Site icon Sanchika

అమ్మణ్ని కథలు!-14

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

అమ్మణ్ని ఇంట్లో మజ్జిగసముద్రం..!

[dropcap]మా[/dropcap] అమ్మా, పెద్దమ్మా, పని ఆవిడ తులసెమ్మా కలిసి బర్రెలకు, ఆవులకు పాలు పిండుతారు. ఈ పనుల కోసం నాలుగు గంటలకే లేస్తారు పాపం! ఒక్కోసారి కరెంటు లేకుంటే, కిరసనాయిలు దీపాలు పెట్టుకుంటారు.

పాలు ఇంట్లోకి తెచ్చుకున్నాక పెరట్లో పెద్దమ్మ దాలి యేర్పాటు చేస్తుంది.

ఒక పాత ఇనప బకెట్‌లో నుగ్గులు (పిడకలు) వేసి, వాటిపై కొన్ని బొగ్గులు వేసి దాన్ని అంటించి, దాని పైన ఒక పెద్దకుండలో పాలు పోసి పెడుతుంది పెద్దమ్మ. దానిపైన చిల్లులున్న గిన్నో, చిల్లుల మూతో పైన పెడుతుంది.

ఆ నుగ్గుల సెగకు పాలు పొంగకుండా నిదానంగా కాగి, అందులోనే చల్లారి, మధ్యాహ్నానికి అరచేయి మందం మీగడ కడుతుంది.

అయితే ఆ పాలు, పెరుగూ కొంచెం పొగవాసనేస్తాయి. అయినా అదో రుచి!

మధ్యాహ్నం భోజనాలయ్యాక లోపల తెచ్చిపెడతారు పాలకుండను.

సాయంత్రం ఆ పాలకుండలను కడుక్కోవడం పెద్ద పని! ఆలిచిప్పలతో గీకి, టెంకాయ పీచుతో రుద్ది రుద్ది కడగాలి. యేమాత్రం సరిగ్గా తోమకపోయినా పాలు విరిగిపోతాయి.

మరి ఇతర బర్రెల పాలు వంటింట్లోకి తెచ్చాక అమ్మ వంట ఇంట్లో కుంపట్లు వెలిగించి, పెరుగుతోడు కోసం ఒక పేద్ద స్టీలు గిన్నెలో పాలు కాస్తుంది. పాలకు, కాఫీలకు కొంచెం నీళ్లు కలిపి వేరే గిన్నెలో పాలు కాస్తుంది.

ఇదంతా అయ్యేటప్పటికి పొద్దున ఆరుగంటలవుతుంది.

మళ్లీ ఇంత కార్యక్రమమూ సాయంత్రం సాగుతుంది.

అమ్మ వేసిన కాఫీ డికాక్షను వాసన తెరలు తెరలుగా ఇల్లూవాకిలీ అంతా అలుముకుంటుంది.

ఆ సువాసనకు మంత్రముగ్ధులమై మేమంతా ఒకరొకరమే మేడమీది నించి దిగి మొహాలు కడుక్కొని అమ్మ చుట్టూ కూర్చుంటాము పాల కోసం.. కాఫీ కోసం కూడా.

అప్పటికే మా నాయన పూజ చేస్తూ వుండేవారు. ఆయన చదువుతున్న రుద్రాధ్యాయం మంత్రాలు ఇంట్లోని వాతావరణాన్ని ఆవరించేసి, మా మనసు పొరల్లోకి కూడా వ్యాపించి, నెమ్మదిగా ఇంకుతూ వుండేవి.

పెద్దవాళ్లంతా కాఫీ కోసం అక్కడక్కడే తచ్చాడుతుంటారు.

మా అమ్మా వాళ్ల నాయన గారు, అంటే మా తాత గారు ఎప్పుడైనా గుత్తి నించి వచ్చేవారు మా ఇంటికి.

ఆయన మేము మా అమ్మ చుట్టూ కూర్చుని పాల కోసం ఎదురు చూస్తున్న మమ్మల్ని చూసి,

“కల్లు అంగడిలో కల్లుపోసేవాడి చుట్టూ కల్లు తాగేవాళ్లు కూర్చున్నట్టు కూర్చున్నారే!” అని నవ్వుతుండేవారు.

అవునేమోనని నవ్వుకునేవాళ్లం. నిజంగా అట్లా కూర్చుంటారేమో కల్లుఅంగడికి వెళ్లి చూసొద్దామని అనిపించింది నాకు. అయినా ఆ కల్లు అంగళ్లు ఎక్కడుంటాయో ఎవరికి తెలుసు గనుక? తెలియక పోవడమే మంచిదయింది! అమ్మణ్ని మరో సాహసం చేసి, తిట్లు తినే ప్రమాదం తప్పింది!

