అమ్మలో మరో కోణం

2
2

[‘ప్రేమించు’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను, ‘కంటేనే అమ్మ అంటే ఎలా’ అనే పాటని విశ్లేషిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]

[dropcap]మా[/dropcap]తృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ.. అన్నారు పెద్దలు. మనిషి జన్మకు కారణం తండ్రి అయినా తన రక్తమాంసాలతో ఒక రూపుని కల్పించి, ఈ లోకంలోకి తీసుకువచ్చేది తల్లి. జన్మించిన తర్వాత విద్యాబుద్ధులు నేర్పేవాడు గురువు. అసలు జన్మ అనేదే లేకపోతే గురువే ఉండడు. కనుక జన్మనిచ్చిన తల్లికి ప్రథమస్థానం కల్పించింది సనాతన ధర్మం.

తరతరాలుగా తల్లి అంటే ప్రేమకు, దయకు, త్యాగానికి ప్రతిరూపాలుగా చెబుతారు. నూటికి తొంభైతొమ్మిది మంది తల్లులు ఇలాగే ఉన్నా, ఎక్కడో ఒకరు మాత్రం బిడ్డలో శారీరక సౌందర్యం చూసి, అంగవైకల్యంతో జన్మించిన వారిని అసహ్యించుకుంటూ దూరంగా ఉండే తల్లులు ఉంటారు. ఇలా తల్లిలో ఉండే రెండురకాల కోణాలను ఆవిష్కరిస్తూ ఒక సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా పేరు ‘ప్రేమించు’ (2001). అందులో సందర్భోచితంగా రచించిన ఒక చక్కటి గీతం ఉంది. ఆ గీతాన్ని రచించినది సి. నారాయణ రెడ్డి. ఆ గీతానికి ఆ సంవత్సరం నంది అవార్డ్ కూడా ఇచ్చారు. ఆ పాటను విశ్లేషించే ముందు పాట నేపథ్యం ఒకసారి చూద్దాం.

మీనా పుట్టుకతోనే అంధురాలు. కానీ చూడచక్కని రూపం. కష్టపడి ‘లా’ కోర్స్ చేస్తూ ఉంది. ఆమెకు అన్నివిధాలా సహకరిస్తూ ఉంటాడు తండ్రి. తల్లి లేదు. పేదరికం అయినా డిపార్ట్మెంటల్ స్టోర్  నడుపుతూ వచ్చిన డబ్బుతో కూతురిని చదివిస్తూ ఉంటాడు తండ్రి. తండ్రీకూతుళ్ళ మంచితనం తెలిసిన ఇరుగుపొరుగువారు కూడా వారితో స్నేహంగా, మంచిగా ఉంటూ ఉంటారు.

ఇలా ఉండగా సురేష్ అనే లక్షాధికారి కొడుకుతో పరిచయం ఏర్పడుతుంది మీనాకి. సురేష్ లక్షాధికారి అయినా గర్వం లేకుండా అందరితో స్నేహపూరితంగా ఉంటూ ఉంటాడు. మీనా స్వచ్చమైన మనసు, వ్యక్తిత్వం చూసి ఆమెని ప్రేమించాడు సురేష్. సురేష్‌కి తల్లి లేదు, మేనత్త కౌసల్యాదేవి అతడిని తల్లిలా చూసుకుంటూ ఉంటుంది. ఐశ్వర్యవంతురాలిననే అహంకారం ఆమె ప్రతి మాటలోనూ కనబడుతూ ఉంటుంది. తన అంతస్తుకి తగ్గ ఏ కోటీశ్వరుడి కూతురినో సురేష్ కిచ్చి వివాహం చేయాలనే తలంపుతో ఉన్న ఆమెకి, అతడు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడనీ, ఆమె అంధురాలు అని తెలిసే సరికి అసహ్యంతో ఒళ్ళు జలదరించింది. ఎలాగైనా మేనల్లుడికి ఆమెను దూరం చేయాలని వచ్చింది.

మీనా షాపు దగ్గరకు వచ్చి వేలితో తలుపు తట్టి, “మీనా!” అని పిలిచింది కౌసల్యాదేవి.

“ఎవరూ!” అడిగింది మీనా.

“నేను కట్టుకున్న చీర, వేసుకున్న జ్యుయలరీస్ చూస్తే కళ్ళున్నవాళ్ళు ఎవరైనా గ్రహిస్తారే నేను కోటీశ్వరురాలివని!.. ఓ! నువ్వు గుడ్డిదానివా?” కావాలనే వ్యంగ్యంగా అన్నది.

