అమ్మణ్ని కథలు!-20

0
2

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

అమ్మణ్ని సినిమా యాత్ర!

[dropcap]ఊ[/dropcap]ళ్లోకి ఏదైనా మంచి సినిమా వొచ్చిందంటే.. స్కూలు నుంచి వొచ్చేటప్పుడే వాల్ పోస్టర్లు చూసుకుంటూ వొచ్చేవాళ్లు మా అక్కలు! అన్నలు!

నేను, జయా కూడా బడి నుంచి వొచ్చేటప్పుడు పరవశంగా వాల్ పోస్టర్లను చూస్తూ నిలబడిపోయే వాళ్లం!

మా ఊరి సెంటరు ఐదు లాంపుల దగ్గర వున్న సోడా షాపు గోడ మీద అతికించిన వాల్ పోస్టర్ల అందాలు చూస్తూ.. నటీనటుల అందచందాలు, వస్త్రధారణ చూస్తూ, అది నడిరోడ్డనీ, అక్కడ అంతంతసేపు ఆడపిల్లలు అట్లా నిలుచుకోకూడదనీ, త్వరగా ఇంటికెళ్లకపోతే అమ్మ కోప్పడుతుందనీ యేమీ గుర్తుకొచ్చేవి కాదు మా అక్కా వాళ్లకూ.. మాకు కూడా. అలా తన్మయులమై నిలబడి పోయేవాళ్లం!

ఇంక ఈ సినిమా బండి వాళ్ల వర్ణనలు ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా.. అని ఊరించేవి.

సినిమా పాంఫ్లెట్లలో సినిమా కథ క్లుప్తంగా రాసి ‘మిగిలింది వెండితెరపై చూడండి’ అని సస్పెన్స్‌లో పెట్టేవారు.

అక్కా వాళ్లు సినిమాకు వెళ్లాలనుకుంటే, ముందుగా అమ్మ దగ్గర “సినిమా చాలా బాగుందంట.. పేపర్లో కూడా రాసినారు ఈ సినిమా గురించి” అని వర్ణించి వర్ణించి చెప్పేవాళ్లు. నిజానికి పాత పాత సినిమాలే వొచ్చేవి మావూరి టెంటులో. వాటి మంచిచెడుల గురించి అప్పటికే ప్రపంచాని కంతటికీ పలువిధాలుగా తెలిసిపోయే వుంటుంది.

అక్కావాళ్లు ఎంత చెప్పినా అమ్మ కరిగేది కాదు.

అమ్మకు ‘అసలు పిల్లలు సినిమా చూడ్డమే అనవసరం..’ అని గట్టి నమ్మకం! నిజానికి మా అమ్మకు సినిమాయే అర్థం కాదు. సినిమా కూడా నిజజీవితంలాగే వుండాలంటుంది.

“నిజంగా అయితే ఇట్లా జరుగుతుందా..? అంతా కల్పన.. అన్నీ అబద్ధాలు.. అసత్యాలు! అందుకే ఈ సినిమాలు మంచివి కావు” అని వాదిస్తుంది సినిమాలోనే.

‘నిజజీవితంలో జరిగినట్టే సినిమా ఎట్లా వుంటుందమ్మా.. కొంత కల్పన వుంటుంది కదా..’ అంటే సినిమాలోనైనా సరే.. అబద్ధాలు, అవాస్తవ సంఘటనలూ వుండకూడదని వాదించేది.

అలాంటి వాస్తవ దూరమైన కథలతో తీసిన సినిమాలు చూడటమే తెలివితక్కువతనమని ఆమె భావం!

తొంభైఎనిమిదేళ్ల వయసులో కూడా సుడోకు పజిల్స్ చేస్తూ, గళ్లనుడికట్టులు పూరించిన మేధావికి మామూలు సినిమా అర్థం కాకపోవడం ఎంత ఆశ్చర్యం కదా!

ఓసారి ‘భూకైలాస్’ సినిమా చూడాలని మా అమ్మ పిల్లలందరినీ వేసుకొని రెండెద్దుల బండి కట్టించుకొని బయల్దేరింది. కానీ దారి లోనే పెద్దవర్షం పట్టుకుంది.

