(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)
అమ్మణ్ని ఊళ్లో పీర్లపండగ!
[dropcap]మా[/dropcap] ఊళ్లో పీర్లపండగ వొచ్చిందంటే మా పిల్ల గుంపు ఆనందం పట్టలేం! ఆ వారం పది రోజులూ పీర్ల చావిళ్ల దగ్గరే మా సాయంత్రాలు గడిచేవి. బడికెళ్లి రావడం, యేదో కాస్త తినేసి, కాఫీ తాగేసి, అందరం కలిసి అక్కడికెళ్లి ఆడుకోవడం, లౌడ్ స్పీకర్లలో పాటలు వినడం, గుండం చుట్టూ తిరగడం, అక్కడ జరిగే ప్రతి విషయాన్నీ గమనించడం, పొద్దుపోయే సమయానికి ఇంటికి రావడం.. ఇట్లా సాయంత్రాలు క్షణాల మాదిరి గడిచిపోయేవి.
పీర్లచావిడి ముందున్న సమాధుల పైకెక్కడం, వాటిపై కూర్చోవడం, వాటి పైన పడుకోవడం, వాటి చాటున దాక్కొని దాగుడు మూతలాట ఆడటం వంటి మహా అల్లరి చేసేవాళ్లం.
పాపం.. అక్కడి వాళ్లు మమ్మల్ని వారిస్తూనే వుండేవాళ్లు.. “పాపా.. సమాధులను తొక్కకూడదమ్మా..” అంటూ. మేం వింటే కదా! సమాధులంటే అసలు భయమే లేదు.
ఇంట్లో అమ్మా వాళ్లకు తెలీదు కదా.. పీర్లసావిడి దగ్గర సమాధు లుంటాయని! లేకుంటే అస్సలు ఊరుకునేది కాదు మా అమ్మ. అయినా కొన్ని విషయాలు అమ్మావాళ్లకు తెలీకపోవడమే మంచిది!
అమ్మ ఎప్పుడైనా ఊరికి పోయేటప్పుడే బయటకు వొస్తుంది. లేదా సంవత్సరానికోసారి ధనుర్మాసంలో రంగనాథస్వామి గుడిలో జరిగే పూజల సమయంలో ఓ రోజు గుడికి వెళ్లేటందుకు బయటికి వొస్తుంది.
లేదంటే ఎవరింటికైనా పేరంటానికి పోవాలంటే బయటికి వొస్తుంది అంతే!
ఆమెకు ఇల్లే వైకుంఠం.. గడపే కైలాసం! కాబట్టి ఇలాంటి వివరాలు అమ్మకు తెలీవు!
కాసేపు బయట ఆడుకొని, చావడి లోపలికెళ్లి పీర్లను చూసేవాళ్లం. పీర్ల చుట్టూ కట్టిన రంగురంగుల వస్త్రాలను చూస్తూ మురిసి పోయేవాళ్లం.
మేము వొచ్చినామని “అయ్యగారి పిల్లలు వొచ్చినారు. చక్కెర చదివించండి పీర్లకు..” అని వారిలోనే ఒక పెద్దాయన చెప్పేవాడు ఇంకొకాయనకు.
ఏవో తురక మంత్రాలు చదివి, వాళ్ల దగ్గరున్న చక్కెరనే పీరుకు మా పేరు మీద చదివించి, ఆ చక్కెరను మాకు ప్రసాదంగా ఇచ్చేవారు. లేదంటే అప్పుడప్పుడూ అమ్మ ఒక పెద్ద బెల్లం గడ్డ పేపర్లో చుట్టి ఇచ్చేది.. పీర్లకు చదివించడానికి. వాళ్లు ప్రసాదంగా ఇచ్చిన చక్కెరో, బెల్లం ముక్కో తినేసి, మళ్లీ ఆటలు మొదలు!
అక్కడ ఎదురుగా వున్న ఖాళీస్థలంలో ‘పీర్లగుండం’ అని ఒక వెడల్పాటి, ఎక్కువ లోతులేని గుంత తవ్వేవారు.
ఆ గుండంలో ఆ పీర్లపండగ రోజుల్లో చివరి రోజు పెద్దపెద్ద నిప్పులు రాజేసేవారు.