కౌసల్యాదేవి కావాలని విసిరిన వ్యంగ్య బాణం మీనా గుండెల్లో లోతుగా గుచ్చుకుంది. బాధని బలవంతాన గుండెలోనే నొక్కిపట్టి “అవును. కానీ కళ్ళున్న వాళ్ళు కూడా కొత్తవారు పేరుపెట్టి పిలిస్తే ‘మీరు ఎవరు?’ అనే అడుగుతారు” అన్నది నిబ్బరంగా.

“గుడ్డిదానివైనా గడుసుదానివే!” మళ్ళీ మరో వ్యంగ్యబాణం విసిరింది కౌసల్యాదేవి.

“ఇంతకీ మీకు ఎవరు కావాలి?”

“నువ్వు మా సురేష్‌కి దూరం కావాలి”.

“మీరు సురేష్ మేనత్త అన్నమాట”

“అంతేకాదు, వాడి పెంపుడు తల్లిని కూడా. వాడి పెళ్లి లక్షణమైన అమ్మాయితో జరగాలని కోరుకునేదాన్ని. ప్రేమ పేరుతో ఓ కిరాణాకొట్టు కళ్ళులేని పిల్ల వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే చూస్తూ ఊరుకునేదాన్ని కాదు. ఈ కుంటి, గుడ్డి, మూగ, చెముడు వాళ్ళంటే నా కసహ్యం. నీకో విషయం తెలుసా? నా కన్నబిడ్డ పుట్టుగుడ్డి అని తెలిసినప్పుడు దాన్ని కోర్టు మెట్లమీదే వదిలేనిసినదాన్ని. పెంచుకుందామని పట్టుబట్టినందుకు భర్తతో కూడా విడాకులు తీసుకునున్నదాన్ని. సరి.. సరి.. ఇంతకీ నీ గుడ్డిప్రేమ విలువెంతో ఈ బ్లాంక చెక్ మీద రాసుకుని తీసుకో. సురేష్‌ని శాశ్వితంగా మర్చిపో!” బ్లాంక్ చెక్ ఆమె చేతిలో పెట్టి చరచరా వెళ్ళిపోయింది కౌసల్య. ఆమెని తన తల్లిగా గుర్తించింది మీనా. నీళ్ళు కారుతున్న కళ్ళతో చెక్ పట్టుకుని స్థాణువులా నిలుచుండిపోయింది.

ఓ రోజు సురేష్ కనబడి “మీనా! రేపు మా అత్తయ్య పుట్టినరోజు. నిన్ను కూడా ఫంక్షన్‌కి తీసుకు వెళతాను. అక్కడే మన ప్రేమ గురించి అత్తయ్యతో చెబుతాను” అన్నాడు. సరేనంది. పుట్టినరోజు ఫంక్షన్‌కి ఇద్దరూ వెళ్ళారు. ఇల్లంతా రంగురంగుల దీపాలతో అలంకరించారు. కేక్ కట్ చేశారు. అందరి కోరిక మీద సురేష్ పాట పాడసాగాడు ఇలా..

“కంటేనే అమ్మ అని అంటే ఎలా?
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నఅమ్మే కదా!”

పది నెలలు కడుపులో మోసి కష్టపడి కనటం గొప్ప విషయమే! అయితే అందరూ స్త్రీలకి ఆ భాగ్యం దక్కదు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా కడుపు పండని వారు కూడా ఉంటారు. అంతమాత్రం చేత వారిలో మాతృహృదయం ఉండదా! కన్నవారే తల్లులు అని అంటే ఎలా! శ్రీకృష్ణుడిని దేవకి కన్నా, పెంచి పెద్దచేసి, ఎవరో కన్నబిడ్డకి తన మమకారం దోసిళ్ళతో పంచిపెట్టింది యశోద. అందుకే కన్నప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అంటారు. శ్రీకృష్ణుడు కూడా తాను యశోదా నందనుడననే చెప్పుకున్నాడు. ఈ పాటలో కథానాయకుడు కూడ అదే విషయం చెబుతున్నాడు. కరుణతో చూసే ప్రతి స్త్రీ కన్నతల్లి వంటిదే! ఆమె అతని దృష్టిలో దేవత లాంటిది. అందుకు ఉదాహరణగా మరో రెండు విషయాలు చెబుతున్నాడు.

“కణకణలాడే ఎండకు శిరసు మాడినా
మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ!
చారెడు నీళ్ళయిన తాను దాచుకోక
జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ!
ఆ అమ్మలనే మించిన మా అమ్మకు
ఋణం తీర్చుకోలేను ఏ జన్మకూ!”

