Site icon Sanchika

అమ్మణ్ని కథలు!-13

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

అమ్మణ్నికి పెరిగిన పనిభారం!!

[dropcap]మా[/dropcap] వంటాయన కిష్టయ్య బాగా పెద్దవాడై పోయినాడు. ఉండి వుండి కింద పడిపోయేవాడు. పెద్ద జబ్బు యేమీ లేదని డాక్టరు చెప్పేవాడు. అయినా యేదో నలతగా వుండేవాడు. వృద్ధాప్యం వల్ల అనుకుంటా.

ఆయన ఒక రోజు ‘తన సొంత వూరికి, గుంటూరు దగ్గర యేదో పల్లెటూరికి వెళ్లి తన వాళ్లందరినీ చూసి వొస్తాననీ, తాను ఎన్నాళ్లు బతుకుతానో నమ్మకం లేదనీ, ఇన్నాళ్లూ తాను వంట చేసిన దానికి తనకు ఏదైనా ప్రతిఫలం ఇవ్వమనీ’ తాత, నాయన దగ్గర చెప్పుకున్నాడు.. కన్నీళ్లతో.

ఆయన బ్రహ్మచారి. మధ్య వయసులో వొచ్చి మా ఇంట్లో వంటకు కుదురుకున్నాడు.

ఇంట్లో మనిషిగా మారిపోయి, వంటలో, పిల్లల పెంపకంలో, కుటుంబంలో ఒకటయి పోయినాడు.

ఆయన వేరే మనిషనే భావనే లేదు ఎవ్వరికీ. ఆయన తనకు నెలజీతం వొద్దనీ, తనకు తిండీబట్టా ఇచ్చి, పై ఖర్చులకు కొద్దిగా ఇస్తే చాలనీ, తాను కొన్నేళ్లు పనిచేశాక అంతా ఒకసారి యేదైనా నిలిచి పోయేట్టుగా ఇస్తే చాలనీ మొదట్లో తాతగారితో మాట్లాడుకున్నాడు.

ఇప్పుడు ఆయన ఊరికి వెళ్తానని అంటున్నాడు కాబట్టి, ఆయన కోరిక మేరకు తాత కొంత పొలం ఆయన పేరు మీద రాసి వుంచిన కాగితాలు ఆయన చేతిలో పెట్టినారు. వాటి విలువ ఎంత వుంటుందో చెప్పినారు. అది ఆయన ఊహించినదానికంటే ఎక్కువేనని ఆయన సంతోషించినాడు.

ఆయనకు వైద్యానికీ, ఇతర అవసరాలకూ అవసరమైన డబ్బు కూడా ఆయన చేతిలో పెట్టి, ఒక మనిషిని తోడు ఇచ్చి, ధైర్యం చెప్పి, తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు తిరిగి రావొచ్చని చెప్పి, ఆదరించి, గుంటూరుకు పంపించినారు తాతగారు.

ఇంట్లో పండిన కందులు, పెసలు, సెనగలు, వేరుసెనగలు లాంటివి, చీరలు, పంచెలు సర్ది యిచ్చింది అమ్మ. ఆయన తృప్తిగా మళ్లీ త్వరలో వొచ్చేస్తానని పేరుపేరునా చెప్పి వెళ్లిపోయాడు.

తర్వాత కొద్దిరోజులకు ఆయన స్వర్గస్తుడైనట్టు జాబు వొచ్చింది. ఆత్మీయుడిని కోల్పోయినట్టు కన్నీళ్లు పెట్టుకున్నాం అంతా.

తర్వాత అంతా మామూలే!

అయిదారు నెలలు పోయాక ఒక రోజు మా ఇంటికి పేద బ్రాహ్మలు ఇద్దరు వొచ్చినారు. అది మామూలే మాకు. ఆ ఊరికి కొత్తవాళ్లు ఎవరొచ్చినా మా ఇంటికే వొచ్చి భోంచేస్తారు.

అరుగు మీద ఒదిగి కూర్చున్న వాళ్లతో మాటలు కలిపినాను. వాళ్లు కిష్టయ్య చెల్లెలి కొడుకులట!

తాతతో, నాయనతో పని వుండి వొచ్చినారట.

 “ఏం పని?” అని కూడా అడిగినాను.