సగం తడిసి ఇంటికి వొచ్చి, పాతచీరతో తల తుడుచుకుంటూ.. “హయ్యో! నా అదృష్టం చూడండమ్మా! పోక పోక సినిమాకు పోతే రాక రాక వొచ్చింది ఈ అకాల వర్షం చూడండి! నీకు ఇల్లే వైకుంఠం.. అని దేవుడు చెప్పినట్లయింది! హయ్యో! దరిద్రుడు తల కడగబోతే వడగండ్ల వాన వొచ్చిందంట. అట్లా వుంది నా ప్రారబ్ధం.. అయ్యో నా అదృష్టమా? నా మొహానికి సినిమా కూడానా?” అని వాపోయింది పెద్దమ్మతో చెప్పుతూ. అది అమ్మ ఒకానొక సినిమా అనుభవం!

ఇక యేదైనా ఇష్టమైన సినిమా వొచ్చిందంటే.. తప్పక చూడాలని స్థిర నిశ్చయంతో వున్న మా అక్కావాళ్లు రాయబారాల పర్వం మొదలు పెట్టేవారు.

మెల్లగా యశోదత్త దగ్గరికీ, మా వీధిలో మరో వైపు వున్న మణెత్త దగ్గరికీ పోయి, వాళ్లను మంచిచేసుకుని, అమ్మకు నచ్చజెప్పమని, తమను వాళ్లతో ఫలానా సినిమాకు తీసుకెళ్లమనీ విన్నపాలు చేసుకునేవారు.

వాళ్ల మాటలు ఎట్లా వుండేవంటే.. ‘ఆ సినిమా చూడకపోతే జీవితమే వేస్టు..’ అన్నట్టుగా వుండేవి.

అక్కా వాళ్ల విన్నపం మేరకు మధ్యాహ్నమే యశోదత్త వొచ్చి మా అమ్మకు సినిమా గురించి యేదో బోధించేది.

“మీరు మరీ చిత్రంగా ఆలోచిస్తా రత్తా! నేను, మా ఆయనా, మా అన్నా, ఒదినా ఇంతమంది చుట్టూ వుంటే మీ కూతుళ్లను ఎవరెత్తుకొని పోతారు? భయపడొచ్చు గానీ, మరీ ఇంత భయమా? మీ పిల్లలే కాదు, అంతకంటే చాలా చిన్నవాళ్లయిన మా పిల్లలూ వుంటారు కదా! మీ రాకుమార్తెలను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చే పూచీ నాది. సరేనా?

అయినా పిల్లలను అంత గూట్లో పక్షుల లాగా పెంచితే ఎట్లా అత్తా? లోకజ్ఞానం లేకుండా పల్లెటూరి మొద్దుల వలె తయారైతే రేప్పొద్దున అత్తగారిళ్లలో సంసారం ఎట్లా నిర్వహించుకుంటారు చెప్పండి? మంచీ చెడూ అన్నీ తెలియాల కదా.. పిల్లల కోరికలు అన్నీ కాకపోయినా కొన్ని అయినా తీర్చాల కదా..! అయినా సినిమా చూడడం పెద్ద భాగ్యమా? బతుకా? మీరు మరీ విపరీతమైన కట్టడి చేస్తున్నారు లెండి పిల్లలను.. అంత అవసరమా చెప్పండి?” అంటూ కొంచెం నిష్ఠూరంగా, కొంచెం ఘాటుగా, కొంత అభిమానంగా, కొంచెం ధైర్యం చెబుతున్నట్టుగా సాగేది యశోదత్త సంభాషణ. ఆమెకు అమ్మ దగ్గర కాస్త చనువు ఎక్కువ!

అమ్మ కొంచెం మెత్తబడినట్టే అనిపించేది. “చూద్దాంలే.. మీ మామనడుగుతా.. ఆయన ఒప్పుకోవాల గదా..” అనేది.

అత్త మెత్తబడిందనే సంతోషంతో.. అక్కావాళ్ల వైపు ఏవో సైగలు చేస్తూ.. విజయోత్సాహంతో ఇంటికి పోయేది యశోదత్త.

