(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)
జంతుజాలంతో సహజీవనం!
[dropcap]ప[/dropcap]ల్లెటూళ్లలో ఇల్లంటే అమ్మానాన్నా, అవ్వా తాతా, అక్కా చెల్లీ, అన్నాతమ్ములూ మాత్రమే కాదు.. ఇంట్లో కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులు, ఆవులు, గేదెలు, ఎద్దులు లాంటి జంతువులు, పిచ్చుకలు, కాకులు, కోతులు లాంటి జీవజాలంతో పాటు పెరిగేవాళ్లు పల్లెటూళ్లలో జనం. మనుషుల ప్రేమతో పాటు, జంతుజాలపు అభిమానం, ప్రేమ పొందడం ఒక బోనస్ వంటిది కదా! అలా అన్ని జంతుజాలాల మధ్య గడిచే జీవితం, రకరకాల జీవజాతులతో అనుబంధం చాలా ఆనందదాయకంగా, మనోవికాస దాయకంగా, ప్రకృతిని దగ్గరినుంచి చూసి అర్థం చేసుకోవడానికి వీలుగా కూడా వుంటుందని పిస్తుంది నాకు! ఇట్లా అమ్మణ్ని కూడా ఆ పల్లెటూళ్లో అన్ని జంతుజాలాల మధ్యన పెరిగింది.
మా ఇంట్లో వెనక వైపు లంకంత ఆవులశాల, దానికి ముందు గొడ్లశాల, చాలక మరో పశువుల కొట్టం వుండేది. ఏడెనిమిది బర్రెలు, వాటి సంతానం గొడ్లశాలలో వుండేవి.
దానికి ఆనుకుని వుండే ఓ గదిలో ఆ గొడ్లశాల పర్యవేక్షకురాలు తులసెమ్మ నివాసం ఉండేది.
పేడకసువు తియ్యడం, శుభ్రం చెయ్యడం, పశువులకు మేపు వెయ్యడం, నీళ్లు తాగించడం, పాలు పిండడంలో అమ్మకు, పెద్దమ్మకు సహకరించడం వంటి పనులు ఆమె చేస్తూ వుండేది.
ఆవులశాలలో మాత్రం వేరే జీతగాళ్లు పనిచేసేవారు.
ఆవులు సాధుజంతువులంటారు కానీ, చాలా ఆవులు దురుసుగా ప్రవర్తిస్తాయి.
మనుషుల్లో కొన్ని జాతులలో లాగా, తాము ప్రత్యేకజాతి అనీ, బర్రెగొడ్లు తక్కువ స్థాయివనే భావం వాటికి వుంటుందనే విషయం చెబితే మీరు ఎవరూ నమ్మరేమో! కానీ, అది నిజంగా నిజం! మనుషులనుంచే ఇలాంటి భావాలు అవీ నేర్చుకున్నాయేమో! నాకు తెలియదు.
బర్రెలు నీళ్లు తాగిన తొట్లో నీళ్లు ఆవులు తాగేవి కావు. బర్రెలు దగ్గరికి వొస్తే కొమ్ములు విసురుతాయి. పొడవడానికి వొస్తాయి. వాటిని తరుముతాయి. ఇది పశువులను పెంచేవాళ్లందరికీ అనుభవమై వుంటుంది.
అప్పుడే పుట్టిన ఆవుదూడలు, బర్రె దూడలు కూడా ఎంత ముద్దుగా వుంటాయో! వాటి కాళ్లను, ఒంటిని శుభ్రం చెయ్యంగానే గొడ్లచావిడి అంతా పరిగెత్తుతాయి. అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న పిల్లల్లా వుండి వుండి జారిపడుతూ వుంటాయి. తిరిగి లేచి పరుగందుకుంటాయి.
బర్రెల దగ్గర పిల్లలైనా పాలు పిండు కోవచ్చు. చిక్కని పాలు సమృద్ధిగా ఇస్తాయి.
