన్ రాకుండా వైబ్రేషన్‌లో ఉంది, పూజకు వెళ్ళినప్పుడు దాన్ని మార్చేసి, తరువాత మళ్ళీ మార్చడం మరచాను, అందువల్ల అది పెద్దగా వినిపించటం లేదు.

ఎవరా అని చూసా, మా అమ్మాయి వాళ్ళ ఊరు నుండి ఫోన్ చేస్తోంది. ఈ మధ్యే ఐదు నెలల క్రితం మంచి సంబంధం చూసి పెళ్లి చేశా, చక్కటి కుర్రాడు, ఆస్తిపరుడు, మంచి కుటుంబ నేపథ్యం ఉన్నవాడు, బుద్దిమంతుడు. కొత్త కాపురం కదా మధ్యాహ్నం బులిటెన్, ఉదయం లేచిన దగ్గర నుండి ఇప్పటిదాకా జరిగిన ప్రతి విషయం, లైవ్‌లో అంతా చెప్పేస్తుంది.

“హలో చెప్పు, ఎలా ఉన్నావ్, అల్లుడు గారు ఎలా ఉన్నారు, ఆఫీస్‌కు వెళ్ళారా?” అని అడిగే లోపే, “… నాన్నా, ఎన్ని సార్లు ఫోన్ చేయాలి నీకు, యిప్పటికే మూడు సార్లు చేశా, ఏం చేస్తున్నారు, అమ్మ ఎక్కడ ఉంది, నువ్వేం చేస్తున్నావు, నా ఫోన్ వస్తుంది, చేస్తాను అని తెలుసుగా, ఎవ్వరూ ఎత్తరే, అంత నిర్లక్ష్యమా?” అంటూ దాడి చేసింది. దాని ధోరణే తప్ప నా మాట వినటం లేదు.

“అవునురా, మొబైల్ వైబ్రేషన్‌లో ఉంది, చూచుకోలేదు, ఈలోపల నిద్ర పట్టేసింది” అంటూ ఏదో పెద్ద తప్పు చేసిన వాడిలాగా, సంజాయిషీ ఇస్త్తూ, ప్రాంతీయ వార్తలు టైంకు వచ్చిన రాకపోయినా నీ ఫోన్ వచ్చేస్తుంది అని గొణుక్కుంటూ, “సరేలే ఇంకేటి విషయాలు” అంటూ పలకరించా.

“ఈయన పద్దతి ఏం బాగోలేదు, ఆఫీస్ నుండి రోజూ లేటుగా వస్తున్నారు, నాకు ఏ విషయం పూర్తిగా చెప్పటం లేదు, నేను ఏమైనా చేస్తే వివరణ అడుగుతున్నారు, భోజనం చేసేటప్పుడు ఏదీ బాగుందని చెప్పరు, ఇవ్వాళ ప్రొద్దున్నే చేసిన టిఫిన్ కూడా ఎలా ఉందో చెప్పకుండా వెళ్లిపోయారు, బాక్స్ కూడా తీసుకు వెళ్ళలేదు, నేనేదో అక్కడ చూసుకుంటా అని ముభావంగా వెళ్లిపోయారు. నిజం చెప్పాలి అంటే నాకు అంత ప్రాధాన్యత లేదు, జీవితం చాల చికాకుగా ఉంది, ఇదా పెద్ద ఊరు, మనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు, మీకు ఫోన్ చేసేస్తే పెద్దగా పట్టించుకోవటం లేదు, పెళ్లి చేసి పంపేస్తే మీ బాధ్యత తీరిపోయింది అని అనుకుంటున్నారా, అమ్మకు చెప్పుకుంటే సరేలే, చూద్దాం, అంటూ పెట్టేస్తోంది….” అంటూ ఇంకా ఏవేవో, బాధలు, చికాకులు, నిందలు ఏకరువు పెట్టేసింది.

ఇదేమిటి నేను మంచి సంబంధం చూసే పెళ్ళి చేసాను కదా, బంగారం లాంటి కుర్రాడు అని, ఇప్పుడేమిటి ఇలా ఉంది, దీని పరిస్థితి ఏమిటి ఇలా తయారయ్యింది అని అనుకుంటూ చాలా ఉద్వేగానికి లోనయ్యా. ఒక్కసారి నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. ఫోన్ అయిపోగానే పక్క గదిలో సేద తీరుతున్న మా ఆవిడ దగ్గరకు వెళ్ళాను.

