Site icon Sanchika

అమ్మణ్ని కథలు!-15

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

అమ్మణ్ని అసూయ

[dropcap]చి[/dropcap]న్నప్పటి నించీ జయా, నేనూ ఒకే జట్టుగా వుండేవాళ్లం. అదెప్పుడూ నా చుట్టూ తిరుగుతూండేది. కొన్నిసార్లు పోట్లాడుకున్నా చాలా వరకు సఖ్యంగానే వుండేవాళ్లం. పంతాలూ.. పట్టింపులూ.. తద్వారా చిన్నాపెద్దా తగవులు వస్తూనే వుండేవి. అయినా తను లేకుంటే నాకు తోచదు. నేను లేకుంటే తనకూ తోచదు.

అలాంటి జయ మీద నాకు అసూయ పుట్టింది ఓ సందర్భంలో. అదెట్లా జరిగిందో చెప్తాను ఉండండి.

మామూలుగా మేము పొద్దున ఎనిమిదింటికల్లా బడికి వెళ్లేవాళ్లం. అప్పటికి పాలు తాగడం, చద్దిపెరుగన్నం ముద్దలు, ఆవకాయతో కలిపి, పెద్దమ్మ చేతుల్లో వేస్తే తినడం అయిపోయేది.

పెద్దమ్మకు పూలజడలు వెయ్యడ మంటే మహా ఇష్టం. ఆడపిల్లలను మహాలక్ష్ములలాగా అలంకరించేది. సాధారణంగా ఆయా పువ్వులు దొరికే కాలంలో తరచుగా సాయంత్రం పూట మల్లెపూల జడలు, చేమంతుల కాలంలో చేమంతి జడలు, మొగలిపూల కాలంలో ఆ జడలు వేస్తుండేది.

వాటిలో కూడా ఎన్నో రకాలుగా వేసేది.

మల్లెపూలను, మొగలిరేకులను జడ పాయలలో ఒక్కో అల్లికకు ఓ పువ్వు, ఒక్కో రేకు పెట్టి అల్లే వంకీ జడ ఒక రకం.

జడ సైజు అట్టముక్కపైన మల్లెపూలు, చేమంతి పూలను వరుసగా కుట్టి మధ్యలో మెరిసే కాగితాలను, వేరే రంగు పూలనూ, ఊలుదారంతో చేసిన పూలను, ముత్యాల పూసలను, బంగారురంగు పూసలను పెట్టి కుట్టే జడ ఒక రకం. వీటిని జడకు దారాలతో కడ్తారు.

కాబట్టి మల్లెపూల, చేమంతి పూలజడలు సాయంత్రం పెట్టుకొనేవాళ్లం. కానీ, రాత్రిపూట ఆ జడలను విప్పదీసి, తడిగుడ్డలో చుట్టిపెట్టేది. మొగలిపూల జడలు, వంకీజడలూ తీయడానికి రావు. జడకే కుట్టేస్తారు.

పొద్దున్నే మాకు బంగారు జడ కుచ్చులు పెట్టి జడ వేసి, మళ్లీ పూలజడ కుట్టేసేది. చిన్నాలం పట్టు పావడాలు, పొడుగాటి జాకెట్లు వేసుకొని, మెడలో బంగారు గొలుసు వేసుకొని, చేతికొక బంగారు గాజు తొడుక్కొని, పూలజడ పైన బంగారు జడబిళ్ల పెట్టుకొని, దాని చుట్టూ పూలదండ చుట్టుకొని, జుంకీలు పెట్టుకొని పెళ్లికూతుళ్ల లాగా బడికి బయల్దేరేవాళ్లం.

పెళ్లికి పోతున్నామో, బడికి చదువు కోవడానికి పోతున్నామో మాకే తెలీదు.

అయినా బడికిపోయి చదువుకోవడం కంటే ఆడుకోవడమే ఎక్కువ!

మామూలు రోజుల్లో రెండు జడలు వేసి, పైకి కట్టి, రిబ్బన్లు పువ్వుల్లాగా వొచ్చేటట్టుగా వేసేవాళ్లు.

మా ఆరుమంది అక్కచెల్లెళ్లకూ ఇంతగా పూలజడలు వేసినా పూలజడలు అల్లే భ్రమ తీరలేదు పెద్దమ్మకు.

అప్పుడప్పుడే కొత్తగా వొచ్చిన తెల్లని ప్లాస్టిక్ పేపర్లలో బొరుగులు పెట్టి, వాటిని మల్లెమొగ్గల్లాగా తయారుచేసి, వాటిని పూలజడ లాగా తయారుచేసి మా జడలకు తగిలించి బడికి పంపేది.