కాస్సేపయ్యాక మణెత్త వొచ్చి అమ్మతో మంతనాలు జరిపేది. తానూ, వాళ్లాయనా కూడా వెళ్తున్నామనీ, ఇంతమంది వుండగా మీ పిల్లల కొచ్చిన భయమేమీ లేదనీ నచ్చజెప్పేది. అమ్మ సరేననేది.

అమ్మ భయానికీ ఒక అర్థముంది.

మా వూరి చుట్టుపక్కల ఊళ్లు పార్టీ గొడవలకు, ముఠా కక్షలకూ పెట్టింది పేరు. అసలు కోస్తా జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులను మా ఊరికి పనిష్‌మెంట్ ట్రాన్స్‌ఫర్ కింద పంపేవాళ్లు. అంతంత గొడవలు జరిగేవి మా ఊళ్లో.

మా ఊరి రెడ్డిగార్ల పిల్లలు వేరే ఊళ్లలో కాలేజీలలో చేరడానికి పోతే మా ఊరి పేరు విని కాలేజీలో సీటు ఇవ్వడానికే భయపడేవారు. మావాళ్లు అక్కడా గ్రూపులు కట్టి గొడవలు చేసేవారు. మా ఊరి గొప్పదనం అంతటిది!

మా ఊళ్లో పార్టీలు యేమీ లేకపోయినా చుట్టుపక్కల ఊళ్లలో నుంచి పనుల మీద వొచ్చిన ముఠాల వాళ్లు కూడా ఉన్నట్టుండి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేవారు. వాళ్లూ వాళ్లూ కొట్టుకోవడంలో, వాళ్లు విసురుకునే బాంబులు మన మీద పడతాయేమోనని అమ్మ భయం! అందుకే జనం ఎక్కువగా కలిసే చోట్లకు పిల్లలను పంపడానికి భయపడేది.

ఒకసారి మా పక్కన వున్న చిన్న వూళ్లోకి టూరింగ్ టాకీసు వొచ్చింది. ఆ వూరు పార్టీ గొడవలకు పెట్టింది పేరు!

రెండు పార్టీల వాళ్లూ సినిమాకు వొచ్చినారు. గొడవ మొదలైంది. రెండువైపుల వాళ్లూ నాటుకట్టెలతో యుద్ధం మొదలు పెట్టినారు. సినిమాకు వొచ్చిన జనం అంతా ఊర్లోకి పరుగులు పెట్టినారు.

టెంటు ఓనరు, అతని అసిస్టెంటూ ప్రొజెక్టరు రూములో దాక్కోని, ప్రొజెక్టరునూ, తమనూ ఎలాగో రక్షించుకున్నారు.

మరుసటి రోజు పొద్దున టెంటు ఓనరు బయటికి వొచ్చి చూస్తే, టెంటు, తెర చినిగిపోయి, ఆ ప్రాంతమంతా చెప్పులు, ఆడవాళ్ల సవరాలు, జనం వొదిలేసిపోయిన చాపలు, బొంతలతో నిండిపోయి వున్నదట!

ఆ టూరింగ్ టాకీసు ఓనరు ఊళ్లో పెద్దవాళ్లతో పోయి మొరపెట్టుకున్నాడు. వాళ్లు రెండు పార్టీల వాళ్ల దగ్గర్నుంచి అతనికి కొంత డబ్బు ఇప్పించినారు, నష్టపరిహారంగా.

 అతడు ‘బతుకుజీవుడా’ అంటూ తట్టాబుట్టా సర్దుకుని “ఛస్తే ఈ వూళ్ల వైపు రాను. బుద్ధి లేక వొచ్చాను. ఈ వూళ్ల వాళ్లు సినిమా చూడడానికి కూడా పనికిరారు” అని రకరకాల తిట్లు తిట్టి, శాపనార్థాలు పెట్టి, మరి ఇటు వైపు వొస్తే తన చెప్పుతో తనే తన చెంపపైన కొట్టుకుంటానని శపథం చేసి వెళ్లిపోయాడట! ఇలాంటివన్నీ విని వుంటుంది కదా.. అందుకే అమ్మకు భయం!