పాపం ప్రొద్దున్న నుండి ఇంటి పని అంతా చేసుకుని ఇప్పుడే కొంచెం సేద తీరినట్టుంది, అలసినట్టుగా కనిపిస్తోంది. మన సహాయం ఎలాగూ అంతంత మాత్రమే, చేసినది ఏమీ లేదు అనుకుంటూ తన పక్కన కుర్చీలో చప్పుడు కాకుండా కూర్చొని తన వంక తదేకంగా చూసా,……కాస్తంత వయసు వచ్చినట్టు, బాధ్యతల వల్ల కాస్త బఱువు ఎక్కినట్టు, జుట్టూ కాస్త తగ్గింది, కానీ తాను ఎక్కడా మారలేదు, చక్కటి ముద్దుగుమ్మలా, అమాయకంగా అలాగే, తన ముంగురులు నిమురుతూ అలా ఉండిపోయాను.

కొంతసేపటికి ఒక్కసారి ఉలిక్కిపడి లేచి, “ఏమిటి ఇలా కూర్చున్నారు, టీ కలపాలా, నేను చాలాసేపు పడుకున్నానా, మీకు ఏమైనా కావాలా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే… “ఆగాగు, నెమ్మది” అంటూ తనను కాస్త ఆగనిచ్చి, నేను తన దగ్గరకు ఎప్పుడు వచ్చింది, తను నిద్రపోయిన విషయం, అసలు తాను ఎందుకు, ఏమి చెబుదామని వచ్చానో, అదే అమ్మాయి, అల్లుడు కాపురం విషయం, వాళ్ళ సంసార విషయాలు నెమ్మదిగా ఏకరువు పెట్టేసా. “ఏం చేయాలి, ప్రతీరోజు ఈ విధంగా దాని నుండి ఫోన్ వస్తే ఏం సమాధానం చెప్పాలి అంటావ్……” అంటూ కాస్తంత ఆదుర్దాగా అడిగా.

చిన్నగా నవ్వి “చూద్దాం” అని చాల తేలికగా అంది. నాకు ఆశ్చర్యం వేసింది, నేను ఇంతా కంగారు పడిపోయి, చెబితే తినేమిటి ఇంత సులువుగా కొట్టిపారేసింది. సరేలే….. చూద్దాం అనుకుంటూ రోజూవారీ కార్యక్రేమంలో పడిపోయా.

సాయంత్ర ఆరు గంటలు అయ్యింది, మళ్ళీ సాయంత్రం బులిటెన్, ఈసారి నాకు కాదు, మా ఆవిడకు. మళ్ళీ అదే సోది అనుకుంటా, అదే ధోరణిలో తన కష్ఠాలు, చికాకులు ఏకరవు పెట్టేస్తూ, కానీ మా ఆవిడా ముఖంలో పెద్దగా ఏమీ భయం కనపడలేదు, చాల నిశ్చింతగా, ప్రశాంతంగా వింది, విన్నంత సేపు విని, చివరగా ఒక మాట మాత్రం అంది… “కాస్త జాగ్రత్తగా ఉండు, ప్రతి విషయం పెద్దగా పట్టించుకోకు, అన్నీ సర్దుకుంటాయి” అంటూ ఫోన్ పెట్టేసింది.

“ఏమిటి మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసిందా, ఏమంటోంది, అదే గోలేనా?” అన్న నాకేసి చూసి, చిన్నగా నవ్వి, “ఏదో ప్రతీరోజు జరిగే విషయమే, మామూలే” అంటూ తీసి పారేసింది. నాకైతే ఏమిటది, ఇలా జరుగుతోంది, నాకున్న ఆదుర్దా, మా ఆవిడకు ఏమీ లేదు, పైగా చాల తేలికగా తీసుకుంటోంది. వెంటనే దీన్ని చక్కదిద్దకపొతే ఇంకేం పరిణామాలకు దారి తీస్తుందో అని అనుకుంటూ, అల్లుడు గారికి ఫోన్ చేశాను.

“మామయ్యగారు, బాగున్నారా, అత్తయ్య గారు ఎలా ఉన్నారు, మేము ఇద్దరం ఇక్కడ చాలా బాగున్నాం, మీకు వీలు కుదిరినప్పుడు సెలవులు పెట్టి ఇక్కడకు రండి, చుట్టుపక్కల చూడటానికి చాల విషయాలు ఉన్నాయి” …అంటూ ఇంకా యేవో విషయాలు చెబుతూ చాలా ప్రశాంతంగా, గౌరవంగా మాట్లాడాడు.