అది చూసినాను గాని, నిప్పుల్లో మనుషులు నడవడం చూడలేదు. ఆ దృశ్యాన్ని చూడాలని నా మనసు ఉరకలు వేసేది. కానీ ఆ తంతు ఎప్పుడో అర్ధరాత్రి పూట జరుగుతుందట! అందుకే చూడటం కుదరలేదు.
ఆ గుండం (నిప్పులు ఇంకా రాజేయనిది) చుట్టూ పరుగులు పెట్టడం, ఒక్కోసారి అందులోకి పడిపోవడం, మళ్లీ లేచి ఆడుకోవడం అదేమి ఆనందమో మా పిల్లజాతికి.. నాకు ఇప్పటికీ అర్థం కాదు.
మా ఇంటి దగ్గర శివాలయం పక్కన వున్న పీర్లచావిడి పేరు ‘పెద్ద బారేమామ్’. దాన్ని నడిపే ముల్లా దాదేఖాన్ మా ఇంటి దగ్గరే వుంటారు. ఆ పీరును చావడిలోకి తెచ్చేముందు ఆ ముల్లా వాళ్లింట్లో అలంకరించేవారు.
ఇంటి ముందు పెద్ద పల్లకీ లాంటి పెట్టెను తయారుచేసి, దాన్ని పూలతో అలంకరించి, దానిలో పీర్లను పెట్టి, ఊరేగింపుగా తీసుకెళ్లేవారు.
అక్కడంతా మా పిల్లల సందడే! ఆ సందట్లో ముల్లా వాళ్ల ఇల్లంతా కలయ తిరిగేదాన్ని. హబీబూన్‌తో కబుర్లే కబుర్లు!
ఈ ముల్లా వాళ్లు పేదవాళ్లు. అందుకే వాళ్ల పీర్ల అలంకరణ చాలా సాదాసీదాగా వుండేది.
చిన్న బారేమామ్ పీరును నిర్వహించే హస్మియ్యా, ఇతరులు కాస్త కలవాళ్లు.
కాబట్టి చిన్నబారేమామ్ చావడి మంచి తళుకుబెళుకులతో వుండేది. అక్కడికి వెళ్లి అక్కడ కూడా ఆడుకునేవాళ్లం. రంగురంగుల దీపాలను చూస్తూ మైమరచి పోయేవాళ్లం!
కొందరు పులివేషాలు వేసేవాళ్లు. పులుల్లా వాళ్లు ఆడుతుంటే, వాళ్ల నడుములకు తాళ్లు కట్టి, వాళ్ల ఆట శృతి మించకుండా ఒక్కొక్కరి వెనుకా ఒక్కొక్కరు వెనకవైపు నుంచి పట్టుకుని అదుపుచేసేవారు. ఒళ్లుమరిచిపోయి, నిజంగా పులులను చూసినట్టే ఫీలయ్యేవాళ్లం!
హిందీ సినిమా పాటలను మేము పీర్లపండగలోనే వినేవాళ్లం. ఎప్పుడూ కొన్ని పాటలే పెట్టేవారు.
“బహారోం ఫూల్ బరసావో.. మేరా మెహబూబ్ ఆయా హై..” అనే పాట అయితే అరిగిపోయేవరకూ పెట్టేవారు. అది అరిగిపోయి, “ఆయా హై.. ఆయాహై.. ఆయాహై..” అంటూ కీసర బాసర మంటూ శబ్దాలు చేస్తూ ఆగిపోతే అందరం పగలబడి నవ్వులు! ఇంకేవో ఖవ్వాలీ పాటలో యేవో పెట్టేవారు. మాకేమీ అర్థమయ్యేది కాదు.
కొన్ని తెలుగు సినిమా పాటలు కూడా పెట్టేవారు. వాటిని శ్రద్ధగా వినేవాళ్లం.
తల్లిపీరును చూడాలంటే సంతపేట దాటి చాలా దూరం పోవాలి. అక్కడ తళుకులూ, బెళుకులూ యేమీ వుండవు పాపం!