కానీ, ఆవుల దగ్గర పాలు పిండు కోవాలంటే, ఒకరు కర్ర పట్టుకోని అదిలిస్తుండాల. కాళ్లు కట్టేయాల కొన్నిటికైతే. కాళ్లు అటూ ఇటూ కదిలిస్తూ, బెదిరిస్తూ వుంటాయి. కొమ్ము విసురుతూ వుంటాయి. తోకతో కొడుతూ వుంటాయి. పాలు కూడా కొద్దిగానే ఇస్తాయి. అవి కూడా నీళ్లగా వుంటాయి.
అందుకే ఆవు పెరుగు వేసుకోవడానికి మేమెవ్వరమూ ఇష్టపడేవాళ్లం కాదు.
కానీ, అది ఆరోగ్యమట! ఒక గరిటెడు ఆవుపెరుగు వేసుకుంటేనే, ఒక గరిటెడు గేదె పెరుగు వేసేది అమ్మ.
అమ్మ ఆవుల జోలికి పోదు. పెద్దమ్మ, తులసెమ్మా, ఇంకెవరైనా జీతగాళ్లూ మాత్రమే ఆవుల దగ్గర పాలు తీసేవాళ్లు. బర్రెలు మాత్రం చాలా వినయవిధేయతలతో బుర్రవొంచుకుని వున్నట్లుగా చెప్పిన మాట వినేవి.
“మన ఇంట్లో ఆవులెన్ని వున్నాయి పెద్దమ్మా?” అని పెద్దమ్మను అడిగితే “ఒకప్పుడు నూరు ఆవులు వుండేవే అమ్మణ్నీ.. ఇప్పుడు నలభయ్యో, యాభైయ్యో, వుండొచ్చు” అని చెప్పేది పెద్దమ్మ.
“తక్కినవన్నీ యేమైనాయి?” అని అడిగాను.
“కాలానుగుణంగా ముసలివై చనిపోయేవి కొన్నీ, కొండలో మేతకు పోయినప్పుడు పులో, తోడేళ్లో ఎత్తుకొనిపోయినవి కొన్ని, పేద బ్రాహ్మణులకు దానాలు ఇచ్చినవి కొన్నీ ఇట్లా కొన్ని పోయినాయి. సుగాలీవాళ్లు తక్కువ వాళ్లు కారు. ఆవును మేతకు కొండకు తీసుకుపోతే ఎక్కడో తప్పిపోయిందనీ, ఎంత వెదికినా దొరకలేదనీ అబద్ధాలు చెప్పి, అప్పుడప్పుడూ ఆవులను అమ్మేసుకుంటారు. దూడలు చచ్చిపోయినాయని చెప్పి, వాటిని పెద్దవయ్యాక అమ్ముకుంటారు. మనం పోయి చూడలేం కదా? వాళ్లు చెప్పింది మనం నమ్మాల. అట్లా ఇప్పుడు మిగిలినవి ఇవి! కోడె దూడలను అవసరమైనవి మాత్రం పెట్టుకుంటాము. కాస్త పెద్దవైనాక అమ్మివేస్తాము. వాటిని వ్యవసాయానికీ, బండ్లు తోలడానికీ వాడుకుంటారు. పెయ్యదూడలు తిరిగి ఆవుల మందలో చేరుతుంటాయి” అన్నది పెద్దమ్మ.
ఉన్న ఆవులనన్నింటినీ ఇంట్లో పెట్టుకోరు. కొండకు తోలుతారు.
సుగాలీ వాళ్లు (లంబాడీలు) వొట్టిపోయిన ఆవులను(అవే ఎక్కువ వుంటాయి) కొండకు (అడవికి) తీసుకుపోతారు. వారికి యేదో లెక్కప్రకారం జొన్నలు కొలిచి యిస్తారు. లేకపోతే అన్ని ఆవులకు ఇంట్లో మేత కష్టం కదా? ఒక్కోసారి కొండలో మేతకు పోయిన ఆవును పులి చంపేసిందని చెప్పేవారు సుగాలీ వాళ్లు. అప్పుడు తాత, నాయన, అందరం చాలా దుఃఖపడేవారం.
కొన్ని ఆవులని కళ్లంలో ఎద్దులకు జతకట్టడానికి వీలుగా అక్కడ పెడతారట.