నాకు అతనిని ఏమి అడగాలో అర్థం కాలేదు, మరిన్ని కుశలప్రశ్నలు వేసి ఫోన్ పెట్టేసా.

నాకు సమస్య ఎక్కడ అన్నది అర్థం కాలేదు, అమ్మాయి చూస్తే అలా మాట్లాడుతుంది, ఇతను చూస్తే అసలు ఏ సమస్య లేదు అన్నట్టుగా ఉన్నాడు, అసలు ఎవరివల్ల వాళ్ళు ఇద్దరూ సుఖంగా లేరు, నా గారాలపట్టి అలా బేలగా, బాధగా మాట్లాడుతుంటే బాధ కల్గింది. ఎంతైనా గారాబంగా పెంచి, పెద్ద చదువులు చదివించి మంచి సంబంధం చూసి ఘనంగా తాహతుకు తగ్గట్టు పెళ్లి చేశా. ఎప్పుడు కష్టం వచ్చిన, ఇబ్బంది వచ్చిన వాళ్ళ అమ్మ కన్నా నాకే ముందు చెప్పేది. అలాంటిది ఇవాళ ఇంత అసహనంగా రోజుకు రెండు సార్లు ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఏదో తెలియని ఇబ్బంది పడుతోంది, “అల్లుడు మంచివాడు కాదా, ఏమైనా చెడు వ్యసనాలు ఉన్నాయా?” అని అడిగితే, “మా ఆయన చాల నిక్కచ్చి మనిషి, చాలా మంచివాడు” అంటూ సెలవిస్తోంది.

మరి ఏమిటి వీళ్ళ సమస్య, ఏ చేద్దాం అని మా ఆవిడను అడిగితే “చూద్దాం లే, ఇది పెద్ద సమస్య కాదు” అంటూ చాల నిర్లిప్తంగా జవాబిస్తోంది. ఈసారి ఇలా కాదు, దీన్ని సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయం తలుచుకుంటూ భోజనం కూడా చేయకుండా ఎప్పడు నిద్రలోకి జారానో తెలియదు, మళ్ళీ మా ఆవిడ “కాఫీ తాగుదురు గాని లేవండి, అసలే రాత్రి మీరు ఏమీ తినకుండా నిద్ర పోయారు. బాగా అలిసి నిద్ర పోయారు కదా అని, మిమ్మల్ని ఇంక లేపలేదు” అంటూ నిద్ర లేపింది.

నెమ్మదిగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని సోఫాలో కూర్చున్నా, కూర్చున్నా కానీ ఇదే ఆలోచన, ఇవాళ దీనితో ఏదో ఒకటి మాటలాడి అమ్మాయి సమస్య తీర్చాలి, అవసరం అయితే ఇద్దరం ఒకసారి వెళ్లి దాని సంసారాన్ని చక్కదిద్దాలి అనుకుంటూ ఉండగానే….. మా ఆవిడ రెండు కప్పుల కాఫీతో వచ్చి కూర్చుంది. “కాఫీ తాగండి, ఇవాళ వంట ఏమి చేయమంటారు?” అంటూ మాట్లాడటం మొదలుపెట్టేసింది, ఏదో వింటున్నట్టు ప్రయత్నం చేశా గాని, ఇక ఉండలేక…

“అబ్బా ఉండవే…. నువ్వు ఎలా ప్రశాంతంగా ఉన్నావ్, నేనైతే చాల టెన్షన్ పడిపోతున్నాను, అసలు మన అమ్మాయి విషయం ఏమైనా ఆలోచించావా, రోజూ దాని ఇబ్బందులు అన్నీ చెబుతూ ఇలా ఫోన్ వస్తుంటే నీకు ఏమీ పట్టడం లేదా, అది అక్కడ ఆలా ఉంటే, మనం ఇక్కడ ఎలా ప్రశాంతంగా ఉంటాం చెప్పు, నాకు మాత్రం ఈ విషయం ఇవాళ తేల్చేయాలి, ఏదో ఒక కొలిక్కి తీసుకురావాలి” అంటూ మా ఆవిడమీద కాస్త విసుగ్గా మాట్లాడాను.