సరే.. అమ్మ ఎట్లాగైతేనేం ఒప్పు కుంటుంది యశోదత్తా, మణెత్తా చెప్పాక. వాళ్లిద్దరూ అమ్మ కంటే చాలా చిన్నవాళ్లయినా, అమ్మకు స్నేహితుల వంటివారు.

ఇక తర్వాత నాయనను అమ్మ సులభంగానే ఒప్పించేది. తాత ఈ విషయాలను పట్టించుకోరు. ఇంటి బాధ్యత అంతా మా అమ్మపై పెట్టి ఆయన నిశ్చింతగా మేడమీద వుండేవారు.

ఇక మా చిన్నపిల్లల కళ్లుగప్పి సినిమాకు పోవడం ఒక పెద్ద తతంగం.

సాయంత్రమే రహస్యంగా అన్నాలు తినేసి, యశోదత్తా వాళ్లింట్లో చేరేవారు అక్కావాళ్లు.

ఇలాంటప్పుడు నాకు మధ్యాహ్నం నుంచే అనుమానం వేస్తుంది.. యేదో గూడుపుఠాణీ జరుగుతోందని. అత్తావాళ్లు రావడం, రహస్యంగా మంతనాలు చేయడం, మేము రాగానే ‘హుష్ హుష్’ అనుకోవడం, అక్కావాళ్లు హుషారుగా మాట్లాడుకోవడం, మేము రాంగానే మాటలు మార్చడం, మొత్తం మీద యేదో హడావిడి నడిచేది. ఏదో కుట్ర జరుగుతోంది.. మా చిన్నపిల్లలకు వ్యతిరేకంగా.. అని మాత్రం తెలిసిపోయేది.

ఆఖరుకు మాకు అసలు విషయం తెలిసిపోయేది. నేనూ, జయా, మా తమ్ముళ్లూ గోలగోలగా యేడుస్తూ “మేమూ సినిమాకు వొస్తాం” అని యేడుపులు!

పెద్దమ్మ మమ్మల్నందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని, సినిమాకు పోతే పిల్లలకు ఎదురయ్యే కష్టాలను అనేక రీతులుగా వర్ణించేది.

“అమ్మణ్నీ! నీకు ఏమీ తెలీదు. అక్కడ బెంచీలు సరిగ్గా వుండవు. రాతిబెంచీలు అవి. ఒకవైపు ఒకరు కూచుంటే మరో వైపు కదిలిపోతాయి. నిద్ర తూగితే బెంచి మీద నుంచి కిందపడి తలకు దెబ్బ తగులుతుంది. జనం ఎక్కువగా వుండి తోసుకుంటారు. సినిమా వొదిలేసరికి పదకొండో, పన్నెండో అవుతుంది. మీరేమో నిద్రకు తాళలేరు. మిమ్మల్నందరినీ అక్కావాళ్లు చూసుకోలేరు. మీరు నిద్రపోతే ఎత్తుకొని రాలేరు. మంచి సినిమా కృష్ణలీలలు, మాయాబజారు వంటి సినిమాలు వొచ్చినప్పుడు నేనే తీసుకొనిపోతా. ఈ ‘వెలుగునీడలు, సిరిసంపదలు, రాముడు-భీముడు’ ఇవన్నీ మనకెందుకమ్మా! దేవుళ్ల సినిమాలైతే పుణ్యం, పురుషార్థం కూడా..” ఇట్లా సాగుతుంది ఆమె వ్యాఖ్యానం!

‘నేను ఒకవేళ నిద్రపోతే, అక్కా వాళ్లు నన్ను ఎత్తుకొని రాలేకపోతే ఎట్లా? నేను అక్కడే వుండి పోతానేమో.. నన్నెవరైనా ఎత్తుకొని పోతారేమో.. ‘ వంటి భయాలు నా నోరు మూయించేవి.

నేనూ, జయా ఒకరినొకరం ఓదార్చుకునేవాళ్లం!

“ఇంక నాలుగేళ్లు పోతే మనం కూడా పోవొచ్చులే..” అని సర్దుబాటు చేసుకునేవాళ్లం.

