(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)
అమ్మమ్మగారి బేరసారాలు!
[dropcap]ఎం[/dropcap]డాకాలంలో మేము మా అమ్మమ్మ గారింటికి పోయినప్పుడు మా అవ్వ చేసే రకరకాల వ్యాపారాలను మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్లం! బేరం ఎట్లా చెయ్యాలో నేర్చుకునేవాళ్లం!
ఆమె వ్యాపారనైపుణ్యం ముందు ఇప్పటి ఐ.ఐ.ఎమ్., ఎమ్ .బి.ఏ. చేసిన వాళ్లు కూడా బలాదూరే!
మా అవ్వ ఎప్పుడూ ఆయాస పడుతూ, బలహీనంగా కనిపించేది. రోజల్లా మడుగుతోనే వుండేది. “మీద పడక.. దూరం.. దూరం!” అని సదా హెచ్చరిస్తూ వుండేది. తమిళయాసతో తెలుగు మాట్లాడేది.
ఆమె ప్లానింగ్, ఆమె గృహ నిర్వహణా సామర్థ్యం అనితర సాధ్యం అనిపిస్తుంది నాకు.
‘ప్రతీ ఒక్కటీ ‘ఏర్పాడు’ (పద్ధతి)గా చెయ్యాల’ అనేది ఆమె స్లోగన్. ఆమెకు సరైన వారసురాలు మా అమ్మ.
అవ్వ వంట చేయడం నేనెప్పుడూ చూడలేదు. రాజారావు అనే కన్నడ వంటాయన వుండేవాడు. మా బంధువుల్లోని వితంతువు ఒకావిడ వాళ్లింట్లోనే వుండేవారు. వాళ్లిద్దరూ వంట చూసుకునేవారు. ఎండాకాలంలో అయితే వేరే వేరే వూళ్లలో వుండే మా అత్తలు (మామల భార్యలు) అమ్మమ్మగారి ఊరికి వస్తారు కదా.. వంటాయనతో పాటు వాళ్లందరూ వంటగదిలో రకరకాల పనులు చూసుకునేవారు.
మా అవ్వ, మరి కొందరు కూరగాయలు తరిగేవారు.
అవ్వ అజమాయిషీ చేస్తుండేది. ఆమె కూరలు తరిగితే అన్ని ముక్కలూ ఒకే సైజులో, ఒకే ఆకారంలో వుండేవి. ఒక్క మాటలో చెప్పాలంటే పర్ఫెక్షనిస్టు ఆవిడ. ఆవిడకు జెరాక్స్ కాపీ మా అమ్మ!
ఆకుకూర అయితే సన్నగా పొట్టుమాదిరిగా తరిగేది అవ్వ.
ఒక్క మాటతో, చూపుతో అందరినీ నియంత్రించగల శక్తి ఆమెకు వుండేది.
కొడుకులు అమ్మంటే దేవతలా చూసేవారు. కోడళ్లు ఆమె ప్రేమ, మెప్పు పొందడానికి తహతహ లాడేవారు. ఆమె అడుగులకు మడుగులొత్తేవారు.
ఈ ఎండాకాలం రెండు నెలల కోసం సంవత్సరమంతా ఆమె ఎన్నో రకాల ప్లానింగులు చేసి, ఇంతమందికి కావలసిన అన్ని రకాల దినుసులు చవకగా వొచ్చినప్పుడు కొని జాగ్రత్త చేసేది.
ఆ కాలంలో చక్కెర రేషన్ షాపు లోనే దొరికేది. బయట మార్కెట్‌లో దొరికేది కాదు.
ఆమె ఎలాగో తిప్పలుపడి చక్కెర సేకరించి ఆ రెండునెలలూ ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసేది.
అందరికీ పెట్టే బట్టలు కూడా ముందు ముందు కొని వుంచేది.
ఆమె స్టోర్ రూమ్ ఒక మాంత్రికుడి గుహలా వుండేది. అక్కడ అందరికీ ప్రవేశం నిషిద్ధం. చీకటిగా వుండి చిన్నబల్బు మాత్రమే వెలుగు తుండేది. అక్కడ కొన్ని రహస్య సమాలోచనలూ, మంతనాలూ తన కొడుకులతో, కూతుళ్లతో చేస్తుండేది అవ్వ.
