అమ్మణ్ని కథలు!-3

1
2

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

అమ్మణ్ని బలపాల యాపారం!!

[dropcap]నే[/dropcap]ను మూడో క్లాసులో పడ్డాను. నాకు చదువెంత ఒచ్చిందో గుర్తులేదు కానీ, బలపాల పిచ్చి మాత్రం పట్టుకుంది.

నిద్రలో కూడా బలపాల పిచ్చే! పెద్దవానొచ్చినట్టు, వానలో నీళ్ల బదులు బలపాలు కురిసినట్లు, నా ట్రంకుపెట్టె నిండా బలపాలు నింపేసుకున్నట్లు కలలు వొచ్చేవి. ఇంటికెవరైనా బంధువు లొచ్చినప్పుడు ఐదుపైసలో, పదిపైసలో, పావులానో చేతిలో పెట్టేవారు.

దసరా పండక్కు వీథిలో వుండే అందరిళ్లకూ పోయి జమ్మిఆకు చేతులో పెట్టి, పడీ పడీ నమస్కారాలు చేసేవాళ్లం.. వాళ్లు చిల్లర యేదైనా ఇస్తారనే ఆశతో. వాళ్లిచ్చిన చిల్లర పైసలన్నీ, ఇంట్లో వాళ్లిచ్చిన డబ్బులన్నీ దాచుకొని, బలపాలు కొనుక్కునే దాన్ని.. రహస్యంగా.

నా ట్రంకుపెట్టెలో అడుగున పేపరు కింద దాచుకునేదాన్ని.

అమ్మ నా పెట్టె సర్దినప్పుడు రహస్యం బట్టబయలయ్యేది. మళ్లీ రెండు తిట్లు.. మందలింపులు మామూలే!

పేదవాళ్ల పిల్లలు బలపం ముక్కకు రంధ్రం చేసి, అందులోకి దారం ఎక్కించి, ముడివేసి మెడలో వేసుకునేవారు. అపురూపంగా చూసుకునేవారు బలపాన్ని.

ఆ పిల్లల తల్లిదండ్రులకు బలపం కొనడం కూడా గగనం అన్నంత పేదరికం వుండేది, ఆ రోజుల్లో.. ఆ ఊళ్లల్లో.

నేను అలా బలపాలకు కన్నాలు చేయాలని, మెడలో వేసుకోవాలనీ ఎన్ని బలపాలు విరగ్గొట్టానో లెక్కలేదు. ఆఖరుకు ఒక బలపాన్ని మెడలో కట్టుకున్నాను కూడా. అక్కావాళ్లు తిట్టి, అసయ్యంగా వుందని తీయించేసినారు. అందులో అసయ్యం యేముందో నాకు అర్థం కాలేదు.

నేను తొరగా పెద్దదాన్ని అయిపోయి, ఈ అక్కల, అన్నల దాష్టీకం నించి బయటపడి, నా ఇష్టమొచ్చినట్టు వుండాలనీ కలలు కనేదాన్ని. పిల్లల ఇష్టాలన్నీ పెద్దవాళ్లకు చికాగ్గా, అసయ్యంగా ఎందుకనిపిస్తాయో నాకు అర్థం కాదు.

నా స్నేహితులతో యేదో ఒక పందెం వేసి, వాళ్లు ఓడిపోతే వాళ్ల బలపాలను నేను తీసేసుకునేదాన్ని. వాళ్లు యేడిస్తే, పెద్ద బలపానికి బదులు చిన్న బలపం ఇచ్చి, యేవో మాయ మాటలు చెప్పి నోరు మూయించే దాన్ని.

మరీ చిన్న పిల్లలయితే మెల్లగా గిచ్చి బెదిరించేదాన్ని. అలా నా బలపాల సంపదను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటున్నాను.

అప్పట్లో మా ఊళ్లో కొత్తగా గ్రంథాలయం మొదలైంది.

కొత్తదేం కాదు గానీ, పాతదే.. కొత్త భవనంలోకి మారింది.

మా నాయన, మా తాత ఊళ్లో లాయర్లు కావడం, మా నాయన అనేక సామాజికసేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వుండటం వల్ల మాకు యెక్కడికి పోయినా ప్రత్యేక గుర్తింపు వుండేది.

గ్రంథాలయ కమిటీకి మా నాయన సెక్రెటరీ గానో.. యేదో వుండేవారు. అందుకే లైబ్రరీలో మాకు అడ్డుండేది కాదు.

మా అక్కావాళ్లు లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివేసేవారు.

నేను చిన్నపిల్లల పుస్తకాలు తెచ్చుకోని తెగ చదివేదాన్ని. మా అక్కావాళ్లు పుస్తకాల పేర్లు రాసిచ్చి, నా చేత తెప్పించుకునేవారు. వాటి కోసం ఒకటే తిప్పేవారు. లైబ్రరీ చుట్టూ తిరగలేక విసుగొచ్చేది.

ఒకసారి చలం పుస్తకాలు యేవో కావాలని రాసిచ్చింది మా నాలుగో అక్క.