ఈనడానికి సిద్ధంగా వున్న ఆవులను, ఒక్కోసారి ఈనిన తర్వాత దూడలను వెంటబెట్టుకొని, సుగాలీవాళ్లు ఇంటికి తెచ్చి యిచ్చేవారు.
సంవత్సరం మధ్యలో ఒకసారి అన్ని ఆవులనూ తోలుకొస్తారు. అప్పుడు ఆవుల శాల నిండిపోతుంది. రెండురోజుల తర్వాత మళ్లీ కొండకు తోలుకెళ్లిపోతారు సుగాలీ వాళ్లు.
ఇంట్లో ఎప్పుడూ ఆవులో, బర్రెలో ఈనుతుండడం వల్ల తరుచుగా జున్ను చేస్తుండేవాళ్లు అమ్మావాళ్లు.
పెద్దమ్మ ఇంట్లో వుండే ఆవులకు నందినీ, సురభీ, పార్వతీ, గంగా, ఈశ్వరీ అని పేర్లుపెట్టి పిలుస్తూ వుండేవి. పూజ చేస్తూ వుండేది. ఐదారు ఆవులైతే ఇంట్లో వుండేవి.
అమ్మావాళ్లు బర్రెల దగ్గర పాలు తీసేటప్పుడు అచ్చం మనతో మాట్లాడినట్టే మాట్లాడుతారు వాటితో. పిల్లలను కోప్పడినట్టే కోప్పడుతారు.
“తులసెమ్మా.. చూడవే దీని సంగతి.. ఈ చుక్కఎనుము మహా అసాధ్యమై పోతున్నది. యేమైందే నీకు? దొంగపీనిగా! సరిగ్గా నిలుచుకోలేవా? కాళ్లు పడిపోయినాయా? తోక విసరడం యేం పోయేకాలం నీకు?” అని పెద్దమ్మ కసిరేది బర్రెను.
“అవునంటే.. నిలకడ లేకుండా పోయిందమ్మా దీనికి. ఎట్ల చూస్తుందో చూడు గుడ్లపక్షి మాదిరి. ఇది పొగురుపట్టింది. కులుకుడు ఎక్కువైంది దీనికి. ఈ ఎర్రది అయితే మరీ మాంతమైంది అమ్మయ్యా.. మేతకేం తక్కువ లేదు. పాలిచ్చేటప్పటికి పానం మీది కొస్తాది” అని తులసెమ్మ వంతపాడేది.
నేను నవ్వుతూ వాళ్ల మాటలు వినేదాన్ని. కొన్ని బర్రెలు కూడా దురుసుగా వుండేవి.
నాకు తెలిసి ఇంట్లో పెంచుకునే జంతువులలో ఎద్దులు చాలా తెలివైనవి. వాటికి దారులన్నీ బాగా తెలుసు. ఏ దారిలో పోతుంటే ఏ వూరికి, ఏ చేనికి పోతున్నామో వాటికి అర్థమైపోతుంది.
మాకు వొడ్లు పండేవి కావు. కేసీ కెనాల్ ప్రవాహమార్గంలో వుండే వొడ్లు పండే ఊళ్లనుంచి వొడ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఆ ప్రాంతంలో పండే ‘ఢిల్లీ భోగాలు’ అనే బియ్యం ఎంతో నాణ్యంగా, సన్నగా, రుచిగా వుండేవి. వాటినే తెచ్చేవారు జీతగాళ్లు.
జీతగాళ్లు రాత్రి బండి ఎక్కి, యే వూరికి పోతున్నామో వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటుంటే ఎద్దులు విని అర్థం చేసుకుంటాయి.
బండిని ఆ దారిలో కొంచెం దూరం నడిపించి జీతగాళ్లు బండిలో పడుకొని నిద్రపోతారు. తెల్లవారేసరికి అవి ఆయా ఊళ్లలో మామూలుగా ప్రతీ సంవత్సరం అలవాటుగా వొడ్లు కొనే రైతుల ఇళ్ల ముందు ఆగుతాయట!
మళ్లీ మరురోజు రాత్రి వొడ్లు తీసుకొని బయలుదేరితే తెల్లవారేటప్పటికి మా ఇంటి దగ్గర ఆగేవి.