కానీ ఆవిడా మాత్రం చిన్నగా ఒక చిరునవ్వు రువ్వి, ప్రశాంతంగా “ఇంతేనా, దీనికే మీరు భయపడుతున్నారా, మీరు ఏమీ చింతించకండి, ఈ సారి ఫోన్ వస్తే నాకు అంది ఇవ్వండి, నేను మాట్లాడి సమస్య తొలగిస్తాను, ఒకవేళ మీరు మధ్యలో మాట్లాడాల్సివస్తే అవును అన్న మాట తప్ప ఇంకేమీ చెప్పకండి. మీ సమస్య తీరిపోతుంది” అంటూ ఏంటో ప్రశాంతంగా, ధైర్యంగా చెప్పిన మా ఆవిడను చూసి ఒకింత ఆశ్చర్యపోయా, ఇది నా భార్యలో నాకే తెలియని మరో కోణం. నేనెప్పుడూ ఆలా ఆమెను చూడలేదు, ఆమె ఆత్మవిశ్వాసం చూడగానే సరే అనేసా.

అనుకున్నట్టుగానే సుమారు మిట్ట మధ్యాహ్నం ఫోన్ కాల్ మా అమ్మాయి నుండి వచ్చింది. “నాన్నా ఎలా ఉన్నావు, నా పరిస్థితి అర్థం అయ్యిందా, నాకు ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగోలేవు, నాకు నచ్చినట్టుగా ఏమీ లేవు, ఈ మధ్య ఈయన విసుక్కుంటుంన్నారు కూడా” అంటూ పాతపాటే మరో రకం గళంలో పాడేసింది, ఇంకా అది మాట్లాడుతుండగానే నా ఫోన్ మా ఆవిడ లాక్కుని, “నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో నాకు చెప్పు, నాన్నకు కాదు, నీకు సమస్య పరిష్కారం నేను ఇస్తాను,..

ఇంతకూ నీకు ఏమిటీ కష్టం., మీ ఆయన ఆఫీస్ నుండి తొందరగా రావటం లేదా, ఎందుకు రావటం లేదో అని ఎప్పుడైనా నెమ్మదిగా అడిగావా, బహుశా దీనికి రెండు కారణాలు ఉండవచ్చు, ఒకటి ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువ ఉండవచ్చు కదా దాని వల్ల ఆలస్యం అవ్వచ్చు, ఇంక రెండో కారణం అతను పెళ్లికి ముందు ఆఫీస్ ఐన తరువాత కాలక్షేపం కోసం స్నేహితులతో తిరగవచ్చు, అది ఇంకా అలవాటుగా ఉండవచ్చు, కానీ నీవు ఇంటిదగ్గర ఉన్నావన్న విషయం అతనికి అర్థం అయ్యేలా నువ్వు చెప్పగలగాలి, ఇంటికి వచ్చేలా చేయాలి. ఇంక అతని వ్యక్తిత్వం గుఱించి ఐతే, అతను నిన్నటి దాకా ఒంటరివాడు, ఈ రోజు నువ్వు వచ్చావు, ఇదివరకు బ్రహ్మచారి అలవాట్లు కొన్ని ఉంటాయి, అవి మారటానికి కొంత సమయం పడుతుంది, ఆ మాట కొస్తే నువ్వు మాకు ఒక్కత్తే అమ్మాయివి, గారాబంగా పెరగావు, నువ్వు ఇక్కడ మన ఇంట్లో ఉన్నట్టు అక్కడ ఉంటే అతనికి నచ్చవచ్చు లేక పోవచ్చు. కలసి ఉండటం అంటే ఒకరి వ్యక్తిత్వం ఒకరు కాపాడుతూ, జీవించడం, దీనిని ఓడిపోవటం అనుకుంటే అవసరం అయితే ఓడిపో, నువ్వు నెగ్గడం కాదు ముఖ్యం, జీవితం నెగ్గటం ముఖ్యం.

మా పెళ్లయిన కొత్తలో, కాపురం పెట్టిన కొత్త రోజుల్లో కాస్త అన్నం ఎక్కువ వేశానని మీ నాన్న కంచం విసిరేశారు, నాకు చాలా కోపం వచ్చేసింది, కాసేపటికి అదే నాన్న, చెదిరిపోయిన అన్నం ఏరుతూ, కంచం కడుగుతూ చీపురుతో అవస్థ పడుతుంటే నాకు చాలా నవ్వు వచ్చింది. అప్పటిదాకా ఉన్న కోపం స్థానంలో నవ్వు వచ్చి, మళ్ళీ పరిస్థితి మామూలుగా ఐపోయింది.