అందరిళ్లలో పిల్లలు ఒక లోటాడు పాలు తాగుతారు కదా! మేం ఒక్కొక్కరం రెండు.. రెండున్నర గ్లాసుల పాలు తాగేవాళ్లం. ఆ పైన సగం గ్లాసు కాఫీ కూడా తాగేవాళ్లం!

చెప్పినాను కదా.. మా అమ్మకు మేమెంత బాగా తింటే, తాగితే అంత ఆనందం!

ఆ మేరకు ఆమె పిల్లల్ని బాగా పెంచినట్టు తన ప్రోగ్రెస్ రిపోర్టులో తనే టిక్కు కొట్టుకుంటుందన్న మాట!

ఒక్కొక్కరికీ ఒక్కొక్క గిన్నె వుంటుంది. దాంట్లో అమ్మ పాలు పోసి యిస్తే, ఆర్చుకుని, గ్లాసుల్లో పోసుకుని, చాలా ఎంజాయ్ చేస్తూ తాగేవాళ్లం! పాలు అయిపోతా యేమోనని కొంచెం కొంచెం తాగేవాళ్లం.

పాలగిన్నెలు, గ్లాసులు తీసుకుని పెరట్లో తులసెమ్మ అరుగు మీద కూర్చుని కొందరమూ, మరో వైపున్న అరుగు మీద కూర్చుని కొందరమూ కబుర్లు చెప్పుకుంటూ పాలు తాగేవాళ్లం. ఉదయం వేళ వుండే చల్లని వాతావరణాన్నీ ఆస్వాదించేవాళ్లం.

మా పెద్దన్నకు ఒక వెండిగిన్నె వుండేది పాలకు. దానిలో ఒక్క చుక్క తగ్గినా బొటబొటా కన్నీళ్లు కార్చేవాడు. నిండుగా పాలు పోయాల్సిందే! లేదంటే భోరున యేడ్చేవాడు. అందుకే అమ్మ పాలల్లో కొంచెం నీళ్లు కలిపేది.. త్వరగా జీర్ణం కావాలని.

అన్ని పాలు తాగినాక అమ్మ మళ్లీ కాఫీ ఎందుకు ఇచ్చేదో అర్థం కాదు. బహుశ మేము అడిగేవాళ్లమేమో!

అమ్మ పెద్ద వెండిగిన్నెలో వెండిగరిటెతో కాఫీ కలిపేది. ఆ గిన్నె, గరిటె ఆమె పెళ్లప్పుడు మా అమ్మమ్మా వాళ్లు ఇచ్చినారట! పాలు తాగాక మళ్లీ వొచ్చి కాఫీ పోయించుకునేవాళ్లం!

మా ఇంటికి బంధువులు రావడమే గానీ, మేమెప్పుడూ బంధువుల ఇళ్లకు వెళ్లేవాళ్లం కాదు.

అమ్మకు మాతో పుట్టింటికి నాలుగు రోజులు పోవాలన్నా ఇబ్బందిగా వుండేది. ఎందుకంటే ఒక్కొక్కళ్లం ఇన్నేసి పాలు, కాఫీలు తాగుతాం కదా.. అక్కడేమో పాడి లేదు. అందుకే అమ్మ అందరినీ తీసుకెళ్లేది కాదు. కొంచెం పెద్ద పిల్లలను పెద్దమ్మ దగ్గర వొదిలిపెట్టి వెళ్లేది.

ఏ ఎండాకాలంలోనో మేము కొంచెం పెద్దపిల్లలం గుత్తికి పోయినా, సవాలక్ష జాగ్రత్తలు చెప్పి పంపేది.

ఇక్కడేమో మా తాతగారికి పిల్లలు సమృద్ధిగా పాలు తాగి, పెరుగులు తిని పుష్టిగా వుండాలని కోరిక. అందుకే యేదైనా పాడి బర్రె పాడి ఎండిపోతే వెంటనే ఇంకో పాడి బర్రెను కొనేసేవారు.

అమ్మమ్మ గారింట్లోనేమో వాళ్లకు ఎన్ని డబ్బులు పెట్టినా చిక్కటి పాలు దొరకవు. పాలవాళ్లు నీళ్లపాలే పోస్తారు.

పాల కార్యక్రమం తరువాత స్నానాల ఘట్టం మొదలు.

ఆ మధ్యలో పెద్దమ్మ యేమో ఎడం పక్క గదిలో వున్న కవ్వం స్తంభం దగ్గరికి పెద్ద ఇత్తడి జోడు తప్పేలాలో (రెండున్నర బిందెల నీళ్లు పడుతుండొచ్చు) సగానికి పెరుగూ, మీగడా వేసుకొని, అందులోకి కవ్వం అమర్చుకొని, చిలకడం ప్రారంభించేది.