“నువ్వు చిన్నపిల్లవమ్మా! నీకు తెలీదులే! నువ్వేనా అమ్మణ్ని అంటే? మా మావయ్య నీ గురించి చాలా చెప్పాడులే. బాగా అల్లరి చేస్తావట గదా?” అని మాట మార్చినారు.

నాకు కిష్టయ్య మీద బాగా కోపం ఒచ్చింది.. నా గురించి వాళ్లకు అట్లా చెప్పినందుకు. కానీ, ఇప్పుడు నేనేమీ అనలేను కదా ఆయనను.

నేను వాళ్ల వైపు చురుగ్గా చూస్తూ..

“అట్లా చెప్పినాడా కిష్టయ్య? నేను చాలా బంగారుకొండను. మంచి పిల్లను. అల్లరి పిల్లనేం కాను” అనేసి లోపలికి వెళ్లిపోయాను జడలు విసురుగా వెనక్కు వేసుకుంటూ. వాళ్లు మరుసటిరోజు పొద్దున వెళ్లిపోయినారు.

ఆ రోజు సాయంత్రం పెద్దమ్మ తులసి చెట్టును దులిపి, ఎండుకొమ్మలను విరిచేసి, విత్తనాలను దూసేసి, బాగు చేసుకుంటూ వుంటే, ఆమె దగ్గర కూర్చుని నిన్న వచ్చినవాళ్ల విషయం అడిగినాను.

అదే ఇలాంటి విషయం అమ్మను అడిగినాననుకో.. “పెద్దవాళ్ల విషయాలు నీకెందుకే?” అని ఎదురుప్రశ్నలు వేస్తుంది.

అసలు పెద్దవాళ్లు మాట్లాడుతూంటే చిన్నపిల్లలం అక్కడి నించి లేచి వెళ్లిపోవాలట. మేము వెళ్ల లేదనుకో.. ఉరిమిచూస్తుంది. పక్కనుంటే మెల్లగా గిల్లుతుంది. ఇదేం క్రమశిక్షణో.. యేమో!

అసలు పెద్దవాళ్లు మాట్లాడేటప్పుడు వినే కదా నేర్చుకుంటారు పిల్లలు! ఆ అవకాశం ఇవ్వకపోతే పిల్లలకు సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలో ఎట్లా తెలుస్తుంది? మరీ పిల్లలు వినకూడని విషయాలైతే సరేననుకోవొచ్చు.

అందుకే యే విషయాన్ని గురించి ఎవరిని అడగాలో, ఎట్లా అడగాలో వాళ్లనే అడగాలని నా తొమ్మిదేళ్ల అనుభవం నేర్పించింది.

అమ్మకూ, మా బళ్లో హెడ్ మాస్టరుకూ యేమీ తేడా కనిపించదు నాకు! పెద్దమ్మ అయితే అన్ని విషయాలూ ఓపికగా చెబుతుంది.. మా సువర్ణమ్మ టీచరు మాదిరిగా.

తన పని తాను చేసుకుంటూనే నా ప్రశ్నకు జవాబు చెప్పడం మొదలుపెట్టింది పెద్దమ్మ.

“కిష్టయ్య ఎన్నో యేళ్లపాటు మన ఇంట్లో వంట చేసినాడు కదా.. దానికి తాతగారు కిష్టయ్యకు కొంత పొలం ఇచ్చినారు కదా.. ఆ పొలం కాగితాలను తాను చనిపోయేముందు తన మేనల్లుళ్లకు అప్పగించినాడట కిష్టయ్య.

ఆ పొలం అమ్ముకొని, డబ్బు తీసుకొని పోవడానికి ఒచ్చినారు కిష్టయ్య మేనల్లుళ్లు. వాళ్లు ఇక్కడ అమ్ముకోవడం కష్టం కదా! ఈ వూరికి కొత్తవాళ్లు. అందుకే తాత ఆ పొలాన్ని ఇప్పటి ధరకు తానే కొని, వాళ్లకు న్యాయంగా రావాల్సిన డబ్బు ఇచ్చి పంపించినారు. దాంతో వాళ్లు సంతోషపడి, డబ్బుతీసుకొని వెళ్లిపోయినారు” అంటూ తాత, నాయన ధర్మబుద్ధిని కాసేపు పొగిడింది పెద్దమ్మ.