నిండువేసవిలో సూర్యుడి ఎండ తలని, వేడిక్కిన నేల కాళ్ళను మండిస్తూ ఉంటుంది. మండుటెండలో నడిచి నడిచి అలసిపోయిన బాటసారి చెట్టునీడకు చేరతాడు. చల్లటి నీడని, చల్లటి గాలిని ఇచ్చి సేదతీరుస్తుంది చెట్టు. కానీ కణకణమండే ఎండకి తన తల మాడిపోతున్నా, తన నీడకి చేరిన వారిని చల్లగా సేదతీర్చే చెట్టు తల్లితో సమానం అని అతడి భావన. అంతేకాదు నల్లమబ్బుల నిండా నీరు ఉంటుంది. ఆ నీటినంతా వర్షం రూపంలో ప్రపంచానికి ఇస్తుంది కానీ ఒక గుక్కెడు కూడా తను తాగదు మబ్బు. అలా నిస్వార్ధంగా ప్రజల దాహం తీర్చే మబ్బు కూడా తల్లి లాంటిదే!

నేను కూడా బాల్యంలో పేదరికంలో పెరిగాను. మా అమ్మ పెరట్లో కాసిన నాలుగు బెండకాయలతోనే కూర చేసేది. అది సరిగ్గా ఒక మనిషికి మాత్రమే  సరిపడేటంత ఉండేది. అది నాకు వడ్డించి తను ఆవకాయ కలుపుకునేది. “కూర నువ్వు వేసుకోలేదేమ్మా!” అని అడిగితే “వద్దు నాన్నా! నాకు బెండకాయ సహించదు” అనేది. నిజమే కాబోలు అనుకునేవాడిని. పెద్దయిన తర్వాత ఆమె నిస్వార్థత, ప్రేమ అర్థం అయ్యాయి నాకు. అలాగే చెట్టు, మబ్బు తమకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ప్రజల సుఖం కోసమే నీడని, నీటిని ఇస్తాయి అని చెబుతున్నాడు నాయకుడు. ఆ అమ్మల కన్నా మించినది మా అమ్మ, అటువంటి తల్లి ఋణం ఏ జన్మకూ తీర్చుకోలేను అని అంటున్నాడు. ఎందుకంటే తల్లి లేని తనను మేనత్త కన్నతల్లిలా పెంచి ఇంతవాడిని చేసింది. కాబట్టి ఆమె కనకపోయినా తల్లితో సమానం అని అతడి భావన. అయితే కధానాయిక ఉద్దేశం మరోలా ఉంది. ఆమె ఇలా పాడుతూ ఉంది.

“కంటేనే అమ్మ అని అంటే ఎలా?
కడుపుతీపి లేని అమ్మ బొమ్మేకదా, రాతిబొమ్మే కదా!”

కన్నంత మాత్రాన తల్లులు అనిపించుకునే అర్హత అందరికీ ఉండదు. ఇంకా మాటలు రాని పసికూన ఆకలి తెలుసుకుని, కడుపు నింపి, నిద్రపుచ్చి, నిద్రలో ఉలికిపడితే ఇక్కడే ఉన్నాను, భయం లేదు అని చెప్పినట్లుగా దగ్గరకు తీసుకుని లాలించే తల్లే నిజమైన తల్లి. ఒక్కమాటలో చెప్పాలంటే కోడి తన రెక్కల మాటున పిల్లని దాచి సంరక్షించినట్లుగా తల్లి కూడా బిడ్డని సంరక్షించాలి. అటువంటి కడుపుతీపి లేకుండా, పుట్టిన శిశువు ఆలనాపాలనా చూడకుండా వదలివేసే స్త్రీకి తల్లి అనిపించుకునే అర్హత ఉండదు. కర్ణుడు పుట్టగానే గంగలో వదిలివేసింది కుంతి. వదిలివేసిన బిడ్డను కాపాడి సంరక్షించింది రాధ. అందుకే కర్ణుడు తను రాధాసుతుడనే చెప్పుకున్నాడు తన జన్మరహస్యం తెలిసిన తర్వాత కూడా.