మళ్లీ కొందరం అక్కడికి చేరేవాళ్లం. ఎంతోసేపు చిలికితే గానీ, వెన్నపడదు.

చలికాలంలో అయితే వెచ్చటినీళ్లు పోయాల. ఎండాకాలంలో అయితే చల్లటి కూజాలో నీళ్లు పోయాల. కొంచెంసేపు మూతపెట్టి వుంచాల. అప్పుడు వెన్నపడుతుంది.

తీరా వెన్నపడే ముందు ఓ పెద్దగ్లాసుడు మజ్జిగ బయటికి తీసి తాతగారికి ఇచ్చిరమ్మంటుంది పెద్దమ్మ. దాన్ని ‘కాను’ అంటారట. అది చాలా బలమట.

నేను తాతగారికి ఇచ్చే లోపల కొంచెం రుచి చూసేదాన్ని.. ఎంగిలి కాకుండా ఎత్తిపోసుకునేదాన్ని లెండి!

తాతగారు మేడ మీదే వుండేవారు. దిగలేకపొయేవారు. అన్నీ పైకి తీసుకెళ్లి అందించాల. ఒక్కోసారి విసుగు వొచ్చేది. రోజుకు ఎన్నిసార్లు ఎక్కి దిగే వాళ్లమో లెక్కలేదు. అందునా నా లాంటి పిల్లలు లోకువ కదా పెద్దవాళ్లకి!

నా పేరైతే నోట్లో రెడీగా వుంటుంది అమ్మకు.. పని చెప్పడానికి.

అందుకే అన్నారు కదా “బాపల్లో చిన్న.. బెస్తల్లో పెద్ద” అని!

వెన్న చిలకడమంటే పెద్ద శ్రమతో కూడిన పని! మేమూ చిలకడానికి ప్రయత్నించేవాళ్లం!

పెద్దమ్మ చిలుకుతూంటే నాట్యం చేస్తున్నట్టు వుండేది. ఒకసారి మా తమ్ముడు అననే అన్నాడు.. “అరే.. పెద్దమ్మ డాన్సు చేస్తుందే..” అని.

నేను వెంటనే వాడి నోరుమూసినాను.. పెద్దమ్మ యేమైనా అనుకుంటుందేమోనని!

పెద్దమ్మ నవ్వి వూరుకుంది.

వెన్నంతా తీసిన తర్వాత బాగా నీళ్లలో కడిగి ఒక పెద్ద సత్తుగిన్నెలో పెట్టేది. పాత వెన్నను రోజూ కడిగి పెట్టేది.

వెన్న పడంగానే అందరం చేతులు జాచేవాళ్లం. పెద్దమ్మ అందరికీ తలో గోలికాయంత వెన్న పెట్టేది. శనివారం నాడు నెయ్యి కాచేది. ఆ రోజు నరసింహ స్వామికి నెయ్యి దీపం పెట్టేవారు.

వెన్న చిలికాక బోలెడంత మజ్జిగ వచ్చేస్తుంది. అది చిక్కగా వుంటుందని నీళ్లు కలిపి, ఇంకో గిన్నెలోకి వేరే తీసి, దేవుడి అరుగు మీద పెడుతుంది పెద్దమ్మ.

మా ఊళ్లో ఒక పేద విద్యార్థుల హాస్టల్ వుండేది. దాన్ని మా నాయన గారు, మరి కొందరు పురప్రముఖులు కలిసి స్థాపించినారు, ఒక దాత దాతృత్వంతో.

మా నాన్నగారే ఎన్నో యేళ్లపాటు దానిని నిర్వహించారు.

అక్కడ డెబ్భయి మంది దాకా నిరుపేద పిల్లలు చుట్టుపక్కల వూళ్ల నుండి వచ్చినవాళ్లు వుండి, అక్కడి జిల్లాపరిషత్ హైస్కూల్లో చదువుకునేవారు.

వాళ్లకు కొద్దిగా ప్రభుత్వసాయం ఒచ్చేది. దాంతో వాళ్లకు పప్పు, జొన్నసంకటి మాత్రం రెండు పూటలా పెట్టగలిగేవారు కార్యనిర్వాహకులు.

సంకటిలోకి మజ్జిగ కావాలి, అది అంబలిగా మారడానికి!

మా ఇంట్లోనూ, మా ఊళ్లో మరి రెండు మూడు ఇండ్లలోనూ దండిగా మజ్జిగ వుండేది.