ఓసారి పెద్దవానలొచ్చి, కుందూ నదికి వరదలొచ్చి, మా కళ్లంలోకి నడుం లోతు నీళ్లు వచ్చినాయట. అప్పుడు ఎద్దులు భయపడిపోయి, కట్లుతెంచుకొని, మా ఇంటి ముందుకొచ్చి “అంబా అంబా” అని పిలిచాయంట. పెద్దవానకు జడిసి, పరిగొత్తుకొచ్చాయని భావించి, అప్పుడు వాటిని సముదాయించి, ఆవుల శాలలో కట్టేసి, మేపు, నీళ్లు పెట్టారట. తెల్లవారాక వరదల సంగతి తెలుసుకొని, వాటి తెలివిని అందరూ మెచ్చుకున్నారట.
వాటికి మన మాటలు కూడా అర్థమౌతాయి. అవి యజమానిపై పిచ్చి అభిమానం పెంచుకుంటాయి. మనల్ని కాపాడాలనుకుంటాయి. మన క్షేమం కోరుతాయి.
ఉగాది పండగ సమయంలో ఎద్దులకు రంగులు చల్లి, వాటికి వాటి ఆభరణాలు పెట్టి, వాటికి పూర్ణం తినిపించి సత్కరిస్తారు రైతులు. మా అమ్మావాళ్లు కూడా ఎద్దులకు పూజచేసి, వాటికి భక్ష్యాలూ, అన్నమూ తినిపించి , వాటికి దండం పెట్టి, వాటి పట్ల కృతజ్ఞత చూపేవారు.
రాయలసీమలో ఎద్దులను, ఆవులను, గేదెలనూ కట్టేసుకోవడానికి ఇంట్లోనే పశువుల శాలను యేర్పాటు చేసుకుంటారు. అవి కూడా వారి కుటుంబసభ్యుల్లాగా అయిపోతాయి. ఇంట్లో పుట్టిన పిల్లల మాదిరే వాటినీ చూసుకుంటారు.
ఇంటి యజమానికి ఆరోగ్యం బాగా లేకపోతే అవి దిగులుపడి మేత ముట్టుకోవు. ఆయన ఊరికెళ్తే చిన్నపిల్లల్లాగా బెంగపెట్టు కుంటాయి. కొన్ని మరీ సూక్ష్మబుద్ధి కలిగిన ఎద్దులైతే యజమాని అన్నం తినకపోతే అవీ మేత తినవు. ఇంట్లో పసిపిల్లలు వాటి కాళ్ల దగ్గరికి పాక్కుంటూ ఒచ్చినా, తొక్కకుండా జాగ్రత్తపడతాయి.
వాటిని అమ్మకానికి పెట్టినట్టు వాటికి తెలిస్తే.. కళ్ల వెంట నీళ్లు కారుస్తుంటాయి. కొన్నవాళ్ల వెంట పోలేక పోలేక వెనిక్కి చూసుకుంటూ పోతాయి.. బలవంతంగా. అప్పుడు మాత్రం కళ్లనీళ్లు వొచ్చేవి.. మాకు అందరికీ. ఇక అవి మరీ ముసలివైతే కటికవాళ్లకు అప్పజెప్పుతుంటే.. కలిగే దుఃఖం చెప్పనలవి కాదు. అట్లా అని కదల మెదలలేని వాటిని మనం పెట్టుకోనూ లేము కదా! అంత మంచి ఎద్దుల, పశువుల జీవితం అట్లా ముగుస్తుంది. విధి బలీయం కదా! అదీ ఎద్దుల కథ!
ఇక ఊరపిచ్చుకలు చేసే అల్లరి అయితే చెప్పనలవి కాదు. అప్పట్లో ఇంట్లో దంతెలు, దూలాల మధ్య ఖాళీలలో గూళ్లు కట్టుకునేవి. ఇల్లంతా గడ్డి తెచ్చి పడేసేవి. అవి ఇంట్లో గూడు కట్టుకుంటే ఇంటికి మంచిదని భావించేవారు. వాటిని తరిమేసేవారు కాదు. గడ్డీగాదం తెచ్చి పడేస్తున్నా విసుక్కునేవారు కాదు. ఫాన్లు వొచ్చాక వాటికి ఇళ్లలో స్థానం లేకుండా పోయింది.