గూళ్లలోనూ, కిందా చిన్నా పెద్దా కుండలు, కొన్ని ఇత్తడి డబ్బాలు, రేకుడబ్బాలు వుండేవి. వాటి నిండా రకరకాల సరుకులుండేవి. ఎక్కడేముంటుందో ఆమెకే ఎరుక!
ఆమెకు రోజంతా రకరకాల వ్యాపారాల తోనే సరిపోయేది. ఈ వ్యాపారాలన్నీ ఇంటి పెరటి వాకిటిలోనే జరిగేవి.
ముందు వాకిట్లో మా తాతగారి ఆఫీస్ రూమ్ వుంటుంది. అందులోనించే లోపలికి రావాలి.
అందుకనే అవ్వ ఎవరైనా అమ్మకందారులు వొచ్చి పిలిచినప్పుడు హాలు వాకిట్లో నించే చేత్తో సైగ చేసి, పెరటి వైపు రమ్మని చెప్పేది.
ఎండాకాలంలో అమ్మమ్మగారి సంతానమంతా వస్తారని తెలుసు వాళ్లకి. అప్పుడు అమ్మేవాళ్లూ వరుస కడతారు.
పెరటి వైపు పెద్ద వరండా వుండేది.
ఒక అరవ చెట్టి గుర్రబ్బండిలో రెండు ట్రంకుపెట్టెలతో బట్టలు తెచ్చేవాడు. అవ్వను ‘పెద్దమ్మా..’ అని పిలిచేవాడు. అతను ట్రంకుపెట్టెల్లో వున్న బట్టలన్నీ వరండాలో పరచిన చాపలపైన వరుసగా అన్నీ అమర్చేవాడు. చీరలు, పంచెలు, పాంటు, షర్టు గుడ్డలు, పావడాలు, జాకెట్ గుడ్డలూ భారీ సంఖ్యలో కొనేది అవ్వ.
ఆమెకు అప్పటికి నలభై ఐదు మంది దాకా మనవలు, మనవరాళ్లు, యేడు మంది కొడుకులు, కోడళ్లు, ఇద్దరు కూతుళ్లూ, అల్లుళ్లూ వున్నారు మరి! అందరికీ బట్టలు పెడుతుంది ఆవిడ.
మా అవ్వ రోజల్లా మడితోనే వున్నట్టు వుంటుందని చెప్పాను కదా! అందుకే కొంచెం ఎడంగా కూర్చుని, కొత్తబట్టలకు దోషం లేదు కాబట్టి వాటిని మాత్రం ముట్టుకుని చూస్తుంది.
ఎవరికి ఏ రంగు బాగుంటుందో.. తానే నిర్ణయించి, ఒక్కో కుటుంబానికి బట్టలు ఎంపిక చేసి పక్కన పెడుతుంది.
ఇక బేరం చెయ్యడం అంటే ఆవిడ తర్వాతే ఎవరైనా. చెప్పిన ధరలో సగానికి తక్కువగా అడుగుతుంది. అంతకుమించి ఒక్క పైసా కూడా పెంచదు.
ఆ చెట్టి యేమో “పెద్దమ్మా.. మీరు దా అంత మొండిపట్టు పడితే మేమెట్లా దా బతకాలమ్మా.. మీరు బోణీ చేస్తే దా నాకు కలిసొస్తుందని ఇంత దూరం జట్కా ఖర్చులు పెట్టుకొని దా వొస్తిని. మదరాసు నించి దా తెప్పిస్తిని ఈ బట్టలన్నీ. మీ మాదిరే నాకూ పిల్లలున్నారు పెద్దమ్మా.. అన్ని ఖరీదులూ పెరిగి పోయినాయని మీకూ తెలుసు కదా? నాకూ గిట్టాల కదా.. మాలాంటి పేదోళ్ల మీద దా దయ చూపించాల మీలాంటి పెద్దోళ్లు!” అని కొంచెంసేపు ఏడుపు గొంతుతో బతిమిలాడినట్టు మాట్లాడుతాడు చెట్టి.
ఆ యేడుపులు అవ్వ దగ్గర యేమీ పనిచేయవు! అవ్వ మనసు అంత సులభంగా యేమీ కరగదు!