బడిలో పిల్లలు మా జడలోని మల్లెమొగ్గలు లాగి, వాటిలోని బొరుగులు (మరమరాలు) తినడం మొదలుపెట్టారు.

దాంతో పెద్దమ్మ తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగు పూసలతో, ప్లాస్టిక్ దారంతో అందమైన జడలు అల్లి, వాటి చివర్లకు హుక్‌లు పెట్టి, మరింత సులభంగా మా జడలకు పూసలజడలను తగిలించేది. పూసలతోనే పూలు తయారుచేసి, జడపైన అలంకరించేది. ఆ పూసల జడలను మా పిల్లలకే గాక మా మనవరాళ్లకూ చేసి ఇచ్చింది వందేళ్లు బతికిన పెద్దమ్మ. ఆమె ఓపిక చల్లగుండ!

ఆ కాలంలో ఆడపిల్లలు బయటికిపోతే చాలా బాగా సంప్రదాయంగా అలంకరించుకుని పోవాలన్నది ఫాషన్ అన్నమాట!

ఆడపిల్ల అంటే పార్వతీదేవిలాగా వుండాలట! అందునా మేము శాస్త్రిగారి పిల్లలం. మరింత సంప్రదాయ బద్ధంగా వుండాల.

మా పూలజడలు చూసి, మా పక్కింట్లో వుండే సీతక్కా వాళ్ల చెల్లెలు నాలుగేళ్ల పిల్ల పూలజడ వేసుకుంటానని మొండి కేసిందోసారి.

దానికి పొట్టి జుట్టు వుంది. పెద్దమ్మ ఓరోజు కష్టపడి చిన్నసవరం పెట్టి, కుచ్చులు పెట్టి జడ వేసింది. చిన్న మల్లెపూల దండ జడకు చుట్టింది. ఎంత ముచ్చట పడిపోయిందో ఆ పిల్ల!

ఇంతలో వాళ్ల నాన్న బజార్లోకెళ్తూ వుంటే తానూ వొస్తానని సైకిలెక్కింది. పాపం.. దారిలో దాని జడ జారిపడిపోయింది.

‘నా పూలజడ.. నా పూలజడ..’ అని ఒకటే యేడ్చింది.

వెనకాల నడుచుకుంటూ వొచ్చేవాళ్లు పూలజడ తెచ్చి యిచ్చినారు.

మళ్లీ వాళ్లమ్మ యెట్లాగో మళ్లీ జడ వేసి, పూలు చుట్టింది. ఆ పిల్లను చూసి అందరూ ఒకటే నవ్వడం!

సరే.. ఇక అసలు మేము బడికి వెళ్లడం గురించి కదా మాట్లాడుతున్నా. మధ్యలో పూలజడల ప్రసక్తి వొచ్చింది.

నేనూ, జయా చెరో చేతి సంచీ తీసుకుని బడికి బయల్దేరేవాళ్లం. అందులో ఓ పలకా, బలపం, ఓ పుస్తకం వుండేవి. ఒక్కో తరగతికి ఒకటే పుస్తకం వుండేది ఆ రోజుల్లో.

మేము బడికి వెళ్లే దారిలో ఒక ఇంట్లో ఓ తల్లీ , ఇద్దరు ఆడపిల్లలు వుండేవారు.

ఆ ఇంటావిడ మరేమీ పనిలేనట్టుగా మేము వాళ్ల ఇల్లు దాటిపోయేదాకా మా ఇద్దరి అందచందాల గురించి పోలికలు పెట్టి మాట్లాడుతూ వుండేది.

“చిన్నపాప చూడవే.. ఎంత తెల్లగా, ముద్దుగా వుందో? జుట్టు కూడా ఒత్తుగా వుంది. కండ్లు చూడు ఎంత పెద్దగా వున్నాయో!

పెద్దపాప మామూలుగా వుంది. జుట్టు పలుచగా వుంది. రంగు కూడా చామనచాయే! జుట్టు కూడా పొట్టిగా వుంది..” ఇట్లా సాగేది ఆమె వర్ణన.

మొదట్లో అంతగా పట్టించుకునే దాన్ని కాదు గానీ, పోనుపోను జయతో అన్నింటిలో పోల్చుకోవడం మొదలైంది.

‘నాకంటే తను తెల్లగా వుంది. నేను యేమంత తెల్లగా లేను. నేనేమీ బాగా లేను’ అనే భావం బలపడసాగింది.

నాకు జయ అంటే విసుగుపుట్టడం మొదలైంది. తన పట్ల అసహనం ఎక్కువైంది. తనను సరిగ్గా ఆడించు కోకపోవడం, నువ్వు చిన్నపిల్లవి అని పక్కనపెట్టడం చేసేదాన్ని. దానివల్ల అమ్మతో తిట్లు తినేదాన్ని. తన పైన యేదో కోపం వస్తుండేది. ప్రతీకారం తీర్చుకోవాలనిపించేది.