అందుకే ఎప్పుడైనా వెళ్లేవాళ్లం.. మేం పోయి చూడకపోతే తల్లిపీరు యేమను కుంటుందో.. యేమోనన్నట్టు! దీనంగా వున్న తల్లి పీరును చూసి జాలిపడేవాళ్లం! తల్లిపీరును నిలిపేవాళ్లు చాలా పేదవాళ్లు.
చివరిరోజు పక్క వూర్ల నించి కూడా పీర్లు ఊరేగింపుతో ఒచ్చేవి. నాలుగైదు పీర్లు పెద్ద పెద్ద కర్రలకు అమర్చబడి, వాటికి చుట్టూ రంగురంగుల వస్త్రాలు అలంకృతమై వుండేవి.
అప్పట్లో (ఇప్పుడు కూడా అనుకుంటా..) పీర్లపండగ మా వూరి రెడ్డిగార్ల ఆధ్వర్యంలోనే జరిగేది.
చాలామంది పీర్లకు మొక్కుబళ్లు మొక్కుకొని వస్త్రాలు, నగలు, డబ్బులూ, చదివింపులూ సమర్పించుకునేవారు. అంతెందుకు.. మా ఇంట్లో ఉన్న వంటాయన కిష్టయ్య పెద్దబారేమామ్ పీరుకు జుంకీలు చేయించినాడు!
హిందువుల్లో ఈ పీర్లకు మొక్కే వాళ్లు హుస్సేన్ రెడ్డి, పీరారెడ్డి, దస్తగిర్ రెడ్డి, హుస్సేనమ్మ, హుస్సేనప్ప, దస్తగిరమ్మ లాంటి పేర్లు పెట్టుకునేవారు.
నిజంగా హిందువులు నడుంకట్టి, ధనం సర్ది నిర్వహించకపోతే అప్పట్లో ముస్లిములు అంతటి ఉత్సవాలు చెయ్యగలిగేవారు కాదు.
ప్రధానవీధి అయిన సంతపేట, కోమట్ల వీధి, ఆ పై నుంచి మా ఊరి సెంటరు ఐదులాంపుల వరకూ పీర్ల ఊరేగింపు సాగేది. మేమంతా కోమట్ల ఇళ్ల పైకి ఎక్కి కూర్చుని చూసేవాళ్లం.
పీర్ల పైన చల్లడానికి లేవడాలు (రేవడే అనే మరాఠీ పదం నుంచి వచ్చింది. ఆ ప్రాంతమంతా రాయల కాలం తరవాత మరాఠీ పేష్వాల యేలుబడిలో వుండేది! మరాఠీ రాజ్యం దక్షిణాదిన జింజి వరకూ వ్యాపించి వుండేది. అందులో భాగంగా ఈ ప్రాంతం కూడా వుండేదనుకుంటా! అందుకని కొన్ని మరాఠీ పదాలు, ఆచారాలు వాడుకలో వుండేవి. ‘రంగరాజు’లనే మరాఠీ వాళ్లు కూడా మా ప్రాంతాల్లో వున్నారు. లేవడాలను ఆంధ్రా భాషలో అయితే లేవడాలను ‘జీళ్లు’ అంటారు) చల్లేవారు. అవి కొనుక్కోవడానికి అమ్మ చిల్లర ఇచ్చేది.
పేపర్ పొట్లంలో వున్న ఆ తియ్యని తినుబండారాన్ని అన్యాయంగా, పీరు మీద చల్లే పేరుతో నేల మీద పడెయ్యడానికి మనసు ఒప్పేది కాదు.
“మనమే తినేద్దాం లేవే. యేమీ కాదు. అమ్మా వాళ్లకు తెలుస్తుందా.. యేమన్నానా? ఇంత మంచి వస్తువును నేలమీద పడేయడమెందుకు?” అనేది సావిత్రి. ఆ మాట కోసమే నేనూ ఎదురు చూస్తుండేదాన్ని.
ఆ పీర్లను చూస్తూ శుభ్రంగా ఆ లేవడాలను తినేసే వాళ్లం.. స్నేహితులందరం పంచుకుని.
పీర్లు వెళ్లిపోయినాక మెల్లిగా మిద్దె దిగి ఇంటిదారి పట్టేవాళ్లం! దారిలో రంగురంగుల పేపర్లు చుట్టి తయారుచేసిన ‘కళ్లద్దాలు’ కొనుక్కునేవాళ్లం.
