అమ్మమ్మ మడి

8
2

[dropcap]‘అ[/dropcap]మ్మమ్మ బేడ్. అమ్మమ్మ పేద్ధ డెవిల్’ అనుకుంటూ వచ్చాడు వరుణ్ అమ్మ దగ్గరకు.

‘ఏమయిందిరా .. అమ్మమ్మ ఎందుకు బేడ్?’ ఐదేళ్ళ కొడుకును దగ్గరకు తీసుకుంటూ అడిగింది స్వర్ణ.

‘అమ్మమ్మ చాలా పేద్ధ బేడ్’ చేతులు బారజాపి చూపిస్తూ.. ‘పేధ్ధ’ .. నొక్కి చెప్పాడు వరుణ్. ఏదైనా చాలా ఎక్కువ అని చెప్పాలంటే వాడలాగే చూపిస్తాడు. “సరే నాన్నా అమ్మమ్మ బేడే.. మరి ఎందుకు బేడో కూడా చెప్పాలి కదా. అప్పుడే కదా అమ్మమ్మ బేడో గుడ్డో నేను చెప్పగలిగేది” అనునయించింది స్వర్ణ.

“అమ్మమ్మ నన్ను బిటికెట్లు తీసుకోనియ్యలేదు. డోన్ట్ టచ్ అన్నది” బుంగమూతి పెట్టాడు వరుణ్. వరుణ్‌కి మాటలు వచ్చినప్పటినుంచీ బిస్కెట్లని బిటికెట్లనటం అలవాటు. ముందు నోరు తిరక్క, తర్వాత అలవాటయ్యి అప్పుడప్పుడూ అలాగే అంటాడు.

వరుణ్ వాళ్ళు అమెరికాలో వుంటారు. ఏడాదీకో రెండేళ్ళకో కుదిరినప్పుడు వచ్చి తల్లిదండ్రులని చూసి వెళ్తారు స్వర్ణ కుటుంబం. రాకపోకలతో అమ్మమ్మ అలవాటే వరుణ్‌కి, వాడి తమ్ముడు తరుణ్‌కి. పైగా ఎప్పుడో వచ్చే మనవళ్ళంటే చాలా ముద్దు అమ్మమ్మకీ తాతగారికీ. వాళ్ళేది అడిగితే అదే చేస్తారు. అలాంటిది బిస్కెట్ తీసుకోవటానికి వెళ్తే ‘డోన్ట్ టచ్’ అంటుందా. ఉక్రోషం పొడుచుకొచ్చింది వరుణ్‌కి. రెండవవాడు తరుణ్ రెండేళ్ళ పిల్లాడే. అల్లరి చేస్తూ ఆడుకోవటం తప్ప ఏమీ తెలియని పసివాడు.

స్వర్ణ తల్లి మహలక్ష్మమ్మ గారికి ముందంతగా లేకపోయినా పెద్దవుతున్నకొద్దీ, మడీ చాదస్తం పెరుగుతున్నాయి. ఆ రోజు శనివారమని మడితో వంట చేస్తోంది ఆవిడ. మనవళ్ళ కిష్టమైనవన్నీ చేసి పెట్టాలని ఆవిడ తాపత్రయం. అమెరికా పిల్లలు కదా ఏ మూలకైనా వెళ్ళిపోవటం, ఏది పడితే అది తీసుకోవటం వాళ్ళకి అలవాటు. ఒకరి అలవాట్లు ఇంకొకరికి అప్పుడప్పుడూ కొంచెం ఇబ్బంది పెడుతూ వుంటాయి.

“అమ్మమ్మ మడిలో వుంది కదురా. నువ్వక్కడవన్నీ తాకుతావని అని వుంటుందిలే. పోనీ నేనివ్వనా బిస్కెట్స్ నీకు” అనునయించబోయింది తల్లి. “ఊహూ.. నాకేం వద్దు. అమ్మమ్మనే తినమను.” కొడుకు ఉక్రోషానికి నవ్వుకుంది తల్లి స్వర్ణ.

రెండు నిముషాలాగి మొదలు పెట్టాడు వరుణ్ తన ప్రశ్నలు.. “అమ్మా మడి ఏంటి? దాన్ని అమ్మమ్మ ఎక్కడ కట్టుకుంది? కనిపించదేం?”