మేము – ఇంతకుముందు చూసిన, విన్న సినిమా కథలు చెప్పుకొని నిద్రలోకి జారుకునేవాళ్లం!

మరుసటి రోజు పొద్దున మా అక్కలు, అన్నలూ సినిమా గురించి రకరకాల విమర్శలు చేస్తూంటే నోరు తెరుచుకుని వినేవాళ్లం! ఎన్టీయార్ ఓవరాక్షన్ చేశాడనీ, భానుమతి తల రుబ్బుడుగుండు లాగా తిప్పుతూ, పాట పాడుతూ మహా అతిగా నటిస్తుందనీ, జమున చాలా అందంగా వుంటుందనీ, కానీ, ఆమెకు నిజజీవితంలో కూడా గర్వం ఎక్కువనీ, అది నటనలో కూడా కనిపిస్తుందనీ, సావిత్రి అయితే చాలా సహజంగా నటిస్తుందనీ, ఆమెను ఎంతసేపు చూసినా తనివి తీరదనీ, ఎల్. విజయలక్ష్మి నాట్యం చాలా బాగుంటుందనీ వ్యాఖ్యానాలు చేస్తూ వాళ్లు మాట్లాడుతూ వుంటే, అవన్నీ చూసి, అట్లా వ్యాఖ్యానాలు చేసే అదృష్టం నాకు లేదని కుమిలిపోయేదాన్ని.

చిట్టచివరికి ఎన్నో రోజులు ఎదురుచూశాక దేవుడి సినిమా ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ రానే వొచ్చింది. దాన్ని మేము ‘ఉప్మా చెట్నీ పూరీ సాంబారు కథ’ అని ఎగతాళి చేసేవాళ్లం!

మాకు ఇచ్చిన మాట ప్రకారం మా పెద్దమ్మ మమ్మల్ని సినిమాకు తీసుకెళ్లడానికి అమ్మను ఒప్పించింది.

కానీ, ఆ దేవుడి సినిమా మేము వెళ్లాలనుకునే సరికే మారిపోయింది. మేము మళ్లీ అసమ్మతి రాగాలు మొదలు పెట్టాము.

మా పోరు పడలేక, మమ్మల్ని నిరాశ పరచలేక ‘ప్రమీలార్జునీయం’ అనే సినిమాకు తీసుకుపోయింది పెద్దమ్మ.

అమ్మ ఆమెకు తోడుగా మా గొడ్లసావిడిలో పనిచేసే తులసెమ్మను కూడా పంపింది. చిన్నతమ్ముళ్లను ఇద్దరినీ మరీ చిన్నవాళ్లని తీసుకుపోలేదు. వాళ్లూ యేడిచారు పాపం వొస్తామని! పెద్దమ్మ ఇంతమంది పిల్లలను చూసుకోలేదు కదా.. అందుకే వాళ్లని ఇంట్లోనే ఒదిలేసి వొచ్చినాము, అయిష్టంగానే.

పెద్దక్క కూతురు చాలా మొండికేసి, వెంటబడితే దాన్ని మాత్రం తీసుకొచ్చినాము.

మరచెంబులో నీళ్లు, జంపకానా, మధ్యలో ఆకలేస్తే తినడానికి ఒక పేపర్లో చుట్టి తెచ్చిన చిరుతిండితో సహా బయల్దేరింది పెద్దమ్మ. మాతోపాటు నా స్నేహితురాలు సుబ్బలక్ష్మి కూడా వొచ్చింది.

ఊరిబయట టెంటు వేసి, లైట్లు వేశారు. తప్పెట్లు మోగిస్తున్నారు. దగ్గరపడేకొద్దీ మా ఉత్సాహం అంతకంతకూ పెరుగుతున్నది.

అప్పట్లో పావలా నేల టికెట్, అర్ధరూపాయి బెంచీ, రూపాయి కుర్చీ టికెట్ వుండేది. కుర్చీ టికెట్లు ఊళ్లో ఆఫీసర్లు కొందరికి మాత్రమే పరిమితం! కుర్చీలు కూడా వాళ్ల ఇంటి నుంచి తెచ్చుకోవాల.