అది చూపగానే లైబ్రేరియన్ చెంచయ్య గారు, “అమ్మో! మీ ఇంట్లో ఆడపిల్లలు చలం పుస్తకాలు చదువుతారా? మీ నాయన సాయంత్రం వస్తాడు గదా.. చెప్తానుండు!” అని బెదిరించాడు.

నాకు విషయమేమో తెలీలేదు. కానీ, యేదో తప్పు జరిగిందని మాత్రం తెలిసింది.

అంతే.. ఆయన పకపకా నవ్వుతూ “అమ్మణ్నీ.. అమ్మణ్నీ.. ఆగు.. ఆగు..” పిలుస్తున్నా వినకుండా వెనక్కి తిరిగి చూడకుండా బాణంలా ఇంటికి పరిగెత్తాను.

మా అక్కావాళ్లతో విషయం చెప్పి “మీరేం పుస్తకాలు రాసిస్తారో యేమో.. అక్కడ ఆ చెంచయ్యతో నేను తిట్లుతినాల. ఇకమీదట నేను చచ్చినా లైబ్రరీకి పోను” అని చెప్పేశాను. చేసేదేమీ లేక వాళ్లు కూడా గమ్మునున్నారు.

ఆ చెంచయ్యగారు మా పక్కింట్లోనే వుండేవారు. నేను వాళ్లింటికెళ్లి వాళ్ల పాపతో ఆడుకోవడం, ఆ అత్తతో వూళ్లో వాళ్ల విశేషాలు చెప్పడం, ఆవిడ వంట చేసుకుంటూ వుంటే ఆవిడకు చిన్నచిన్న సహాయాలు చెయ్యడం వంటి పెత్తనాలు చేస్తూండేదాన్ని. ఆ వూళ్లో.. ముఖ్యంగా ఆ వీథిలో నేను దూరని ఇల్లు లేదంటే ఆశ్చర్యం లేదనుకోండి!

నేను, నా స్నేహితురాళ్లూ ఆడే దాగుడు మూతలాటలో భాగంగా వీథిలోని అందరిళ్లలోకీ దూరి దాక్కునేవాళ్లం.

అలా చెంచయ్య వాళ్లింట్లో వాళ్ల పరుపుల చాటునా, పెట్టెల చాటునా దాక్కునేదాన్ని.

కానీ, చెంచయ్య గారు కనిపిస్తే చాలు.. పరుగు లంకించుకునే దాన్ని.

కొన్నాళ్లకు ఆ విషయం మరుగున పడిపోయింది.

మళ్లీ లైబ్రరీకెళ్లి చిన్నపిల్లల పుస్తకాలు తెచ్చుకునేదాన్ని. ఆ కాలంలో పిల్లల పుస్తకాలే తక్కువ! అందునా బొమ్మలున్న పుస్తకాలు మరీ తక్కువ. మామూలు పిల్లలకు పాపం.. అవేవీ అందుబాటులో వుండేవి కావు.

మా ఇంట్లో వుండిన ‘బొమ్మల పంచతంత్రం’ పుస్తకంలో ఎన్నో బొమ్మలుండేవి. ఆ పుస్తకాన్ని మేము, మా పిల్లలూ, మా బంధువుల పిల్లలూ, మా చుట్టుపక్కలవాళ్ల పిల్లలూ ఎంతమంది ఎన్నిసార్లు చదివారో కూడా లెక్కలేదు.

నేను మా బడిలో రీసెస్ పీరియడ్‌లో  బొమ్మల పుస్తకాలు చూసుకుంటుంటే.. పిల్లలంతా నా చుట్టూ మూగేవారు.

ఇదేదో బాగుందని బలపాల వ్యాపారం మొదలెట్టాను. ‘బలపానికి బొమ్మ’ అనే పద్ధతి మొదలుపెట్టాను.

అట్లా పిల్లల బలపాలన్నీ నా సంచీలోకి చేరి పెద్దమూట తయారైంది.

ఇదంతా చూసి నా స్నేహితురాళ్లకు నా మీద కన్ను కుట్టింది. వాళ్లంతా కుట్రపన్నారు నాపైన!

ఆ రోజు ఓ మంచిపుస్తకం తెచ్చుకున్నాను బడికి.

‘తాత – తాటాకు బుట్ట’ ఆ పుస్తకం పేరు. ఒక ఏరు, యేటి ఒడ్డున ఒక గుడిసె, దానిపైన అందమైన కోడిపుంజు, గుడిసె ముందు ఒక బుర్రమీసాల తాత, ఆయన చంకలో తాటాకుబుట్ట, అందులో యేవో కూరగాయలు, పండ్లూ అందంగా రంగురంగుల్లో చిత్రీకరించి వున్నాయి.

పుస్తకం లోపల కూడా అడవి, పక్షులు, జంతువులు ఇలా ఎంతో అందమైన బొమ్మలున్నాయి. ఎంత చూసినా తనివితీరేది కాదు.

