[dropcap]శ్రీ[/dropcap]మతి దాసరి శివకుమారి రచించిన నవల ‘అమ్మకు వందనం’. ‘కందుకూరి నవలా పురస్కారం’ గెలుచుకున్న ఈ నవల – విద్యాబోధన ఎలా సాగితే పిల్లలకు ఉపయుక్తంగా ఉంటుందో సూచిస్తుంది.
~
“విద్యార్థులందరూ ఒకే మాదిరిగా ఉండరు. కొందరు బుద్ధిమంతులుంటారు. అల్లరి పిల్లలు కొందరుంటారు. తెలివిగలవాళ్లు కొందరుంటే, మందమతులు మరికొందరు కనిపిస్తారు. విద్యార్ధి ఎలాంటి వాడయినా అతనికి విద్య పట్ల ఆసక్తిని రేకెత్తించి, ఉత్తమ పౌరునిగా, మానవతా విలువలు కలిగిన మంచి మనిషిగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రపంచ దేశాల ఉపాధ్యాయులది, తల్లిదండ్రులది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించే క్రమంలో ఎన్నో సమాధానాలు దొరకని ప్రశ్నలు, మరెన్నో జవాబులు లేని ప్రశ్నలు ఎదురౌవుతాయి. అలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానంగా శ్రీమతి దాసరి శివకుమారి ‘అమ్మకు వందనం’ రచించారు. గతంలో ఎవరూ స్పృశించని అంశాన్ని ఇతివృత్తంగా స్వీకరించినందుకు ముందుగా వారిని అభినందించవలసిందే.
సంపూర్ణమైన వ్యక్తిత్వం, సృజనాత్మకమైన బుద్ధి, దేశభక్తి మరెన్నో ఉన్నత విలువలు కలిగిన పౌరులుగా విద్యార్థులు రూపొందడానికి తల్లిదండులు, ఉపాధ్యాయులు ఎలా సన్నద్ధం కావాలో, ఎలాంటి ప్రయత్నాలు చేయాలో రచయిత్రి ఈ నవలలో శాస్త్రబద్ధంగా నిరూపించారు. అంతేకాదు, క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు పెద్దలు ఎంత సంయమనంతో వ్యవహరించాలో, ఎంత ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాలో, ఎలా నిటారుగా నిలబడి ఆదర్శం కావాలో తెలియజేశారు.
ఇతివృత్త స్వీకరణలో వైవిధ్యాన్ని, విషయ నిరూపణలో నైశిత్యాన్ని, పాత్ర చిత్రణలో నైపుణ్యాన్ని ప్రదర్శించి, విద్యాబోధనలో మరో మంచి మార్గాన్ని చూపిన దాసరి శివకుమారి గారి ‘అమ్మకు వందనం’ చేయాల్సిందే.
ఇంకా ఆలస్యం ఎందుకు? నవలను చదవండి, ఆదరించండి. మీ పిల్లలను ఉత్తములుగా పెంచండి. మీరూ సమాజ ప్రగతిలో భాగం పంచుకుంటూ, సవ్య మార్గంలో సంచరించండి.” అని వ్యాఖ్యానించారు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ తమ ముందుమాట ‘మంచి నవల’లో.
~
“సాహిత్యంలో నవలకున్న స్థానం ప్రత్యేకమైనది. ఇదివరకటి రోజుల్లో నవలలను బాగా ఇష్టంగా చదివేవారు. ప్రస్తుత పాఠకులు చిన్న కథ అయితే త్వరగా చదివేయొచ్చు. నవల చదివే తీరిక, ఓపిక ఎక్కడున్నాయనుకుంటున్నారు. కాని ఎన్నో విషయాలను తెలపాలని, కొన్ని సంఘటనల సమాహారాన్ని గుది గుచ్చి రచయితలు పాఠకులకు అందిస్తున్నారు. చిన్న కథల్లో, కథా వస్తువుకే ఎక్కువ ప్రాధాన్యముంటుంది. నవలలో అనేకానేక విషయాలను జొప్పించటం వలన, పాఠకులు కథా వస్తువుతో పాటు తరువాతి కథ ఏమవుతుందో అనే ఉత్కంఠను పొందుతారు. ఈ సందర్భానుసారంగా వచ్చే ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటారు.