మా వూళ్లో సినిమా మధ్యలో వర్షం కురిస్తే.. అందరికీ స్లిప్పులిచ్చేవారు. అవి తీసుకుని మరుసటిరోజు ఉచితంగా సినిమా చూడొచ్చు నన్నమాట!

శివరాత్రి కయితే మూడు ఆటలు వేస్తారు. మూడు ఆటలూ చూసేవారికి టికెట్‌లో రాయితీ వుంటుంది.

మా చుట్టుపక్కల చిన్నవూళ్లలో టూరింగ్ సినిమా టాకీసులలో ఊళ్లో పెద్దవాళ్లకు నులక మంచాలు కూడా వేసేవాళ్లట! వాళ్లు చక్కగా మంచంమీద శేషశయనం పోజులో సినిమా చూస్తారన్నమాట!

టెంటు మధ్యలో నడుమెత్తు తడికె కడతారు. ఒక వైపు ఆడవాళ్లు, మరోవైపు మగవాళ్లు కూచోవాల. అటూ ఇటూ కూర్చున్న భార్యాభర్తలు మధ్యమధ్యలో పిల్లలను అటూ ఇటూ అందుకోవడం, సోడాలు అందిచ్చుకోవడం వంటివి చేస్తుంటారు. అరగంటకోసారి సినిమా రీలు తెగిపోతే ఆపరేటర్ మార్చుకోవాలి.

అప్పుడు సినిమా ఆగిపోయి లైట్లు వెలుగుతాయి. అప్పుడు సోడాలు అమ్ముతారు. ‘ఇండియాబాదమ్’ అని వేరుసెనక్కాయలు అమ్ముతారు.

పెద్దమ్మను ‘ఇండియా బాదమ్’ కొనమంటే..

“ఇండియా బాదమా? వాడి పిండాకూడా? అవి సెనక్కాయలే అమ్మణ్నీ! వాడి దగ్గర కొనుక్కోవడం ఎందుకు? మన చేలోనే మనకు పుట్లు పుట్లు పండుతూంటే. ఇంటికి పోయింతర్వాత ఇస్తాలే!” అని నోరు మూయించింది.

పిల్లలు నిద్రపోతారనీ, బెంచీ మీద కూర్చుంటే పిల్లలు కిందపడతారనీ పెద్దమ్మ నేలటికెట్ తీసుకోవాలనుకుంది.

గేటు దగ్గర సినిమా టెంటు ఓనరు కమలమ్మ నిలబడి వుంది. ఫెళఫెళలాడే సిల్కుచీర కట్టుకుంది. సవరం పెట్టి ముంతంత కొప్పు చుట్టుకుంది. కొప్పులో రెండు చెండు మల్లెపూలు (బంతిపూలు), మొహాన రూపాయ కాసంత బొట్టు, చెవుల్లో చక్రాలంతేసి తెల్లరాళ్ల కమ్మలు, ముక్కుకు తెల్లరాళ్ల బేసరి పెట్టుకుంది. చేతిలో డబ్బుల సంచీ పట్టుకుంది. నోటి నిండా తాంబూలం నములుతూ వుంది.

పెద్దమ్మ అందరికీ సరిపడా డబ్బులు ఇచ్చింది గానీ, మాతో పాటు వొచ్చిన మా అక్కకూతురిని చంకలో ఎత్తుకొని లోపలికి తీసుకొని పోబోయింది.

“ఓ అమ్మోవ్! ఆ పాపకు కూడా టికెట్ తీసుకోవాలమ్మా తల్లీ! ఓయబ్బో.. బలే జోరున పోతున్నావే లోపలికి.. ఇదేదో నీ సొంత ఇల్లయినట్టూ..” అని పొలికేక పెట్టింది కమలమ్మ.

“ఓసి నీ అసాధ్యం కూలా! ఎంత ఆశా పాతకురాలివే.. ఇంత చిన్నపిల్లకు టికెట్ అడుగుతావా? న్యాయముందా నీకు అసలు? చంకలో పిల్ల నీ సినిమా చూస్తుందా.. యేమన్నానా? యేదో మొండికేసి వొచ్చింది గానీ! అయినా ఒక్క సినిమా టిక్కట్టుతోనే మిద్దెలు కడ్తావా ఏమి?” అని వాదానికి దిగింది పెద్దమ్మ.

