[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘అమ్మాయి కలలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]తె[/dropcap]లిమంచు కురిసిన తరుణాన పుడమి తల్లి పులకరించి పరవశించింది
చెట్లు చిగురించాయి పచ్చిక బయళ్లు పూల రంగుల తివాచీలు పరిచాయి
పచ్చబారిన కొండలు ఒళ్ళువిరుచుకుంటూ అందాలు ఆరబోసుకున్నాయి
ఉదయ భానుడు అప్పుడప్పుడు తన కిరణాలను సంధించే ప్రయత్నం చేస్తున్నాడు
సీతాకోక చిలుకలు రెక్కలు అల్లార్చుకుంటూ ఎండ కోసం తహతహలాడుతున్నాయి!
కలలుకనే నిశిరాతిరిలో నను మేలుకొలిపింది చెలికాని వలపు పిలుపు
అదిరిపడిలేచి నా గది కిటికీ నుంచి ఒదిగిన రాత్రి రాణిని వివరమడిగాను
పక్కున నవ్వినరాణి సన్నజాజి పందిరివైపు సైగచేసింది పరుగునపోయి వెదికాను
నన్ను ఆటపట్టించిందని తెలిసి అలిగి పూలన్నీ తుంపి వేసాను
అప్పుడు చెప్పింది మల్లిపొదల నీడలో వేచివున్నాడు నీవాడని!
కలయో నిజమో రాత్రిరాణి పరిహాసమొ తెలియని గందరగోళంలో
పొదలనీడలో కలయ చూడగా కుందేళ్ళ జంట వచ్చి నా ఒడిలో వొదిగింది
వాటిని లాలించి ముద్దుచేసి మురిసిపోయాను నా కలను మరిచాను
సెలయేటి అలల సంగీతం వింటూ వెన్నెలవెలుగులో పరవశించిపోయాను
కొలనులోఈదులాడు రాయంచల సోయగాలు వివరిస్తూ నీకు ప్రణయలేఖ రాసాను!
మేఘసందేశాలు రాయంచల రాయబారాలు ప్రణయలేఖలు కలలుగన్న కొత్త ఆశలు
సాగరతీరాన కట్టుకున్న బొమ్మరిల్లు ఇష్టమైన పాటలు అలరించిన కవితలు
కవుల కల్పనలోని కథలు అనంతమైన అన్వేషణలు కష్టం ఏమిటో తెలియని ఊహలు
ప్రకృతిలోని అందాల పరిశీలనలు చిలకా- గోరింకల ప్రణయ దృశ్యాలు ఎగిసిపడే కోరికలు
కోయిల గొంతులో పొంగి పొరలిన తీయని భావాలు యౌవనాల నవ్వుల పూవులు!