“ఇంతింత వ్యాపారం చేసేవాడివి నువ్వా పేదవాడివి.. మాటలు దా బాగా నేరిస్తివి. ఈ బట్టలు మదరాసువీ కాదు, యేమీ కాదు..ఇక్కడే పామిడి (అది ఆ ప్రాంతాల్లో బట్టల వ్యాపారానికి పేరొందిన ఊరు) నించి దా తెచ్చి వుంటువు. నాకు చెప్పక ఈ మాటలు! మదరాసు బట్టలేవో, ఇక్కడి బట్టలేవో నాకు తెలీదా?” అని అతని గుట్టు బయట పెడుతుంది అవ్వ.
“సరేనమ్మా.. ఇన్నేండ్లనించి మీ ఇంటికి వొస్తున్నా నా మాట దా మీరు నమ్మరు. నేనేం చేస్తును? ఈ రోజు నా అదృష్టం దా ఇట్లుంది. ఇంకో ఇల్లు చూసుకుంటాలేమ్మా! మీకు దా నా మీద దయమాలింది. ఏమో ఈ పూట మీ మనసు బాగున్నట్టు లేదు. ఇంకోసారి వస్తును లే పెద్దమ్మా!” అని అవ్వ సెలెక్ట్ చేసిన బట్టలన్నింటినీ ట్రంకులో పెట్టుకుంటాడు.. బెట్టు చేస్తున్నట్టు..
మేమంతా చుట్టూ కూచుని చూస్తున్నాము.
నాకు ఒకటే టెన్షన్.. ‘అయ్యో..వెళ్లిపోతాడేమో’ అని బిక్కు బిక్కుమని చూస్తున్నాను.
“ఏమీ భయపడకు. ఇచ్చే పోతాడు చూస్తుండు” అని గొణిగింది నా పక్కనే వున్న మా అత్త.. నా భయాన్ని గమనించి.
“సరేలే ..మాకూ ఇంకొకరెవరో వొస్తారులే.. నీవు దా నా మాట ఒప్పుకుంటే నీ ట్రంకుపెట్టెలు ఖాళీచేసుకోని డబడబలాడించు కుంటూ పోతావు. నీవు ఈ రోజు పొద్దున్నే ఎవరి మొహం చూస్తివో యేమో.. నా బేరం దా కాదనుకొని పోతున్నావు. ఎప్పుడూ తీసుకొనే వాళ్ల దగ్గర ఇంత హఠం చెయ్య కూడదప్పా. ఇట్లా చేసేటట్లయితే ఇంకెప్పుడూ మా కాంపౌండ్ లోకి రాకు మీ. నాకు ఎక్కడి పని అంతా అక్కడే నిలిచిపోయింది. దమ్మిడీ ఆదాయం లేదు.. ఘడియ పురుసత్తు(తీరిక) లేదు.. అన్నట్టుంది నా పని!” అని ఇంట్లోకి పోవడానికి లేచింది.
అతనితోపాటు వొచ్చిన ఇంకొక పెద్దాయన.. “అక్కా.. అక్కా.. అక్కా.. అక్కా.. అక్కా ..అట్లా ఎల్లిపోవద్దక్కా.. బేరం కుదరనీ అక్కా..” అంటూ అరవంలో యేదో గడగడా మాట్లాడినాడు.
మా అవ్వ కూడా అరవంలోనే దడదడా సమాధానం చెప్పింది. ఇద్దరికీ అరవంలోనే ఏదో రాజీ కుదిరింది.
అవ్వ తన పట్టువిడిచి, కాస్త ఎక్కువ ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు నాకు అర్థమైంది.
జట్కాలో పెట్టుకోబోయిన ట్రంకు పెట్టెలను తిరిగి వరండాలోకి చేర్చాడు చెట్టి.
“ముందే నీకు ఈ తెలివి వుంటే ఇంత పని తప్పేది దానే. ఊరికే పంతాలకు పోతావప్పా.. కొంచెం ఆలోచన వుండాల దానే.. అయినా నక్కను తొక్కి వొచ్చినావులే.. నీకు మంచి లాభం వొచ్చింది! నాకు దా బాగా నష్టమయింది. నీ పోరు తట్టుకోలేక నీ రేటుకు దా ఒప్పుకుంటిని! అయ్యగారు దా తిట్టబోతారు నన్ను ఇప్పుడు..” అని లోలోపల విజయగర్వంతో వున్నప్పటికీ పైకి తనే నష్టపోయినట్టు సణిగింది అవ్వ.