“సిన్నపిల్లనా? సంకలో పిల్లనా? ఐదేళ్లు పైనుంటాయ్! ఈ పిల్లకాయలే సినిమా బాగా జూసేది. సినిమా సూసినా సూడకపోయినా టెంటులోకి వొచ్చినాక టిక్కట్ ఇయ్యాల్సిందే! పావులా ఇచ్చి కదులు! తిట్లు తర్వాత తిడుదువులే! ఒక్క పావలాతో నువ్వు మాత్రం మేడలు కడ్తావా?” అని టపటపా చెంపదెబ్బలు వాయించినట్టు మాట్లాడి నిర్బంధించింది, కమలమ్మ.. తాంబూలం పక్కన నేల మీద తుపుక్కుమని ఉమ్మేస్తూ.

“పావలా నా దగ్గర లేదు. ఇదుగో పదిపైసలు వుంది.. తీసుకో.. లేదంటే మా డబ్బులు మాకియ్యి. మేమంతా వెనక్కి వెళ్లిపోతాం!” అని బెదిరించి, పదిపైసలు ఆమె చేతిలో పెట్టి, సమాధానం కోసం ఎదురు చూడకుండా..

“పదవే అమ్మణ్నీ!” అంటూ లోపలికి దూసుకు పోయింది పెద్దమ్మ నా చెయ్యి పట్టుకొని లాగుతూ.

కమలమ్మ ‘ఇదంతా మామూలే’ నన్నట్లు చిద్విలాసంగా పక్కనున్న అసిస్టెంటు కేసి చూసి నవ్వుతూ, మరో పాన్ బీడా నోట్లో బిగించింది. నేను పెద్దమ్మ చేత లాక్కొని పోబడుతూ.. వెనిక్కి తిరిగి చూస్తే కనిపించిన సీను అది!

లోపలికి పోయింతర్వాత కూడా పెద్దమ్మా, తులసెమ్మా సినిమా టికెట్లు వసూలు చెయ్యడంలో సినిమా టెంటు వాళ్లు చేసే అన్యాయాలను తూర్పార బడుతూనే వున్నారు.

తెర బాగా కనబడే వైపు వెనకగా జంబుఖానా పరిచింది తులసెమ్మ. అందరం కూర్చున్నాం. నాకేమో తెరకు దగ్గరగా కూర్చొని చూడాలని కోరిక పుట్టింది.

సగం మరచెంబుడు నీళ్లు అప్పుడే తాగేశాం. చిరుతిండీ తినేశాం. సినిమా మొదలైంది. నాకు వెనక కూర్చుని చూస్తే తృప్తిగా లేదు. మెల్లగా పెద్దమ్మను ఒప్పించి, నేనూ, సుబ్బలక్ష్మీ ముందు వరసలో పోయి కూర్చున్నాము. సుబ్బలక్ష్మి తెచ్చిన దుప్పటి పరుచుకున్నాం. జనం ఎక్కువగా లేకపోవడంతో పెద్దమ్మ సరేనన్నది.

సినిమా మొదలయ్యీ కాకుండానే రీలు తెగిపోయిందో.. యేమో సినిమా ఆగిపోయి, లైట్లు వెలిగాయి.

అందరూ ఈలలూ, అరుపులూ మొదలుపెట్టారు. నేను గేటు దగ్గరికి పోయి సినిమాపాటల పుస్తకం కొనుక్కొచ్చుకున్నాను, రెండణాలు పెట్టి.

నేను పెద్దమ్మా వాళ్ల వైపు చూడాలని తల వెనక్కి తిప్పాను. అక్కడికి దగ్గర్లోనే వెనక వరసలలో మా పనిమనిషి వెంకటమ్మ బొంతపరచుకొని, ముగ్గురు పిల్లలను చుట్టూ కూర్చోబెట్టుకుని కనిపించింది. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది.