నాకు కూడా కిష్టయ్య మనింటికి చేసిన సేవకు తగిన ప్రతిఫలం దక్కినట్లనిపించింది. నేను కూడా నా జీవితంలో ఎప్పుడూ న్యాయంగా, ధర్మంగా వుండాలని మనసులో గట్టిగా అనుకున్నాను.

కిష్టయ్య ఊరికి పోవడమేమో గానీ, ఆయన పోయిన తర్వాత ఇంట్లో అందరికీ తాత్కాలికంగా పనిభారం పెరిగింది.

ఇక ఆయన స్వర్గస్థుడు కూడా కావడంతో ఇప్పుడు ఆ పనులు తప్పనిసరి బాధ్యతలు అయిపోయాయి అందరికీ.

పెద్దమ్మకు పొద్దునపూట వంట పనంతా మీద పడింది.

అమ్మకు ఆమెకు సహకరించాల్సిన బాధ్యత పడింది. అక్కా వాళ్లకు కూరలు తరగడం, వంటింటి శుభ్రత లాంటి పనులు పడినాయి.

పెద్దక్క, రెండో అక్క పెళ్లయి అత్తగారిళ్లలో వున్నారు. మూడో అక్క, నాలుగో అక్క వేరే ఊళ్లలో కాలేజీ చదువులు చదువుతున్నారు. వాళ్లిద్దరూ ఊళ్లో వుంటే ఈ పనులు చేసేవారు. లేదంటే అమ్మకే ఆ పనులు పడేవి.

నాకైతే పొద్దున్నే ‘బండ’ (రచ్చబండ) దగ్గరికి చేటతో జొన్నలు తీసుకొని పోయి, గోంగూర, తోటకూర, మిరపకాయలు, టమేటోలు (అప్పుడప్పుడే వంటిళ్లలోకి ప్రవేశిస్తున్న కొత్త కూరగాయ అది. చారులోకి మాత్రమే వాడేవారు అప్పట్లో..) వంటి రోజువారీ కూరలు తీసుకువచ్చే డ్యూటీ పడింది. (వస్తుమార్పిడి పద్ధతిలో జొన్నలు తీసుకొని, కూరగాయలు ఇచ్చేవారు)

అక్కడ దొరకకపోతే బజారుకు పోయి కూరగాయలు తేవాలి. మాటిమాటికీ సరుకులు తేవడం వంటి పనులు ఎక్కువైనాయి. ఎప్పుడంటే అప్పుడు పిండి మిషనుకు పంపడం, బజారుకు పంపడం ఎక్కువై నా ఆటలకు గండిపడుతూ వుండేది. ఒక్కోసారి ఏడ్చుకుంటూ, తిట్టుకుంటూ పోయేదాన్ని. కానీ, ఎట్లా అయినా పోక తప్పదు.

అంతేసిమంది వుండే ఇంట్లో, ఎప్పుడూ వొచ్చేవాళ్లూ, పోయేవాళ్లూ, తాత కోసం ఒచ్చే కక్షిదారులు, అతిథులూ, అభ్యాగతులూ ఇట్లా తీర్థక్షేత్రం మాదిరిగా వుండే ఇంట్లో ఎప్పుడూ యేదో ఒక అవసరం పడుతూనే వుంటుంది.

కిష్టయ్య వుంటే తానే బజారు పనులకు పోయేవాడు. అట్లా పోయినప్పుడల్లా చంటిపిల్లలను ఎత్తుకోనిపోయేవాడు.

సాయంత్రం ఎవరో ఒక పిల్లవాణ్ని ఎత్తుకోని బయటికి తీసుకెళ్లేవాడు. అమ్మకు సాయంత్రం వంట చేసుకునే వీలుదొరికేది.

అమ్మకు నా తర్వాత జయ, తర్వాత ముగ్గురు మగపిల్లలూ పుట్టినారు.

పెద్దన్నకు ఎప్పుడూ ఆయాసం.. అందునా ఆయన మా తాతగారికి ఇష్టమైన మనుమడు. రాకుమారుడు.

రెండో అన్న పుస్తకాల పురుగు. ఎప్పుడూ పరధ్యానం. ఒకటి చెప్తే ఒకటి తెస్తాడు.