అప్పుడు ఎక్కడ లేని స్టైల్ ఒచ్చేది మాకు. మమ్మల్ని మేము సినిమా హీరోయిన్ల లాగా భావించు కునేవాళ్లం!
రంగుపేపర్లతో తయారుచేసిన చిన్న పూలగుత్తి.. జడలో పెట్టుకునేది.. అదీ కొనుక్కునేవాళ్లం!
ఆ రంగుటద్దాలు పెట్టుకుని, ఆ గులాబీ, ఎరుపు రంగు కాగితాల పూలగుత్తి, పైన చెమ్కీలు చల్లినది జడలో పెట్టుకుంటే మాకు ఇంద్రధనుస్సు పైకెక్కి విహరించి నంత ఆనందంగా వుండేది.
ఏదో జీవితంలో పొంది తీరవలసిన ఆనందాన్ని పొందామన్న తృప్తితో ఇంటిదారి పట్టేవాళ్లం!
ఆ తర్వాత కొన్నేళ్లకు నేను హైస్కూలు కొచ్చాక కర్నూలు నుంచి నజ్మా టీచర్ అనే ఆవిడ మా వూరికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వొచ్చింది.
ఆవిడ, “పీర్లపండగ నిజానికి పండగ కాదనీ, కొందరు ముస్లిమ్ మహనీయులు, శత్రువుల చేత హతమార్చబడ్డ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఆచరించే సంతాప దినాలనీ, ఇలా ఉత్సవాలు చేయకూడదనీ, అది తప్పనీ” చెప్పింది.
మరి మన దేశంలో చాలా చోట్ల అలా ఊరేగింపులు ఎందుకు చేసేవారో మరి!
మన హిందువులకు యే సందర్భాన్నయినా ఆర్భాటంగా, ఉత్సవంలా చేసుకునే అలవాటు కదా? అదే అక్కడి ముస్లిములకూ అలవాటయిందేమో!
పీర్లపండగ అయిన తర్వాత పీర్లను ఏటి వరకూ తీసుకొనిపోయి వొస్తారట! అప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తారట! అయితే వినడమేగానీ, నేనెప్పుడూ ఆ దృశ్యాన్ని చూడలేదు.
నాకు అప్పటికి చాలా రోజుల నించే అగ్నిగుండంలోకి నిజంగానే నడుచుకుంటూ పోతారా.. అది యేదైనా మోసమేమో, కాళ్లకు యేదైనా పసరు రాసుకుంటారేమో ననే అనుమానం బాధిస్తూ వుండేది.
ఆ సంవత్సరం ఎట్లాగైనా దాన్ని ప్రత్యక్షంగా చూసి, సందేహ నివృత్తి చేసుకోవాలని దృఢ నిశ్చయం చేసుకున్నాను.
హస్మియ్యా కూతురు గౌస్ బీబీ నాకు బాగా పరిచయం. నిజానికి నాకు ఆ చుట్టుపక్కల వీధుల్లో చాలామంది పరిచయమే! అందుకే అమ్మ నన్ను ‘పెత్తనాల పేరిందేవి’ అని పిలుస్తుంది.
గౌస్ బీబీ నాకంటే చాలా పెద్దది. వాళ్లింటి పెరట్లో పాడుబడిన కాంపౌండు గోడ ఎక్కి కూచుంటే, ఆ పీర్ల గుండం ఆ పక్కనే కనిపిస్తుంది. అది నాకెట్లా తెలుసూ.. అని అడిగారనుకోండి.. నేను ఇంతకుముందే చెప్పాను కదా.. ఆ చుట్టుపక్కల వీధుల్లో నేను దూరని ఇల్లు లేదని.. నా చాంద్రాయణంలో నేను పరిచయం చేసుకోనివాళ్లు లేరని..
అందుకే ఆమెనడిగి అన్ని వివరాలూ తెలుసుకున్నాను.
ఆ రోజు రాత్రి వాళ్లంతా ఆ గోడ మీదికెక్కి కూర్చుని మనుషులు పీర్లగుండంలో నడవడాన్ని చూస్తామని చెప్పింది గౌస్ బీబీ.