స్వర్ణ ఒక్క నిముషం ఆలోచనలో పడ్డది. తల్లి ‘మడి కట్టుకున్నాను ముట్టుకోవద్దు’ అని వుంటుంది. కొడుక్కి అదేదో వస్తువు.. అమ్మమ్మ ఏ చేతికో మెడకో కట్టుకుంది, దాన్ని తాకద్దంటోందని అర్థం అయింది. అందుకే ఎక్కడ కట్టుకుంది అని అడుగుతున్నాడు అనుకున్నది.

“మడి అంటే వస్తువు కాదు కన్నా ఎక్కడన్నా కట్టుకోవటానికి. అమ్మమ్మ పెద్దావిడ కదా. రోజూ పూజ చేసుకుంటుంది. దేవుడికి పూజ చేసిన తర్వాత నైవేద్యం పెడుతుంది.. అదే.. నేను నీకు ఫుడ్ పెడతాను చూడు.. అలా దేవుడికి పెట్టాకే మనకి పెట్టి తను తింటుంది. మరి మనం తినే ఫుడ్ నీట్‌గా వుండాలి కదా.. అందుకే స్నానం చేసి, ఫ్రెష్ బట్టలు ఎవరూ తాకకుండా వున్నవి కట్టుకుంటుంది. దాన్నే మడి కట్టుకోవటం అంటారు” వాడికర్థమయ్యేలా చెప్పాలని స్వర్ణ తాపత్రయం.

“ఎవరన్నా తాకితే ఏమవుతుంది?” అమ్మ ఊపిరి తీసుకునే సమయంలోనే ఇంకో ప్రశ్న సంధించాడు వరుణ్.

“ఏమన్నా తాకితే ఆ వస్తువో, ఆ మనిషో శుభ్రంగా లేవనుకో దానికున్న బేక్టీరియా వాళ్ళ చేతుల ద్వారా వండే పదార్థంలోకి వెళ్తుంది. దానితో తినే వాళ్ళందరికీ జబ్బులొస్తాయి.”

“మరి నువ్వెందుకు మడి కట్టుకోవు రోజూ? స్నానం కూడా చెయ్యకుండా టిఫెన్ చేసేస్తావు కదా”?

“అయ్యో! .. అమ్మమ్మ వింటే క్లాసు పీకుతుంది వూరుకోరా బాబూ. నాకు ఇంట్లో నీ పని, తమ్ముడు పనీ, ఇంటి పనీ అన్నీ వుంటాయా. ఇవ్వి కాక ఆఫీసు పని ఒక్కోసారి ఇంట్లో కూడా చెయ్యాల్సి వస్తుంది కదా. మరి ఇన్ని పనులతో ఇలా ఏమీ ముట్టుకోకుండా చెయ్యటం కుదురుతుందా చెప్పు. పైగా ఇక్కడ దొరికినట్లు అక్కడ మనకి హెల్ప్‌కి సర్వెంట్ మెయిడ్ కూడా దొరకదు కదా.”

ఆలోచనలో పడ్డాడు వరుణ్. నిజమే తల్లి ఎప్పుడూ ఏదో చేస్తూనే వుంటుంది. అమ్మమ్మ దగ్గరయితే సర్వెంట్స్ వున్నారు. చాలా పనులు వాళ్ళే చేస్తారు. అమ్మకి పాపం అన్ని పనులూ అమ్మే చేసుకోవాలి. నాన్నేమో మరీ పొద్దున్నే వెళ్ళి రాత్రికొస్తారు. ఆయన ఆఫీసు దూరం. నేను పెద్దవాణ్ణవుతున్నా కదా. అమ్మకి నేను సహాయం చెయ్యాలి. అప్పుడు అమ్మ మడి కట్టుకుంటుంది. అయినా అమెరికాలో ఇంత పొల్యూషన్ వుండదు కదా. అందుకని అక్కడ జబ్బులు రావు. అదే అమ్మతో చెప్పాడు.

“అమ్మా, అమెరికాలో ఇంత పొల్యూషన్ వుండదు కదా. అందుకే నువ్వు మడి కట్టుకోకపోయినా పర్వాలేదులే. నేనూ, తమ్ముడూ కాళ్ళూ చేతులూ ఎప్పుడూ నీట్‌గా వుంచుకుంటాంలే. మరి నీకు మడి కట్టుకోవటానికి టైము సరిపోదు కదా.”

వాడి మాటలు విని నవ్వుతూ వాడిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది స్వర్ణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here