Site icon Sanchika

అమ్మకి ప్రేమతో

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన ఎం. జి. సరస్వతీ దేవి గారి ‘అమ్మకి ప్రేమతో’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]వి[/dropcap]వేక్ చెన్నైలో ఒక పెద్ద స్టాప్‌వేర్ కంపెనీ డైరెక్టర్. కంపెనీ సక్సెస్ సందర్బంగా ఫంక్షన్ జరుగుతోంది. అందరి కరతాళ ధ్వనులతో సభ నిండిపోయింది. వివేక్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే తాను చేపట్టిన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. అందరూ చాలా మెచ్చుకున్నారు. సంతోషంగా ఫంక్షన్ జరిగిపోయింది.

కారులో ఇంటికి వచ్చి రాగానే అలసటగా సోఫాలో పడిపోయిండు.

ఇంతలో వివేక్ భార్య శ్వేత వివేక్‌ను చూసి “ఏవండీ” అని లేపగా,  వివేక్ లేచి “పాప పడుకున్నదా” అని అడిగాడు.

“మీ కోసం చూసి చూసి, ఇప్పుడే పడుకున్నదండి”. అని శ్వేత జవాబు ఇచ్చింది.

“అవునా” అంటూ కూతురు లక్ష్మి దగ్గరికి వచ్చాడు. పాపని చూడగానే వివేక్‌కి వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది.

అమ్మ గుర్తుకు రాగానే కళ్ళు చెమ్మగిల్లాయి.

‘అమ్మ లేదు. అమ్మ ఇప్పుడు ఉండుంటే, నా సక్సెస్ చూసి ఎంత సంతోషపడేది’ అనుకుంటూ గతంలోకి వెళ్లాడు.

***

వివేక్‌కి 10 సంవత్సరాల వయసులోనే, అతడు 5వ తరగతి చదువుతున్నప్పుడే వాళ్ళ అమ్మ లక్ష్మి చనిపోయింది. అమ్మలేని జీవితం ఎంత నరకం.

లక్ష్మి సిద్దిపేటలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. లక్ష్మికి ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. వాళ్ళ నాన్న పూజారి. వాళ్ళ అమ్మది కూడా పెద్ద ఫ్యామిలీ. నలుగురు చిన్నమ్మలు, నలుగురు మామలు అమ్మమ్మ, తాతయ్య ఉండేవారు. లక్ష్మి వాళ్ళ మామలు ఉద్యోగం కోసం  సౌదీ అరేబియా వెళ్లారు.

లక్ష్మికి పెళ్ళీడు వచ్చాకా, వాళ్ళ నాన్న, – దుబాయ్ నుంచి వచ్చిన ఆమె చిన్న మామయ్యతో లక్ష్మికి పెళ్లిచేశారు. ఆ విధంగా లక్ష్మికి తన చిన్న మామయ్య వెంకన్న మామతో పెళ్లయింది.

చాలా సంతోషంగా కాలం గడుపుతుండగా, లక్ష్మి భర్త వెంకన్న మామ జ్వరంతో చనిపోయాడు. దాంతో లక్ష్మికి కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత లక్ష్మీ పుట్టింట్లోనే ఉండిపోయింది.

లక్ష్మి తెల్లగా చాలా అందంగా ఉండేది. పొడవాటి జడతో చాలా అందంగా ఉండేది. చాలా ఆకర్షణీయంగా కనిపించేది. ఎప్పుడూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ ఉండేది.

సడన్‌గా భర్త చనిపోయేసరికి ఒంటరి అయిపోయింది. ఏమి చేయాలో తెలియక దిగులుతో బతికేది. అయితే లక్ష్మికి అనుకోకుండా అంగన్వాడి టీచర్ జాబ్ వచ్చింది.

అప్పటినుండి లక్ష్మీ జాబ్ చేసుకుంటూ, స్వతంత్రంగా బతకడం అలవాటు చేసుకుంది. అయితే లక్ష్మీ స్వతహాగా చాలా తెలివిగల అమ్మాయి. తన తప్పు లేకుంటే ఎవరికైనా కరెక్ట్ గా జవాబు ఇచ్చేది. చిన్న వయసులోనే భర్త చనిపోవడం వలన, ఒంటరిగా ఉన్న లక్ష్మికి మళ్లీ సంబంధం చూశారు పెద్దలు.