“నేను రాత్రి వొస్తే నాకూ చూపిస్తావా పీర్లగుండంలో మనుషులు నడవడం..” అని అడిగినాను. సరేనన్నది. వాళ్లమ్మ కూడా ఒప్పుకుంది.
మా అమ్మకు విషయం చెప్పి “ఒక్కసారి పీర్లగుండంలో మనుషులు నడవడం చూస్తాన”ని చెప్పాను. బతిమాలుకున్నాను. మా అమ్మ ఏ కళనుందో కష్టం మీద సరేనన్నది.
గౌస్ బీబీ ఇల్లు మా సందుకు ఇంకో చివర్లో రోడ్డుకు దగ్గరగా వుంటుంది.
గౌస్ బీబీ రాత్రి నన్ను ఇంటి దగ్గర దింపుతుందని చెప్పాను.
గౌస్ బీబీ మా ఇంట్లోని బోరింగ్‌లో నీళ్లు కొట్టుకోవడానికి వొచ్చినప్పుడు ఆమెను అమ్మతో మాట్లాడించాను.
నా రక్షణ బాధ్యత తను చూసుకుంటానని బీబీ గట్టి మాట ఇచ్చాక, మరెప్పుడూ ఇలాంటి కోరికలు కోరనని ప్రమాణ పూర్వకంగా చెప్పాక, ఎంతో అయిష్టంగా ఒప్పుకుంది అమ్మ.
నా ఆనందానికి అవధులు లేవు.
రాత్రి తొమ్మిది గంటలకల్లా బీబీ ఇంట్లో వున్నాను. నేనూ, తనూ చాలాసేపు గోడమీద కూర్చుని కథలు, కబుర్లు చెప్పుకున్నాము.
గుండంలో నిప్పులు కణకణ మంటున్నాయి. ఆ వేడికి చెమటలు పోస్తున్నాయి. అందరూ గుండం చుట్టూ తిరిగి పోతున్నారు కానీ, పీరు ఎంతసేపటికీ రాలేదు. తప్పెట్లూ, తాళాలూ మోగుతున్నాయి.
రోజూ తొమ్మిదింటికల్లా నిద్రపోయే నాకు ఆ రోజు కళ్లలోకి నిద్ర వొస్తే ఒట్టు!
ఏదో ఒక గొప్ప సత్యం నా కళ్ల ముందు ఆవిష్కృతం కాబోతున్నదన్న ఆనందం నన్ను ఊపేస్తున్నది. కోరుకున్నది సాధించడంలో అంత సంతోషం వుంటుంది కాబోలు!
చివరికి అర్ధరాత్రి దాటాక తప్పెట్లు, తాళాలతో పెద్ద బారేమామ్ పీరు గుండం దగ్గరికి వొచ్చి నిలుచుకుంది.
పిల్లా పెద్దా అందరూ ఒకరి తర్వాత మరొకరు గుండంలోకి దిగి ఈ కొస నించి ఆ కొసకు వేగంగా పరుగులు తీశారు.
వాళ్లకేమీ కావడం లేదు.
నా వయసున్న మగపిల్లలు కూడా దిగి పైకి వొచ్చారు ఏమీ కాలకుండానే. నేను కళ్లప్పగించి చూశాను. మంత్రముగ్ధురాలినై పోయాను.
నా లక్ష్యం ఒకటి నెరవేరింది. నేను ఒక విశేషమైన సందర్భానికి సాక్షిగా నిలిచినాను! ఒక అపురూపమైన దృశ్యాన్ని నా కళ్లతో చూసినాను.
కానీ ఆనందంతో పాటు ఎన్నో సందేహాలు పుట్టగొడుగుల్లా మొలిచినాయి.
‘పెద్దమ్మ కుంపట్లో నించి కిందపడిన నిప్పులను చేత్తో అమాంతంగా తీసి తిరిగి కుంపట్లోకి పడేస్తుంది కదా.. అప్పుడు పీరు యేమీ వుండదు కదా.. పెద్దమ్మకు చేతులు ఎందుకు కాలవు?
