Site icon Sanchika

అమ్మకు నేనేం చేశాను

[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘అమ్మకు నేనేం చేశాను’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]క[/dropcap]డుపున ఆకారం చేరిందనగానే
అమ్మ రూపం కొత్త అందాలు సంతరించుకుంది
నడుము వంపులు మాయమైనాయి
నాకోసం ఆ కళ్ళల్లో ఎన్ని కలలో
ఆశలో, కోరికలో కదా
ఇష్టాలన్నీ వదులుకుంది నా కోసం
రుచులు మార్చుకున్నది నా కోసం
చీర కట్టు మార్చుకుంది నా వీలు కోసం
పెరుగుతున్న నన్ను రోజూ రోజూ
తడిమితడిమి చూసుకునేది
నవ మాసాలు నిండి
భూమ్మీద పడగానే
అరమూసిన కన్నులతో ఆశగా
ఆనందంగా చూసుకుంది
ప్రాణమైన తన ప్రాణంవైపు
తన రక్తాన్ని పాలుగా మార్చి
నా ఆకలిని తీర్చింది
దుఃఖాలన్నీ తనలో దాచుకొని
ఆనందాలను నాకు పంచింది
తప్పులన్నీ తనమీద వేసుకొని
తప్పటడుగులను సరి చేసింది
మంచినినేర్పి గురువయింది
కోరివన్నీ ఇచ్చింది నాకోసం
తను ఏమి లేనిదయింది
అయినా చిరునవ్వు చెదరనీయలేదు
ఉన్నతంగా చదివించింది
విదేశాలకు వెళతానంటే
రెప్పలచాటున కన్నీళ్ళను దాచి
ఆనందంగా వీడుకొలిపింది
అప్పుడు నాకు తెలియలేదు
అమ్మ ఆనందంలోని దుఃఖం
నాకు కనబడలేదు
మళ్ళీ నేనొచ్చేటప్పటికి
అమ్మ జ్ఞాపకాలే మిగిలాయి నాకు
అమ్మకు ధనంతో పనిలేదు
ఒక్క చిరునవ్వుతో పలకరింపు
అమ్మ అన్నపిలుపే
అనంత ధనరాసులపెట్టామెకు
ఆ అదృష్టాన్ని దూరం చేసుకోవద్దు
కాలం గతించినతరువాత
ఇంత చేసిన అమ్మకు నేనేం చేశాను
అని నిన్ను నువ్వు ప్రశ్నించుకునే
దశకు రాకు నీ మీద నువ్వే జాలిపడే
స్థితిని రానీయకు.

Exit mobile version