అలా లక్ష్మికి వేరే ఒక అబ్బాయితో పెళ్లి జరిగింది. అతనికి అప్పటికే భార్య చనిపోయి ముగ్గురు పిల్లలు ఉండడం వలన అతను లక్ష్మిని చేసుకున్నాడు

తరువాత లక్ష్మికి ఒక కొడుకు పుట్టడం జరిగింది. అతడే వివేక్.

లక్ష్మీ కొన్ని రోజులు అత్తారింట్లో ఉంది. అత్తారిల్లు తను ఉద్యోగం చేసే ప్రాంతానికి దూరం కావడం వలన, తన ఉద్యోగం కోసం పుట్టింటిలోనే ఉండిపోయింది లక్ష్మి.

లక్ష్మి భర్త అప్పుడప్పుడు వచ్చి పోతుండేవాడు. ఐతే తన తల్లి తండ్రులు పెద్దవారై చనిపోవడం, ఆ తరువాత తల్లి గారి ఇంట్లో తమ్ముడు, అన్న వాళ్ళ భార్యలతో తరచుగా గొడవలు జరగుతుండటం, తరువాత తమ్ముడి భార్య కూడా ప్రమాదంలో చనిపోవడం లాంటి సంఘటనలు లక్ష్మికి బాధని, చికాకును తెప్పించి, తనకంటూ సొంతంగా ఇల్లు కొనుక్కొని, వేరే ఇంట్లో ఉండాలి అని అనుకుంది. తర్వాత ఒక ఇల్లు కొనుక్కొని అందులోకి మారిపోయింది.

లక్ష్మి తన కొడుకు వివేక్‌ను చాలా అల్లారుముద్దుగా పెంచేది. ఏది కావాలన్న, లేదు అనకుండా ఇప్పించేది. తనకున్న దాంట్లోనే కొంచెం ఎక్కువగా కొడుకు కోసం ఖర్చు పెట్టేది.

అయితే ఈ విధంగా సంతోషంగా గడుపుతున్న సమయంలో, అంగన్వాడి స్కూల్లో మంచిగా డ్యూటీ చేస్తుంటే లక్ష్మికి అప్పుడప్పుడు జ్వరం రావడం మొదలైంది. జ్వరమే కదా తగ్గుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తూ, టాబ్లెట్ వేసుకుంటూ ఆ రోజుకి విశ్రాంతి తీసుకునేది.

ఒకనాడు లక్ష్మికి బాగా జ్వరం వచ్చింది. ఊరిలోని డాక్టర్‌ని కలిస్తే కొన్ని పరీక్షలు చేసుకోమన్నాడు. ఆ పరీక్షల కోసం తమ్ముడు సంతోష్, సరస్వతి చిన్నమ్మ లక్ష్మిని హైదరాబాద్ లోని యశోదా దవాఖానకి తీసుకొని పోగా, దావఖానలో లక్ష్మికి గొంతు క్యాన్సర్ అని చెప్పారు. ఆ మాట విని అందరూ ఎంతో బాధపడినారు.

గొంతు ఆపరేషన్ చేయడం వల్ల కాన్సర్ తగ్గే అవకాశం ఉంది అని డాక్టర్ చెప్పినాడు. కానీ దానికి 300000 ఖర్చు అవుతుంది అని చెప్పినారు. అయితే ఇంకొక మిత్రుడి సలహా మేరకు యశోద హాస్పిటల్ వద్దని, బసవతారకం కాన్సర్ దవాఖానలో చేర్చారు లక్ష్మిని.

ఆపరేషన్ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో అని లక్ష్మికి ఆ వారం రోజులు తనకి ఇష్టమైనవి తిననిచ్చినారు.

తర్వాత ఆపరేషన్ అయినది, చిన్నమ్మలు, అన్నలు అందరూ వచ్చినారు.

వివేక్ బాధపడినాడు. సరస్వతి అమ్మమ్మ ఏమి కాదు అని ఓదార్చింది. ఆపరేషన్ తర్వాత లక్ష్మికి చాలా ఇబ్బంది అయినది. అన్నము తినడానికి కూడా ఇబ్బంది ఉండేది కానీ నొప్పి కొంచం ఉపశమనం ఉండి మెల్లిగా మాట్లాడుతూ ఉండేది.