జయ యేమో చిన్నపిల్ల! అందుకే వాళ్లకు పెద్దగా పనులు చెప్పేవారు కారు. వాళ్లు కూడా చేసేవాళ్లు కానీ, తక్కువ!

ఇంక దొరికిందాన్ని నేనే! అందుకే బయటిపనులన్నీ నాకే చెప్పేది అమ్మ. జయ కూడా అప్పుడప్పుడూ నాతో పాటు వొస్తుండేది.

ఇక ప్రతి శుక్రవారం మా ఊళ్లో సంత జరుగుతుంది. మంచి కూరగాయలు కావాలంటే పొద్దున ఆరూ ఆరున్నర కల్లా సంతకు పోవాల.

నమ్మరు గానీ, నేను రెండు రేషన్ బ్యాగులు, చిన్నబ్యాగులు ఒకటి రెండు భుజానేసుకుని సంతకు పోయేదాన్ని.

అమ్మ ఐదు రూపాయలిచ్చి, వెయ్యి జాగ్రత్తలు చెప్పి, బేరం ఎట్లా చెయ్యాలో ట్రయినింగిచ్చి పంపేది.

ఇంత కష్టపడీ మోసుకొని వొచ్చి, అన్నీ కుప్ప పోసి, వేరు చేసి, బుట్టలలో వేసి పెడతానా.. అక్కడితో అమ్మకు తృప్తి లేదు.

ఒక్కొక్క కూరగాయా వాళ్లెంత రేటు చెప్పిందీ, నేనెంత తగ్గించమని అడిగిందీ, చివరికి ఈ బేరమెంతకు కుదిరిందో వివరించి చెప్పాల.

“ఇంకా తక్కువకు అడిగి వుండాల్సింది” అంటుంది. నాకేమో బేరం చేయడం ఎక్కువ ఇష్టం వుండదు.

అయినా మనం మరీ తక్కువకు అడిగితే.. విదిలించి పడేస్తారు అమ్మేవాళ్లు!

“నీది కొనే మోహం కాదులే!” అనీ, “ఎప్పుడైనా కూరగాయలు కొన్న మొహమేనా?” అనీ ఈసడించేస్తారు. ఈ బాధలు ఎన్నిసార్లు చెప్పినా అమ్మకు అర్థం కావెందుకో?

ఒక్కోసారి “అయ్యో! ఇంత తక్కువ రేటు వుంటే ఇంకో అర్ధ కిలో తెస్తే సరిపోయేది..” అని నస పెడుతుంది.

అట్లా ఆమె మనసులో మాట తెలుసుకొని మనం పనులు చెయ్యాలంటే అయ్యే పనేనా?ప్రాణం విసిగిపోయేది.

అమ్మకు లెక్క సరిగ్గా తేలాలి. పదిపైసలు తేడా వొచ్చినా మళ్లీ మొదటినించీ లెక్కవేయాల్సిందే!

“ఈ మాత్రం కూరగాయలు ఐదు రూపాయలంటే.. చూడండి అమ్మా.. ఎంత మండిపోతున్నాయో ధరలు!” అని అమ్మ ఆశ్చర్యపోతూ వుండేది పెద్దమ్మతో బుగ్గలు నొక్కుకుంటూ.

‘ఇంత రేట్లయితే ఎట్లా బతకుతామే అమ్మా! ఎంత కలికాలం ఒచ్చి పడిందే తల్లీ! నా చిన్నప్పుడు రూపాయ ఇస్తే ఇంతకు రెండింతలు కూరగాయలు ఒచ్చేవి.. యేమి కరువుకాలం ఒచ్చిందబ్బా.. మన సంగతే ఇట్లుంటే ఇక సన్నా సవుకూ వాళ్లు బతికేదెట్లా?” అని తన చిన్నప్పటి విషయాలన్నీ తవ్వి మా తలకెత్తేది.