నాకైతే ఆ చెట్టికి అవ్వ బేరం చేసే పద్ధతి తెలిసి, ముందే రేట్లు పెంచి చెప్పినట్లనిపించింది. వెంటనే సరేనంటే అవ్వకు అనుమానం వొస్తుందని, కావాలని కొంచెం బెట్టు చేశాడేమోనని నా అనుమానం!
అన్ని బట్టలూ తాత రూములోని అలమారాలోకి చేర్పించింది అవ్వ.
ఆమె వ్యాపారాలు పొద్దున్నే పాలు పోసే గంగమ్మతో మొదలవుతాయి. గంగమ్మ పేరుకు తగ్గట్టుగానే పాలలో ధారాళంగా గంగను కలుపుతుంది. ఎంత డబ్బిస్తామన్నా నీళ్లు కలపకుండా తాను పాలు పోయలేనంటుంది.
ఏ రోజు ఎన్ని సేర్ల పాలు తీసుకున్నదీ తమాషాగా లెక్క పెట్టుకుంటారు వాళ్లిద్దరూ.
గడప మీద శుక్రవారం నాడు ఎర్రమట్టితో అలుకుతారు మా వూళ్లలో. దానిపై కాసిని పాలచుక్కలు పోసి, ఎర్రమన్ను చుక్కలు గోడమీద పొడుగ్గా, పొట్టిగా గీసుకుని సేరు, అర్ధసేరు అని లెక్కపెట్టుకుంటారు. దాని ప్రకారం నెలాఖరున లెక్క చేసుకుంటారు.
ఆ తరువాత కూరగాయల వాళ్లు వొస్తారు.
ఇంతమందికి ఎన్ని కూరలు తీసుకోవాలో చూడండి. గంపలు గంపలు ఖాళీచేసి పోయేవారు కూరగాయల వాళ్లు.
ఇక మామిడిపండ్ల వాళ్లు వచ్చి బుట్టలు బుట్టలు పండ్లు ఇచ్చిపోతారు.
సాయంత్రమైతే మల్లెపూల వ్యాపారం! ఇంతమంది ఆడవాళ్లకు బోలెడు పూలు కొనాలి. తోటలో పూసే పూలు చాలవు. అవన్నీ మాల కట్టడం మరో పెద్దపని! అప్పట్లో రోజూ సాయంత్రం ఆడవాళ్లు తప్పనిసరిగా పూలు పెట్టుకోవాలి.
మధ్యాహ్నం పూట పాతబట్టలకు స్టీలుసామాన్లు ఇచ్చేవాళ్లు వొస్తారు. మా అత్తా వాళ్లంతా సంవత్సరం రోజులు దాచిపెట్టిన పాతబట్టలను తెచ్చేవారు. అవన్నీ వేసి, వాళ్లకు స్టీలుసామాన్లు కొనిపెట్టేది మా అవ్వ.
మా అమ్మకు పాతబట్టలు తెచ్చే పని లేదు. ఆమెది వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆశ్రితులు చాలామంది వుండేవారు. అమ్మ కట్టుకునే వరయూరు చీరలు మంచిరంగులతో, పాతబడినా ఎంతో బాగుండేవి. పనివాళ్లు, జీతగాళ్ల భార్యలు, ఇతర ఆశ్రితులు అమ్మ చీరలు పాతబడకుండానే అడుగుతూ వుండేవారు. మా అందరి పాత బట్టలు కూడా ఎవరికో ఒకరికి ఇచ్చేసేది అమ్మ.
ఒకసారి ఒక స్టీలు సామాన్ల వాడికి మా అవ్వ బేరం నచ్చలేదు. ఇవ్వను పొమ్మన్నాడు.
“నువ్వూ వొద్దు. నీ స్టీలు సామానూ వొద్దు. మా బట్టలు మాకిచ్చి ఫో” అన్నది అవ్వ కోపంగా.
అతనికీ కోపం ఒచ్చింది. ఆ బట్టల మీద తుపుక్కు తుపుక్కుమంటూ నోట్లో వున్న తాంబూలం ఉమ్మేశాడు.
“ఇంకెట్లా తీసుకుంటావో తీసుకో..” అని సవాలు చేశాడు.