కానీ సంవత్సరము లోపలే మళ్ళీ గొంతు నొప్పి ఎక్కువయినది. మళ్లీ హాస్పిటల్ కి వెళ్ళినారు.

డాక్టర్‍లు పరీక్షలు చేసి “గతంలో చేసిన ఆపరేషన్ సక్సెస్ కాలేదు. మళ్లీ ఆపరేషన్ చేయాలి” అని చెప్పారు. కానీ దాని మీద కూడా నమ్మకం లేదు, బతకడం కష్టం అని చెప్పారు.

అందరూ చాలా బాధపడ్డారు. ఏడ్చారు.

లక్ష్మికి ఆపరేషన్ అయినది. ఆపరేషన్ తరువాత అన్నము మొత్తానికే తిననీకి రాలేదు. ముక్కు ద్వారా పైపులు వేసి డ్రింక్స్, లిక్విడ్ ఫుడ్డు తినిపించినారు.

తర్వాత ఒక సంవత్సరము బ్రతికినాది. ఆ టైంలో కూడా ఎన్నోసార్లు కీమోథెరపీ ఇచ్చినారు. ఎన్నో బాధలు పడినాది. అయినా దేవుడు కరుణ చూపలేదు. దయ చూపలేదు.

వివేక్ ఏడ్చినాడు. అమ్మకు ఏమవుతుందో అందరిని అడిగినాడు. ఏమీ కాదు లక్ష్మి బతుకుతాది అని అందరు వివేక్‍తో చెప్పినారు.

లక్ష్మికి కూడా బ్రతకాలని ఆశ. అందుకోసం చాలా కష్టపడినాది.

దేవుడు దయ చూపలేదు. అలా లక్ష్మి రెండేండ్లు కాన్సర్‌తో పోరాడి చనిపోయినది.

తర్వాత వివేక్ వాళ్ళ నాన్న కూడా వివేక్ కి దూరంగానే ఉన్నాడు.

అమ్మమ్మ, మామయ్యల సహకారంతో వివేక్ చాలా కష్టపడుతూ చదువుకున్నాడు. ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నాడు. అమ్మా, నాన్న లేకున్నా, చాలా కష్టపడుతూ చదువుకున్నాడు.

తన అమ్మ పేరు నిలబెట్టాలని, కష్టపడి ఇష్టంతో చదువుకున్నాడు. అందరూ మామయ్యలు, అమ్మమ్మలు సహాయముగా ఉన్నారు.

అలా కష్టపడి పెద్ద స్థాయికి వచ్చినాడు. కంపెనీ పెట్టినాడు.

***

ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్న వివేక్‌కు వాళ్ల ఫ్రెండు శివప్రసాద్ ఫోన్ చేసి, “మన ప్రాజెక్టు సక్సెస్ అయినది కదా, మనీ 20 కోట్లు వస్తుంది” అని చెప్పినాడు. సంతోషంతో “ఏం చేద్దాం రా వివేక్?” అని అడిగినాడు.

అప్పుడు వివేకు “మా అమ్మ క్యాన్సర్ వ్యాధితో చనిపోయినది. ఆ మా అమ్మ లాగా ఎవరు చనిపోవద్దు. అందుకే ఆ డబ్బుతో ఒక ఆస్పత్రి కట్టిస్తాను” అన్నాడు.

“అవునురా నాకు కూడా తెలుసు, అమ్మ ఎంత బాధపడ్డదో.  అమ్మ లాగా అక్కడ ఎంతమంది బాధపడుతున్నారో పాపం. వాళ్ళ కోసం ఏదైనా చేయాలి. అలాగే చేద్దాం” అని చెప్పినాడు శివప్రసాద్.

అప్పుడు వివేక్ తన బిడ్డ లక్ష్మిదీపను చూస్తూ, ‘అమ్మా ఈ విధంగా నీ రుణము నేను తీర్చుకుంటున్నాను. ఆశీర్వదించు’ అని తలుచుకున్నాడు.

