[శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ రచించిన ‘అమ్మమ్మ ఊరు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఎ[/dropcap]న్నో ఏళ్లనాటి
బాల్య స్మృతులను
జ్ఞాపకాల పుటలను
మనసు పొరల్లో
పదిలంగా దాచుకున్న
అపురూప చిత్రాలను
గుర్తుచేసుకుంటూ ఆశగా
అడుగు పెట్టాను అమ్మమ్మ ఊరు
ఉరకలేస్తున్న ఉత్సాహంతో
తక్షణం చూడాలనే ఆరాటంతో
నిలబడ్డాను అమ్మమ్మ ఇంటి ముందు!
పెద్ద లోగిలి పెంకుటిల్లు
విశాలమైన వరండా
పూలమొక్కల ఆవరణ
నీళ్ళు చేదుకునే గిలకల బావి
గడ్డి నెమరు వేస్తూ
సేద తీరే పశువుల కొట్టం
వచ్చిపోయే వారికి స్వాగతం
పలికే రంగుల చెక్క గేటు
లోపలి నుంచి బయటికి వాలుతూ
నీడనిచ్చే పెద్దదైన వేప చెట్టు
దానిపై గూళ్ళు పెట్టుకుని
కువకువలాడే గువ్వలు
పల్లెవాసుల బాతాఖానీలతో
ఆత్మీయ సంభాషణలతో అలరారే
ఇంటి బయటి రాతి అరుగులు
అన్నీ అదృశ్యమయ్యాయి!
ఇల్లు కొన్నవారు కట్టిన
కాంక్రీట్ కట్టడాలు
వెక్కిరిస్తూ నిలబడ్డాయి!
ఇంటి పక్కగా సాగిన బాటలో
ఒక్కింత దూరం నడవగానే
కనులు ముందుకొచ్చే పచ్చటి పొలాలు
ఆనవాలు లేకుండా పోయాయి
వాటి స్థానంలో వచ్చి పడ్డాయి
వరుసగా కట్టిన ఇళ్ళు!
ఎడమ వైపున దీటుగా నిలబడి
ఆహ్వానించే సినిమా హాలు
అయింది ఫంక్షన్ హాలు
పాత సినిమాలు చూస్తూ ఆనందించిన
రోజులు ముగిసిపోయాయన్న
ఎరుక నిరాశ పరిచింది!
కొంగలు ఉల్లాసంగా స్నానం చేస్తుంటే
కళకళలాడుతూ కనపడే ఊరి చెరువు
పరిశుభ్రతకు నోచుకోక
ఆలనాపాలనా లేక
అందాలు కోల్పోయింది!
శిధిలావస్థలో ఉన్న పాత ఇళ్ళు
అరమరికలు లేకుండా మాటలు కలిపే
పరిచయస్థుల కొరత
చిన్ననాటి నెచ్చెలి ఉనికి తెలియని వెలితి
హృదయాన్ని కలత పరచింది!
శైశవంలో మైమరపించిన
అమ్మమ్మ ఊరు చూసి
అంచనాలు తారుమారై
మనసు చిన్నబోయింది!
(ఎన్నో ఏళ్ళ తర్వాత గుంటూరు దగ్గరలో ఉన్న అమ్మమ్మ ఊరు తాడికొండ వెళ్లి చూసి వచ్చాక రాయాలనిపించిన కవిత.)