మా ఊరి నెయ్యి సువాసనకు, రుచికి పెట్టింది పేరు. మా ఇంట్లో ఎప్పుడూ నిత్య కల్యాణం.. పచ్చతోరణం లాగా అక్కా వాళ్ల పెళ్లిళ్లు, పేరంటాలు, శ్రీమంతాలు, పురుళ్లు, నామకరణాలు జరుగుతూనే వుండేవి. ఏకాదశులూ, ద్వాదశులతో సహా ప్రతీ పండగా ఘనంగా చెయ్యవలసిందే! ఇట్లాంటి వాటికన్నింటికీ బయట నెయ్యి కొనాల్సివొచ్చేది.

లేదంటే బంధువుల ఇళ్లలో యేవైనా కార్యాలయితే నెయ్యి తీసి వుంచమని జాబు రాసేవారు. అప్పుడు చుట్టుపక్కల ఊళ్ల నుంచి నెయ్యి తెచ్చి అమ్మే వాళ్లను సంతలో పట్టుకొని పిలిచి రావాల. అదో పని నాకు! వాళ్ల దగ్గరున్న నెయ్యి నాణ్యంగా వుందో లేదో తెలుసుకోవాల. బజార్లో నెయ్యి ఖరీదెంతో పది చోట్ల విచారించి, తెలుసుకొని రావాల!

ఇదంతా అయ్యాక స్నానం చేసి, భోంచేసి, బడికి పోవాల.

సాయంత్రం ఒచ్చింతర్వాత టిఫినూ, కాఫీ అయ్యాక దేవుడి అరుగు, తులసెమ్మ అరుగూ తుడిచి, ముగ్గులు పెట్టాల. దేవుడిసామాన్లు, కాఫీగిన్నెలూ అన్నీ శుభ్రం చెయ్యాల.

ఇక పోయి ఆడుకుందాం.. అనుకునేసరికి.. అమ్మ, “అమ్మణ్నీ! వీడిని ఆడించుకోవే! నేను మడుగు కట్టుకొని రాత్రికి వంట చేసుకోవాల” అని, తమ్ముళ్లలో ఒకరిని అప్ప జెప్పుతుంది.

పెద్దమ్మ తక్కిన ఇద్దరినీ చూసుకుంటే, అమ్మ మడిగట్టుకొని, వంటచేసి, రాత్రి పూజకు సిద్ధం చేసిపెడుతుంది.

అప్పట్లో పూజలు చేసేది మగవాళ్లే అయినా, వాళ్లకు అన్నీ సిద్ధం చేసి వుంచాల. దేవుడి సామాను శుభ్రం చేసి, చెంబులో మడినీళ్లు పెట్టీ, పీట మీద మడిబట్టలు సిద్ధంగా పెట్టి, దీపపు సెమ్మెల్లో నూనె పోసి, పువ్వులు సజ్జలో పెట్టి అన్నీ అమరిస్తే మా నాయన పూజ చేస్తారన్నమాట!

పొద్దున్నించీ రకరకాల పనులతో అలసి వుంటాను కదా. అప్పుడు తమ్ముణ్ని ఆడించుకోమంటే నా కోపం నసాళానికి అంటుతుంది.

ఇంతలో నా స్నేహితురాళ్లందరూ ఆటకు వొస్తారు.

“అమ్మణ్నీ! ఎప్పుడూ ఈ తమ్ముళ్ల వాయనం యేందే నీకు! హాయిగా ఆడుకోవడానికి లేకుండా..” అని నన్ను ఎగదోస్తారు.

వాళ్లు అదృష్టవంతులు..ఇంతమంది తమ్ముళ్లు లేరు మరీ!

తమ్ముళ్లను చూసుకోవడం అంటే ఊరికేనా? వాళ్ల ఒన్ లూ, టూలూ శుభ్రం చేసుకోవాల. వేరే వాళ్ల ఇళ్లలో ఆ పనులు చేస్తే, ఆ ఇంటి వాళ్లు చెప్పినట్టుగా ఆ ప్రాంతం శుభ్రం చెయ్యాల! ఎంత చిన్న తనంగా వుంటుందో? ఇంక ఆట ఎప్పుడు ఆడుకునేట్టూ?

అక్కడికీ నేనూ, నా స్నేహితురాళ్లూ మొదట తమ్ముళ్లనే ఆడిస్తాం. అయినా తమ్ముళ్లకు తృప్తి లేదు. వాడితోనే చివరి దాకా ఆడాల.