తర్వాత హాస్పిటల్ కట్టి దానికి లక్ష్మీ దీప హాస్పిటల్ అని పేరు పెట్టాడు.

తరువాత కాలంలో వివేక్ ఆ హాస్పిటల్‌లో జాయిన్ అయిన క్యాన్సర్ పేషెంట్లకు ఎంతో సహాయకరంగా ఉండేవాడు. వారికి ఉచిత వైద్యం, మందులు మాత్రమే కాకుండా, Ensure డబ్బాలు కొనుక్కోడానికి కూడా డబ్బులు ఇచ్చేవాడు.వివేక్ దాత్రుత్వ గుణాన్ని ఎంతో మంది అభినందించారు. మెచ్చుకున్నారు .

ఆ హాస్పిటల్ వార్షికోత్సవ సభ జరిగింది.

ఆ కార్యక్రమానికి ఆ జిల్లా కలెక్టర్ అతిథిగా వచ్చి వివేక్‍౬ని చాలా అభినందిస్తూ, “కన్నబిడ్డలు ఉండి కూడా తల్లిదండ్రులను చూడని ఈ రోజుల్లో, నువ్వు మీ అమ్మ కోసం, మీ అమ్మ పేరుమీద ఎందరో అభాగ్యులకు నీడనిచ్చినావు” అని అభినందించాడు.

ఫ్రెండ్స్ అందరు కూడా “నీతోనే ఉంటాము, నీకు చేదోడు వాదోడుగా ఉంటాము, క్యాన్సర్ పేషెంట్ల బాధలు తీరుస్తాము” అని మాట ఇచ్ఛారు.

ఆ సభకి హాజరైన ఒక సినిమా నిర్మాత “వివేక్ గారు మీ కథ చాలా బాగున్నది. మేము సినిమా తీద్దామనుకుంటున్నాం” అని అడిగాడు.

అప్పుడు వివేకు “థాంక్స్ యు సార్. మీరు సినిమా తీస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. తియుండ్రి. దీనితో స్ఫూర్తి పొంది కొంతలో కొంతమంది అన్న తమ తల్లిదండ్రులను అనాధాశ్రమంలో పంపకున్నా,

తమ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకున్నా నాకు సంతోషమే” అని చెప్పాడు.

తరువాత  వివేకు తన భార్య, పిల్లలతో అమ్మ ఫోటో దగ్గరికి పోయి, “నువ్వు మా మధ్య లేకున్నా,  నీ పేరు మీద పెద్ద ఆస్పత్రి కట్టినాను. ఎక్కడ ఉన్నా మమ్మల్ని ఆశీర్వదించు అమ్మా” అని బాధపడుతుండగా

వివేక్ వాళ్ళ ఊరు అతను వచ్చి – “నువ్వు ఏమి బాధపడకు, మీ అమ్మ ఎక్కడున్నా, మీ అమ్మ ఆశీర్వచనాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ అమ్మనే నీ కడుపులో పుట్టింది. నీ బిడ్డ దీపనే లక్ష్మీ దీప. మీ అమ్మ పేరు వెంకటలక్ష్మి అని ఉండే. కానీ లక్ష్మి తన పేరుకు దీపాన్ని పెట్టుకొని, లక్ష్మీ దీపా అని చేసుకుంది. లక్ష్మీ దీపంలా వెలిగి అందరికీ వెలుగునివ్వాలి అని అనుకున్నది. పాపం దురదృష్టం తనను వెంటాడి చిన్నవయసులోనే చనిపోయినది” అని అన్నాడు.

ఆ ఊరి సర్పంచి వాళ్లు కూడా చాలా బాధపడినారు.

“లక్ష్మి కోసం వాళ్ళ చిన్నమ్మలు, వాళ్ళ అన్నలు, బాబాయిలు అందరూ చాలా హెల్ప్ చేసినారు. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డారు. కానీ ఫలితం లేకపోయింది” అని చాలా బాధపడ్డారు.

“చిన్న వయసులోనే తల్లి చనిపోయినా తండ్రి చూడకున్నా నువ్వు కష్టపడి ఇంత ప్రయోజకుడివి అయినావు, మీ అమ్మ పేరు నిలబెట్టినావు, నువ్వు గ్రేట్” అని సర్పంచ్ వాళ్ళు చాలా చాలా పొగిడినారు.