ఇప్పటికీ ఆ సంఘటనకు నాన్న పెద్దగా క్షమాపణలు చెప్పలేదు, ఆలా అని నేను దెప్పనూ లేదు, కానీ అయన కళ్లలో ఆనాటి సంఘటన తాలూకు సిగ్గుపడిన గుర్తులు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ప్రతీ దానికి సారీలే చెప్పక్కరలేదు, వాళ్లల్లొ ఆ పశ్చాత్తపపు పోకడలు కనిపిస్తే చాలు, నువ్వు విజయం సాధించినట్టే…. అలాగే నువ్వు కూడా మారాలి, మన ఇంట్లో ఉన్నట్టు కాకుండా కాస్తంత మారాలి, అది నీ ఇల్లు అన్న ఆలోచన నీకు రావాలి, ఇక్కడ మన ఇంట్లో వదిలేసినట్టుగా బట్టలు, పుస్తకాలూ అన్నీ ఉంచకుండా, నీ ఇల్లు ఎలా ఉండాలి అని కలగంటావో అలా చేసుకో, అదేవిధంగా నువ్వు కూడా తను వచ్చే సమయానికి చక్కగా ముస్తాబై తనకోసం వేచివుండు, ఎంతో పని ఒత్తిడి తట్టుకుని ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన తనకు నిన్ను చూడగానే అలసట అంతా పోవాలి. నీకు మంచి మొగుడు వచ్చాడు, ఏ దుర్వ్యసనాలు లేని బంగారం, చాలామంది ఇలాంటి జీవితం లేక, జీవిత భాగస్వామి రాక సుఖం లేకుండా జీవచ్ఛవంలా బ్రతుకుతున్నారు. మన ఇంటిని మనకు నచ్చినట్టుగా ఎలా ఉండాలనుకుంటున్నమో దానికి తగ్గట్టుగా మనం మారాలి, మన పరిస్థితులని మార్చుకోవాలి, అదే జీవితం, అదే దాంపత్యం.

పైగా నీవు బాగా చదువుకున్న దానివి, ఇలాంటి విషయాలు నీకే ఎక్కువగా తెలియాలి. ప్రతి చిన్న విషయాన్ని మనకు మనంగా ఎదుర్కుని మనమే పరిష్కరించుకోవాలి, అంతేకాని ప్రతీదానికి, ప్రతీ చిన్న విషయాన్ని, అటూ ఇటూ వార్తలాగ చెప్పేస్తే చుట్టుపక్కల వాళ్లకు మంచి న్యూస్ ఛానల్ అయిపోతావ్ తప్ప ఇంకేం జరగదు.

అసలు ఈ రోజుల్లో ఎక్కువ జంటలు విడాకులు అవుతున్నాయి అంటే దానికి కారణం సెల్ ఫోన్, సోషల్ మీడియా అని నా అభిప్రాయం, మన ఇంట్లో ప్రతీ సంఘటన నిముషాల్లో పక్కింట్లోకి చేరిపోతున్నాయి, సరిదిద్దుకునే సమయం లేకుండానే, అవకాశం రాకుండానే ఆ సమస్య కోటలు దాటి, రాష్టాలు దాటి, అనవసర రాద్ధాంతానికి దారి తీస్తోంది, ఇలాంటి సమస్యలే మా కాపురం పెట్టిన కొత్తలో కూడా ఉండేవి, మేమూ నీలాగే ఇబ్బంది పడేవాళ్ళం, కోపంగా ఇంటికి ఉత్తరం రాద్దాం అంటూ కూర్చొని, ఏదో రాద్దాం అనుకుని ఏమీ రాయకుండానే కుశల ప్రశ్నలు రాసి పోస్ట్ చేసేవాళ్ళం,