పొద్దున్నే మా తాత మా ఇంటి ముందు అరుగు మీద నిల్చుకోని కొర్రలు చల్లేవారు. పదులకొద్దీ ఊరపిచ్చుకలు వొచ్చి టకటక టైపు కొట్టినట్టు కొర్రలను తినేసేవి.
పొలంలో వంగిపోయినట్టు పండిన జొన్నకంకులను గుత్తులు గుత్తులుగా అరుగుల మీద స్తంభాలకు కట్టేవారు. రోజల్లా పిట్టలకు వాటిని తినడమే పని!
అయినా యేమైనా తృప్తి చెందుతాయా.. అంటే ఊహూ..
మా ఊళ్లో భిక్షగాళ్లు ఎక్కువ. పొద్దున్నించీ వస్తూనే వుంటారు. పాత కాగితాలను నానబెట్టి తయారుచేసిన ఒక బుట్ట నిండా జొన్నలు తీసిపెడుతుంది పెద్దమ్మ. ఎవరు చూస్తే వాళ్లు భిక్షాలకు పిడికిళ్లతో, దోసిళ్లతో జొన్నలు పెట్టేవాళ్లం.
రాత్రి భిక్షాల కోసం ఓ పెద్ద గిన్నె నిండా కొర్రన్నం వండేవాళ్లు అమ్మావాళ్లు. వంటంతా అయ్యాక చివరగా కొర్రన్నం చేసి, వేడిగా వుంటుందని ఆర్పేసిన పొయ్యి మీదే వుంచేవారు.
మధ్యాహ్నం అమ్మావాళ్లు పండుకోవడానికి హాల్లోకి పోతే చాలు.. ఓ పది పదహైదు పిట్టలు కలిసి వంటింట్లో కొచ్చి, కొర్రన్నం పైన పెట్టిన బరువైన ఇత్తడి మూతను వాటి ముక్కులతో లాగి కింద పడేసేవి.. ఐకమత్యంతో సాధించలేనిది యేమీ లేదన్న సత్యాన్ని నిరూపిస్తున్నట్టుగా. వేడివేడి కొర్రన్నాన్ని ముక్కులతో నేల మీదికి చిమ్మేసి, చల్లారిన తర్వాత తింటూ వుండేవి.
మేమంతా వాటి తెలివికీ, దాష్టీకానికీ ఆశ్చర్యపోయేవాళ్లం!
పెద్దమ్మ అయితే పకపకా నవ్వుతూ..
“ఇదేం పోయేకాలమే అమ్మా ఇవిటికి? వీటి తెగింపు నెత్తిన వాన గురువ! ఎంత కరువున బడినారే తల్లీ! పొద్దున బుట్టెడు కొర్రలు తింటిరి కదే.. మీ ఆకలి పాడై పోనూ! మీ అసాధ్యం కూలా! ఇంత బరువు మూత కూడా కింద పడేస్తిరి కదే.. నేనేం జేతు ఇంక..” అని ముద్దుగా తిడుతూండేది. వాటికి కాస్త అన్నం పక్కన వేసి, మళ్లీ మూత పెట్టి, పైన ఒక గుండ్రాయి పెట్టి పండుకోవడానికి పోయేది.
మా ఇంట్లో బయటి అరుగు చివరగా ఒక రాతి తొట్టి వుండేది. పొద్దున నాయన స్నానం చేసి వస్తూనే దాన్ని టెంకాయపీచుతో శుభ్రం చేసి, నిండుగా నీళ్లు పట్టి, ఆ పైన చేతులూ కాళ్లూ కడుక్కుని, మడుగు కట్టుకునేవారు.
ఆ పని అదేదో దైవసేవ అన్నట్టు భక్తిగా చేసేవారు. తర్వాత పూజకు వెళ్లేవారు.
ఆ నీళ్లు కుక్కల కోసం అన్నమాట! ఎక్కడెక్కడి కుక్కలు వొచ్చి ఆ నీళ్లు తాగిపోయేవి. కోతులు, కాకులు కూడా తాగేవి. ఎంగిలి మెతుకులన్నీ కాకుల పాలే!