అమ్మమ్మ, తాతాలు, బాబాయిలు, చిన్నమ్మలు, మామలు, అత్తలు అందరూ కూడా వివేక్ సక్సెస్ చూసి చాలా సంతోషించినారు.

దీప పేరు నిలబెట్టినావు అని చాలా సంతోషించినారు.

సర్పంచ్ వివేక్‌తో “నీలాగా ఎంతమంది ఉంటారు, ఈ కాలంలో. తల్లిదండ్రులు కోరుకునేది ఏమున్నది కాసంత ప్రేమ, అంతే కదా. బంగారము పెట్టినా కూడా వాళ్ళు ఇప్పుడు తినలేరు. కాస్త ప్రేమతో కొంచెం ముద్ద పెడితే చాలు. వాళ్ళ కడుపు నిండుతుంది. కానీ ఇంత మంచిగా ఎవరు ఆలోచిస్తలేరు. అందరు అనాథాశ్రమాలకే పంపిస్తుండ్రు. మణులు, మాణిక్యాలు అడగలేదు తల్లిదండ్రులు. చిన్నప్పటినుంచి కష్టపడి కడుపుల పెట్టుకొని పెంచితే, వాళ్లు తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు పంపుతుండ్రు. ఇది ఎంతవరకు న్యాయం. మీ యొక్క ఈ యొక్క సినిమా చూసిన తర్వాత కూడా జనాల్లో కొంచెం మార్పు వచ్చి, కొంతమంది మారినా చాలు. ఆ వృద్ధ తల్లితండ్రులు ఎంతో సంతోష పడతారు” అని సర్పంచ్ వివేక్‌ని చాలా మెచ్చుకున్నాడు.

“నేను మెప్పు కోసం చేయలేదు. మా అమ్మ కోసం చేసాను. మా అమ్మను ఇంతమందిలో చూస్తున్నాను. అందుకనే ఈ యొక్క పని మొదలు పెట్టినాను. ఇది సక్సెస్ అయ్యి వాళ్ళందరిలో ఎంతో కొంతమందయినా బాగుపడితే చాలు నాకు సంతోషము” అని వివేక్ చెప్పాడు.

 వివేక్ మళ్ళీ మాట్లాడుతూ  “నా కథ ఇది. మా జీవిత చరిత్రను తెలుసుకున్న వాళ్ళు, ఏ విధంగా తల్లిదండ్రులను చూసుకోవాలో గమనించి, కొంతమందిలో మార్పు వచ్చి, ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ప్రేమగా ఆదరణతో చూసుకోవాలి. అమ్మానాన్నలని అనాథాశ్రమమాలకు పంపెయ్యవద్దని, తల్లిదండ్రులకు ద్రోహం చేయవద్దని, మనసారా వాళ్లకు ప్రేమనిచ్చి, వాళ్ళు తృప్తిగా, సంతోషంగా బతకడానికి, వాళ్ల కోసం కొంచెం టైంను కేటాయించదామని కోరుకుందాము. అలాగే నేను ఈ హాస్పిటల్‌ను కూడా మా అమ్మకు నా నివాళిగా అర్పిస్తున్నాను” అన్నాడు.

శ్వేత వచ్చి “బాధపడకండి. ఇంతమందిలో మీ అమ్మ ఉన్నది. మీరు బాధ పడవద్దు. మీ సక్సెస్ చూసి సంతోషిస్తది, బాధపడద్దు” అని పాప లక్ష్మీ దీపను తీసుకొచ్చి ఇచ్చింది.

వివేక్ కూతురిని తీసుకొని ‘అమ్మా’ అని ఎత్తుకున్నాడు.

దేవుడు అమ్మని తీసుకపోయినా, పాప రూపంలో వివేకు న్యాయం చేసినాడు అనిపిస్తుంది.

ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల కోసం దాన ధర్మాలు చేయకున్నా, వారి కోసం రోజూ కొంచెం సమయం కేటాయించి, సమయం గడిపితే చాలు. ఆ తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. అదే ఆ ముసలి తల్లి తండ్రుల జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి.

Exit mobile version