ఇక్కడ నాయికకు తల్లిమీద అలాంటి అభిప్రాయం కలగటానికి కారణం నాయిక పుట్టటం తోనే అంధురాలిగా పుట్టింది. “ఈ గుడ్డిపిల్ల నాకు అక్కరలేదు. నేను పెంచను” అని భర్తతో చెప్పింది తల్లి. అందుకు అంగీకరించని భర్తతో విడిపోవటానికి కూడా సిద్ధపడింది. కానీ “బిడ్డ బాధ్యత తల్లిదే! తల్లీబిడ్డలను విడదీసే హక్కు ఎవరికీ లేదు” అని కోర్టు తీర్పు ఇచ్చింది. “కోర్ట్ తీర్పు ఇచ్చింది గానీ, నన్ను ఒప్పించలేదు. ఈ గుడ్డిపిల్ల అంటే నాకు అసహ్యం” అని కోర్ట్ మెట్ల మీదే వదిలేసి వెళ్ళిపోయింది. అందుకే కన్నంత మాత్రాన తల్లికాదు అని చెబుతుంది నాయిక. ఇంకా ఇలా అంటున్నది.

“ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా
మేడకున్న అసలు ఉనికి ఆ పునాది పైనే!
సిరుల జల్లులో నిత్యం పరవశించినా
మగువ జీవన సాఫల్యం మాతృత్వం లోనే!
ప్రతి తల్లికి మమకారం పరమార్థం
అది లేని అహంకారం వ్యర్థం వ్యర్థం!”

ఎన్నో అంతస్తులతో ఆకాశాన్ని అంటుతున్నట్లు సగర్వంగా తలలెత్తి నిలబడిన మేడ అయినా, దాని పునాది మాత్రం నేలమీదే ఉంటుంది గానీ ఆకాశంలో ఉండదు. అలానే ఎనలేని సిరిసంపదలతో తులతూగుతున్నా కూడా  ఏ స్త్రీ అయినా మాతృమూర్తి అనిపించుకుంటేనే ఆ జన్మకు సాఫల్యం. స్త్రీ చెల్లిగా, భార్యగా, ప్రియురాలిగా, స్నేహితురాలిగా అనేక రూపాల్లో ఉన్నా, ప్రధానంగా మాతృమూర్తి. పిల్లలపట్ల మమకారం రక్తంలో ఇంకిపోయి ఉండాలి. అవేమీ లేకుండా సిరిసంపదలు చూసుకుని గర్వించే స్త్రీ జీవితం గెల వేయని అరటిచెట్టు లాంటిది. గెలవేయని అరటిచెట్టుని కొట్టేస్తారు. అలాగే మాతృప్రేమ లేని స్త్రీ జీవితం వ్యర్థం. ఆమె అహంకారం కూడా వ్యర్థం అని నాయిక భావన.

ఇదీ ఆ గీతం. ఈ పాటని ‘ప్రేమించు’ చిత్రం కోసం సి.నారాయణ రెడ్డి రచించగా, యం.యం. శ్రీలేఖ సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం, చిత్ర గానం చేశారు. ఇందులో సురేష్‌గా సాయికిరణ్, మీనాగా లయ, కౌసల్యాదేవిగా సీనియర్ నటి లక్ష్మి నటించారు. ఈ సినిమాలో అచ్చమైన తెలుగుతనంతో విరబూసిన మల్లెపువ్వులా లయ, పొటమరించిన యవ్వనంతో అందాల చందమామలా సాయికిరణ్ కనువిందు చేశారు.

ఈ పాట రాసిన నారాయణ రెడ్డి గారు వీధిబడిలో చదువు మొదలుపెట్టి విశ్వంభర వరకూ ఎదిగిన మహాకవి (సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం ఆయన రచించిన ‘విశ్వంభర’ కావ్యానికి వచ్చింది). నారాయణ రెడ్డి గారి పూర్తిపేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. అంటే ఇంటి పేరు ‘యస్’ తో మొదలు అవ్వాలి. కానీ అప్పట్లో ఉపాధ్యాయులకి తెలుగులో ఉన్నంత పాడిత్యం ఇంగ్లిష్ లో లేదేమో పొరపాటున ఎడ్మిషన్ రిజిస్టర్ లో ‘సి’ అని రాశారు. ఆయన ఆ పేరుతోనే పాపులర్ అయ్యారు. వాస్తవానికి ‘సి’, ‘యఫ్’ సౌండ్స్ ఇచ్చే అక్షరాలు తెలుగుభాషలో లేవు. ఇప్పుడు కూడా చిల్లర భవానీదేవి అని ఒక రచయిత్రి ఉన్నారు. ఆమె ఇంటిపేరు ‘సి.హెచ్.’తో మొదలు అవ్వాలి. కానీ సి.భవానీదేవి అనే పేరుతోనే ఆమె ప్రాచుర్యం పొందారు. అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here