మా ఊళ్లో కోతులు కూడా ఎక్కువే! అవి తిండి కోసం చేసే అల్లరి తమాషాగా వుండేది.
ఇనుప కడ్డీల తలుపులు వెయ్యడం మర్చిపోతే చాలు..లోపలికి దూరి తినడానికి యేది దొరికితే అది ఎత్తుకోనిపోయేవి.
బయట కడగడానికి పెట్టుకున్న గిన్నెలను ఎత్తుకొనిపోయి గోడ మీద కూర్చుంటాయి. మనం చూసి, గిన్నె ఇవ్వమని బతిమాలుతూ ఏదైనా తినడానికి ఇస్తే, తీసుకొని, గోడమీది నించి గిన్నెలను దబామని కిందపడేసేవి. ఎన్ని నొక్కులు పోయేవో గిన్నెలు! అయితే వాటికేం లెక్క?
అల్లరిపిల్లలు ఒకరిద్దరు కోతికి అరటిపండు ఆశ చూపి యేమార్చి, కిటికీలోని ఇనుపకడ్డీలలో నుంచి వాటి ముందు కాళ్లను గట్టిగా ఒక చేత్తో పట్టుకొని, రెండో చేతిలో నశ్యం (ముక్కుపొడి) వేసుకుని దానికి వాసన చూపేవారు. అది తినేపదార్థమనుకొని, వాసన చూసి, నశ్యం ముక్కులోకి పోయిన కారణంగా తుమ్మడం మొదలు పెట్టేది. అప్పుడు దాని కాళ్లను విడిచేసి వీళ్లు ఒకటే నవ్వడం! అప్పుడు నవ్వు వొచ్చేది కానీ, మూగజీవులను అట్లా బాధించడం తప్పని పెద్దయ్యాక తెలిసింది నాకు.
ఒకసారి మా మూడో అక్క మేడమీది వరండాలో పడుకుని చదువుకుంటూ వుంటే, వెనక్కు వేసుకున్న ఆమె పొడుగాటి జడ మీద కోతి కూర్చుని ఆమెకు పేలుచూడడం మొదలుపెట్టింది. ఒక్క వెర్రి కేక పెట్టి, అక్క దాన్ని తరిమేసింది.
కోతికి అద్దం ముక్క దొరికితే అది తనను తాను ఎన్ని కోణాల్లో చూసుకుంటుందో.. అచ్చం మనిషిలాగే!
అలాగే పాములూ, తేళ్లూ కూడా కనిపిస్తూ వుండేవి తరచుగా. పాములు కరవలేదు కానీ, తేళ్లు మాత్రం అప్పుడప్పుడూ కాటు వేస్తుండేవి. అవన్నీ మామూలే నన్నట్టుగా వుండేవాళ్లం.
అమ్మ మంగళవారం నాడు కాలభైరవుడికి నెయ్యి దీపం పెట్టి “తేళ్లూ, పాములూ కనబడకూడద”ని దండం పెట్టుకునేది.
పిల్లులూ తిరిగేవి కానీ, పాడి వున్న ఇల్లు కావడం చేత వాటిని తరిమేస్తూ వుండేవాళ్లం. కానీ, అవి ఎట్లాగో మమ్ములను ఏమార్చి గాజల్లో, గంపల్లో పిల్లలను పెట్టుకునేవి. మళ్లీ తీసికెళ్లిపోతుండేవి.
మా తాతగారు భోంచేసేటప్పుడు ఆయనకు అదేం అలవాటో యేమో గానీ, సగం ముద్ద తిని సగం ముద్ద పక్కన వేరే పళ్లెంలో పెట్టేవారు. అది ఒక చిన్న కొండలాగా అయ్యేది. దాన్ని వీథిలోని కుక్కలకు వేసేవాళ్లం.
“మేము కుక్కలకు అన్నం పెడతాం లెండి. మీరు సరిగ్గా భోంచెయ్యండి” అని అమ్మావాళ్లు చెప్పినా ఆయన పద్ధతి ఆయనదే! కుక్కలకు కడుపునిండా అన్నం పెడతారో లేదో అని సందేహం అనుకుంటా!