అది అక్కడకు చేరడానికి వారం, మళ్ళీ జవాబు రావడానికి ఇంకో వారం జరిగేది. ఈ లోపల పాత సమస్యలు పోయి, కొత్తవి వచ్చేవి, కానీ ఇప్పుడా ప్రతీ విషయం లోను, ప్రతీ నిమిషం లోను మీ కాపురాల్లో తల్లులు చూడటం వల్ల అనవసర రాద్ధాంతాలు పెరుగుతున్నాయి. మా ఇద్దరి కాపురంలో కూడా గొడవలు, చికాకులు, సరదాలు అన్నీ ఉండేవి, కానీ సాయంత్రానికి ఎవరో ఒకరు తగ్గటం వల్ల, లేదా ముందుకు వచ్చి పరిష్కరించుకోవటం వల్ల మా సంసారంలో ఏ సమస్య ఎక్కువ కాలం ఉండేది కాదు. అంతేకాని ప్రతీ చిన్నదాని బూతద్దంలో చూడకు, నీవు మీ ఆయనకు నచ్చినట్టు మారడానికి ప్రయత్నం చేయి, అలాగే నీకు నచ్చే విధానము మీ ఆయనకు చెప్పి అలా ప్రవర్తించేలా చేసుకో, ఇది నీ సమస్య, సమాధానం కూడా నీ దగ్గరే ఉంది, నువ్వే పరిష్కరించుకో, అర్థమైందా….” అంటూ తన సుదీర్ఘ ఉపన్యాసం చాల నిక్కచ్చిగా ముగించేసింది.

మరింక ఏమి అయ్యిందో, తెలియదు కానీ ఆ వైపు నుండి ఫోన్ కట్ అయ్యింది, నాకు నోట మాట రాలేదు, ఇదేమిటి ఇంతలా మాట్లాడేసింది, కూతురు అని జాలి కూడా లేకుండా, నా భార్య ఇంత లోతుగా ఆలోచించి గలదా, ఇంత బాగా వివరంచగలదా, అని ఆశ్చర్యంలో “..ఏమేవ్, నేను నిన్ను ఇలా చూడటం విచిత్రంగా ఉంది, నువ్వేనా మాట్లాడినది, అమ్మాయికి అంత నిర్దాక్షిణ్యంగా చెప్పేసావేమిటి, ఏమీ అనుకోదు కదా, నిజంగా మన పెళ్లయిన కొత్తలో ఇంత ఇబ్బంది పెట్టనా, నా మూర్ఖత్వంతో నిన్ను బాధపెట్టానా” అంటూ.. చిన్నపిల్లాడిలా అయిపోయి అడిగా.

“ఊరుకోండి, మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు, యివన్నీ కొత్త సంసారంలో మామూలే, మన పెళ్లయిన కొత్తల్లో మీరు నేరుగా ఇంటికి వచ్చేవారు కాదుగా, కాసేపు మీ ఫ్రెండ్స్ ఇళ్లల్లో గడిపి వచ్చేవారు, క్రమేపీ ఆ అలవాటు మారి నా కోసం తొందరగా బయలుదేరి వస్తుంటే, అది చూచి నీ సహచర ఉద్యోగులు గేలి చేసిన రోజులు, కుళ్ళి చచ్చిన రోజులు మరచిపోయారా, అది మనం మార్చుకునే విధానంలో ఉంది, మన పెళ్లయిన కొత్తలో మీకు ఉన్న కోపం, మీరు వేసే వేషాలు అన్నీ మరచిపోయారా, నన్ను యెంత ఉడికించేవారో గుర్తులేదా.

కానీ ఇవన్నీ నేను మనసులో పెట్టుకుని కక్ష సాధించలేదు కదా, పెద్దరికంగా అర్థం చేసుకుని కాస్త సంయమనం పాటించా, అప్పట్లో మనకు వచ్చే జీతం యెంత, మంచం లేకుండా, క్రింద పరుపు మీద కాలం గడిపిన రోజులు, ఇంట్లో ఏ విధమైన సౌకర్యాలు లేకుండా గడిపిన రోజులు, నెలకు ఒక్కసారే, అదీ జీతం వచ్చిన నాడు, హోటల్‌కు వెళ్లి సరదాగా గడిపిన రోజులు, నాకు ఇప్పటికీ గుర్తే.. ఆ తాజాదనం ఇప్పటికి మన జీవితం నుండి పోలేదు. వారానికి ఒక్కసారి కూరలు చవకగా వస్తాయని కొనుక్కుని, ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోయినా తడిగుడ్డల్లో కుట్టి వాడుకున్న రోజులు, మీరు ఇంకా ఆఫీసులో ఉంటే సాయంత్రం మీ ఆఫీస్ దగ్గర ఉన్న పార్కులో కూర్చొని, మీ కోసం వేచి చూచినా రోజులు, ఒకే కూల్ డ్రింకులో రెండు స్ట్రా లు వేసుకుని తాగిన రోజులు నేను ఇంకా మరచిపోలేదు, అలా మనం ప్రతీ విషయంలో సర్దుకుని నడవడం వల్లే, మనం ఈ స్థాయికి ఎదిగాం. అప్పట్లో ప్రతీ చిన్న విషయంలో గొడవపడి ఉంటే, ఈ పాటికి మన విడాకులు అయ్యి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయి ఉండేవి. ఇక్కడ సమస్య అంతా ఒకరినొకరు అపార్థం చేసుకోవటం వల్ల, ఒకరి అభిప్రాయాన్ని గౌరవించుకోకపోవటం వల్ల. ఎవరి దగ్గరయిన లోతుపాటులు ఉంటె, నా భర్తే కదా అని అనుకోవటం, అవసరం అయితే పంతాలు లేకుండా తగ్గటం వల్ల, వాళ్ళ సంసారం, జీవితం రెండూ నిలబడతాయి.