నేను ఆడుకుంటుంటే వాడు అరుగు మీద కూర్చోవచ్చు గదా! “అక్కా.. అక్కా.. నన్ను ఎత్తుకో..” అని యేడుస్తాడు.

పోనీ, రమావాళ్ల అరుగు మీద కూర్చొని, వాణ్ని పక్కన కూర్చోబెట్టుకుని బారాకట్ట (అష్టాచెమ్మా) ఆడుదామంటే, పావులన్నీ తనకే కావాలని యేడుస్తాడు. గవ్వలు నోట్లో పెట్టేసుకుంటాడు.

ఇలాంటప్పుడు ఒకసారి సావిత్రి విసిగిపోయి, “అమ్మణ్నీ! వీడికి తగిన శాస్తి చేయవే! పిర్రెమీద చిన్నగా గిచ్చవే.. యేడుస్తున్నాడని అమ్మకిచ్చిరా” అని సలహా చెప్పింది.

ప్రియస్నేహితురాలి సలహాను తు.చ. తప్పకుండా పాటించేదాన్ని.

“అమ్మా! నేనెంతగా ఆడించినా వీడు ‘అమ్మ.. అమ్మ..’ అంటున్నాడమ్మా..!” అని అమ్మ దగ్గర ఒదిలిపెట్టి, అమ్మ పిలుస్తున్నా పలకకుండా ఒచ్చేసేదాన్ని. ఆట మైమరుపు అట్లా వుండేది!

అప్పటికి గంటసేపటి నించి వాడితో నానా తిప్పలూ పడ్డానన్న కృతజ్ఞత కూడా ఉండదు అమ్మకు.. విసుక్కుంటూ వుండేది.

ఆట నించి వొచ్చింతర్వాత కావలసినన్ని తిట్లు పడేవి. ‘అయినా ఓ గంటయినా తృప్తిగా ఆడుకున్నాను కదా! తిట్లు ఎప్పుడూ వుండేవేలే! పని చేసినా, చెయ్యకపోయినా తిడతారు పెద్దవాళ్లు..’ అని దులిపేసుకునేదాన్ని.

‘అయ్యో పాపం.. అమ్మణ్ని కూడా చిన్నపిల్లే కదా.. తను కూడా ఆడుకోవాల కదా..’ అనే ఆలోచనే వుండదు కదా అమ్మకు. ఒక్కోసారి ఈమె నా సొంత తల్లేనా.. అని కూడా అనిపించేది. ఎందుకంటే “నువ్వు చిన్నప్పుడు సంతలో దొరికితే తెచ్చి పెంచుకుంటున్నామని” చెప్పి యేడిపించేవాళ్లు అన్నావాళ్లు.

పెద్దవాళ్లు తామూ చెప్పినట్లు తు.చ. తప్పకుండా పిల్లలు చేయాలనుకుంటారు. ఎంత స్వార్థం కదా! పిల్లలంటే తమ సొంత పనిమనుషుల మాదిరి చూస్తారు.

ఒకసారి అమ్మానాయనా, రెండో అక్కా, మామా, నేను, ముగ్గురు తమ్ముళ్లూ కలిసి హైదరాబాద్‌కు పోయి, అక్కడినించీ రామగుండం అనే వూరికి పోయినాము.

అక్కడ మా అక్క భర్త.. అదే మా మామ బొగ్గుగనుల్లో ఉద్యోగం చేసేవారు. అక్కను అక్కడ కాపురానికి దింపడానికి పోయినామన్నమాట!

హైదరాబాదులో మా బంధువుల ఇండ్లకు పోయినప్పుడు అమ్మ అయితే అందరిండ్లలో ఒకటే పాట మొదలుపెట్టేది.

“తమ్ముళ్లను ఎత్తుకోవడానికి వుంటుందిలే.. అని అమ్మణ్నిని కూడా వెంట తీసుకొచ్చినాము” అని అందరితో చెప్పింది.

వాళ్లంతా “ఓహో.. అవునా.. నిజమేలే.. చిన్నపిల్లలను చూసుకోవడానికి నీకు సాయం కావాల కదా..” అని ఒకటే ఇకిలించడం..!

అప్పుడు నా వయసు అయిదారేండ్లే అయినా.. నాకు చాలా అవమానంగా, చిన్నతనంగా, అహం దెబ్బతిన్నట్టుగా అనిపించింది.