అతని దాష్టీకానికి అవ్వ కోపం తారాస్థాయికి చేరింది. “మాకేం ఫర్వాలేదు. మా పనిమనిషి చేత నేను ఈ బట్టలు ఉతికించి తీసిపెట్టుకుంటాను. నీ మీద పోలీసులకు కంప్లైంట్ ఇప్పిస్తాను లాయరు గారి చేత. జైల్లో కూచుందువులే. జైలు కూడు తింటే అప్పుడు బుద్ధి వొస్తుంది. మళ్లీ ఎప్పుడైనా మా కాంపౌండులోకి వొస్తివా.. కాళ్లు విరగ్గొట్టిస్తును.. అమ్మణ్నీ..పోయి మీ తాతను పిలుచుకోని రావే..” అని నా వైపు తిరిగి చెప్పింది.
కళ్లు కోపంతో ఎర్రబడిపోయినాయి ఆమెకు.
అతను భయపడిపోయినాడు. పోలీసులు, జైలు అనేసరికి దడుపు మొదలైంది.
తొందరపడి ఊశాడు గానీ, కొంచెం తెలివి తెచ్చుకుని, మళ్లీ రాజీకొచ్చి స్టీలుగిన్నెలు ఇచ్చినాడు.
పేదవాడైన అతడి మీద కోప్పడినందుకు బాధపడిందేమో తను కట్టుకునే చీరలు రెండు, తాతగారి పంచెలు అతనికి ఉచితంగా ఇచ్చింది అవ్వ.
“అన్నం తింటావా? ఆకలి మీద వున్నట్టున్నావు?” అని అడిగింది. తింటానన్నాడు.
అన్నం పెట్టింది. రెండు మామిడిపండ్లు చేతికిచ్చింది. అతను వెళ్లిపోయినాడు. “ఆకలైనట్టుంది పిచ్చివెధవకు! అందుకే దా అట్లా చేసినాడు” అని సమర్థించింది అతన్ని అవ్వ. అలా సాగుతాయి మా అవ్వ బేరాలు!
సాయంత్రమైతే అవ్వకు జడ వెయ్యడానికి పక్కవీధిలో వుండే పెద్దావిడ వొచ్చేది. ఆ కాలంలో పెద్దముత్తైదువులకు జడ వేసి అలంకారం చేస్తే పుణ్యమని భావించేవారు. అందులో కొడుకులను ఎక్కువగా కన్న తల్లికి మరీ స్పెషల్ గౌరవం!
మేము వాకిట్లో వున్న చమేలీ పూలు, తోటలో వుండే బొండు మల్లెపూలు, పన్నీరు మల్లెపూలు అనే ప్రత్యేక రకం మల్లెపూలు కోసి తెచ్చి యిచ్చేవాళ్లం. ఆవిడ మా అవ్వ జుట్టు దువ్వి, జుట్టుపాయల మధ్యలో పూలుపెట్టి, వంకీ జడ అల్లేది. గుండ్రంగా కొప్పు చుట్టి, పూలు కట్టి పెట్టేది ఆ పెద్దావిడ.
జడ వేస్తున్నంతసేపూ ఒకింత గర్వంగా చేతిలో అద్దం పెట్టుకుని చూసుకుంటూ వుండేది మా అవ్వ.
అవ్వకు అప్పటికి అరవైయేండ్లు దాటినా, జుట్టు నల్లగా పట్టుకుచ్చు మాదిరి వుండేది. పచ్చనిరంగుతో, రూపాయంత బొట్టుతో, కండ్లనిండా కాటుకతో పార్వతీదేవిలాగా వుండేది ఆమె.
అక్కడ అరటినారతో పువ్వుల దండ కట్టేవారు. నాకు చాలా ఆశ్చర్యంగా వుండేది. అరటి బోదెను నీళ్లలో నానబెట్టి, దాన్ని చిన్నదారాలుగా చీల్చి, ముళ్లు వేసి, చిన్నా పెద్దా ఉండలు చుట్టిపెట్టేవారు.
ఒక రోజు ఈ కార్యక్రమాలన్నీ అయ్యాక చీకటి పడే వేళకు వొచ్చినాడు ఫక్రుద్దీన్.. మా అవ్వ ఆస్థాన దర్జీ.
రాంగానే “అప్పా! నమస్కారం!” అని మా తాతకూ, మామలకు ఒంగి ఒంగి దండాలు పెట్టాడు.
“ఇన్ని రోజుల నించి చెప్పి పంపుతుంటే ఇప్పుడు దా నా కుదిరింది నీకు ముహూర్తం? ఇంకా అర్ధరాత్రి వేళకు రావలసింది. అయినా నువ్వు రావడమే దా మాకు శ్రీమహావిష్ణువు వొచ్చినట్టు! వచ్చినాడయ్యా గుత్తి నవాబు!” అని సాధిస్తూ అలమారులో నించి మా బట్టలు, మరి కొందరివీ తెచ్చి ఇచ్చింది.