అమ్మ సుమారైన వేడి అన్నం గిన్నెను సులువుగా చేత్తో పట్టుకుంటుంది కదా!
మా పనమ్మాయి వెంకటమ్మ మసిలిపోయే కాఫీని క్షణాల్లో తాగేస్తుందే.. వాళ్లకేమీ కాలదెందుకు?’ అని ఆలోచిస్తూ కూర్చున్నాను.
ఇంతలో పీరు చావడిలోకి వెళ్లిపోయింది. నేను గౌస్ బీబీ ఇంట్లోనించి బయటికి వొచ్చినాను. తను నాకు ఇంటి వరకూ తోడు వొస్తానని మాట ఇచ్చినదల్లా.. “నేను ఇక్కడే నిల్చుకుంటాను. నువ్వు పరిగెత్తుకుంటూ పో.. భయమేం లేదులే..” అని ప్లేటు మార్చింది.
ఎంత అడిగినా “నేను మళ్లీ ఒక్కదాన్ని రావాల గదా..” అని మొండికేసింది.
అప్పుడు నిజంగా భయం అంటే యేమిటో అర్థమైంది. పిచ్చి వెరపు కలిగింది. కానీ, తప్పదు కదా.. ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం..’ అని మనసులో అనుకుంటూ నిశ్శబ్దంగా, చీకటిగా, నిర్మానుష్యంగా వున్న ఆ వీధిలో భయంతో పరుగులు పెడుతూ నేను ఇల్లు చేరాను. తలుపు జేరవేసి వుంచింది అమ్మ. లోపలికెళ్లి, తలుపు గడియ వేసేసి, చప్పుడు చేయకుండా కాళ్లు కడుక్కొని మంచం మీద వాలేసరికి రెండు గంటలు కొట్టింది మా గోడ గడియారం!
పెద్దవాళ్లు పిల్లలను ఎక్కడికంటే అక్కడికి పంపడానికి ఎందుకంత భయపడతారో నాకు అర్థమైంది. గౌస్ బీబీ మీద చాలా కోపం వొచ్చింది. ఇంకెప్పుడూ తనతో మాట్లాడకూడదని నిశ్చయం చేసుకున్నాను. అయితే రాత్రి ఒంటరిగా ఇంటికి వొచ్చిన విషయం ఎవరికీ చెప్పకూడదనుకున్నాను.
నా గుండె వేగంగా కొట్టుకోవడం నాకు ఇంకా వినిపిస్తూనే వుంది.
ఇంతింత సాహసాలు ఇకపై ఎప్పుడూ చెయ్యకూడదని నాకు నేనే బుద్ధి చెప్పుకున్నాను. నా చెంపలు నేనే వాయించుకున్నాను.
మంచంమీద పడుకున్నానే గానీ, పీర్లగుండం దగ్గర జరిగిన విషయాలే గుర్తొస్తున్నాయి.
ఒక విశేషమైన సంఘటనను చూశానన్న తృప్తితో నా మనసు నిండిపోయింది. అయినా యేవేవో అనుమానాలు, సందేహాలు మనసులో మొలకెత్తుతూనే వున్నాయి!
రాత్రంతా సరిగా నిద్రపోకపోయినా యేదో ఒక రకమైన విజయగర్వంతో పొద్దున లేచాను. అందరికీ రాత్రి నేనేం చూసినానో గొప్పగా చెప్పుకున్నాను.
ఎర్రగా వున్న నా కళ్లు చూసి అమ్మ “ఈరోజు బడికి పోవొద్దులే.. రాత్రి నిద్ర సరిపోయినట్టు లేదు. మళ్లీ బడిలో నిద్రపోతావేమో!” అన్నది.
“అంత మంచిమాట అమ్మ నోట్లోనించి వచ్చిందా.. ఎప్పుడైనా..” అని ఆశ్చర్య పోయాను.
పెద్దరుగు మీద చెక్క మంచం పైన నా బొమ్మల బుట్ట పెట్టుకుని ఆడుకుంటూ కూర్చున్నాను. ఆడుకుంటూ.. ఆడుకుంటూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలీదు. నిద్రపోనీ లెమ్మని ఎవ్వరూ భోజనానికి కూడా పిలవలేదు!