ఇలా ఆ కాలం వాళ్లు ఆవులు, ఎద్దులూ, బర్రెలు, కుక్కలు, పిట్టలు, కాకులూ, కోతులు అన్నింటినీ పోషిస్తూ వాటితో సహజీవనం చేసేవారు. అన్నింటి పట్లా దయగా వుండేవారు.
పేదవాళ్లకు వాళ్ల వంతు సహాయం చేస్తూండేవారు. చాలా ఇళ్లలో భిక్షగాళ్ల కోసం ప్రత్యేకంగా కొర్రన్నమో, జొన్నసంకటో వండి ఓపికగా బయట కూర్చుని వేసేవాళ్లు.
రాత్రి చీకటిపడుతూనే భిక్షగాళ్లు ఒచ్చేవారు. కొర్రన్నాన్ని ఒక గిన్నెలో పెట్టుకోని, యేదైనా పచ్చడో, పప్పో పక్కన పెట్టుకోని వీథి అరుగు మీద కూర్చునేది పెద్దమ్మ. నేనూ అప్పుడప్పుడూ పెద్దమ్మ పక్కన కూర్చొని ఆమె మాటలు వింటూ వుండేదాన్ని.
భిక్షగాళ్లు వొచ్చినవాళ్లకు వొచ్చినట్టుగా భిక్ష వేసేది.
ఓ భిక్షగాడు మాత్రం “కొర్రబువ్వనా? నాకొద్దమ్మయ్యా! ఆబువ్వ (వరిఅన్నం) కావాల నాకు” అన్నాడు.
పెద్దమ్మకు ఒళ్లు మండిపోయింది.. కొర్రన్నం ఒద్దన్నందుకు! అన్నాన్ని తిరస్కరించకూడదన్నది ఆమె భావం!
“అమ్మణ్నీ.. వీణ్ని చూడవే.. ఆబువ్వ కావాల్నంట! జాగీర్దారు వొచ్చినాడు. పాపం.. ఇంకా పరవాన్నం అడగలేదు. మేలే! రేపురా నాయనా.. భక్ష్యాలు చేసిపెడతాలే..! జనం పొగురు పట్టిపోతున్నారు. పో.. ఫో.. వేడి వేడి ఆబువ్వ యే అమ్మ అయినా పెడుతుందేమో.. తినుపో.. వేసింది తీసకపోయేది లే.. తినడానికి లేకపోయినా పొగురుకేం తక్కువ లే..” అని తిట్టడం మొదలుపెట్టింది.
“నువ్వు పెట్టకపోతే పెట్టక పోయినావులే అమ్మా.. తిట్టొద్దు. ఆబువ్వ యేసేటోళ్లు వున్నారులే.. నువ్వొక్కదానివేనా ఈ ఊళ్లో బిచ్చం పెట్టేది..” అంటూ అతనూ తిట్టుకుంటూ వెళ్లిపోయినాడు.
“సిద్ధాన్నం వొద్దనుకొని పోతున్నావ్.. అనుభవిస్తావ్ పో..” అని పెద్దమ్మ శాపనార్థాలు పెడుతూనే వుంది. అన్నం వొద్దంటే అంత కోపం పెద్దమ్మకు!
“పేదవాళ్లకు, అడుక్కునేవాళ్లకూ ఇష్టాయిష్టాలు వుండొచ్చా? వుండకూడదా? ఉంటే తప్పా? ఒకవేళ వాళ్లకు ఇష్టం లేకుంటే లేదని చెప్పడం నేరమా? పెద్దమ్మ మాటలు రైటా? తప్పా?” యేవేవో ప్రశ్నలు అమ్మణ్ని మనసులో వానాకాలంలో వీథి దీపాన్ని కమ్ముకునే ఉసుళ్లలాగా కమ్ముకున్నాయి. వాటికి సమాధానం వెతుక్కునేంత వయసు అమ్మణ్నికి అప్పటికి లేదు. కానీ, వాటికి జవాబులు వెతుక్కునే దాకా ఊరుకునే పిల్ల కాదు అమ్మణ్ని!