ఆ పేద విద్యార్థులు దుత్త తీసుకుని ఒచ్చేవాళ్లు మజ్జిగ కోసం. దుత్త నిండా మజ్జిగ పోసేవాళ్లం. సత్తు తప్పేలాతో ముంచి యేడెనిమిది సార్లు పోస్తే దుత్త నిండేది.

మాకు పుణ్యం రావాలని మా చేత పోయించేది అమ్మ.

నేనూ, జయా ఆయాసపడుతూ మజ్జిగ పోసేవాళ్లం. ఒక్కోరోజు సరదాగానే వున్నా ఒక్కోరోజు విసుగ్గా వుండేది. ఆ మజ్జిగ చుక్కలు ఇల్లంతా పడితే మళ్లీ తుడుచుకోవడం ఓ పెద్దపని!

వాళ్లు వెళ్లాక చుట్టుపక్కల ఐదారిళ్ల వాళ్లు వొచ్చి మజ్జిగ పోయించుకుని పోయేవాళ్లు.

ఎప్పుడూ మజ్జిగ తప్పేలా చుట్టూ తిరుగుతున్నట్టే వుండేది. అలా రోజూ ఓ మూడు బిందెల దాకా మజ్జిగ పోసేవాళ్లం. ఎండాకాలంలో పాడి తగ్గుతుంది. అప్పుడు మజ్జిగ కూడా తగ్గేది.

‘అబ్బా! ఈ మజ్జిగ ఎంతకూ అయిపోదేంట్రా దేవుడా..’ అని విసుక్కునేదాన్ని.

ఎప్పటికీ తరగని మజ్జిగ సముద్రం లాగా అనిపించేది.

ఇంతమందికి పంచినా ఇంకా మజ్జిగ వుండి పోయేది. ఎప్పుడూ మజ్జిగపులుసు, మజ్జిగచారు, పెరుగులో కలిపిన కూరలు, పుల్లమజ్జిగ దోసెలు చేసేవారు అమ్మావాళ్లు. ‘మోర్కళి’ (పుల్లమజ్జిగ, బియ్యం పిండితో చేసే ఉప్మాలాంటిది ఇది. దీన్ని ఎక్కువగా తమిళులు చేసుకుంటారు) అనే టిఫిన్ చేసేవాళ్లు.

మధ్యాహ్నమైతే అమ్మా పెద్దమ్మా ఓ కునుకు తీసేవాళ్లు. సెలవురోజుల్లోనైతే ఆ సమయంలో మా పెద్దన్న మెల్లగా వంటింట్లోకి దారితీసేవాడు. నేనూ, జయా మెల్లగా పిల్లుల్లా మా అన్నను అనుసరించేవాళ్లం!

పాలగిన్నెపైన అరచేతి మందాన కట్టిన మీగడను మెల్లిగా స్పూనుతో తీసి, మా ఇద్దరి చేతుల్లో పెట్టేవాడు. దాని పైన కొంచెం చక్కెర చల్లేవాడు.

తన కోసం వేరే చిన్న ప్లేటులో మీగడ వేసుకొని, చక్కెర చల్లుకొని, అందులోకి ఓవల్టీన్ (బోర్నవీటా లాంటిది) కూడా వేసుకోని తినేవాడు.

మా తర్వాత మెల్లగా తమ్ముళ్లు కూడా సిద్ధమయ్యేవారు. వాళ్లకూ తలో చెంచాడు మీగడ పెట్టి, అమ్మ లేచేలోగా అందరమూ యేమీ ఎరగనట్టు హాల్లోకి వొచ్చి, పుస్తకాలు పట్టుకోవడమో, ఆట లాడుకోవడమో చేసేవాళ్లం!

కానీ, అమ్మకు తెలీకుండా యేమీ వుండదు లెండి.

‘పోనీలే.. పిల్లలు మీగడ తిన్నారు.. తిననీలే.. పెద్దయినాక ఎవరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో వుంటారో ఎవరికి తెలుసు? నా దగ్గర ఉన్నప్పుడు తృప్తిగా వాళ్లకు కావలసినవన్నీ తిననీలే!’ అనుకుని అమ్మ క్షమించేస్తుందన్నమాట!

అట్లా అమ్మలు మనల్ని ఎన్నిసార్లు క్షమించకపోతే మన బాల్యం అంతంత ఆనందమయంగా గడిచివుంటుంది చెప్పండి!

ఇప్పుడు తలచుకుంటే అదంతా నిజమేనా.. లేక కలా? అనిపిస్తుంది.

ఇదీ అమ్మణ్ని ఇంట్లో మజ్జిగసముద్రం కథ!

Exit mobile version