ఇంట్లో అన్నం తినే సమయం లేనట్టుంది.. సుబ్బరంగా సత్తు అన్నం గిన్నె వెంట తెచ్చేసుకుంది. దాంట్లో పప్పో యేదో వేసుకొని తను తింటూ, పిల్లలకు కూడా పెడుతున్నది. చెంబులో నీళ్లు కూడా తెచ్చుకుంది. నీళ్లు తాను తాగి, పిల్లలకు తాగించింది.

సినిమాలోకి అన్నం గిన్నె తెచ్చుకుని తినడం మాకు భలే నవ్వు పుట్టించింది. నేనూ, సుబ్బలక్ష్మీ పడీపడీ నవ్వాము, వెంకటమ్మను చూసి!

“ఏం జేతు అమ్మణ్నమ్మా! మనింట్లో పని అయ్యేటప్పటికే పొద్దు పోయింది. ఉరుక్కుంటా ఇంటికి పోయి, ఆదరబాదర అన్నం వొండి తీసుకొచ్చినా.. పిల్లోళ్లు సినిమా జూడాలని యేడుస్తా వుంటే..” నవ్వుతూ చెప్పింది వెంకటమ్మ.

సినిమా మొదలైంది. ముందు వరుసలో కూర్చోవడం వల్ల తలెత్తి తెరను చూడాల్సి వొచ్చింది.

కాసేపటికల్లా “అమ్మణ్నీ.. మెడ నొప్పిపెడుతుందే! మొహాలు కూడా పొడుగు పొడుగ్గా మన జొన్నలు కొలిచే ‘పడి’ (కుంచం) లాగా వున్నాయే!” అన్నది సుబ్బలక్ష్మి.

“నిజమేనే! తెర మీద పొడుగు పొడుగు గీతలు మెరుస్తూ కనిపిస్తూ కళ్లు చెదురుతున్నాయి. పద పోదాం వెనక్కు!” అన్నాను నేను.

ఇద్దరం బుద్ధిగా వొచ్చి పెద్దమ్మ దగ్గర కూర్చున్నాము.

సినిమా అయ్యేసరికి అందరం పడి నిద్దర్లు పోయినాము. ఈ ఆపదను ఊహించే అమ్మ మా జీతగాడు పడిగలప్పతో ఒంటెద్దు బండి కట్టించి పంపింది. అతను వొచ్చి, తులసెమ్మ సాయంతో నిద్రమత్తులో జోగుతున్న ఒక్కొక్కరినీ పట్టుకొని తీసుకుపోయి బండిలో కూర్చోబెట్టినాడు. అందరం బండిలో కూలబడి ఇల్లు చేరుకున్నాము.

నిద్ర తేలిపోయింది.

సాయంత్రం ఆదరాబాదరాగా తిన్న అన్నం ఎప్పుడో అరిగిపోయింది. అమ్మకు మా సంగతి తెలుసు కదా! అమ్మ మా కోసం పెరుగన్నం కలిపి వుంచింది. మేమేదో యుద్ధం చేసి అలసిపోయి వస్తామనుకుందో యేమో.. పెద్దఫ్లాస్కులో పాలు కూడా పోసి పెట్టింది.

పెరుగన్నం ముద్దలు తిని, పాలు తాగి, వెన్నెల్లో చల్లబడిన పరుపులపై పడుకుని ఒళ్లెరక్కుండా నిద్దర్లు పోయినాము.

ఆ తర్వాత రోజుల్లో మేము పెద్దవాళ్లమయినా సరే.. సినిమాకు వెళ్లొచ్చేసరికి అమ్మా, పెద్దమ్మా పెరుగన్నం, పాలు సిద్ధంగా పెట్టేవారు.

అమ్మ అయితే ఇంటి ముందు వున్న అరుగు మీద లైటు వేసుకొని కూర్చుని మా కోసం ఎదురుచూస్తూ వుండేది.

అంత ప్రేమగా మమ్మల్ని చూసుకునే ఇద్దరమ్మలు వున్న కాలమెంత బంగారుకాలమో! మళ్లీ మళ్లీ అవి రాని రోజులు కదా.. అనిపిస్తుంది.

కానీ, ఆ పెరుగన్నం రుచి మాత్రం ఇప్పటికీ మరపురాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here