కానీ, తనంటే నాకు చాలా ఇష్టమే. అట్లా ఎందుకనిపించేదో ఆ వయసులో అర్థం అయ్యేది కాదు.

రాత్రిపూట నేను, జయా పట్టెమంచం పైన పడుకునేవాళ్లం.. దోమతెర కట్టుకుని. మా వూళ్లలో దోమతెర తప్పనిసరి. లేకపోతే అరగంట సేపు కూడా పడుకోలేం. మనుషులను కూడా ఎత్తుకు పోతాయేమోననేట్టు పుట్టెడు దోమలుంటాయి.

నా పరుపు మీదికి జయ కాలు పొరబాటున వొచ్చినా ధన్ మని ఒక దెబ్బవేసేదాన్ని. తనూ అంతే.

తను నిద్రపోయాక మెల్లిగా గిచ్చేదాన్ని, నాకే తెలియని యేదో అసూయతో.

అది లేచి యేడిస్తే నేను నిద్రపోయినట్టు నటించేదాన్ని.

అది నన్ను లేపి నిలదీస్తే “దయ్యం వొచ్చి గిచ్చిందేమో.. నాకేం తెల్సు?” అని బుకాయించేదాన్ని.

కానీ, తను యేడిస్తే నాకు చాలా పాపమనిపించేది.

ఒకరోజు మా గొడవ అమ్మ విననే విన్నది. నన్ను బాగా కోప్పడింది. “ఇంకోసారి ఇట్లా జరిగితే ఊరుకోను” అని బెదిరించింది.

ఆ దెబ్బకు దయ్యం రావడం మానేసింది.

కానీ నాలోని అసహనాన్ని, అసూయనూ ఎలా సర్దుకోవాలో నాకు తెలియలేదు.

ఇదంతా తెలుసుకున్న పెద్దమ్మ ఓ మధ్యాహ్నం వేళ నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని, మొహం మీద పడుతున్న జుట్టును నా చెవుల వెనిక్కి తోస్తూ ఎన్నో విషయాలు చెప్పింది. నాక్కొన్ని అర్థమైనాయి. కొన్ని అర్థం కాలేదు.

కానీ, పని చేసి చేసి గరుకుగా మారిన పెద్దమ్మ చేతుల్లోనించి ఆప్యాయత, సానుభూతి, అనునయం, దయ, ప్రేమ, కరుణ వంటి ఎన్నో భావాలు పొంగులువారుతూ నా మనసు లోకి, నా శరీరంలోకి అలలు అలలుగా ఇంకిపోయిన అనుభూతి కలిగింది.

“అమ్మణ్నీ.. నీ చెల్లెల్ని నువ్వు ప్రేమగా చూసుకోవాల కదా? ఇప్పుడేనే మీరిద్దరూ కలిసి ఆడుకునేది. కలిసి వుండేది. పెళ్లయి అత్తగారిళ్లకు పోతే, మీ ఇద్దరూ సంవత్సరాని కొకసారి కూడా చూసుకోలేరు.

మన రూపాలు దేవుడు పెట్టినట్టు వుంటాయి అమ్మణ్నీ!

నీ దగ్గరున్న బొమ్మలన్నీ ఒకే మాదిరి వున్నాయా? నువ్వే ఎందరో పెండ్లికూతుర్ల బొమ్మలు చేసినావు కదా? అన్నీ ఒకటే మాదిరి ఎందుకు చెయ్యలేదు? ఒకటి చాలా బాగా అనిపిస్తుంది. ఒకటి అంత బాగా లేదనిపిస్తుంది.

నీ దగ్గరుండే రంగురాళ్లే తీసుకో. ఒకటి పొట్టిగా, ఒకటి పొడుగ్గా, ఒకటి సన్నగా, ఒకటి లావుగా ఎందుకున్నాయి చెప్పు? ఒకటి నీలంగా వుంటే, ఇంకోటి ఎర్రగా ఎందుకున్నాయి?

ఈ ప్రపంచంలో అందరూ తలో రకంగా వుంటారు గానీ, అందరూ ఒకటే రకంగా వున్నారా? పోనీ, మీ అక్కాచెల్లెళ్లందరూ ఒకే రకంగా వున్నారా? లేరు కదా?

పోనీ, ప్రపంచంలో అందరూ ఒకే రంగూ రూపంతో వుంటే గుర్తుపట్టేదెట్లా? చెట్లన్నీ ఒకే రకంగా, పక్షులన్నీ ఒకే రకంగా, జంతువులన్నీ ఒకే మాదిరిగా వుంటే ఏమన్నా బాగుంటుందా?