దూషణ భూషణ తిరస్కారాలకు అతీతుడినన్నట్టు నిర్వికారంగా అవ్వ వైపు చూసినాడు ఫక్రుద్దీన్ .
గుడ్డ సంచీలోనించి ఓ పుస్తకం, ఓ చాక్ పీసు ముక్కా, సగం అరిగి పోయిన పెన్సిలూ బయటకు తీసి, పెన్సిల్ చెవిలో పెట్టుకున్నాడు. అతని బట్టతలా, మెల్లకన్నూ, చెవిలో పెన్సిలూ చూసి నాకయితే నవ్వాగలేదు. మరి కొందరు పిల్లలు కూడా ఫక్కున నవ్వారు.
అతనేం పట్టించుకోలేదు. స్థితప్రజ్ఞుడిలా నిరామయంగా వున్నాడు.
మగపిల్లలవి ఆల్తీ (ఆదీ) బట్టలు ఇచ్చి, వేరువేరుగా ఎవరివి వాళ్లకు చుట్టలు చుట్టిచ్చి, రకరకాల సూచనలు, హెచ్చరికలు చేసింది అవ్వ.
పుస్తకంలో యేదో రాసుకున్నాడు. అవ్వ సూచనలు అతనికి ఎంతవరకూ అర్థమయినాయో గానీ, అయోమయంగా దిక్కులు చూస్తూ తలూపుతున్నాడు.
ఆడపిల్లల పావడాలూ, జాకెట్లు గురించి మరింత ఎక్కువగా సూచనలు చేసింది అవ్వ.
ఒక్కో గుడ్డ పైనా పెన్సిల్‌తో యేదో రాసుకున్నాడు. రంగు గుడ్డలపై చాక్ పీసుతో యేవేవో రాసుకున్నాడు.
రెండ్రోజుల్లో తేవలసినవేవో మళ్లీ మళ్లీ చెప్పి పంపింది అవ్వ.
అతను తల గోక్కుంటూ “సరే అమ్మయ్యా..” అంటూ వెళ్లిపోయినాడు.
రెండు రోజులు కాస్తా నాలుగు రోజులయినాయి.
మనుషులను మీద మీద పంపి గుర్తు చేశాక ఒకరోజు తను కుట్టిన బట్టలను తీసుకొచ్చాడు ఫక్రుద్దీన్ .
వధ్యశిల ముందు నిలబడ్డ మేకపిల్ల మాదిరిగా అవ్వ ముందు కూచున్నాడు.
కోర్టులో జడ్జి యేం శిక్ష విధిస్తాడోనని భయపడుతున్న ముద్దాయి మాదిరిగా బిత్తరచూపులు చూస్తూ కూచున్నాడు ఫక్రుద్దీన్. లోలోపల వాళ్ల దేవుణ్ని తలచుకుంటున్నాడేమో ననుకున్నా నేను.
అవ్వ మా అందరినీ పిలిచింది. అతను మాకు కుట్టిన బట్టలను మామీద పెట్టి కొలత చూశాడు.
నాకు కుట్టిన పావడా, జాకెట్టూ నాకంటే రెండేళ్లు పెద్దదైన మా మేనమామ కూతురికి సరిపోయింది. నాకంటే చిన్నపిల్లకు కుట్టిన పావడా, జాకెట్టు నాకు సరిపోయింది. మా చిన్నన్నకు కుట్టిన నిక్కరు, షర్టు అతనికి లొడుంగు బుడుంగు అయ్యి, అతనికంటే పెద్దవయసు వాడైన మా పిన్నమ్మగారి అబ్బాయికి సరిపోయింది.
మా అవ్వ తలపట్టుకొని కూచుంది. “ఎన్ని జాగ్రత్తలు దా చెప్తినిరా.. చివరకు ఇట్లా ఒకరివి ఒకరికి దా కుట్టి చచ్చినావు కదరా.. త్రాష్టుడా! నీ తలలో దా మెదడు వుందా? బంకమట్టి దా వుందా?” అని రకరకాలుగా మందలించింది.