ఆ బొమ్మలు చూడడానికి పిల్లలు పోటీపడి, బలపాలన్నీ నాకిచ్చేసుకున్నారు.

ఇక నా అన్యాయాన్ని భరించలేక పోయారు నా క్లాసుమేట్లు చాటకొండ సుబ్బలక్ష్మి, బి.వి. జయలక్ష్మి.

మరురోజు రీసెస్ పీరియడ్‌లో పుస్తకాన్ని లైబ్రరీలో ఇచ్చిరావడానికి నేను పోతుంటే.. “మేమూ వస్తామబ్బా నీ తోటి లైబ్రరీకి!” అని వెంటపడి వొచ్చారు.

లైబ్రరీలో అడుగు పెట్టీపెట్టగానే, “సార్! అమ్మణ్ని మీ లైబ్రరీ పుస్తకాలతో యాపారం చేస్తావుంది సార్! ‘బలపానికి బొమ్మ’ అని ఈ పుస్తకాల్లో బొమ్మలు చూపిచ్చి, మా బలపాలన్నీ తీసేసుకుంటావుంది సార్! పిల్లలు అందరూ యేడుస్తా వున్నారు సార్!” అని ఉన్నవీ, లేనివీ చెప్పడం మొదలుపెట్టినారు.

“నిజమా? నిజమా? నీకిట్లాంటి ఆలోచనలు ఎట్లా వొస్తాయి అమ్మణ్నీ?” అని చెంచయ్యగారు పకపకా నవ్వడం మొదలుపెట్టినారు.

నాకు అవమానం అయిపోయింది. ఆయన పిలుస్తున్నా వినిపించు కోకుండా ఒక్కటే పరుగు తీసి బడిలో కొచ్చిపడ్డాను.

మళ్లీ ఎప్పుడూ లైబ్రరీలోకి అడుగు పెట్టలేదు.

అట్లా నా బలపాల యాపారానికి గండిపడింది. తర్వాత్తర్వాత మా తమ్ముళ్లతో పుస్తకాలు తెప్పించుకోవడమే! తమ్ముళ్లు అంత సులభంగా మాట వింటారా? వాళ్లక్కావలసిన పనులన్నీ చేసిపెట్టాల. వాళ్లు చేసిన తప్పులు అమ్మకు చెప్పకుండా వుండాల. వాళ్లు నా వస్తువులేమన్నా అడిగితే నోరుమూసుకొని ఇవ్వాల. ఎన్ని తిప్పలో!

నా స్నేహితురాళ్లిద్దరితోటీ చాలా రోజులు మాటలు మానేశాను.

తరువాత రోజులలో మా నాయనగారు ఆరునెలల కోసారి లైబ్రరీ కోసం కర్నూలుకెళ్లి పుస్తకాలు, నవలలు కొనుక్కొచ్చేవారు. ఇంట్లో ఓ నెలరోజులుంచేవారు. అంతలో అమ్మా, నాయనా, పెద్దమ్మా, అక్కలూ, అన్నలూ అందరం ఆ పుస్తకాలను చదివేసేవాళ్లం!

ఆ క్రమంలోనే రంగనాయకమ్మ గారు రాసిన “అంధకారంలో..” అనే పుస్తకం కూడా కొనుక్కొచ్చారు. ఆ పుస్తకం పైన పై భాగంలో ‘అంధకారంలో..’ అనీ, మధ్యలో యేదో బొమ్మ, దాని కింద రంగనాయకమ్మ అని రచయిత్రి పేరూ వుండేది. నవల పేరూ, రచయిత్రి పేరూ దాదాపు ఒకే సైజులో (ఫాంట్‌లో) వున్నాయి. దాంతో పెద్దమ్మ మొత్తం పుస్తకం పేరు అదేననుకుంది.

పెద్దమ్మ ఓరోజు “ఎవరైనా ‘అంధకారంలో రంగనాయకమ్మ’ అనే పుస్తకాన్ని చూసినారా? ఈ గూట్లోనే పెట్టినాను. ఇప్పుడు కనబడటం లేదు” అని అందరినీ అడగడం మొదలుపెట్టింది. ఆ మాట విని అందరూ నవ్వడమే! చివరికి ఎవరో పుస్తకం తెచ్చి యిచ్చినారు. అదొక జోక్‌గా ఇప్పటికీ చెప్పుతూ వుంటారు మా ఇంట్లో.

నేనైతే కనబడిన పుస్తకమల్లా చదవడమే.. అర్థం కానీ.. కాకపోనీ..! అది నా వయసు వాళ్లు చదివేదా.. లేదా అని కూడా చూసేది లేదు. చదివేయ్యడమే! అలా నా గ్రంథాలయ ప్రహసనం పూర్తయింది. నా బలపాల యాపారానికి బండపడింది. కానీ, అప్పటికే ఓ పెద్ద మూటెడు బలపాలు పోగయినాయికదా! వాటితో సంతృప్తి చెందినాను. తృప్తి చెందక చేసేదేముంది చెప్పండి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here