నీవూ, నీ స్నేహితురాళ్లూ అందరూ ఒకటే మాదిరే వున్నారనుకో. గుర్తించేదెట్లా? అప్పుడు సృష్టి విసుగుపుట్టిస్తుంది.

దేవుడు ఒకరిని అందంగా పుట్టించినాడనుకో.. మనం సంతోషించాల. వాళ్ల గురించి మనం యేడిస్తే మన కళ్లే పోతాయి. కానీ, మనకు ఆ అందం రాదు కదా? మనకు దేవుడు కాళ్లూ చేతులు, కళ్లూముక్కూ అన్ని అవయవాలూ సరిగా ఇచ్చినందుకు సంతోషపడాల. అవి లేనివాళ్లు ఎంత కష్టపడుతారో చూడు.

పెద్ద కళ్లుండి చూడలేకపోతే ఏమి లాభం? చెవులు చక్కగా తీర్చినట్టు వుండి వినలేకపోతే యేమి ప్రయోజనం?

మనం మన శరీరంతో ఎన్ని మంచిపనులు చేయగలమో చేస్తూ పోవాల. అప్పుడే దేవుడు మనల్ను కాపాడుతాడు.

జయ తెల్లగా వుంటే మనకే మంచిది కదా! నీ చెల్లెల్ని చూసి నీవే సంతోషపడు.

నీలో యేమేమి మంచి వుందో చూసుకో. యెదుటివాళ్ల గురించి ఆలోచించవద్దు. నీ గురించి నీవు ఆలోచించుకో.

నీ వయసుకు మించి, ఎన్నో పుస్తకాలు చదువుతావు. బయటి పనులన్నీ చక్కబెట్టుకోని వొస్తావు. ఇంట్లో అమ్మకు సహాయం చేస్తావు. నీవు లేకుంటే నీ స్నేహితురాళ్లకు ఆడుకోబుద్ధేయదు. అంత బాగా ఆడిస్తావు వాళ్లను. సంతకు పోయి ఎన్నెన్ని కూరగాయలు తెస్తావు? ఈ పనులు కొన్ని చేయగలదు గానీ, అన్నీ జయకు చేతగావు కదా? బాగా ఆలోచించుకో!” అని ఇంకా ఏవేవో చెప్పింది పెద్దమ్మ.

నా మనసు కొంత సమాధానపడింది. పెద్దమ్మ ఇంకా ఇట్లా చెప్పుతూ పోయింది.

“అందంగా వుంటే యేమన్నా కొరుక్కుతింటామా? అందంగా వుండి చెడ్డవాళ్లయితే ఎవరయినా మెచ్చుకుంటారా? కైకేయి చాలా అందగత్తె. కౌసల్య మామూలుగా వుంటుంది.

అయితే కైకేయిని తిట్టేవాళ్లే గానీ, మెచ్చుకునే వాళ్లెవరైనా వున్నారా? ఆమె పేరు ఎవరూ పెట్టుకోరు కదా? అదే కౌసల్యను అందరూ ప్రేమిస్తారు. ఆమె పేరు కూడా పిల్లలకు పెట్టుకుంటారు.

వేరేవాళ్లు అందంగా వుంటే మనకేం ఉపయోగం? మనకున్నది మనకుంటుంది గానీ, పరులకున్నది మనకు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా రాదు కదా? మంచిపనులు చేసేవాళ్లు నిజంగా అందమైనవాళ్లు, వాళ్లు నిజంగా అందంగా లేకపోయినా సరే.. నవ్వుమోహంతో వుండడమే నిజమైన అందం..

పరోపకారాన్ని మించిన సౌందర్యం ఉంటుందా? చెప్పు.. ప్రేమగా వుంటూ, కలగలుపుతనంతో అందరినీ మంచిమాటలతో ఒకటిగా వుంచగలగడమే అందం.. అందరినీ ఆనందంగా వుంచగలగడమే అందం.. మానవత్వంతో అన్ని ప్రాణుల పట్లా ఆదరంతో వుండడమే సౌందర్యం..” అంటూ ఎన్నెన్నో ఉదాహరణలతో నా సమస్యను విడదీసింది పెద్దమ్మ. నాలోని ‘సిబ్లింగ్ రైవల్రీ’ అనే సమస్యను తేనెమాటలతో తీసివేసింది బడి మొహమే ఎరుగని పెద్దమ్మ.

పెద్దవాళ్లు ఇంట్లో వుంటే పిల్లల మధ్యలో తలెత్తే సమస్యలను ఎలా మాటలతోనే పరిష్కరించేస్తారో కదా!

పెద్దమ్మ మాటలతో నా మనసు సమాధానపడింది.

అసూయ మరెప్పుడూ, యే విషయంలోనూ తలెత్తలేదు.

Exit mobile version