“పెరిగే పిల్లోళ్లని కొంచెం పెద్దగా కుట్టినాలే అమ్మయ్యా.. అంతా మన పిల్లోళ్లే కదా? ఎవరికి యేది సరిపోతే అది యేసుకుంటారు లెండి! చిన్న పాప గుడ్డలు పెద్దపాప యేసుకుంటాది, పెద్దపాపవి ఇంకో పాప యేసుకుంటాది లెండి..! చిన్నయ్యవి పెద్దయ్య యేసుకుంటాడు లెండి.. పాడైతే చెయ్యలే కదా నేనూ..” అని అదేమీ పెద్దతప్పేమీ కాదన్నట్టు, ఆ మాత్రం సర్దుకోవడం కూడా చేతకాదా.. అన్నట్టు చెప్పినాడు నెత్తిమీద పెన్సిల్‌తో గోక్కుంటూ.
మా అవ్వకు కోపం నసాళానికి అంటింది. కానీ, అతన్ని తిట్టినా లాభం లేదని నిగ్రహించుకుంది. నెత్తిమీద చేత్తో కొట్టుకుంటూ..
“నేనేం చేస్తునురా నాయనా? నా ఖర్మ ఇట్లా కాలింది! నేనెన్ని జన్మల్లో ఏమేం పాపాలు దా చేస్తినో.. ఎవరెవరిని ఎంత దా యేడిపిస్తినో.. యేమో.. నీపాలబడినాను. దేవుడు నా మీద దా కక్ష కట్టినట్టున్నాడు. పోనీ ఇంకెవరినన్నా పిలుస్తామా అంటే.. నిన్ను మించిన టైలరు దా ఈ కొంపలో లేడు. అసలు నీకు ఈ విద్య నేర్పినవాడెవడో వాణ్ని పట్టుకొని తన్నాల! మాకు నీతోనే దా పని కావాల. మా పాలిటికి నువ్వే దేవుడివి! కానీ..నా ఖర్మ..యేం చేస్తును? సరే.. ఈసారైనా సరిగ్గా కుట్టు. పెద్దపెద్దగా కుట్టక!..” అని లక్ష సూచనలు చేసి, మరికొందరి బట్టలిచ్చింది మా అవ్వ.
అవ్వ నిష్ఠూరాలన్నీ శివుడు గరళం మింగినట్టు మింగేసినాడు ఫక్రుద్దీన్. శివుడు గొంతులోనే విషాన్ని మింగినాడు కానీ, ఫక్రుద్దీన్ తన పెద్ద బొజ్జలో అవ్వ నిష్టూరాలను సర్దేసుకున్నాడు.
అవ్వ సూచనలు వినేకొద్దీ అతనికి మళ్లీ గందరగోళం మొదలైంది. పెన్సిల్‌తో మధ్యమధ్యలో తలమీద గోక్కుంటూ, బట్టల పైన యేవో రాసుకున్నాడు. అయోమయం ముఖంతో అవ్వకు నమస్కారం చెప్పి ఇంటికి బయల్దేరాడు.
ఈసారి ఎవరికి కుట్టినవి ఎవరికి సరిపోతాయో ఆ దేవుడికే ఎరుక!
కానీ, మా అవ్వ మదరాసు తెలివితేటలు పల్లెటూరి ఫక్రుద్దీన్ ముందు వెలాతెలా పోవడం మాత్రం నాకు భలే నవ్వు తెప్పించింది. మా మామలకు, అత్తలకూ, పిల్లలందరి క్కూడా.
ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే కదా?
అందరూ దాన్నొక వినోద కార్యక్రమం లాగా చూశాము. అందరూ అవ్వా- ఫక్రుద్దీన్ మధ్య సంభాషణలను తలుచుకొని, తలచుకొని నవ్వుకున్నారు.
బట్టలు కుట్టించుకోవడం అయిపోయింది కనుక నేను, మా చిన్నన్నా మరునాడే ఊరి బస్సెక్కినాము.. మా ట్రంకుపెట్టెలు బస్సుపైకెక్కాయి. కండక్టరుకు, డ్రైవర్ కు మా గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పిపంపినారు మామావాళ్లు.
అందరికీ నమస్కారాలు పెట్టేసరికి నడుము పీకేసింది. మా వూరు ఎప్పుడెప్పుడొస్తుందా.. అని కిటికీలోకి తలదూర్చి కదిలిపోతున్న కొండలను, పొలాలను గమనిస్తూ కూర్చున్నాను బస్సులో.