సంసారం బాగుండాలని అని అనుకుని రెండడుగులు వెన్నక్కి తగ్గితే, ఇలాంటి చిన్న సమస్యలు తేలిపోతాయ్, కాలం మారే కొలది అన్నీ సర్దుకుంటాయి, ఒకవేళ నిజం తెలిసిన మగాడిని అనుక్షణం దెప్పి పాడవకుండా ఉంటే, పురుష అహంకారంవల్ల ఆతను అప్పట్లో ఒప్పుకోకపోయినా, తరువాత నుండి జాగ్రత్తగా ఉంటాడు…..” అంటూ ఎన్నో విషయాలు పెద్ద మానసిక విశ్లేషకునిలాగా మాట్లాడుతున్న నా భార్యను చూచి నాకు నోట మాట రాలేదు. గీతాసారం చెపుతున్న ఆడకృష్ణుని లాగ, నేను చిన్నపిల్లాడు లాగ అనిపించింది.

ఒక్కసారిగా లేచి నా భార్యను గట్టిగా కౌగలించుకుని కన్నీళ్లతో… “సారీ, నాకు తెలియకుండా మన సంసారంలో ఇన్నాళ్లు ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించు… నిజంగా క్షమించు…” అంటూ చిన్న పిల్లాడినయిపోయా.

“ఊరుకోండి, ఏంటి మరీ చిన్నపిల్లాడిలాగా, మన సంసారానికేం అద్భుతంగా ఉంది, మీరు బంగారం, మిమ్మల్ని యెంత జాగ్రత్తగా చూసుకోవాలో నాకు తెలుసు” అంటూ ఉన్న నా భార్యను ఇంకా గట్టిగా కౌగలించుకున్నా. ….అప్పటిదాకా మమ్మల్ని ఇద్దరినీ విడగొడదాం అని అనుకుని విశ్వప్రయ్తత్నం చేసిన గాలి మా మధ్య ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయి చచ్చింది.

ఇది జరిగిన పదిరోజుల వరకు మా అమ్మాయి నుండి ఏ విధమయిన ఫోన్ లేదు, సమాచారం కానీ లేదు, నేను చేద్దాం అంటే మా ఆవిడ ఒప్పుకోలేదు. నాకు ఎక్కడో భయం ఉన్నా, మా ఆవిడా ఆత్మవిశ్వాసం ముందు లొంగిపోయింది.

సరిగ్గా పదకొండవ రోజు ఉదయం, ఆదివారం నాడు, మా అల్లుడు, అమ్మాయి ఎంతో సరదాగా, నవ్వుతూ, ఆనందంగా చేసిన వీడియో కాల్ చూచినా తరువాత, వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకున్న తరువాత నాకు ఆనందం వచ్చింది, మా ఆవిడకేసి చూస్తే, ఆవిడ నిదానంగా, ఏపాటి విజయ గర్వం లేకుండా “ఏం కావాలి, మీకు మధ్యాహ్నం మినప సున్నిండలు చేయమంటారా?” అంటూ…. ఆమె. “వద్దే ఇప్పటికే నాకు చాలా ఆనందంతో ఆకలి లేదు” అంటూ నేను ఒకరికొకరు… నవ్వుతూ, సరదాగా, సరసాలాడుతూ… హాయిగా గడిచిపోయింది.

Exit mobile version