ప్రపంచ దేశాల సంస్కృతులలో భారతీయ సంస్కృతి కొక విశిష్ట స్థానమున్నది. ఎందుకంటే అని తనలో వచ్చి కలిసిన సంస్కృతులన్నింటికీ సాదరంగా ఆహ్వానం పలికినా తన అస్తిత్వాన్ని మాత్రం కోల్పోకుండా మరింత విశాల భావాలతో ఒక సజీవ ప్రవాహం లాగా నిరంతరం, అవిచ్ఛిన్నంగా, అమేయంగా ముందుకు సాగుతున్నది కనుక. భారతీయ సంస్కృతి అనే పదం విన్నప్పుడల్లా మనస్సుకు చాలా సంతోషం కలుగుతుంది. ‘యత్ర విశ్వం భవతి ఏకనీడం’, ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే విశ్వజనీనమైన మానవీయ విలువలు స్ఫురణకు వచ్చినప్పుడు ఎవరి మనసు మాత్రం పులకరించదు? అలాగే భారతీయ సంస్కృతీ పునాదుల మీద నిలబడే పాశ్చాత్య విజ్ఞానాన్ని అలవర్చుకోవాలన్న హితబోధ అందరికీ శిరోధార్యమే కదా?
మన సంస్కృతిలో నైతిక విలువలకూ గొప్ప స్థానమున్నది. అలాంటి నైతిక విలువలను ఉపాధ్యాయులు కలిగి వుండి తమ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ దేశభక్తినీ, తోటి వారి పట్ల ప్రేమనూ నేర్పాలి. వాటిని కూడా శిక్షణలో భాగంగా భావించాలి. అలాగే, చెప్పే చదువును ఆటపాటలతో, కథలతో, శారీరిక శిక్షణతో చెప్పినట్లైతే మంచి ఫలితాలను రాబట్టవచ్చు. పర్యావరణ పరిరక్షణ పట్ల స్పందిస్తూ ప్రాణికోటికి కలుషితం కాని, వాతావరణాన్ని అందించవచ్చు. గాంధీజీ బోధనలు భవితకు దిశానిర్దేశాన్ని చేస్తాయి. వాటన్నింటి రూపకల్పనే ఈ ‘అమ్మకు వందనం’ అన్నారు రచయిత్రి శ్రీమతి దాసరి శివకుమారి ‘నా మాట’లో.
~
నవలలోంచి కొన్ని పేరాలు పాఠకుల కోసం:
“అక్కడి నుండి లేచి దగ్గర్లో వున్న హనుమంతుడి గుడికెళ్ళారు. గుడి నుండి ఏభై అడుగులు కిందకి నడిచి కృష్ణమ్మ నీళ్ళలో కాళ్ళు పెట్టారు. పెద్ద పిల్లలు ఒకరి మీద ఒకరు నీళ్ళు జల్లుకోసాగారు. వాళ్లకు జాగ్రత్తగా కాపలా కాసి వెంటనే పైకి తీసుకువచ్చారు. ఆ దగ్గరలోనే జైన బౌద్ధ సౌధాలుంటే వాటి దగ్గరకు తీసుకెళ్లారు. వాటినిప్పుడు అధికారుల అతిథిగృహాలుగా వాడుతున్నారట. అక్కడినుండి మళ్లీ గుడి వెలుపలి మంటపంలోకొచ్చారు. రామలక్ష్మమ్మ తినడానికి మరోసారి ప్లేట్లలో సర్ది ఇచ్చింది. తినటం పూర్తయ్యాక మరలా నది ఒడ్డుకు వచ్చి నిలబడ్డారు. ఆ రావటంలో కాలికొందికీ ఇసుకను తన్నుకుంటూ నడవటం, గుప్పెళ్ళతో ఇసుకను తీసుకుని చిమ్మటం పిల్లలకు మహదానందంగా వున్నది. అందర్నీ జాగ్రత్తగా పడవెక్కించి తీసుకుని వచ్చారు. విహారయాత్ర పూర్తి చేసుకుని అమ్మయ్య అనుకున్నారు
మర్నాడు పిల్లల్ని అడిగారు. నిన్న మనం వెళ్లిన ఊరు పేరేంటి? చాలారోజుల ఎవరు పరిపాలించారని చెప్పుకున్నాం? బాగానే గుర్తుపెట్టుకుని జవాబులు – చిత్రపటాలూ చూపిస్తూ చెప్పటం పెద్దపిల్లలకు అలవాటు చేస్తున్నారు.