నేనేమైనా అమ్మకు పనిమనిషినా..? జీతానికి పనిచేస్తున్నానా? నేనంత తేలిగ్గా దొరికినానా? అని ప్రశ్నల మీద ప్రశ్నలు ఒచ్చేవి. అవన్నీ అడిగే వయసు లేకపోవడం వల్ల అడగలేకపోయేదాన్ని గానీ, ఆ కోపం తమ్ముళ్ల మీద చూపేదాన్ని.

సరే.. ప్రస్తుతంలోకి వొస్తే.. నేను ఇలా తమ్ముడిని గిల్లడం, వాడు యేడిస్తే అమ్మ దగ్గర వొదిలిరావడం కొన్నిసార్లు జరిగిన తర్వాత, నేను వాడిని ఎత్తుకోని ఆటకు తీసుకెళ్తుంటే, మా తమ్ముడు కొంచెం బుద్ధి తెలుస్తోందో.. యేమో..

“నేను అమ్మణ్నితో ఆడుకోను.. అది బాగా గిచ్చుతుంది.. అమ్మణ్ని వొద్దూ.. అమ్మా.. నీ దగ్గరే వుంటా” అని యేడవడం మొదలుపెట్టినాడు.

ఆ రోజు అమ్మకు వొచ్చిన కోపం చూడాలా.. ఎప్పుడూ ఆమెకు అంత కోపం రాలేదు.

కానీ, ఆట తొందరలో అంతగా పట్టించుకునే సమయం నాకు లేదు.

‘ఓపలేనివాడికి వొద్దన్నవాళ్లే తల్లీ దండ్రీ..’ అన్నట్టు..

ఇదే ఛాన్సులెమ్మని, “అయితే అమ్మణ్ని ఒద్దంటే అమ్మ దగ్గరే వుండూ..” అని వాణ్ని అమ్మ దగ్గర దిగ్గులికి (దింపి) బయటికి పరుగో.. పరుగు!

అమ్మ తిప్పలు దేవుడికి తెలియాల! అయినా వాడు ఆమె కొడుకు.. ఆమెకు తప్పదు మరి!

నేను ఆటలాడి వొచ్చిన తర్వాత అమ్మకు తిట్టడానికి ఓపిక లేదో యేమో.. ఉరిమి ఉరిమి చూసింది. పని చేసినా.. చెయ్యకపోయినా తప్పే! ఏంటో ఈ పెద్దవాళ్లు.. పిల్లలను ఎప్పటికి అర్థం చేసుకుంటారో.. యేమో! అన్నీ వాళ్ల కోణంలో నించే ఆలోచిస్తారు.

నేనైతే నా పిల్లలను ఇట్లా చూసుకోను..! ప్రేమగా పెంచుతాను.. వాళ్ల మనసు తెలుసుకుని పెంచుతాను.. అని మనసులో నిశ్చయించుకున్నాను. పెద్ద చదువరిలాగా పుస్తకం ముందేసుకుని కూర్చున్నాను.

ఇంతలో వంటింట్లో నించి “అమ్మణ్నీ! ఒకసారి వొచ్చిపోవే!” అన్న పెద్దమ్మ పిలుపు వినబడింది. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పెద్దమ్మ పిలిచిందంటే, యేదో తినడానికి పెడ్తుందని నాకు తెలుసు. ఎగురుకుంటూ పోయినాను. దోసెముక్క ఒకటి చేతిలో వేసింది. అప్పటికే అన్నావాళ్లు, జయా దోసె తింటున్నారు.

పెద్దమ్మ రాత్రిపూట భోంచెయ్యదు. ఏదైనా ఫలహారం చేసుకుని తింటుంది. తానొక్కతే తినలేక పిల్లలందరికీ తలో కొంచెం పెడుతుంది. ఆ టిఫిన్ ఎంత రుచిగా వుండేదో చెప్పలేను! ‘ఇప్పుడు అట్లా ప్రేమగా పిలిచి పెట్టేవాళ్లెవరున్నారూ..’ అని గాఢంగా నిట్టూరుస్తూ పెద్దమ్మను చల్లనివేళలో గుర్తుచేసుకున్నాను.

Exit mobile version