రాజరాజేశ్వరి, విద్యాధరి ముందు చదరంగం బాగా ఆడటం అలవాటు చేసుకున్నారు. ఈ ఆటలను నేర్పిస్తూ పిల్లలలో ఏకాగ్రత, జాగ్రత, జ్ఞాపకశక్తి మొదలైన వాటిని పెంచాలని ఆలోచిస్తున్నారు. ముందు పిల్లలకు లెక్కలు నేర్పటానికి కొన్ని పనిముట్లు సమకూర్చుకోవాలనుకున్నారు. సంఖ్యల విలువలను కనుక్కోవటం చాలా ముఖ్యం కనుక చెక్కతో చతురస్రాలూ, ఘనాలూ చేయించి అన్ని భుజాలమీదా సమాన సంఖ్యలు ఏర్పరిచేవాళ్ళు. ఇలాంటి దృశ్యపరికరాల సహాయంతో పిల్లలకు సులభంగా లెక్కలు నేర్పిస్తూ వాళ్ళ జ్ఞాపకశక్తి పెరిగేటట్లు చూశారు. విద్యాధరికి మరీ పిల్లల చదువు, ప్రవర్తన గురించిన ఎవుతుంది. నిద్రపోయిన కాసేపూ ఏం ఆలోచించకుండా వుంటుందో కాని మిగతా సమయమంతా పిల్లలకు ఇంకా నాణ్యంగా ఏమేం నేర్పాలి? దానికోసం ఏయే పద్ధతుల్ని అనుసరించాలి అదే ధ్యాస, అదే శ్వాస అయిపోయింది.
కథలంటే ఇష్టపడని వారుండరు. అందులో పిల్లలకు మరీ ఇష్టంగా వుంటుంది. కథల ద్వారా ఏది మంచో చెడో, ఎవరు దుర్మార్గుడో, ఎవరు మంచివాడో తెలుసుకుంటారు. ఆపదలు వచ్చినపుడు ఉపాయంగా కథలోని వ్యక్తులుగాని, జంతువులుగాని ఎలా బయటపడ్డారో గమనిస్తారు. రాజకుమారులు ఎలా రెక్కలగుర్రం మీద విహరించారో, ధర్మాన్ని ఎలా కాపాడారో, రాక్షసులు ఎలా నాశనమయ్యారో అంతా తెలుసుకుంటారు. ముఖ్యంగా పిల్లలకు ఎంతో మానసిక ఆనందం, వినోదం, విజ్ఞానం అన్నీ దొరుకుతాయి. ఇదంతా ఆలోచించి కొన్ని కథల పుస్తకాలు తెప్పించింది. పంచతంత్ర కథలతోపాటు, అరేబియన్ నైట్స్ కథలూ, యూసఫ్ కథలూ, రామాయణ, భారత భాగవతకథలూ, సంస్కృత అనువాదకథలూ వెతికి వెతికి పట్టుకున్నది. రోజుకొక కథ చొప్పున చెప్పటం అలవాటు చేసుకున్నారు. సోవియట్ బాలల కథలు చెప్తూ ఆ దేశ పరిస్థితులూ, అక్కడి పిల్లల అలవాట్లూ వివరించేది. రామాయణంలో వచ్చే బాలపాత్రలను గురించి వర్ణించేది. పంచతంత్ర కథల్లోని జంతువుల యుక్తినీ, సమయానికి తగ్గట్లుగా నడుచుకునే విధానాన్ని గుర్తుంచుకోమని చెప్పేది. అగ్నికి ఆజ్యం తోడయినట్లుగా విద్యాధరికి తోడు రాజరాజేశ్వరి దొరికింది. పిల్లలకు ప్రపంచాన్ని మొత్తం దర్శింపచేయగలగాలి, సమస్త విజ్ఞానాన్ని ఇప్పటినుంచే తెలుసుకోవటం అలవాటు చేయించాలి అనే ధ్యాస ఇద్దరిలో రోజురోజుకూ పెరిగిపోతున్నది. జీవిత సత్యాలను తెలిపే సుమతీశతకం, వేమన శతకంలోని పద్యాలను కంఠస్థం చేయించసాగారు.”
***
రచన: శ్రీమతి దాసరి శివకుమారి
పేజీలు: 142
వెల: అమూల్యం
ప్రచురణ: గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ, గుంటూరు
ప్రతులకు:
గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ,
3-30-11/4, 2వ లైన్, నలందా నగర్
గుంటూరు 522006
~
శ్రీమతి దాసరి శివకుమారి
301, సాకృత స్పెక్ట్రమ్,
రణవీర్ మార్గ్, సరళానగర్,
జె.ఎం.జె. కాలేజ్ దగ్గర
తెనాలి 522202
ఫోన్: 9866067664